1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ మాటలు – ఆచరణాత్మక సప్తసూత్రాలు

అమ్మ మాటలు – ఆచరణాత్మక సప్తసూత్రాలు

Ganti Kaliprasad Puttaparthi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : May
Issue Number : 10
Year : 2022

ప్రసంగవశాన అమ్మ చెప్పిన మాటలు వేదసారాలు, నిత్యసత్యాలు, అనుస్మరణీయాలు, అవశ్యం అనుసరణీయాలు. వాటితో అద్వైతం, సకల సిద్ధాంత సూత్రాలూ కనిపిస్తాయి. అవి సరళంగా, సుందరంగా లలిత పద బంధురమై సులభంగా అర్థం అవుతాయి. అందలి కొన్ని వాక్యాల్ని సప్తసూత్రాలుగా క్రోడీకరించుకుని ఆచరిస్తే సంతోషంగా ఉంటాం. అనుకున్నది సాధిస్తాం, ఉత్తమ స్థితుల్ని పొందుతాం.

  1. “ప్రేరణే దైవం” : మనకి కలిగే ఆలోచనలను పవిత్రంగా, దైవంగా భావించాలి. అపుడు చెడు తలంపులకు తావు లేదు. సమయం వృథాకాదు; ప్రతి నిముషం ఫలప్రదంగా సార్థకంగా సద్వినియోగం అవుతుంది. ఆలోచనలను పూజ్యభావంతో చూస్తే సత్కర్మలను ఆచరిస్తాం, విజయం సిద్ధిస్తుంది, కృతకృత్యులవుతాం.
  2. “తృప్తే ముక్తి” : నిత్యం అసంతృప్తితో ఉంటే సమయం అంతా నిరర్ధకం, నిష్ప్రయోజనంగా గడుస్తుంది. పైకి ఎదగాలని ప్రయత్నం చేయాలి, లభించిన దానితో తృప్తి చెందాలి. ‘యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః’ అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినదీ అదే.
  3. “అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు” : మనం ఎన్నో చేయాలి, ఎంతో సాధించాలి. అనుకుంటాం. కానీ కొన్ని మాత్రమే చేస్తాం, కొంత వరకే సాధిస్తాం. ఎందరో మహనీయులు, పుణ్యపురుషుల గాధలు విన్నాం. వాళ్ళంతా పూలబాటలో కాక ముళ్ళబాటలో పయనించి ఎంతో ఎత్తుకు ఎదిగిన వారే. అనుకున్న వన్నీ జరగవు. కావున, గోతిలో పడినా నిరాశతో క్రుంగి పోకుండా, మొక్కవోని ధైర్యం, ఉత్సాహంతో ముందడుగు వేయాలి. Failures are stepping stones to Success అని గ్రహించి గమ్యం చేరుకోవాలి.
  4. “ఇష్టం లేనిదే కష్టం” : చాలా సందర్భాల్లో భౌతికంగా, శారీరకంగా శ్రమపడిపోతుంటాం. ఎవరో ఏదో అంటారనో, అన్నారనో తడిమన్ను పొడిమన్ను చేసినంతగా శ్రమపడిపోతాం. అది ఇష్టం లేని పనికాబట్టి ఆ క్షోభ. మనకి ఆప్తులు ‘బాగున్నారా?’ అంటే ఆనందిస్తాం, కిట్టనివాళ్ళు అంటే హేళనగా, ఎగతాళిగా తీసుకుంటాం. జీవితంలో మనం సంతోషంగా ఉండాలన్నా, ఇతరులను ఆనందంగా ఉంచాలన్నా కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి.
  5. “ఇతరులలో మంచిని చూడటమే మన మంచితనం” : తన దోషాన్ని కప్పిపుచ్చుకుని ఎదుటి వారి దోషాన్ని ఎంచడం మానవనైజం. తప్పులెన్నువారు తమ తప్పు లెరుగరు కదా! అలాకాకుండా మంచినే చూడటం అలవాటు చేసుకుంటే మన ఆలోచనలు, ఆచరణలు, ఆవరణ శుభావహం అవుతాయి. ఆ విధంగా శుభాలు ప్రాప్తిస్తాయి, కష్టాలు దూరమవుతాయి. అంటే- “ఆగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసామ్’ అన్నట్లు దైవీ సంపత్తి చేరువవుతుంది, ఆసురీతత్వం నశిస్తుంది. ఎదుటి వానిలో లోపాలను ఎంచినందున మనకు తరుగే కానీ ఒరిగేదేమీ లేదు.
  6. “నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” : మన జ్ఞానం / శక్తి / సంపద యధాశక్తి బలహీనులకు పంచాలి. చక్కగా అన్న వితరణ చేయాలి. అమ్మను చూడాలనుకుంటే అమ్మను స్మరించి అన్న వితరణ చేస్తే, ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుందో అక్కడ హనుమ కొలువై ఉన్నట్ల, అక్కడ అమ్మని ప్రత్యక్షంగా దర్శించి పులకరించవచ్చు, తరించవచ్చు. ఇది నా స్వానుభవం.
  7. “ఏ స్థితి అయినా వచ్చేదే” : ఒక ఉత్తమ స్థితిని కోరుకుంటే అది ఎవరో ఇచ్చేది కాదు, ఆర్జించుకునేది. సాధన ద్వారా పొందాలి. తృప్తిగా తింటూ, బాధితుల్ని ఆదుకుంటూ, కోరికలు లేకుండా జీవిస్తే కైవల్యం / మోక్షం కరతలామలకం అవుతుంది.

అమ్మ నోట వెలువడిన ఈ సప్తసూత్రాలను, ఆణిముత్యాలను అర్ధం చేసుకుని ఆచరించటం ద్వారా అమ్మ చూపిన రాచబాటలో పూలబాటలో పయనించి సద్గతి, ఉన్నత స్థితిని పొందవచ్చు. అలా మనం అమ్మ మాటల్ని ఆచరణలో చూపడం అమ్మ బిడ్డలుగా మన కర్తవ్యం, అమ్మతత్వ ప్రచారం.

GRAND CELEBRATIONS

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!