(అమ్మ మాటల పట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్)
ఇది వ్యాసంలో సృష్టి యావత్తూ (Things, Events and Processes) ఒకానొక, ఒకే ఒక శక్తి యొక్క విలసనం, ప్రకటనం, ప్రకాశమే అని నిర్వచించాము. అనగా, చూచేది, వినేది, భావన చేయగల్గింది, సంకల్ప, వికల్పాలు, పరిణామం, జనన, మరణాలు – ఇత్యాదులన్నీ కలిపితే దానికి “సృష్టి” అని పేరు. ఇది సర్వులకి అనుభవైక వేద్యమే. అందరికి అనుభవమైనదాన్ని ప్రత్యేకించి వివరించనక్కర్లేదు. ఈ లాగున ఉన్న సృష్టికి మూడు Co-ordinates ఉన్నాయి. అవి Time – Space – Causation. వీటినే సైన్సు eternal verities అంటుంది. సర్వమూ దేశ, కాల, కార్య, కారణ రూపంగా, లేద మాధ్యమంగా విశ్లేషించబడుతోంది. ఒకనాడు అమ్మ దగ్గర కూర్చున్న రామకృష్ణశర్మగారు కాలాన్ని గురించి అడిగారు. “కాలస్వభావం తెలియడం లేదు, కాలమంటే వ్యవధే కాలమా?” అని ప్రశ్నించారు. దానికి అమ్మ తన మామూలు శైలిలోనే జవాబిచ్చింది. భగవద్గీతలో కృష్ణపరమాత్మ కాలమే నేనంటాడు. (బ్రహ్మాండం వసుంధరః శ్రీవారి చరణ సన్నిధి – 21.5.1963 తేదీ డైరీ ఆధారంగా పే.జి. 32-33) శంకరభగవత్పాదులు భగవంతుణ్ణి మహాకాల కాలం అంటారు. “మహా కాలకాలం, గణేశాది పాలం” అని స్తుతిస్తారు – విశ్వనాధుడ్ని. అంటే కాలమే దైవం. దేశం (Space) ఆకాశం కూడా దైవమే. కార్యానికి (సృష్టి) కారణ భూతమైనది కూడా దైవమే! అందుకే అమ్మ ఆకాశమంటె అవకాశమే అంటుంది. సంకల్ప, వికల్పాలు దైవమే అంది. (Causation) కాలం, దేశం, కారణం ఇవి అనంతం, సర్వవ్యాపకం. ఒకటి రెండవ దాన్కి కారణమైతే, రెండవది మూడవదాన్కి కారణం. ఇట్లా అనంతంగా Causation (పరిణామం) జరుగుతూనే ఉంది. కాబట్టి కాలం (Time) దేశం (ఆకాశం – Space) వలెనే కారణం కూడా సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్మంగాను, అనంతంగాను, సర్వత్రా ఉంటాయి. సంకల్పాల గురించి చెప్తూ అమ్మ, సంకల్పమే సంకల్పానికి కారణం అంటుంది. వికల్పానికి సంకల్పమే కారణమంది. అంటే ప్రప్రథమమైన సృష్ట్యాది సంకల్పమే తర్వాత వచ్చే సంకల్పాలకి, తదుపరి సంకల్పములే వికల్పాలకి కారణభూతం. అందుకే మొదటి జన్మ కారణం ఏది? అని అడిగింది. ఆదిలోని ప్రథమ జన్మకి ఏది కారణమో, అదే మొత్తం జన్మ పరంపరలకి కూడా కారణం అయింది అంటుంది. ఎవరి నడకలు వారికి ముందే ఏర్పడ్డాయి అంది. అంటే ఇదే కాలస్వభావం. (Unfoldment of what is due) కాలమంటే వ్యవధేనా అన్న కృష్ణశర్మగారి ప్రశ్నకి అమ్మ సమాధానం: “జరుగుతున్నది కాలస్వభావం”. జరుగుతున్నది. జరిగినది తెలుస్తున్నాయి కాని, కాలం మాత్రం తెలియడం లేదన్నది. కాలాతీతం, మహాకాలం అయిన పరమాత్మకి ఒకే కాలం – అంతా వర్తమానమే! జరిగిందంతా (భూతం) మరుపులేకపోవడం – భూతకాలంలో జరిగిపోయినదంతా వర్తమానంగా స్ఫురించడం ఇదీ కాలాతీతమైన తత్వమునకు స్వభావము. అదే రీతిగా కాలాతీతునికి కాలమే తానుగా ఉన్న పరమాత్మకి భవిష్యత్తు (జరుగబోయేది) కూడా వర్తమానమే అవుతుంది. “ఇన్నికాలాలు లేవు నాన్నా! అంతా వర్తమానమే!” అంటుంది అమ్మ. పైగా మరొక విధంగా చెస్తోందిః “మరుగులేనిదానికి “మరుపు లేదు” అని. మరుగులేని దేమై ఉంటుంది? సర్వవ్యాపకమై, ఆది మధ్యాంత రహితమైనదానికే మరుగుకాని, మరుపుగాని ఉండవు. తన ఆది తనకే తెలియదండి. ఒకచోట ఉండి, మరొక చోట లేనిదానికి, ఒకప్పుడుండి మరొకప్పుడు లేనిదానికి మరుగు, మరుపు (దేశకాల, కారణ పరిమితులు) ఉంటాయికాని, అంతటా, అన్ని వేళలా ఉన్న దానికి అంతా సర్వజ్ఞమేగా? దానికి భూత, భవిష్యత్తులు ఏవి? అంతా వర్తమానమే అవుతుంది. అటువంటపుడు మరుపెక్కడిది? అందువలననే అమ్మ జవాబు “మరుగులేని దానికి, మరుపు లేదు” అని కాలాన్ని చూడ జాలం. కాని, కాలం అంతా చూస్తుంది. ఆకాశాన్ని చూడలేం. కాని, ఆకాశం అంతా చూస్తూ అంతకీ అవకాశం యిస్తుంటుంది. నడిచే కాలిని చూస్తాము. నడకకి కారణ శక్తిని చూడ లేము. సంకల్ప వికల్పాలు తెలుస్తుంటాయి. వాటి జన్మ భూమికగాని, ప్రేరణాన్నిగాని తెలియలేము. ఇదే అమ్మ చెప్పిన ‘దేవుళ్ళాడినా దొరకని వాడు దేవుడు’ అన్న దానికి అర్థం. దేవుడైన వానికే దేవుడు తెలుస్తాడు. తన పూర్వజన్మలో దేవకీ దేవి తపః ఫలంగా ఒక వరాన్ని కోరుకుంటుంది. అదేమంటే “నీలాంటి కొడుకుని కనాలని” దానికి ప్రత్యక్షమైన పరమాత్మజవాబిస్తాడు. “అమ్మా! నా లాంటి వాడు మరొకడు లేడు. అందుకని నేనే నీకడుపున పుట్టగలన”ని దేవకికి వరమిచ్చి, శ్రీ కృష్ణపరమాత్మగా వస్తాడు. దీన్నే లలితా సహస్రనామం చెప్తోంది – ‘సమానాధిక వర్జితా’ అని. తనకంటే అధికుడుగాని, తనతో సమానమైనవాడుగాని మరొకరు లేరని, అంటే అమ్మలాంటివారు మరొకరు లేరని. మరి అమ్మలాంటి వారు మరొకరు లేనపుడు శ్రీకృష్ణుడెవరు? అమ్మే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడే అమ్మ. అమ్మ బాల్యంలో చేసినటువంటి మహత్తులన్నీ శ్రీకృష్ణుడు కూడా బాల్యంలోనే చేసాడు. ఎక్కువగా! అమ్మ ఎంత మందికో శ్రీకృష్ణపరమాత్మగా దర్శనం యిచ్చింది. ఉన్నది ఒకే శక్తీ, అది స్త్రీ రూపంలో అమ్మ; పురుషరూపంలో శ్రీకృష్ణ పరమాత్మ, శైవమతంలో అనేక శాఖలున్నాయి. సాధారణ శైవమని, శ్రాతశైవమని, వీరశైవమని, పాశుపత శైవశాఖ యొక్క మూలసిద్ధాంతం శివకేశవాద్వైతమే! శివుని యొక్క చైతన్య శక్తియే స్త్రీగా పార్వతి అని, పురుషుడుగా విష్ణువని, లలితా సహస్రంలో విష్ణుపరంగా చెప్పబడిన నామాలు చాలా ఉన్నాయి – “విష్ణు మాయా విలాసిని”, అని ‘గోవింద రూపిణి’ అని లేదా ‘విష్ణు; మాయా విలాసిని” అని