1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మ మాటలు ఒక అవగాహన (నిజానికి నిజం)

అమ్మ మాటలు ఒక అవగాహన (నిజానికి నిజం)

C. R. Prasad Rao
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 6
Month : October
Issue Number : 4
Year : 2007

(అమ్మ మాటల పట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్)

ఇది అమ్మ యొక్క సహజ, గంభీర పదప్రయోగ విధానం, అదే పదాన్ని రెండుసార్లు వాడి ఒక సత్యమైన అర్ధాన్ని ఆవిష్కరించడం. ఈ ప్రయోగంలో అర్థం అంతగా సుబోధకం కాదొక్కొక్కసారి. ఇది ఉత్ప్రేక్షమాత్రంకాదు. ఉత్ప్రేక్షయితే యిట్లా చెప్పాల్సి వుంటుంది: “నిజానికి, నిజంగా ఉంటావు” – అంటే సత్యస్య సత్యమనో సత్యాతి సత్యం అనో అర్థం స్ఫురిస్తుంది. ఆ ‘కామా’ లేదనుకుంటే, అదొక ironies or paradoxes or enigmaనో అవుతుంది. అంటే ప్రశ్నార్థకం అవుతుంది. దానికి సమాధానం, మేధోమధనం అంత ఒక రకంగా ‘నిజానికి నిజం’ అనగా రెండు నిజాలలో ఒకటి రెండవదానికి సాపేక్షం (ఆధారం) అని అనుకోవచ్చు. రెండూ నిజాలే; కాని ఒకటి స్వతంత్ర అస్థిత్వం, రెండవది ఆధారిత అస్థిత్వం కలవన్న మాట. మరి అమ్మే మరొక సందర్భంలో అన్నట్లు అమ్మా, హైమలు బింబ ప్రతిబింబాలు. ఒక సత్యాన్ని మరొక సత్యం ప్రతిబింబించడం. అంటే “ప్రేమ, కరుణ, సౌలభ్యం, నిరంతర రక్షణ మొదలయినవి తత్వంగా ఉన్న అమ్మని, ఇవే గుణాలు మరింతగా మూర్తీభవించిన హైమ ప్రతిబింబించడం అన్న మాట. బింబప్రతిబింబ న్యాయంలో రెండు ముఖ్యలక్షణా లుంటాయి: ఒకటి ప్రతిబింబం బింబాన్ని యధాతథంగా reflect చేయడం (except lateral inversion); రెండు మరొక వేరైన మాధ్యమం (medium) అవసరమవ్వడం. ఉన్న ఒక్కనిజమే మరొకరకంగా గోచరిస్తే అది ఆభాస, భ్రాంతి, మాయ అట్లాగోచరమయిన దాన్కి అస్థిత్వం లేదు. నిజంకాదు. రజ్జు, సర్పభ్రాంతి. అంటే – రెండవది, గోచరమైనది ‘మిథ్య’; గోచరింప చేస్తున్నది నిజం. దైవం (రజ్జు) జగత్తుగా గోచరించడం (సర్పం) మిథ్య. ఈ మిథ్యకి కారణం అనుభవమే. రజ్జువు రజ్జువుగానే స్ఫురించడం కూడా అనుభవమే. ఒకటి లౌకికానుభవం; రెండవది జ్ఞానానుభవం. అంటే అనుభవ పరిణామమే “జ్ఞానం”. దైవం, జగత్తుగా గోచరించడం, జగత్తు మరల దైవంగా చూడగల్గడం కేవలం, దృష్టి లేక అనుభవ పరిణామమే. కాబట్టి యిక్కడ బింబ ప్రతిబింబ న్యాయం లేదు. కేవలం విద్యావిద్య ప్రజ్ఞలమార్పు (సైన్సు పరంగాచెప్పాలంటే Energy, Matter గా కన్పించడం; మరలా Matter Energyగా మారడం – ఒకరు Matter is a permanent possibility of energy అన్నారు – అంటే ఒకటి Noumenon రెండవది Phenomenon. అమ్మ చెప్పినది మిధ్యాభావంలో కాదు. బింబమూ, ప్రతిబింబమూ రెండూ కూడా నిజాలే. అంటే అమ్మ, హైమలు ఇద్దరూ నిజాలే. అమ్మకి నిజమైన నిజం హైమ; హైమకి నిజమైన నిజం అమ్మ. అమ్మా, హైమ ఇద్దరూ ఒకటే. రెండు లేవు. కావు. అంటే యిక్కడ మిథ్యా బింబం లేదు; మాధ్యమం కూడా లేదు. అనగా అద్వైతమే. రెండూ సత్యస్య సత్యాలే. రెండూ సత్యాతిసత్యాలే. అమ్మ త్రిగుణాత్మికం, గుణాతీతము, అయితే, హైమ శుద్ధసాత్వికగుణ సంపన్న. త్రిగుణాత్మికం, గుణరహితం, గుణాతీతం అయిన అమ్మకి నిజమైన నిజం శుద్ధసాత్విక లక్షణ సంపన్నయైన హైమ. శుద్ధసాత్వికం గుణ రహితమూ కాదు; గుణాతీతమూ కాదు. కాని శుద్ధసాత్వికత్వానికి సాపేక్షం (ఆధారం) నిర్గుణత్వమే! (Ref: రాచర్ల లక్ష్మీనారాయణ, శ్రీహైమవతీదేవి విగ్రహప్రతిష్ఠ సావనీర్, 2002, పేజి. 105-113), రూపాలు వేరయినా, జన్మచరిత్రలు వేరుగా ఉన్నా, అస్థిత్వం, శక్తి ఒకటే, “మన కార్యాలు వేరుగా ఉన్నా, మనిద్దరం ఒకటే సుమా!” అని అమ్మ హైమకి చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలి. అందుకే అమ్మ హైమ సమాధి క్రతువుముగిస్తూ యిక మనకి హైమే దారి. అఖండంగా నామం చెయ్యండి. తర్వాత కాలంలో తాను ‘అదృశ్యా’, ‘అవ్యక్తా’, ‘విశృంఖలా’గా అయినపుడు తాను కన్పించనని కాని మనల్ని తాను ఎల్లపుడూ చూస్తూనే ఉంటానని, నిష్క్రమణకాల సందేశంలో రామకృష్ణ అన్నయ్యకి చెప్పినది. కాని హైమ విషయంలో అమ్మ హైమ మీకు కన్పిస్తుందని, మీతో మాట్లాడుతుందని చెప్పింది. పైగా తనకోసం జరిపే పూజలు, నివేదనలు అన్నీ హైమాలయంలో చేయమన్నది. తానుకూడా హైమకి స్వయంగా అర్చన చేసింది. హైమకి చేసిన నివేదనలు, తీర్థాలు తాను కూడా అందరిలాగానే ప్రసాదంగా స్వీకరించింది. రాకపోకలు, చరిత్రలు, రూపాలు, నామాలు వేరయినా, అమ్మా హైమల శక్తి మాత్రం ఒకటే. ఇట్లాగ నిర్ణయించుకోవడాన్కి మనకి, ఆధారాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఉదాహరణకి పై సావనీర్ లోని మొసలికంటి ఉషగారి వ్యాసం చదవండి. (పేజి 73-74). నేను ‘కోట్’ చేస్తున్నాను (పేజి 74):

“హైమ మ్రోలవాలగానే అమ్మ ఆకార (అనంతాకార దర్శన ప్రాప్తిం…… దేవి కేసి తదేక దృష్టితో కొద్దిక్షణాలు చూస్తూ కూర్చుంటె అమ్మ రూపం యింతింతై, అంతై, అనంతమై అంతటా నిండినట్లుగా వుండేది. హైమా అమ్మా, అమ్మా హైమా అనే నాదం శరీరమంతా, ప్రాంగణమంతా, ప్రపంచమంతా, అనంతమంతా ప్రతిధ్వనిస్తున్నటు వుండేది…. ఎటుచూసినా అమ్మ రూపం… యే శబ్దం విన్నా అమ్మ నామం… ఆ దేవి సమక్షంలో అక్షరాలా వాస్తవము. అది నా అనుభవము….. ఈ దర్శన భాగ్యం వల్లన అమ్మా – హైమా రెండూ వేర్వేరు ఆకారాలు కాదు, రెండూ ఒకటే…

ఇహానికి అధిష్ఠాన దేవతగా హైమను, పరాన్కి అధిష్ఠానదేవతగా అవ్యక్తం, అదృశ్యం, విశృంఖల అయిన అమ్మను ఎరిగి యుండడం సమంజసము. ఒక ‘విశ్వజనని’ మాసపత్రికలో హనుమబాబుగారిదే వ్రాసారు. హైమవతీదేవి విగ్రహప్రతిష్ఠ సావనీర్ ఎ.వి.ఆర్. సుబ్రహ్మణ్యంగారు హైమా అంటే High – మా అని వ్రాసారు (పే. 62)

అదేసావనీర్ 14 పేజీలో దయామణిగారు హైమ నేడు భక్తజన పరివేష్టితయి అమ్మ బాధ్యతలో తనూ పాలుపంచుకోంటోంది అంటారు. హైమా నీవు “నిజానికి నిజంగా వుంటావ”ని అమ్మ అంటే అర్థం: నాకు (అవ్యక్తాన్కి, విశృంఖలకి, నిర్గుణానికి) నిజంగా నీవుంటావని (వ్యక్తంగా, అభీష్టవరదాయినిగా, పరమ సులభగా, సర్వశుభగా) నీవుంటావని, అందుకే నిన్ను నేనే కావాలని కన్నాను, పెంచాను, చంపుకొన్నాను. దైవత్వంతో నింపి నిలబెట్టాను” అని అమ్మ అంది అని అర్థం చేసుకోవాలేమో!

రాచర్ల లక్ష్మినారాయణగారు తమ సావనీర్ వ్యాసంలో ఇదే స్పష్టం చేసారు. (పే.111)

అడవులదీవి మధుగారు తాము అనుకొన్నవన్నీ జరిగి జిల్లెళ్ళమూడిలో అమ్మకి కొబ్బరికాయలు కొట్టుకుంటానంటే అమ్మ “నాదేముందిరా! అంతా హైమ అనుగ్రహమే! మీ హైమకే కొట్టు కొబ్బరి కాయలు అంది (సావనీర్, 112 పే.) లక్ష్మినారాయణగారు హైమలో వినాయకుడు, కుమారస్వామి, ఆంజనేయస్వామిల తేజస్సు ఉందని అమ్మ అన్నదని వ్రాస్తున్నారు. (సావనీర్ 112) అమ్మ ఏది చెయ్యాలన్నా అది హైమ ద్వారానే చేయిస్తోందంటారు. “వీడు ఏ పని కావాలన్నా వాళ్ళ అమ్మాయి హైమకే చెప్పుకొంటాడు! నాకేమి చెప్పడు” (సావనీర్ పే. 111). హైమాలయంలో 11 రోజులు అభిషేకాలు గాని, 40 రోజులు లలితా సహస్రనామపారాయణగాని చేస్తే కోరికలు సిద్ధిస్తాయని అమ్మ చెప్పినట్లు వ్రాసారు.

హైమది సజీవసమాధియా? పునః ప్రాణప్రతిష్ఠయా?

హైమది సజీవ సమాధియేకాని మరణించిన తర్వాత పునఃప్రాణప్రతిష్ఠ కాదనడాన్కి కొంత నిదర్శనం ఉంది.

హైమ మరణించినదని గుంటూరు నుంచి జిల్లెళ్ళమూడి వెనక్కి తీసుకొని వచ్చినప్పుడు నాన్నగారు ఆమెను దహనం చేస్తానంటే అమ్మ యిచ్చిన సమాధానం, తర్వాత చేసిన క్రతువు ఒకసారి పరిశీలించాలి. రాజుపాలెం రామచంద్రరరావుగారు తమ “హైమవతీయం”లో (సావనీర్, పే. 5) వ్రాసినదిః అమ్మ ః “హైమగతించలేదు. నా ముందు తిరుగుతూనే ఉంది. ఈసారి నా ఇష్టమొచ్చినట్లు

నన్ను చెయ్య నివ్వండి. మీరు చూస్తుండండి”.

దయామణిగారు వ్రాసినది (సావనీర్, పే. 12) 

“అదెక్కడికి పోయింది. దాన్ని ఇక్కడే ప్రతిష్ఠ చేస్తాను.

గుంటూరు నుంచి జిల్లెళ్ళమూడి వచ్చాక కూడా హైమ ప్రాణంతోనే ఉంది. రాజుపాలెం రామచంద్రరావుగారు వ్రాసినది: “గుంటూరు నుంచి వచ్చిన రాత్రి హైమ ముక్కు దగ్గఱ వేలుపెట్టినపుడు చల్లని గాలి వెలువడుతోంది. పొట్టకూడా రేచకము వల్ల కదులుతోంది. ఆ శ్వాస రాత్రి 8.30 గంటలకిగాని ఆగలేదు” (సావనీర్ పే. 5) రాయప్రోలు భద్రాద్రి రామశాస్త్రిగారు వ్రాసినది. (సావనీర్, పే. 18-19):

“ఖిన్నుడనై ఆర్తితో హైమ దేహమును ఆపాదమస్తకమును సృశించితిని. ముఖముపైను, నాసికాగ్రమునను చెమట బిందువులు కలవు. కొంచెము వేడిగల శ్వాసయున్నది. ముఖవికాసము తగ్గలేదు. ప్రాణోత్కృణము కాలేదనియు సజీవయేయనియు బిగ్గఱగా నచటవారిందరితో నంటివి…. ఆమె సజీవయై యుండుట నిశ్చయము” (పే. 18

గర్తమున పంచకోణముగా మ్రుగ్గు పెట్టదలచిన వాడు అష్టదళ పద్మమునెట్లు వేయగలిగెనో తెలియదు. కృష్ణాజిన, దర్భాసనములపై పద్మాసనాసీనగానుంప యత్నింప సుఖాసీన అయ్యెను. ఇవి యోగినీ లక్షణములుకావా? జీవసమాధికి తార్కాణమగునేమో!” (పే. 19)

“రుద్రానువాకములు ఉచ్ఛైస్వనమున జెప్పవలెననియు సర్వాకర్షణ ప్రియముగా నుండవలెననియు నా యాశయము. అట్లు చెప్పు చుండ కొంత యాయాసము కలుగగా హైమయెదుట నిలిచి – తాతా! నీ చేతగూడ సేవజేయించుకొన వలసివచ్చే గదా యని నా శ్రమమునకు అనునయము ప్రకటించినది. ఇట్లు పెక్కు పర్యాయములు పలువిధములుగా ప్రత్యక్ష సంభాషణావకాశమును గలదు” (పే. 19)

మోడరన్ వైద్యశాస్త్రము కూడా మరణము Physical death and physiological death గా విభజించి నిర్వచించినది. బ్రౌన్కి సంబంధించిన స్టెమ్సెల్స్ చచ్చునంతదాక Physical death కలుగవచ్చుగాని, Physiological death మాత్రం ఉండక పోవచ్చు. డాక్టరు కమలగారో, ఇనజకుమారిగారో ఒక సందర్భంలో ప్రాణం బ్రహ్మరంధ్రం గుండా నిష్క్రమిస్తుందా అని అడగ్గా అదేం లేదని అమ్మ సమాధానం చెప్పింది. ప్రాణం ఒకేసారి నిష్క్రమించదు. ఎక్కడికక్కడే అణిగి పోతుందంటుంది. Physical deathలో జీవకణాలు యింకా ప్రాణచైతన్యంతో కూడా ఉంటాయి.

హైమకి, అమ్మకి కూడా హైమ జిల్లెళ్ళమూడిలోనే (మరణించాలని) కోరిక గలదు. మరి అమ్మ హైమను భూగృహసమాధిలో చేసిన కార్యక్రమం, అంతా చూసి, అది సజీవ సమాధి యేకాని, పునఃప్రాణ ప్రతిష్ఠ మాత్రం కాదని అర్థం చేసుకోవచ్చు. అచ్యుతుని సుబ్బారావుగారు ప్రతిష్ఠా కాలంలో అమ్మని యిదంతా “సజీవ సమాధియా?” అని అడిగితే అమ్మ “మీరు చూస్తున్నారుగా” అని జవాబిచ్చింది. (దయామణి వ్యాసం, సావనీర్ పే. 13) మంత్రాలయ రాఘవేంద్రులు, యోగివేమన, పోతులూరి వీరబ్రహ్మంగారు వగైరా అంతా సజీవసమాధి పొందినారు. దయామణిగారు సావనీర్ 12వ పేజీలో వ్రాసినదిః

“సహజంగా హైమ శరీరం మృదువైనది. 5వ తేదీకల్లా కఱ్ఱలా బిగుసుకుపోయి, బరువెక్కింది. అమ్మ ప్రతిష్టాక్రతువు ప్రారంభించగానే హైమలో మృదుత్వం, నులివెచ్చదనం ఏర్పడ్డాయి. నీరసంగా ఉన్నా పిల్లకి నీళ్ళుపోస్తున్నట్లున్నదిగాని మృతదేహాన్కి చేస్తున్నట్లు లేదు….. చాచిన కాళ్ళు అప్రయత్నంగా పద్మాసనం వేసుకొన్నయి. (సమాధి గృహంలో ప్రవేశించినపుడు) పద్మాసనం సిద్ధాసనంగా మారింది. అమ్మ యజ్ఞోపవీతం వేసింది. అది ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలేదు. ఇక్కడే ఉంది…. నా అగ్ని ప్రవేశించింది…. నా కాలుమాడుతున్నది. వేడికి నాడి కూడా వస్తుందేమో! అయినా ఇందులో వింతేమున్నది” అన్నది అమ్మ (సావనీర్, పే. 13)

హైమాలయంలో హైమ నిత్యయోగ సమాధిలో ఉంది. అమ్మ అన్నదిః “హైమ మీకు కన్పడుతుంది. మీతో మాట్లాడుతుంది”. ఆ ప్రాంగణాన్ని ఒక తపోభూమి చెయ్యాలని అట్లా చేసింది, విగ్రహాలకి ప్రాణ ప్రతిష్ఠ మనం చేసేది కాదంది. ఆ దైవం అందులో ఉండాలనుకొంటేనే ఉంటాడు అంది. “నిజానికి నిజంగా ఉంటావంటే”. అర్థమిదేనేమో! హైమయే పరతత్వమైన రాధాదేవో, మాధవియో! నిజానికి అదే. ఆ మాధవీయ పరతత్వమే. అమ్మ కార్యనిర్వహణలో భాగంగా మనకి, అమ్మకి వారధిగా, శుద్ధసాత్విక గుణసంపత్తితో అమ్మగర్భాన జన్మించి 25వ ఏట అమ్మలక్ష్య సిద్ధిగా అక్కడే సిద్ధాసనంలో సజీవసమాధిలో ప్రతిష్ఠితం అయి ఉంది. అట్లావచ్చి, నిలిచి నిజానికి అయింది.

హైమ యొక్క శుధ్ధసాత్విక ప్రవృతి :

ఆమె హృదయం, మనస్సు, మాట, పాట, చేత, నడక అంతా లాలిత్య రసభరితం సాంద్రమైన కరుణారసమే హైమగా జన్మించిందా అన్నట్లుండేది. తన శారీరక (ఇతర) బాధలు కంటే ఇతరుల బాధల గురించి ఎక్కువగా బాధ పడేది. అమ్మ అంది: “ఇతరుల బాధలకీ కదలి, కరిగి, ద్రవించి, దహించే హృదయమే దైవత్వమని, సత్వగుణ సంపదైన నిష్కామత్వం, ముముక్షుత్వం, భూతదయ, త్యాగం, వైరాగ్యం, పరహితత్వం, పరోపకారత్వం, ద్వేషాసూయ వివర్జనం, ఈ దైవీగుణసంపత్తి, పరిపుష్ఠంగా మూర్తీభవించిన మానవి”. ఇతరుల బాధలకి దిగులుచెంది నివృత్తి చెయ్యమని అమ్మకి సిఫార్సుచేయగా అమ్మ ఒకసారి అన్నదిః “ఆ పని నీవే చెయ్యరాదా?” “నాకే ఆశక్తి ఉంటే నీదాక ఎవ్వరినీ రానిచ్చేదానిని కాదని” హైమ జవాబు (లక్ష్మినారాయణగారు, సావనీర్, 107) అమ్మ త్రిగుణాత్మిక, గుణాతీతకూడ, హైమది పూర్తిగా ఒకే సాత్వికగుణం, హైమకి అమ్మే స్వయంగా పూజలు చేసింది. అందరిచేత చేయించింది. ఆమె తీర్థప్రసాదాలు స్వయంగా అడిగి పుచ్చుకొనేది. (సావనీర్, 106). అమ్మ దర్శనాన్కి వచ్చిన వారేదయినా పట్టుకొనివస్తే హైమాలయంలో యివ్వమనేది (సావనీర్, 107). 11 నవంబరు 10వ తేదీ అమ్మ దేశంలోని అన్ని పుష్కరనదుల నుండి, కన్యాకుమారి దగ్గరున్న మూడు సముద్రాల జలం తెప్పించి హైమకి అభిషేకంచేయించింది. కోటి లలితా పారాయణం చేయించింది (సావనీర్, 110). లక్ష్మినారాయణగారు వ్రాసారు హైమది ఆకాశమంత మనస్సు అని. ఆ మనస్సుకి తెలిసినవి రెండే రెండుః ఒకటి దయ; రెండు దైవం అని (సావనీర్ 108 & 109). దయారసమే దైవంగా మారిన ప్రయోగం హైమ. ఇదే నిజానికి నిజం. హైమ సజీవ యోగ సమాధి ప్రతిష్ఠిత.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!