1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ బిడ్డలందరికీ అమ్మే

అమ్మ బిడ్డలందరికీ అమ్మే

Yellapragada Lalitha
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : June
Issue Number : 10
Year : 2011

‘అమ్మ’ బిడ్డలందరికీ అమ్మనే అనీ, ‘అమ్మ’ అమ్మలనే కన్న అమ్మ అనీ, బిడ్డలందరికీ ‘అమ్మ’ ఒడిలో చేరే అర్హత ఉంది అనీ మరోమారు, మరోమారు నిరూపిస్తూనే వుంది. జిల్లెళ్ళమూడిలో మొట్టమొదటి కోటి నామపారాణలో పాల్గొనే అవకాశం అమ్మ నాకు ఇచ్చింది. ఆరోజు కేవలం ఒకేసారి (1గంట) చేసిన అమ్మనామస్మరణ ఫలితంగా అమ్మనాకు ప్రసాదించిన వరం సహస్రము, అష్టోత్తరము, త్రిశతి, ఖడ్గమాల, సౌందర్యలహరి మొదలగు అమ్మ స్తోత్రాలని నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మార్చటం. ఆ ఆశీర్వాదమే ఆమె నాకిచ్చిన వరం. కేవలం ముమ్మారు మాత్రమే ‘అమ్మ’ని దర్శించుకున్నాను.

ఎంతకన్నతల్లి అయినా బిడ్డ తప్పు ఆలోచనచేస్తూ, తప్పుడు త్రోవలో ప్రయాణిస్తుంటే ముందు లాలించి, బుజ్జగించి బోధించి మంచి చెపుతుంది. ఇంకా వినక మొండికేస్తే, ఒక దెబ్బ తగిలించైనా బిడ్డని మార్చటానికి తన ప్రయత్నం తాను చేసి అందరికీ న్యాయం చేస్తుంది.

  అమ్మ అందరినీ గన్న అమ్మ. ధర్మానికీ, న్యాయానికీ, నీతికి విరుద్ధంగా (నీబిడ్డే అగుగాక) ప్రవర్తిస్తే ఎలా వూరుకుంటున్నావమ్మా అని అమ్మని నేను నిలదీసి ప్రశ్నించాను. మా కుటుంబ వ్యవహారం, రచ్చకెక్క నివ్వవద్దని చేతులు జోడించి ప్రార్థించాను. న్యాయం నువ్వు మాత్రమే చెయ్యగలవని భారం ‘అమ్మమీదనే వేశాను. ప్రపంచ భారాన్ని వహించిన విశ్వజననికి ఇదొక లెక్కా!

నేను అడిగింది సమంజసంగా అమ్మకి తోచిందేమో మరి ‘అమ్మ’ మూడు నెలలు తిరక్కుండా (పాతిక సంవత్సరాలు అపరిష్కృత సమస్యకి) నాకు భారాన్ని తొలగిస్తూ పరిస్థితులని, అనుకూలంగా మార్చి నమ్మినవాళ్లకి రక్షగా ఎప్పుడూ నే నుంటాననీ, ‘అమ్మ’ బిడ్డలందరూ ఒక్కటే అనీ, ‘అందరిల్లు’ ఏ ఒక్కరి సొంతంకాదనీ, అది అందరిదీ’ అని నిరూపించింది. అమ్మపాదాలచెంతనే జీవిత పరమార్థం నెరవేర్చుకుంటాను.

ఇదేకాదు. మా జీవన సరళిలో ఏర్పడిన ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని, నామస్మరణే మీ ‘ఆయుధం’ అనే ధైర్యమూ, కార్యదక్షత, వివేకాన్నీ మాకు ప్రసాదించి, మాలో వున్న మంచిని పెంచుతూ, తగిన సహాయ, సహకారాలని మాకు అందిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న అమ్మకి  మనసా, శిరసా, వాచా పాదాభివందనములతో, కృతజ్ఞతలతో….

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!