అనేక ఆర్థిక యిబ్బందులకు లోనై ఆత్మానుభవం పొందాలనే జిజ్ఞాసతో 1958లో అమ్మను దర్శించుకుని, అమ్మనే నమ్ముకుని, అమ్మనే ఆశ్రయించి, అమ్మ సూచించిన మార్గంలో ప్రయాణం చేస్తూ భక్తుడుగా, జ్ఞానిగా జీవిస్తూ, 90 సంవత్సరాల వయస్సున్న వయోవృద్ధుడు తపస్వి ఆలపాటి పూర్ణచంద్రావుగారు. వీరు గుంటూరు వాస్తవ్యులు ప్రస్తుత నివాసం తెనాలి. వీరు అమ్మను దర్శించటానికి పూర్వం – కంచికామకోటి పీఠాధిపతులైన చంద్రశేఖరసరస్వతీ స్వామివారిని కలిశారు, వారు కర్నూలు వచ్చినపుడు. వీరిలో ఉన్న ఆర్తిని గమనించి తనను తరచుగా కలుసుకోవడం కష్టమని గుంటూరు జిల్లా చందోలు గ్రామంలో ఉన్న శ్రీ విద్యోపాసకులైన రాఘవనారాయణశాస్త్రిగారిని కలవమని సూచించారు, స్వామివారు. స్వామివారి ఆజ్ఞప్రకారం వీరు చందోలు వెళ్లి రాఘవనారాయణశాస్త్రి గారిని సంప్రదించగా “కనిపిస్తున్న వస్తుజాలాన్ని సాక్షిగా చూడు” సాక్షికి అవతల “అశరీరి అరూపశక్తి, ఉందని దానినే భగవంతుడు అంటారని” వారు ఉపదేశించారు.
1958లో వీరు అమ్మదగ్గరకు మొదటిసారిగా వచ్చినపుడు ఆర్తితో అమ్మా ! నాకేదైనా చెప్పమని అడిగినపుడు, అందుకు సమాధానంగా అమ్మ చిరునవ్వుతో వారివంకచూసి “సోహం” అన్నారట. పూర్ణచంద్రరావుగారు – అంజలి ఘటించి “అమ్మా ! దాసోహం ! అన్నారట. అప్పటి నుండి భగవంతుని దాసుడుగా ఉండటం కంటే ఆనంద మేమున్నదని అమ్మను భగవంతునిగా ఆశ్రయించి – అమ్మతో ఏకాంతంగా ఆధ్యాత్మిక సంభాషణలు చేస్తూ ఉండేవారు.
1958లో గుంటూరు నుండి భక్తులుగా అమ్మ సన్నిధికి వచ్చినవారిలో వీరు ప్రధములు అ చెప్పుకున్నారని బహుశా అవి అమ్మ స్వయంగా వంటచేసి పెడుతున్న రోజులు. తరువాత హైమాలయం వెనుక ఉన్న పూరిపాకలో ఉండేవారు. రోజులలో ఆ జిల్లెళ్ళమూడి రావాలంటే చాలాకష్టం. 7వ మైలు రాయి దగ్గర బస్సుదిగి మూడువాగులు దాటుకుంటూ విస్తళ్ల కట్టలు నెత్తిన పెట్టుకొని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అమ్మను దర్శించటానికి వచ్చేవారు. పూర్ణచంద్రరావుగారు. వీరు జిల్లెళ్లమూడి వచ్చినప్పుడల్లా. అమ్మస్నానం చేసుకున్న నీళ్ళను బక్కెట్టుతో పట్టుకుని స్నానం చేస్తుంటే అది గమనించిన అమ్మ వసుంధరతో తాను రుద్దుకునే సబ్బును కూడా పంపించారట ఒకసారి.
1960 ప్రాంతంలో ఒకసారి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో అమ్మ నివసించే పూరిపాకకువచ్చి దర్శనం కొరకు తలుపుతట్టారట. ఆ రోజులలో అర్థరాత్రి 12 గంటలకు జిల్లెళ్లమూడికి చేరటమంటే పెదనందిపాడు నుండి నడిచివచ్చి ఉండవలసిందే తప్ప వేరే అవకాశం లేదు. 7వ మైలు రాయి వరకయినా బస్సులు వచ్చే అవకాశంలేదు. వీరు తలుపు కొట్టిన సమయంలో అమ్మ నివసించే పూరిపాకలో ఉన్న గోపాలన్నయ్య తలుపుతీసి అమ్మ నిద్రపోతున్నారు. ఇప్పుడు దర్శనంకాదు. రేపే ! అమ్మదర్శనం అని చెప్పగానే మౌనంగా వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఒకగంట తరువాత అమ్మలేచి ఎవరైనా యిక్కడకు వచ్చారా అని గోపాలన్నయ్యను అడిగితే జరిగిన విషయం అమ్మతో చెప్పగా ఎక్కడున్నా వెదికి వెంటపెట్టుకొని రమ్మని ఆదేశించింది. అర్థరాత్రి కటిక చీకటిలో గోపాలన్నయ్య ఆవరణంతా వెదికి – ఒక చోట పెద్దగా రోదన వినిపిస్తుంటే! గమనించి అమ్మ మిమ్ములను వెంటనే వెంట పెట్టుకు తీసుకురమ్మన్నదని ఓదార్చి అమ్మ సన్నిధికి తీసికెళ్లారు.
అమ్మను దర్శించుకున్న పూర్ణచంద్రరావుగారు అమ్మ రెండు పాదాలపై తలపెట్టి నమస్కరిస్తూ ఉండగా అతని శిరస్సుపై తన వేలు పెట్టి ఉంచింది అమ్మ. అప్పుడతనికి కలిగిన అనుభవం యేమిటో తెలియదుగాని మౌనంగా వెనుదిరిగి వెళ్లిపోయారు – అమ్మకూడా మౌనంగానే వున్నది.
పూర్ణచంద్రరావు అన్నయ్యగారు బంధుమిత్రులతో కలిసి 27-1-2013న ఉదయం షుమారుగా 10 గంటలకు జిల్లెళ్లమూడి చేరారు. వయోవృద్ధులైన కారణంగా వీల్చైర్ ద్వారా అనసూయేశ్వరాలయానికి తీసుకువచ్చారు.
అది ఒక అపూర్వ సన్నివేశం – వయోవృద్ధులైన పూర్ణచంద్రరావుగారు అనసూయేశ్వర ఆలయంలో వీల్చైరులో అమ్మకెదురుగా కూర్చుని ఆర్తితో అనేక స్తోత్రాలు చేసి అక్కడనుండి హైమాలయానికి పోయి దాసోహం అంటూ గద్గదకంఠంతో ప్రార్థిస్తున్న దృశ్యం చూచి తీరవలసిందే.
అక్కడున్న అమ్మభక్తులందరికి అంజలిఘటించి పూర్ణచంద్రరావుగారు నూతన వస్త్రములతో సత్కరించగా విశ్వజననీ పరిషత్ పాట్రన్, బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్యగారి చేతులమీదుగా వారు సత్కరించబడ్డారు.
జిల్లెళ్లమూడి చరిత్రలోనే ఇది ఒక జ్ఞప్తిపెట్టుకోదగిన సన్నివేశం అనిపించింది అందరికి.