1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మ మహిమల కదంబము

అమ్మ మహిమల కదంబము

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 20
Month : January
Issue Number : 1
Year : 2021

శ్రీ మిన్నికంటి గురునాధ శర్మగారి పద్య కావ్యం – “అమ్మ” ఈ మహోత్కృష్ట గ్రంథ ప్రచురణ 1961 సంక్రాంతినాడు. ఇందు అసంఖ్యాకములైన విశేషాంశములు కలవు. అన్నిటిని వివరింప నేను అశక్తుడను. నాకు అందినంత మేరకు వివరిస్తా.

ఈ వ్యాసంలో – 50 ఏళ్ళనుంచి జిల్లెళ్ళమూడి వస్తున్న నావంటి వానికి నేటి వరకు తెలియని అమ్మ అలౌకిక లీలా విభూతులను కొన్నింటిని వివరిస్తాను. అవి అపూర్వములు, అపురూపములు, అమోఘములు, అప్రమేయ స్వరూపిణి అమ్మ మానవాతీత మహిమ ప్రభా సంశోభితములు.

నాలిబూతమ్ము తెనాలి రిక్షావాడు

 దారి తప్పించి సత్వరముగాను

 పురి వెలుపలికి గొంపోయిని న్నిర్జన

 స్థలి నిల్ప వెంటనే తలక కీవు

 సాంబయ్య! క్షేమమా! యమ్మాయి ప్రసవించె 

నా? యని పల్కుచో నతడు వచ్చి

 ఎవడవురా? అమ్మ నిట కేల తెచ్చితి 

వనవుడు గోపింప కతడు దారి

 తెలియ కేతెంచెనని నీవు పలుక సాంబు

డోరి! యిది దారి చనుము నేనుందు గనుచు

ననగ నిన్ను వాడిలు సేర్ప నడగి నంత

ధన మొసగి పంపితట వాడు దండమిడగ.

సందర్భం: ఒకసారి తెనాలిలో రవి అన్నయ్య, హైమక్కయ్య (చిన్న పిల్లల)తో అమ్మ రిక్షాలో వస్తున్నది. ఆ రిక్షావాడు దురాత్ముడు. దారి తప్పించి ఊరు. దాటించాడు. సంజ చీకట్లు కమ్ముకుంటున్నాయి. కొంతదూరం పోనిచ్చి రిక్షాని ఆపాడు. ఆ సమీపంలో వాడి ముఠా మనుషులు నలుగురున్నారు. వాళ్ళకి అది రివాజు – అలా తేవడం, అంతా పడి దోచుకోవటం. ఆ నలుగురు సమీపించే తరుణాన అమ్మ “ఏవిరా సాంబయ్య! కులాసానా? అమ్మాయి ప్రసవించిందా? అని అడిగింది. అంతే. తక్షణం చేత దుడ్డుకఱ్ఱ పట్టుకుని సాంబయ్య ప్రత్యక్షమై నాడు. కళ్ళు ఎఱ్ఱజేసి “ఎవడవురా నువ్వు? అమ్మని ఇటు తెచ్చావేం? వెనక్కు ఇంటికి తీసుకుపో. ఇదీ దారి. నేను నిన్ను ఒక కంట కనిపెడుతూ ఉంటాను” – అన్నాడు కోపంగా రిక్షా వానితో. ఆ రిక్షావాడికి, వాడి ముఠాకి దడ పుట్టింది. స్థాణువులై నిలుచున్నారు.

అంతలో అమ్మ కలగ జేసుకుని “దారి తెలియక వచ్చాడులే!’ అని రిక్షావానికి ఊపిరి ఊదింది. వెంటనే వాడు అమ్మను క్షేమంగా తాతగారింటికి చేర్చాడు. వాడు అడిగినంత బాడుగ అమ్మ ఇచ్చింది. వాడు చేతులు జోడించి అమ్మకు నమస్కరించాడు.

వివరణ : పిలువగానే ప్రత్యక్షమైన ఆ అజ్ఞాత వ్యక్తి సాంబయ్య ఎవరు? సాంబశివుడా? తన చేతిలో దుడ్డు కఱ్ఱ త్రిశూల సదృశమా? ఆతని కోపావేశం త్రినేత్ర అగ్ని జ్వాలాతిశయమా?

  1. చోరులు పాక లోపలికి జొచ్చి పరుండిన నిన్ను మంచముం 

గూరిచి కట్టివేయునెడ గూరిమి బేరులతోడ బిల్చి ‘మీ

 కోరిన దీయనే యడుగుకో నన వారడలెత్తి మ్రొక్కి మీ 

వారికి దీని జెప్పకిదె వాంఛయనన్ సరెయంచు బంపితే.

సందర్భం: ఒకనాడు అమ్మ తన నివాసమైన పర్ణ కుటీరంలో నిద్రిస్తోంది. దొంగలు పాకలోకి జొరబడి, అమ్మని మంచానికి కట్టేశారు. వాళ్ళందరినీ అమ్మ పేర్లతో పిలిచి “నాయనా! మీకు ఏమి కావాలంటే అది నేను ఈయనా? అడగండి” – అన్నది.

అమ్మ పలుకులు విని చోరులు హడలెత్తి అంజలి ఘటించి “మాకేమీ వద్దు. ఈ సంగతి నీ భర్తకి చెప్పవద్దు. అదే మా కోరిక’ – అని విన్నవించుకున్నారు. ‘సరే!’ అని అమ్మ వాళ్ళని పొమ్మన్నది.

వివరణ: నాన్నగారు గ్రామ కరణంగారు. ఆ దొంగలని అమ్మ పేర్లతో పిలిచింది. అంటే ఆకృతితో కాదు, పేర్లతో గుర్తించిందని తెలుస్తోంది. ఆ సంగతి తెలుసుకుని ‘బ్రతికుంటే బలుసాకు తిని బ్రతక వచ్చు’ – అని ఆ చోరులు కాళ్ళకి బుద్ధి చెప్పారు.

“నన్ను నిర్బంధించడం ఎందుకు? మీకు ఏది కావాలంటే దానిని నేను ఇవ్వనా? అనటంలో అమ్మ హృదయాన్ని మీరే గ్రహించండి.

  1. ఒకనాడు నీవింట నుండి రైతులతోడ

 మాటలాడుచు నదే మన పొలాన

పంటకుప్ప తగులబడ సాగె బొండన 

వారు తత్తరమున బయటికేగి 

పొగమంటలం గాంచి యిగ మనమేగు న

ప్పటికి గుప్పంతయు భస్మమగు న

 టంచు బలుకు కొంచు నతిరయంబున బర్వు

లిడిరట పొలమున కింతలోన

 నెవ్వరార్పకుండనే నిప్పు చల్లారి

 పోయెనంట వారు డాయులోన

 వడ్లు గూడ నవల బ్రతివత్సరము కంటె

నెక్కువైనవంట యెంత వింత?

సందర్భం: అలనాడు అమ్మ సంస్థ నిర్వహణకోసం వ్యవసాయం చేయించింది. ఒకనాడు తన ఇంటి ఉండి అమ్మ రైతులతో మాట్లాడు చున్నది.

ఉన్నట్టుండి – “అరె! మన పొలంలో పంటకుప్ప తగుల బడుతున్నది. పొండి” అని తొందర పెట్టింది. కంగారుతో వారు పరుగులు తీశారు. బయటికి వచ్చి చూస్తే – నిజం. ఇంకేముంది? కుప్ప నుంచి పొగ, మంటలు కాన వచ్చాయి. అయ్యో! మనం అక్కడికి చేరుకునే లోపల కుప్పంతా బూడిద కాక మానదు అని మౌనంగా రోదిస్తూ తత్తరపాటున కుప్పను సమీపించారు.

అంతలో ఎవ్వరూ ఆర్పకుండగనే నిప్పు దానంతట అదే చల్లారి పోయింది. అంతేకాదు. ఆశ్చర్యం. ప్రతి ఏడాది కంటే ఆ ఏడాది పంట దిగుబడి ఎక్కువగా వచ్చింది. ఎంత వింతగా ఉంది!

వివరణ: అమ్మ సన్నిధిలో మహిమలు సహజంగా సంభవిస్తాయి. అమ్మ సన్నిధి అంటే జిల్లెళ్ళమూడి అనికాదు; అమ్మ కరుణా పరీవాహ ప్రాంతం. అది మనకి విశేషం. ఎక్కడో ఇంట్లో ఒక చోట కూర్చొని ఉన్న అమ్మకి ఇంకెక్కడో ఉన్న పంటకుప్ప తగులబడుతోందని ఎలా తెలిసింది? అమ్మ మనవలె మానవ మాత్రురాలు కాదు. అమ్మ దృష్టి మన దృష్టి వలె పరిమితం, సంకుచితం కాదు. ఇందలి రహస్యాన్ని గురించి ఒక సోదరుడు అమ్మను ఇలా ప్రశ్నించాడు “అమ్మా! నీకు అన్నీ ఎలా తెలుస్తాయి?” అని. అందుకు స్పష్టంగా అమ్మ “ఏదైతే తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో, అది నాకు తెలుసు. అదే నేను” అన్నది. అమ్మకి దాపరికం లేదు. మనకి అందకుండా ఎత్తున ఏ ఉత్కృష్ట సత్యాన్నీ దాచి ఉంచలేదు.

అంతేకాదు. మానవాతీత శక్తిని ప్రదర్శించింది. అదృశ్యంగా చేయూత నిచ్చింది. నిప్పు అంటుకున్న పంట కుప్ప ఎవరూ ఆర్పకుండానే దానంతట అదే అరిపోయింది. అంతకంటే ఆశ్చర్యకరమైన సంగతి ఏమంటే – ఏటా వచ్చే ధాన్యం కంటే ఆ ఏడాది ఎక్కువ దిగుబడి వచ్చింది. అంటే అమ్మ అనుక్షణం మన వెన్నంటి ఉంటూ కనిపెడుతూ సంరక్షిస్తూ ఉన్నది అన్నమాట.

  1. అన్నము మానివేసిన రవంతయు జిక్కవు దేహకాంతి య 

భ్యున్నతి జెందు నేమికతమో యనుకొంటే సహస్ర పద్మమం 

దున్న సుధారసంబు గొనుచుంటివె యాకలి దప్పులారగా

నెన్నడు నింటి దొంగ బరమేశ్వరుడైనను బట్టలేడుగా

సందర్భం: “ఈ కలిలో నాకు ఆకలి లేదు” అన్నది అమ్మ. అమ్మకి సన్నిహితంగా ఉండు వారలందరూ అమ్మ నిరాహార అనే వాస్తవానికి ప్రత్యక్ష సాక్షులు. ఆహారము తీసుకోదు. అయినా దేహము కార్తీక దీపం వలె ఉజ్జ్వల కాంతి తరంగాల్ని ప్రసృతం చేస్తుంది. ఇందుకు కారణం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే ఒక సమాధానం లభించింది.

వివరణ: సహస్రార కమలంలో నివసించే అమ్మ అచ్చటి సుధారస ధారలను గ్రోలుచున్నది. ఇక ఆకలిదప్పులు ఎందుకుంటాయి? తను సుధాసారాభి వర్షిణి కదా!

కవీశ్వరులు శ్రీశర్మగారు ఇక్కడ ‘వ్యాజనింద’ అనే స్తుతి ప్రక్రియను చేపట్టారు. ‘ఇంటి దొంగను ఈశ్వరుడైనను పట్టుకోలేడు’ అంటారు. పైకి నింద అనిపించినా అది స్తోత్రమే.

“గుఱుతెఱిగిన దొంగ కూగుగు

వీడె గుఱిలోనె దాగీనే కూగూగు” అంటారు అన్నమయ్య.

“ఇదిగో ముసుగు దొంగ” అన్నది అమ్మ చిదంబరరావుగారితో ఒక సందర్భంలో. అమ్మని అర్థం చేసుకోవటం అసాధ్యం. ఎన్నో మాయ తెరలను తప్పించుకుంటూ వెళ్ళాలి.

అలా శ్రీ శర్మగారు అమ్మ అతిలోక సామర్థ్యానికి, అలౌకిక శక్తికి దర్పణం పట్టారు. అటువంటి అద్భుత సంగతులు, సందర్భాలు, సత్యాలు ఈ గ్రంథంలో పెక్కు గలవు. ఈ గ్రంథ ప్రతులు శ్రీవిశ్వజననీ పరిషత్ పబ్లికేషన్ స్టాల్

లభించుచున్నవి. ఆసక్తిగల సోదరీ సోదరులు ఈ గ్రంథ పఠనం చేసి అమ్మ సత్య సత్స్వ రూపాన్ని దర్శించగలరని ఆకాంక్షిస్తున్నాను.

ఉపయుక్త గ్రంథావళిః

  1. ‘అమ్మ’ శ్రీమిన్నికంటి గురునాధ శర్మ, 2015, ఎస్.వి.జె.పి ప్రచురణ. 
  2. ‘మహెూదార మాతృత్వ దీప్తి’ శ్రీరామరాజు కృష్ణమూర్తి, 2020, ఎస్.వి.జె.పి ప్రచురణ.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.