అనుపమ మాతృవాత్సల్య రూపిణి, అవతారమూర్తియైన మాతృశ్రీ అనసూయాదేవి (అమ్మ). వివిధ సందర్భాల్లో పలికిన వాక్యాలు అంత పదాలతో కూడి ఉన్నప్పటికీ ఎంతో నిగూఢమైన, గంభీరమైన భావాల్ని వ్యక్తీకరిస్తాయి. జిజ్ఞాసతో తరచేకొద్దీ ఎప్పటి కప్పుడు కొత్త అర్థాల్ని ఆవిష్కరిస్తాయి.
ఉదాహరణకు: తోచిందేదో చేయ్, తోపింపజేసేవాడు వాడేగా అన్న వాక్యం మన అంతరంగంలో ఎంతో విశ్లేషణకు, వివేచనకు దారి తీస్తుంది; మనల్ని ఎంతో ఆలోచింప జేస్తుంది. మరుక్షణం మనకు ఏ ఆలోచన తోస్తుందో ఏ మాత్రమూ తెలియదుకదా! ఇక ఆచరణ మాత్రం మన చేతుల్లో ఉంటుందంటే ఎలా నమ్మటం? వేరే సందర్భంలో “అమ్మ” “చేతలు చేతుల్లో లేవు” అని విశదీకరించింది. అంతేగాక “ఈ సంకల్పం మనది కాదు అని తెలియటమే సంకల్ప రాహిత్యం” అని కూడా నొక్కివక్కాణించింది. అయినా టీ కప్పు మన పెదాలకు అందుతుంది అని ఖచ్చితంగా చెప్పగలమా?
నేను ఆలోచిస్తున్నాను, నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావం నుండి అమ్మ మనల్ని విముక్తం చేయటానికే పై అభిప్రాయాల్ని వెలిబుచ్చిందేమో? మానవుడ్ని నడిపించే శక్తి కనులకు కనిపించదు. కనుక మానవుడు తాను నడుస్తున్నానని తలుస్తాడు. ఇదే “అహం” కల్పించిన మాయ. ఇంకో చమత్కారం ఏమిటంటే ఆలోచనల్ని తోపింప జేసే వాడు; మనల్ని నడిపించే వాడు పరమాత్మే అన్న ఎరుక బలపడినప్పుడు అహం అణగి పోవటమే కాక మన మానసంలో ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైన ఆలోచనలు మాత్రమే జనించే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని విశ్వసించవచ్చు.
మన మస్తిష్కంలో సంస్కారవంతమైన; జీవుని సముద్ధరణకు; వీలైన అవసరమైన ఆలోచనల్ని కల్గింప జేయాలని అవ్యాజదయాస్వరూపిణి, ప్రేమమూర్తియైన “అమ్మ”ను ఆత్మార్పణ బుద్ధితో, భక్తితో నిరంతరం ప్రార్ధిద్దాం!
చం॥ నడపెడి దివ్యశక్తి నయనంబులకున్ గనిపింపబోదికన్
నడచెడువాడు మాత్రము కనంబడు; కావున మానవుండు నే
నడచుచునుంటి నం చనుట నైజమటంచు “అహం” పదార్థమున్
నుడివితి వమ్మ ఎంతటి మనోజ్ఞములో కద నీదు వాక్యముల్”
- (శ్రీ పన్నాల రాధాకృష్ణశర్మ గారి “అశ్రులహరి” నుండి)