అదొకమహారాజ్యం. ఆయనొక మహారాజు. మనస్సున్న మహారాజు. మానవీయవిలువలపై అపారమైన నమ్మకమున్న మానవతావాది. అయితే అతని ఆస్థానంలో ఉన్నవారి ప్రవర్తనతో అతను చాలా నొచ్చుకున్నాడు. వారి స్వార్థబుద్ధిని ఉపయోగించుకున్నాడు. ఆయనకు ఏమి పాలుపోక మహామంత్రిని సంప్రదించాడు. మహామంత్రి బాగా ఆలోచించిన మీదట రాజుగారికి ఒక ఉపాయం చెప్పాడు. రాజుగారు వెంటనే తన ఆస్థానంలో అందరికి బ్రహ్మాండం అయిన విందు ఏర్పాటు చేశాడు. రకరకాల పిండివంటలు, మధుర భక్ష్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. వాటిని చూస్తుంటే నోళ్ళల్లో నీళ్ళురుతున్నాయి. వాటిని తినటానికి రాజాజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో కొంతమంది రాజభటులు లోపలికి వచ్చారు. ఒక్కొక్కరి రెండు చేతులకు భుజం దగ్గర నుండి మణికట్టు వరకు వెదురు బద్దలతో కట్టివేశారు. మోచేతులు వంగకుండా కట్టుదిట్టం చేశారు. ఇంతలో రాజుగారు వచ్చారు. విందు ఆరగించమని రాజాజ్ఞ అయింది. ఆస్థానోద్యోగాలు విందు ఆరగిద్దామని ప్రయత్నించారు. కాని చేతిలోకి తీసుకొన్న భక్ష్యాలు నోటికి అందించటం ఎలాగో వారికి అర్థం కాలేదు. రాజుగారు మంత్రిగారు ఏమి చెప్పకుండానే బయటకు వెళ్ళారు.
ఒకసారి ఒక కుటుంబం వారి పిల్లవానికి అమ్మ చేత అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. పలకా బలపాలతో పాటు అమ్మకు నివేదన చేయటానికి చాక్లెట్లు కూడా తీసుకువచ్చారు. అక్షరాభ్యాసం అయింది. ‘ఓం’ అక్షరం వ్రాసి పిల్లవాని చేత దిద్దించి తాను పలికించింది అమ్మ. మన దృష్టిలో ఆ కార్యక్రమం పరిసమాప్తి అయింది. కాని అమ్మ దృష్టిలో అసలు కార్యక్రమం ముందే ఉన్నది. ట్రేలో పోసి ఉన్న చాక్లెట్లలో ఒకటి తీసికొని పిల్లవాని నోటికి ప్రేమగా అందించింది. వాడు దానిని సంతోషంగా చప్పరిస్తు ఉండగా అమ్మ వాడి దోసిలి నిండా చాక్లెట్లు పోసి అందరికి ‘ఇవ్వమంది’ పిల్లవాడు వాటిని అందరికి పంచుతుండగా అమ్మ ఆనందంగా చూస్తూ” ఇదే అసలు అక్షరాభ్యాసం. జీవితంలో నేర్చుకోవలసిన ప్రథమపాఠం, ప్రధానపాఠం ఇదే నని అంటూ తన కున్నదానిని అందరకు అట్లా హాయిగా పంచుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందీ?” అని ప్రశ్నించింది. ఇదీ అమ్మ అవతారపరమార్థం. ఇది మానవాళికి నేర్పటానికే అమ్మ అవతరించింది.
అమ్మ అనంతంగా అన్నమూ, గుడ్డలు పెడుతూ ఉండేది. అందులోని రహస్యాన్ని ఒకసారి ఇలా వివరించింది. “మీకు నేను పెట్టటం – మీ చేత ఇతరులకు పెట్టటం మీకు నేర్పటం కోసమూ” అని ఇంతకంటే మానవతకు పరమావధియేమున్నది.
ఆ రోజుల్లో తరుచుగా చాలమందికి నోట్లో అన్నపు ముద్దలు అమ్మే స్వయంగా పెట్టేది. అలా అమ్మ చేతి అమృత ముద్దలు శతసహస్రాలు తిన్న భాగ్యశాలి శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య అనేది ఒక చారిత్రక సత్యము. అలా ఒకసారి ఆ అన్నం ముద్దలు అమ్మ స్వయంగా తినిపిస్తుంటే అన్నయ్య అమ్మను అడిగాడు. “అమ్మా ! నాకెందుకు ఇలా ముద్దలు నోట్లో పెడ్తున్నావు. నాకు కాళ్ళు, చేతులు అన్నీ సవ్యంగానే ఉన్నాయి కదా! నేను క్రిందకు వెళ్ళి స్వయంగా తినగలను కదా!” అని. దానికి అమ్మ సమాధానం “నువ్వు తినలేవని కాదు నాన్నా! నేను నీకు తినిపిస్తున్నాను అంటే ఖాళీగా ఉన్న నీచేతులు ఇతరులకు ఉపయోగపడాల” అని. ఓహో అమ్మ ఇచ్చిన ఈ సందేశం ఒక్క రామకృష్ణఅన్నయ్యకే కాదు. సమస్తమానవాళికి అమ్మ ఇచ్చిన అమృతసందేశం ఇది.
శ్రీనాధునర్చించు కరముల్ కరములు” అని పోతన కవీంద్రుడు అంటే అమ్మ ఆకరములకు సరికొత్త కార్యక్రమాన్ని నిర్దేశించింది. ఇంతకు మించిన కార్యం ఇహంలో గాని పరంలో గాని ఇంతకంటే ఏముంటుంది.
రాజుగారు, మంత్రిగారు కాసేపటి తర్వాత వచ్చారు. అక్కడ కనబడుతున్న దృశ్యం రాజుగారికి కనువిందుగా ఉన్నది. ఆనందంతో రాజుగారి కళ్ళు చెమ్మగిల్లినాయి. జీవితంలో తను చూడలేనను కున్న దృశ్యాలు ఆయన కళ్ళముందు నాట్యం చేస్తున్నాయి. కృతజ్ఞతగా రాజుగారు మంత్రిగారికి నమస్కరించారు.
రాజుగారు లోపలికి వచ్చేటప్పటికి ఆయన కనిపించిన దృశ్యం. రాజుగారు చేయించిన దిగ్బంధం వల్ల ఎవరు చేతిలోకి తీసుకొన్న భక్ష్యాలు వాళ్ళు తినలేక పోతున్నారు. కాని ఎదుటివాడి నోటికి అందించటం బహు సులభం. అంతే వారందరు ఆ మధుర భక్ష్యాలు ఒకరి కొకరు తినిపించుకొంటున్నారు.
“ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటలేదోయి… అన్న మధురగీతం దూరంగా ఎక్కడో విన్పిస్తున్నది.