1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మ మాటలు ఒక అవగాహన (అమ్మ సూక్తులు : బ్రహ్మము – సృష్టి : – గణితము, పరిణామము)

అమ్మ మాటలు ఒక అవగాహన (అమ్మ సూక్తులు : బ్రహ్మము – సృష్టి : – గణితము, పరిణామము)

C. R. Prasad Rao
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 8
Month : January
Issue Number : 1
Year : 2009

(అమ్మ మాటలపట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్)

జిల్లెళ్ళమూడి మాతృశ్రీ అనసూయేశ్వరీ దేవి యొక్క విదగ్ధము అల్పాక్షరములతో (సూత్రరూపంగా) అనల్పమైన భావము, సత్యార్థమును వినిపింప చేయుట. శ్రీలలితా సహస్రనామాలలో 90వ॥ నామం విదగ్ధా అ మహాచాతుర్యము కలది. అపూర్వ ప్రభావతి. సకలము నందు, సర్వకృత్యములందు (పంచకృత్యాలు – సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము) నేర్పరి, అని అర్థములు. అమ్మ యొక్క వైదగ్ధ్యము ఈ పంచకృత్యాలకే పరిమితం కాదు. అక్షర (వర్ణములు) సమాహారములందు అలతి అలతి పదములు ఎంచియో నిర్మించియో నిగూఢమైన వేదాంత భావములను, సత్యములను నిబద్ధీకరించుట యందు కూడా బహునేర్పరి. అక్షరమైన పరబ్రహ్మమునకు, అక్షరములే (వర్ణములు) తనవి తన స్వరూపము అయిన వేద జననికి, ఒక అల్పుడు చేయుచున్న అక్షర పూజగా ఇది తనకు తెలిసినంత, తోపినంత వ్రాసి సమర్పించుకొంటున్న వ్యాసము. ఇక వివరణము,

అమ్మ ప్రయోగించిన రెండు పదములు పరిణామం, గణితం – రైలు పట్టాలలాగ సమాంతరంగా సాగిపోయేవి కావు. అక్కడక్కడా ఈ రెండు కలుస్తుంటాయి. అంటే, పరస్పరం పరామర్శించుకోవడం, విమర్శించుకోవడం (ప్రకటన) చేస్తుంటాయి. మరోలాగ చెప్పాలంటే ఈ రెండూ ఒకదానికి యింకొకటి supplementary, complementary explanatory. 

పరిణామము:

సృష్టి (జగత్తు) యావత్తు గతి శీలము, అనగా మార్పు, లేక పరిణామంతో కూడినది. అమ్మ మాటలు : ఆలోచనలు క్షణక్షణం మారుతుంటాయి. (మనస్సు సంకల్ప, వికల్పాత్మక ప్రవాహరూపం). పరిణామం సూక్ష్మం గానూ స్థూలంగాను కూడా ఉంటుంది. అది స్థూలమైనప్పుడే మనము గుర్తించగల్గుతాము. అనుక్షణం జరుగుతున్న పరిణామం మనం అర్థం చేసుకోలేము. మార్పుకి లోనుకాకుండా ఉండే వస్తువు ఏదీ లేదు. మార్పు సృష్టికి స్వభావం (natural, తత్త్వం). పరిణామం సర్వత్రా ఉంది. పరిణామం పొందడంలోనూ, మనకి గోచరించటంలో ఆలస్యం కావచ్చు. (అంతా కాలనిర్ణయం). ఇవి ఇంచుమించు అమ్మ వాక్యాలు.

వేదం, పరిణామం లేనిది బ్రహ్మమంటుంది. నిష్కలం, నిశ్చలం, శాంతం అనీ, ధ్రువం, స్థాణుః, స్థిరః అచ్యుతం, శాశ్వతం, దేశకాల అపరిచ్ఛిన్నం అని, నిర్వికారం (షడ్భావ వికారాలు లేనిది – పుట్టుట, ఉండుట, వృద్ధి పొందుట, క్షీణించుట, వినాశ మొందుట వగైరా). షడ్భావ వికారాలు కలవి జీవ, జగత్తులు. ఆత్మకిగాని, పరమాత్మకిగాని ఈ వికారములు లేవు. (ఆత్మ, పరమాత్మ అని రెండు లేవు అంటుంది అద్వైత సిద్ధాంతం). అందువలన, బ్రహ్మ సత్యం, నిత్యం; జగత్తు మిథ్య, అనిత్యం అని సిద్ధాంతం. అమ్మ చెప్పిన పరిణామ సిద్ధాంతం సృష్టికేగాని, బ్రహ్మమునకు వర్తించదు అని మనం భావించ వచ్చు. అంటే బ్రహ్మము, జగత్తు రెండూ వేరు వేరుగా ఉన్నవి. వాటి స్వరూప, స్వభావ, తత్త్వాలు కూడా వేరే అని అనుకోవలసి వస్తోంది. కాని, అమ్మ దీనిని కాదంది. జగత్తే సత్యం, బ్రహ్మ మిథ్య అంటుంది. “నా దృష్టిలో జడమే లేదు. ఈ గోడను, రాయి రప్పలను మీరు జడమంటారు. రాతికి, రప్పకు పెరగడం, తరగడం ఉన్నవి. ఆలోచించే శక్తి రాయికి, రప్పకు ఉన్నదో, లేదో మనిషికి తెలుసా? ఒకరి మనస్సు మరొకరికి తెలిసే అవకాశమే లేనప్పుడు రాయికి, రప్పకి మనస్సుందో లేదో ఎట్లా చెప్పగలం? అంటుంది.

బ్రహ్మమును, జగత్తును సమన్వయం చేస్తూ శ్రుతి “సదేకం విప్రా బహుధా దంతి” అంటున్నది. ఉన్నది ఒకే ఒక సత్యం. అది అంతటా సర్వవ్యాపకమై ఏకరసమై (రసోవైసః) ఆనందరసమై (ఆనందోబ్రహ్మ) ఏకతేజమై, ఏకజ్ఞానమై (చైతన్యం) అన్యమనేది లేకుండా (ఏకమేవాద్వితీయం, నేహనానాస్తికించనః) ఉన్నదంటోంది. మన అమ్మ భావం, “ఆ ఉన్న ఒక్క సత్యాన్ని బ్రహ్మమన్నా తప్పులేదు; జగత్తు అన్నా పర్వాలేదు. అందుచేత జగత్తే సత్యం; బ్రహ్మ మిథ్య కాని యిక్కడ నిర్వచన పరమైన ఒక చిక్కుముడి వస్తోంది. అది, జగత్తుకి షడ్భావ వికారాలున్నాయి కదా? మరి జగత్తు, బ్రహ్మము ఏకమైన ఒకే “సత్” అనడం ఎట్లా కుదురుతుంది? దీనికి సమన్వయమే అమ్మ పరిణామ సూక్తి. ఒకాయన  “అమ్మా! భగవంతుడు సృష్టి ఎందుకు చేసాడు?” అని అడిగితే అమ్మ సమాధానం : “సృష్టి చేయలేదు నాన్నా, సృష్టి అయినాడు” అంటే బ్రహ్మమే సృష్టిగా పరిణమించాడు. – వ్యవహరిస్తున్నాడు అన్నాడ అనిపించు చున్నాడు. బ్రహ్మము బ్రహ్మముగా కాక సృష్టిగా మారడం అనేది మిథ్య విపర్యయ జ్ఞానం. ఉన్నదాన్ని మరొకటిగా తెలియడం “మాయ”. మన సామాన్య తెలివి (ఎఱుక)లో జగత్తును చూస్తున్నంత పర్యంతం బ్రహ్మము అగోచరము. (వ్యవహారిక జ్ఞానమే లేదా సత్యం). మన తెలివికి, ఎఱుకకు ఎంత విశ్లేషించినా, అన్వేషించినా బ్రహ్మమే అనుపించడం పారమార్ధిక జ్ఞానం, సత్యము. జగత్పరమైన జ్ఞానం సాపేక్షికం (మనస్సు లేదా జ్ఞాత మీద ఆధారం) పరోక్షం. బ్రహ్మమును తెలిపే జ్ఞానం అపరోక్షానుభవం శుద్ధజ్ఞానం. అన్ని ప్రమాణాలకి అతీతమయినది. ప్రత్యక్ష (ఇంద్రియ జన్యము) అనుమాన (inferential) ఉపమాన (analogical) శాస్త్రప్రమాణాలు (authoritative) అంటే జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం – ఈ మూడూ కూడా బ్రహ్మమే అయిన (త్రిపుటి రహిత) జ్ఞానం – సత్యం దీన్నే సంప్రదాయజ్ఞులు బ్రహ్మాకారమనస్సు, బ్రహ్మకారవృత్తి, అఖండాకార వృత్తి అంటారు. రమణ మహర్షి: జ్ఞాని మనస్సే, బ్రహ్మము శ్రుతి: ‘బ్రహ్మవిత్ బ్రహ్మైవభవతి’ బ్రహ్మమును ఎరిగినవాడు బ్రహ్మమే అయి ఉండును. కావున సాధారణ వ్యవహారిక జ్ఞాన కారకమైన మనస్సు (జ్ఞాత) బ్రహ్మాకార మనస్సుగా మారడమే జీవుని జ్ఞానంలో వచ్చిన పరిణామం. దీన్నే వేదము “విప్రాబహుథావదంతి” – అనగా సత్యం (బ్రహ్మము) తెలిసిన పండితులు, విప్రులు ఉన్న ఒకే సత్యమును అనేకంగా చెప్పుతుంటారు. (వేదం : ప్రజ్ఞానం, ప్రాణం, అన్నం, ఆకాశం అన్నీ బ్రహ్మయే అంటుంది. ఇట్లా తెలిసిన విప్రుల ప్రకారం బ్రహ్మమును జగత్తు అని అన్నా. అనవచ్చు అని అర్థం వస్తుంది. (ఇదం బ్రహ్మ – పూర్ణమిదం) నిర్విశేష పూర్ణ బ్రహ్మగా తెలియలేకపోవడమే మిథ్యాజ్ఞానం. “మిథ్య|| అంటే “లేదని” కాదు “కాదని” అర్థం చేసుకోవాలి. జగత్తు మిథ్య అనగా జగత్తు లేదని కాదు – జగత్తు జగత్తుగా కాదు. పారమార్ధికంగా ఇంకో విధంగా ఉన్నది అని గ్రహించాలి. బ్రహ్మమే జగత్తుగా భాసిస్తున్నాడని తెలియకపోవడమే మాయ, మిథ్య, అవిద్య. అమ్మ అంటుంది : “అదే ఇది”. “అదే ఇదంతా అయినది” (శ్రుతిః సర్వం ఖల్విదం బ్రహ్మ) లేదా, “ఏకోహం బహుళ్యాం” అహం (నేను) ఏకః అనేకంగా ఉంటున్నాను. ఇక్కడ ఒక ప్రశ్న. బ్రహ్మము బ్రహ్మముగానే ఉండవచ్చుకదా! మరి అనేకం అవడం దేనికి? అది మనం కల్పించుకొన్న ప్రశ్న. అది బ్రహ్మమునకు వచ్చిన ప్రశ్నకాదుగా! మరొక సందేహం : బ్రహ్మము అనేకంగా, అన్యంగా, ద్వైతంగా, జగత్తుగా పరిణమించినప్పటికీ, బ్రహ్మముగానే కన్పించవచ్చుకదా మనకి? మరి ఈ మఱుగు ఎందుకు? ఈ మాయాజాలం ఈ మిథ్యా జ్ఞానం, ఈ అవిద్యావరణంతా ఎందుకు? ఒక సమాధానం : అంతా బ్రహ్మమే అయినప్పుడు, రెండవది లేనప్పుడు చూచేవాడెవడు? అడిగేవాడెవడు? దీనికి పెద్దల సమాధానంః అది ఆయన లీల, క్రీడ, ఈ యావత్ సృష్టి ఆయన ఆనందార్థమే. అదే ఆయనలో వచ్చిన ఆనందాన్కి, జ్ఞానాన్కి, తేజస్సుకి వచ్చిన పరిణామ స్థితి. నిశ్చలం నిరంజనం, నిర్వికల్పం, శాంతంగా ఉన్న స్థితిలో ఒక స్పందన, కదలిక, కామన. అది ఆయనకి స్వాభావికం – కాలబద్దం. ఆ స్పందన కల్గితే సృష్టి; ఆగితే ప్రళయం. ఇదే మన అమ్మ మాటల్లో ఏకరసంగా ఏక ఆనందరసంగా నున్న స్థితిలో, ఏకమైన సంయోగ అవస్థతో (అస్థిత్వంలో) అనేకత్వసిద్ధి, అదే సంయోగావస్థలో వియోగపరిణామం. దీన్నే అమ్మ గణితం అంటుంది. అగణితుడు గణితుడయ్యాడంటుంది. అమ్మ అంటోంది: రూపంలేని దానికి రూపం రావడమే సృష్టి. అన్ని రూపాలు వాడివే కాబట్టి రూపంలేని వాడు. గుణం లేని వానికి గుణత్వసిద్ధియే సృష్టి. అన్ని గుణాలు వాడివే కాబట్టి నిర్గుణుడు. రూపంలేని వాడికి రూపం ఎప్పుడయితే వచ్చిందో అన్ని వికారాలు ఆ రూపంతో పాటే వచ్చాయి. నిస్పందుడు, శాంతము అయిన వాడికి స్పందన ఎప్పుడైతే కల్గిందో అన్ని ఉద్రేకాలు కూడా కల్గినాయి. ఆనందమూ ఒక ఉద్రేకమే. స్పందనా ఉద్రేకమే. శాంతము ఒక రసమే. శాంతరసం నుంచే నవరసాలు వచ్చాయనుకోవాలి. ద్వంద్వం లేని వాడికి ద్వంద్వం వచ్చినప్పుడే భ్రమకూడ వచ్చింది. రెండు ఉంటేనే భ్రమ గాని, భయంగాని, తరతమ భేద భావంగాని అహమత్వ, మమత్వం గాని. అమ్మే చెస్తోంది : సామాన్యంలోంచి విశేషం వేరు చేసి; మరలా విశేషాన్ని సామాన్యంలో చేర్చడమో కూర్చడమో జ్ఞానంలోని పరిణామం – పరాకాష్ఠ. అంటే బ్రహ్మము నుంచి జగత్తును సృష్టించి (లేదా, బ్రహ్మమునందు జగత్తును వేరుచేసి, కల్పించి, ఆరోపించి) మరలా జగత్తుని బ్రహ్మములో విలీనం చేయడమే జ్ఞానంలోని పూర్ణపరిణామం. సృష్టికి బ్రహ్మము నిమిత్తకారణము, ఉపాదాన కారణమును. (Primary or essential or instrumental cause; and substantive or material cause) సృష్టి కార్యం – బ్రహ్మము కారణము. బ్రహ్మము యొక్క సృష్టి గతమైన స్పందన అకారణ కారణము. నిర్హేతుకం. అగ్రాహ్యం. నిర్వివాదం. కారణము, కార్యము రెండూ వేరు కాదు. కార్య కారణాలకి అభిన్నత్వమే. సృష్టి అనగా కార్యరూప బ్రహ్మము (శబలబ్రహ్మము) ఉపలక్షణంగా బ్రహ్మము కారణాత్మక, లేక కారణ రూప సృష్టి (శుద్ధ బ్రహ్మము ఏలక అధిష్టాన చైతన్యము పరిణామ సిద్ధాంతాన్కి అంగములే. ఉపమానంగా చెప్పాలంటే విత్తు – వృక్షము. వృక్షము విత్తు యొక్క స్థూలపరిణామం. విత్తు వృక్షము యొక్క సూక్ష్మపరిణామ దశ. వృక్షం అంతా సూక్ష్మంగా విత్తులోనే ఉంది. వేదాంతులు సృష్టి ప్రకాశ విమర్శాత్మకం అంటారు. శివ, శక్తి యుక్తం. శివ, శక్తి అభిన్నమే. శివుని శక్తి అని కాదు. శివుడే శక్తిని ఇదే విధంగా జగత్తు యావత్తు ప్రళయకాలంలో, ప్రళయావస్థలో బీజరూపంగా బ్రహ్మమునందే లయించును. (పరిణామం) మహాకల్పాంతమున జరిగే జగత్ప్రళయంలో జగత్తు బీజ మగుట పరిణామమే. మరల కాలబద్ధంగా పునః సృష్టి ప్రారంభవేళ బ్రహ్మములో లయించిన బీజ రూప జగత్తు, స్థూల రూపమగుట కూడా (విమర్శ రూపమగుట) పరిణామమే. అందుచేత జగత్తూ ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఉండనే ఉన్నది. దాని ఉనికి, అస్థిత్వము స్థూలము కావచ్చు, సూక్ష్మ బీజస్థితియు కావచ్చు. బ్రహ్మము కారణముగా గల ‘కార్యరూప జగత్తు’ కూడా దేశ, కాల అబాధ్యము (భంగింపరానిది) దేశమునందుగాని, కాలమందుగాని దానికి పరిచ్ఛిన్నత్వముగాని సఖండత్వముగాని, పరిమితత్వముగాని లేదు. అందుకనే అమ్మ జగత్తుకి వినాశము లేదంది. (కాలంలో) ప్రళయం జగత్తు అంతకీ ఒకేసారి లేదంది. (దేశంలో) (సహస్రంః అఖిలాండకోటి బ్రహ్మాండ జనని) జగత్తూ సత్యమే. నిత్యమే. అనంతమే. అనాదియే. పరిణామమే పరమ సత్యం. పరిణామం భౌతికమూ పారమార్థికము కూడా.

– సశేషం

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!