1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మ భక్తులే ఆత్మ బంధువులు

అమ్మ భక్తులే ఆత్మ బంధువులు

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 19
Month : April
Issue Number : 2
Year : 2020

‘మాతాచ పార్వతీ దేవీ, పితా దేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాః” అన్నారు శ్రీ శంకర భగవత్పాదులు. ఆ పరదేవతే మన అమ్మ. ఆ పరమేశ్వరుడే నాన్నగారు, అమ్మ బిడ్డలంతా ఆత్మబంధువులే జిల్లెళ్ళమూడిలో.

ఈ తాత్పర్యంతో త్రికరణ శుద్ధిగా అమ్మను ఆరాధించిన కొమ్మూరు డాక్టర్ గారు, కొండముది రామక్రిష్ణ అన్నయ్య, పూండ్ల మాణిక్యమ్మగారు, రాజుబావ, ప్రభావతి అక్కయ్య వంటి వారి సేవలు చిరస్మరణీయములు. వారంతా ఆదర్శ ప్రాయులు, ప్రాతః స్మరణీయులు.

ఇక్కడ ఒక వాస్తవం, పదహారు అణాల పరమార్థం ఏమంటే – అమ్మ సేవ అంటే అమ్మకి సేవ కాదు, అమ్మ బిడ్డలకి, తోడబుట్టిన వారికీ సేవలే, నాడూ నేడూ ఏనాడైనా అదే సత్యం – అది అన్నపూర్ణాలయం గురించి, ఆలయాల గురించి, ఆస్పత్రి గురించి, కాలేజి గురించి ఏదైనా సరే. అమ్మ సాహిత్యం, చిత్రపటాలు, వర్ణ చిత్రాలు, దృశ్య శ్రవణ కావ్యాలు, స్థానికులకు, యాత్రికులకు కలిగించే సౌకర్యాలతో సహా. ఒక్కమాటలో చెప్పాలంటే భగవంతుని సేవ అంటే భాగవతుని సేవే.

ఈ దిశగా ఈ మార్గంలో అహరహం శ్రమిస్తున్న కొందరు విలక్షణ విశిష్ట సేవాతత్పరులను వారి తపశ్చర్యను వివరిస్తా నాకు తెలిసినంతవరకు.

1) మన దేశం కాదు, మన భాష కాదు, మన సంస్కృతికాదు. తన దేశానికి తన భాషకి తన సంస్కృతికి స్వస్తి చెప్పి, అనసూయమాతే నా తల్లి, అమ్మ నడయాడిన అవనియే నా మాతృభూమి, అమ్మమాటే బైబిల్ – భగవద్గీత, ఆంధ్రభాషే మాతృభాష, అమ్మ కట్టు బొట్టు ఆదరణ, ఆప్యాయత, చేతులు – చేతలు, అమ్మత్వం – ఇదే సంప్రదాయ పరమ లక్ష్యం – సర్వోత్కృష్ట గమ్యం అని విశ్వసించాడు 23 సంవత్సరాల ప్రాయంగల ఒక పాశ్చాత్య యువకుడు.

1975 జూన్ నెలలో వాత్సల్య యాతలో భాగంగా అమ్మ మద్రాసు, కంచి, తిరువణ్ణామలై, కలవై వెళ్ళింది. శ్రీ రమణాశ్రమంలో అమ్మ అడుగుపెట్టగానే నెమళ్ళు పురివిప్పి నాట్యం చేశాయి. ఆశ్రమ నిర్వాహకులు అమ్మను పూర్ణకుంభంతో స్వాగతించారు. ఆ సమయంలో జిజ్ఞాసువైన ఆ యువకుడు అమ్మను ప్రప్రథమంగా దర్శించుకున్నాడు. అమ్మయే పరమ సత్యం. (absolute truth ) అని గ్రహించాడు. క్షణ కాలంలో ఆ నిశ్చయాత్మక ఎఱుక అతనికెలా కలిగింది? అది కేవలం కృపాధారాధార అమ్మ అనుగ్రహ విశేషం. సోదాహరణంగా వివరిస్తా. ఒక పేద వృద్ధ అంథురాలు అనుదినం శ్రీ రమణులు చెంతకు వచ్చేది. కొన్నాళ్ళు గడిచింది అలా. ఒక రోజున మహర్షి ఆమెను అడిగారు. ‘నీకు… కనిపించదు. నన్ను చూడలేవు కదా! రోజూ ఎందుకు వస్తున్నావు?’ అని. అందుకు ఆ అంథురాలు ‘స్వామీ, నేను నిన్ను చూడలేను కానీ నువ్వు నన్ను చూస్తావు అని’ అన్నది.

అట్లే అమ్మను మనం తెలుసుకొనలేము, అమ్మ తనంతట తానే తెలియబడుతుంది. అలా అమ్మ కృపాపాత్రుడైన ఆ యువకుడు జిల్లెళ్ళమూడి వచ్చాడు. ఇదే నా నెలవు, నా మూలం అని తెలుసుకుని స్థిరపడ్డాడు. “My journey ends here” అని ఆనాడే ప్రకటించటం విశేషం.

హైమాలయంలో పూజాదికములు, ఉత్సవాల నిర్వహణ, అమ్మ సుప్రభాత సంధ్యావందన నామ సంకీర్తన బాధ్యతలు స్వీకరించాడు. అణువణువునా అమ్మ దివ్యమంగళ విగ్రహ తేజస్సును, నామమహిమను నింపుకున్నాడు. అందరింటి సేవా కార్యక్రమ నిర్వహణే ఊపిరిగా శ్వాసించాడు. 1978 మే నెలలో అమ్మ ప్రతిష్ఠించిన వైద్యాలయం Matrusri Medical Centre భవన నిర్మాణానికి పునాది రాయిగా నిలిచాడు. రమ్యమై సకల సదుపాయములతో శోభిల్లే రెండంతస్థుల భవనం నిర్మించాడు. అందు ప్రస్తుతం మొదటి అంతస్థులో శ్రీ విశ్వజననీ పరిషత్ కార్యాలయం, రెండవ అంతస్థులో Matrusri digital Centre నిర్వహింపబడుతున్నాయి.

అమ్మ దివ్య వాణిని యథాతథంగా భావితరాల కోసం క్యాసెట్స్ గా రూపొందించాడు. అమ్మ సాహిత్య సర్వస్వం మాటలు, పాటలు, చలనచిత్రాలు అన్నిటినీ భద్రంగా భద్రపరిచాడు. జిల్లెళ్ళమూడి అందరింటి సంప్రదాయం, సంస్కృతి ననుసరించి వివాహం చేసుకుని గృహస్థు జీవనం గడుపుతున్నాడు. తన కడుపున అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి Emily అనో Eliza అనో Victoria అనో నామకరణం చేయలేదు. తన తల్లి ‘అనసూయ’ కావున ఆ పేరు పెట్టుకున్నాడు.

ఇటీవల మైసూరులో ఆ అమ్మాయికి రంగరంగ వైభవంగా వివాహం చేశాడు. వెంటనే పసుపు బట్టలతో కూతురిని అల్లుని తీసుకుని జిల్లెళ్ళమూడి వచ్చి, ముందుగా జగన్మాత అమ్మకు పూజ చేయించాడు. పిమ్మట జిల్లెళ్ళమూడే జన్మస్థలం అనే గౌరవంతో ఒక సుందర భవనం కొనుగోలు చేసి అందే గృహప్రవేశం చేయించాడు. అమ్మభక్తులే ఆత్మబంధువులని ఎంచి అందరికీ శుభలేఖలు పంపి ఫోన్ చేసి వారిని ఆదరించి ఆశీస్సులంది అమితంగా సంతోషించాడు. అందరికీ విలువైన కానుకలు ఇచ్చి సన్మానించాడు.

ఆతని నిశ్చల నిర్మల భక్తికి ఒక ఉదాహరణ. 1978 డిసెంబర్ 31వ తేదీ రాత్రి గం. 11.45 ని.లకు అమ్మ నామ సంకీర్తన కోసం మైకు అమర్చాలని ఆ పరికరాన్ని సిద్ధం చేసి, ఒక్కొక్క దానినే అనుసంధానం చేస్తున్నాడు. అంతలో దభీమని పడిపోయాడు. తన చేతిలో కరెంటు వైరు మంటలు విరజిమ్ముతోంది. నేలపై పడిపోయాడు. స్పృహ కోల్పోలేదు. ‘అమ్మా, అమ్మా’ అంటూ నామాన్ని విడువలేదు. దాదాపు రెండు ని.లు తన శరీరంలో విద్యుత్ ప్రవహించింది. సాధారణ మానవ మాత్రుడు బ్రతికి బట్ట కట్టడు. అమ్మ నామ మహిమ అది. అమ్మ కృపతో పునర్జీవితుడనైనానని అన్నాడు.

స్పృహలో ఉన్నా, స్పృహ లేకున్నా అమ్మ స్మరణ స్ఫురణ వీడని ఆ సోదరుడు William James Campion.

2) ఆయన వృత్తి రీత్యా pharmacist. ప్రవృత్తి రీత్యా సత్యాన్వేషి, నిత్యసత్య సద్వస్తు చింతనాభిలాషి. ప్రముఖ రచయిత, సంపాదకులు. వారి రచనలు సనాతనం, సదా నూతనం. సునిశితమైన పరిశీలన, తపస్సు, విలక్షణ శైలిలో అమ్మ సాహిత్యాన్ని ఔపోసన పట్టి అనుభూతి చెందారు. అనుష్ఠాన వేదాంతానికి అద్భుతమైన ఉదాహరణ అమ్మ ప్రారంభించిన అన్నపూర్ణాలయం అని అభివర్ణించారు. అమ్మ మాటలు ‘రమణీయ భాషలో చెప్పిన స్మరణీయ సత్యాలు” అని శ్లాఘించారు. ‘అసలీ పుస్తకాలు, పత్రికలు, సాహిత్యం అంతా పరమతు’ల, పరిమితుల మయం’ అని వాస్తవాన్ని దర్శించిన ద్రష్ట, వారు అమ్మను భౌతికంగా చూడలేదు. కానీ తత్త్వతః సహస్ర కోణాల్లో అమ్మను దర్శించవలసిన రీతిలో దర్శించారు. వేనోళ్ళ ఆ అలౌకిక తత్వాన్నీ అనంత వాత్సల్యాన్నీ విప్లవాత్మక విశిష్ట వినూత్న ప్రవచనాల్నీ రసరమ్యంగా అక్షరబద్ధం చేశారు.

లోగడ వారు జిల్లెళ్ళమూడి రాలేదు, అమ్మను దర్శించి యుండలేదు. కానీ… వారిని వెదుక్కుంటూ అమ్మయే వారింటికి, వారివద్దకు వెళ్ళింది. సర్వాంతర్యామి అమ్మకు కానరానిది, చేరలేనిది ఏమున్నది? వారి అనుభవం ఇది – ఒకనాడు వారు నిద్రిస్తున్నారు. కలలో వారు జిల్లెళ్ళమూడిలో ఉన్నారు. అమ్మ మంచం మీద కూర్చున్నది.

చుట్టూ ఓ పదిమంది ఉన్నారు. ఆయన గది గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. అమ్మ వారి వైపు దృష్టి సారించి ‘నాన్నా! వాడు బాగా రాస్తాడు ఫోటోలు బాగా తీస్తాడు’ అంటూ ప్రక్కనున్న వారికి పరిచయం చేస్తోంది. ఉన్నట్టుండి అమ్మ లేచి వారి వద్దకు వచ్చి వారి శిరస్సుపై తన చేతినుంచింది. ఒక అవ్యక్తమైన అలౌకిక స్థితి కలిగింది. ఒళ్ళంతా స్వేదధారలు స్రవిస్తున్నాయి. ఆధ్యాత్మిక రంగంలో దానిని గురు-శిష్య పరంగా హస్త మస్తక సంయోగం శక్తి అని వ్యవహరిస్తారు.

ఆ వృత్తాంతాన్ని కేవలం కల అనుకోరాదు. మెలకువ వచ్చిన తర్వాత ఒకటే చెమటలు ఒళ్ళంతా. అమ్మ ఎవరిని ఏవిధంగా ఆదరిస్తుందో అనుగ్రహిస్తుందో అగ్రాహ్యం.

ఆయన కవి, రచయిత, విమర్శకుడు. శ్రీ శంకర విజయం, శృంగేరి కథలు సుందర దర్శనం, మహనీయులు-మహాత్ములు వంటి గ్రంథాల్ని రచించారు.

మన అమ్మను గురించి ‘విశ్వజనని’, ‘Mother of All ‘ పత్రికలలో అసంఖ్యాకంగా రచనలు చేశారు. అందరి అభినందనలకు పాత్రులైనారు. వారు రచించిన ‘దాటవలసిన 7వమైలు రాయి గ్రంథం దశాబ్దాలుగా జిల్లెళ్ళమూడి వచ్చే సోదరీసోదరుల మనోఫలకంపై చెరగని ముద్ర వేసింది. భాస్కరరావు అన్నయ్య వ్రాసిన 640 పేజీల ‘అమ్మ జీవిత చరిత్ర’ (మాతృశ్రీ జీవిత మహోదధి)ని కేవలం 150 పేజీలలో ‘అమ్మకథ’ అనే పేరుతో సంక్షిప్తంగా, సర్వాంగ సుందరంగా, రసస్ఫోరకంగా, లక్ష్యాత్మకంగా, సరళంగా, సుందరంగా రచించారు.

అది గ్రంథరూపంగా ప్రచురితమై ఆవిష్కరింపబడలేదు. ఈ సేవలన్నీ ఎందుకు చేస్తున్నారాయన? జిల్లెళ్ళమూడి చిరకాలంగా వస్తూన్న, నేడు వచ్చీ పోయే, మున్ముందు రాబోయే భావితరాల వారి కోసం. వారి పేరు శ్రీ కామఋషి వెంకటేశ్వర ప్రసాదవర్మ.

మాన్యసోదరులు శ్రీ జేమ్సుకి, శ్రీ కె.వి. ప్రసాదవర్మకి ‘అమ్మ భక్తులే ఆత్మబంధువులు’.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!