1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ మహిమలు అనంతం

అమ్మ మహిమలు అనంతం

Goteti Rama Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : November
Issue Number : 4
Year : 2013

‘అమ్మ’ అనసూయమ్మ అన్నపూర్ణమ్మ

‘నాన్న’ నాగేశ్వరుడు!

  వంశం బ్రహ్మాండం !

నాన్నగారికి శత వసంతోత్సవం

అమ్మ’కు శత సంతోషోత్సవం !

బిడ్డలకు బ్రహ్మాండోత్సవ ఆనందం !’

లోకంలో కలి, ఆకలిని పుట్టిస్తాడని ఆ ‘అమ్మ’ ఒక్కరికే తెలిసింది. కాశీలోని అన్నపూర్ణమ్మ ఇక్కడ జిల్లెళ్ళమూడి లోనే వెలసిందా ? అసూయ లేని అనసూయమ్మ త్రిమూర్తులనే పసిపాపలను చేసి చనుబాలు కుడిపి చనువుగా పెంచిన ఆ అనసూయమ్మే జిల్లెళ్ళమూడిలో వెలసి, ఆ బాలవృద్ధులనూ తనబిడ్డలుగానే తలచి, ఆర్తినీ క్షుదార్తినీ తీర్చడానికే ‘మన్నవ’లో పుట్టి, బ్రహ్మాండం వారింటిని ‘మెట్టినిల్లు’గా చేసుకుని ఆ వంశపు నాగేశ్వరరావు గారికి అర్ధాంగి అర్ధనారీశ్వరిగా ‘పార్వతీపరమేశ్వరౌ అని కాళిదాసు అన్నట్టు ‘జిల్లెళ్ళమూడి’ నొక కాశీగా, కైలాసంగా తీర్చిదిద్దినదా అన్నభావం. అర్థశతాబ్ది క్రితం ‘జిల్లెళ్ళమూడి’ సతీసమేతంగా వెళ్ళి ఆ తల్లి అనుగ్రహంగా అన్నం పరబ్రహ్మంగా తలిచి భుజించి నపుడే గ్రాహ్యమైంది. కడుపు ఏడుస్తున్నట్టుగా ఉంది, తృప్తిగా తిన్నావా? అని అడిగి, మా దంపతులిరువురి తలనిమిరి, ఇరువుర్నీ ఆశీర్వదిస్తూ నూతన వస్త్రములు లిచ్చినపుడే ‘అమ్మ’ ఇల్లు పుట్టినిల్లుగా భావించాను. ఆ అన్నపురుచ్యం ఎక్కడ నుంచి వచ్చిందో, భగవత్ప్రసాదితమైన ప్రసాదం జఠరాగ్నిని తీర్చి జీర్ణమై ఆనందాన్నీ కలిగించింది. అందుక్కారణం అనుగ్రహం, ఆత్మీయత, ఆప్యాయత, లలితాదేవి వంటి ఆమె వర్చస్సు, వచస్సు కారణం. ఎప్పుడో కోల్పోయిన మా ‘అమ్మ’నూ, అమ్మమ్మనూ చూచిన అనుభూతి కల్గింది. ఆ అడ్డబాస, ముక్కుపుడకలు, దుద్దులు చేతులు గాజులు, భృకుటిని ఉదయిస్తున్న సూర్యునిలా ఉండే ఆ బొట్టు, మోము మీద చిలకరించే ఆ నవ్వు, ఆ ప్రక్క గోడ మీద కిరీటధారిణియై ఉన్న ‘అమ్మ’ను జూచినపుడు హయగ్రీవులు వర్ణించిన లలితాదేవే ప్రత్యక్షమైనట్లయింది. మా భార్యాభర్తలిరువురం ఆత్మ నమస్కారం చేసుకున్నాం.

శింజానమణిమంజీర మండిత శ్రీ పదాంబుజా

మరాళీమందగమనా మహాలావణ్య శేవధిః |

సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషితా

శివకామేశ్వరాంకస్థా శివాస్వాధీనవల్లభా ॥ అంటూ ముందు శ్లోకాల్లో –

‘సకుంకుమ విలేపనా మళిక చుంబి కస్తూరికాం

సమన్దహసితేక్షణాం సశరచారు పాశాంకుశామ్

అశేష జనమోహనీ మరుణమాల్య భూషోజ్వలాం

జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరేదమ్బికామ్.

చాలమటుకు రూపం అంతసుందరంగా మహాలక్ష్మిలా ముచ్చట గొలుపుతూంటుంది. ఆ స్నిగ్ధ ముగ్ధ ఆప్యాయత చూస్తూంటే, చిలకపలుకుల చిన్ని కృష్ణుణ్ణి యశోద బుజ్జగిస్తూ గోరుముద్దలు పెడ్తున్నంతటి గోముగా ఉంటుంది. నా చిన్నతనం, వయసు పదేళ్ళొచ్చినా ఒడిలో పడుకుని అమ్మ చేతిగోరుముద్దలు తిన్న చందం గుర్తుకు వచ్చింది. జిల్లెళ్ళమూడి వచ్చిన వారందరూ అలాటి అనుభూతి పొందినవారే ! అక్కణ్ణుంచీ కదలాలనిపించదు. అమ్మ ఆ యింటికి పెట్టిన పేరు అందరిల్లు ‘అమ్మ’ అందరి అమ్మ. అన్నం తిననిదే ఎవరినీ కదలనీయదు. అన్నం తినకుండా ఆ గడపదాటలేరు. అందరినీ అలరించే అమ్మ దనం ఆ అమ్మవద్దనే ఉన్నది.

‘అమ్మ ఎపుడూ తాను దైవమని చెప్పుకోలేదు. తొలిసారి దర్శించవచ్చినవారు పాదనమస్కారం పెట్టబోతోంటే ‘నాన్నా! ముందు వెళ్ళి అన్నం తినిరారా!’ అని పంపించేది. నేను ‘అమ్మ’ను, బిడ్డల ఆకలి తీర్చడం కోసమేరా నేనున్నది. నా వద్దకు వచ్చిన వారెవరూ ఆకలితో ఉండకూడదు. బిడ్డల ఆకలి తల్లి భరిస్తుందా? భరించదు, నా వద్దకు వచ్చేవారిని బిడ్డలు గానే చూస్తాను. బిడ్డలను లాలనగా చూసేది తల్లి, కళ్ళు తెరిచి చూచినపుడు తొలిగా తల్లినే చూస్తాడు. ప్రతిగా తల్లి పిల్లవాడినే కాదు పిల్లవాడి ఆకలిని కూడా చూస్తుంది. జిల్లెళ్ళమూడి ‘అమ్మ’ బిడ్డల ఆకలినే చూస్తుంది.

అందరూ తన బిడ్డల ఆకలినే భావనతో 1958 సంవత్సరము ఆగష్టు 15న ఆకలి చిచ్చు అణగార్చడం కోసం ‘అన్నపూర్ణాలయం’ ప్రారంభించింది. ఆనాడు గాడి పొయ్యిలో వేసిన నిప్పు, ఈనాటికీ నీ కొనసాగుతూ లక్షల కొలదీ బిడ్డా పాప లొక్కరననేల ఆ బాలవృద్ధులందరూ వచ్చి, రుచ్యమైన అన్న ప్రసాదాన్ని ఆరగిస్తున్నారు. అమ్మ 50 వ పుట్టినరోజున లక్షమంది ఒకే పంక్తిన భుజించి ఆనందించడం ఎక్కడా జరుపని, జరుగని నయనానంద కరమైన రోజు, ఎన్నిగాడి పొయ్యిల్లో వండారో, ఎన్ని పందిళ్ళ నీడన సుఖాసీనులై షడ్రసోపేతమైన భోజనం చేశారో – ఆ ఆనంద అన్నభోజన ఉత్సవాన్ని అన్న బ్రహ్మోత్సవంగా పైన దేవతలు కూడి చూచినంత మహోత్సవంగా భాసిల్లింది. ఇలా ద్వాపరయుగంలో ద్రౌపది చేసి, అందరికీ వంటకాలు అందాయా లేదా అని స్వయంగా పరిశీలించి, పరితృప్తి నొందిన తరువాత తాను భుజించిన విషయాన్ని, ఆమె గృహిణీ ధర్మాన్ని దుర్యోధనుడు అచ్చెరువు నొందాడనీ, ప్రశంసించాడని మహాభారత గ్రంధము తెలియచేసింది. కానీ కలియుగంలోని జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయమ్మ ఒక్క మెతుకును మాత్రమే ఆస్వాదించి, బ్రహ్మానంద మొందింది. ‘ ఈనాడు కూడా ఆ అన్న మహోత్సవాన్నీ కళ్ళారా చూచి ఆనందం అనుభవించిన వారున్నారు.

కొందరు రాజరాజేశ్వరీదేవిగా కిరీటాలంకరణం చేసి ఆనందిస్తూంటే నాన్నలారా ! నేను అమ్మనురా ! మీ అమ్మను ఈ యిల్లు మీ అందరిల్లు అనే తల్లి ఆ అనసూయాతల్లి. అమ్మ ఉపన్యాసాలిచ్చేది కాదు. సభలు జరిపేది కాదు. నీవు అడిగిన ప్రశ్నలోనే నీకు జవాబు చెప్పేది. సమాధాన పరిచేది, సంతృప్తి పరిచేది. ఇలాంటి సందర్భాలుగా మాట్లాడిన ఎన్నో మాటలు, సూక్తులు, పురాణోక్తులు గ్రంధాలుగా వెలువడ్డాయి. ఆ ‘అమ్మ’ మహిమలు చెప్పాలంటే అనంతం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!