(అమ్మ మాటలపట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్)
మొదటి భాగంలో నాకు తోచిన వివరణ, దానికి సరిపడు నేపధ్యము వ్రాసి యున్నాను. సారాంశమేమనగా నిర్వికార నిరంజన శుద్ధ బ్రహ్మ చైతన్యంలో అంతర్లీనంగా కొన్ని శక్తుల కదలికలవల్ల సృష్టి కామన (కామేశ్వరత్వ రూప సంకల్పం) బయల్దేరిందని, అది అకారణంగానే జరిగిందని (కారణం మనకి తెలియదు కాట్టి అది ఆ మన పొందిన వారికే తెలియాలి కనుక) తత్సంబంధంగా శబల బ్రహ్మ సృష్టి జరిగిందని, ఈతడే ప్రతిబింబేశ్వర బ్రహ్మచైతన్యమని, అది అధిష్ఠాన బ్రహ్మమునకు అభేదమని తెలుసుకున్నాము. ఈ కారణంగా సృష్టి అనాదియని రూఢిఅగుచున్నది, అధిష్ఠాన బ్రహ్మమునకే “అస్తి”, “”భాతి”, “ప్రియం” లక్షణాలని; నామ, రూప, గుణ, క్రియాత్మకము సృష్టి అని తెలియుచున్నది. అనగా శబల బ్రహ్మము నిరుపాధి అయిన శుద్ధ బ్రహ్మము యొక్క ఉపాధియని తలంచవలెను. దేహమును, దేహిని, సూర్యుని తేజమును విడదీయలేనట్లుగానే అధిష్ఠానమును, ఆధేయమును విడదీయలేము. ఆవరణ, విక్షేపశక్తుల సమిష్టి, వ్యష్టి అవతరణమే జగత్తు. జీవుడు. శబల బ్రహ్మము స్వతంత్రత్వ, కర్తృత్వ వికారములైన అహంస్ఫురణతో కూడి యున్నందున, లేదా వానియందభిమానముంచినందున సృష్టి కారణత్వము వహించి యుండెను. ద్వైత భావమును కల్గించు ఈ అహంస్ఫురణనే “పరాహంత”, “పరాచిత్”, “పరాశక్తి”, “ప్రజ్ఞానము” – ఇత్యాది నామాలతో చెప్పెదరు. లలితాసహస్రము దీనినే “తిరోధానకరీ” నామమున సూచించు చున్నది. తిరోధానమనగా ఆవరణ, ఆచ్చాదన అని అర్థము. జగత్తు సంబంధముగా ఈ తిరోధానశక్తి “మహామాయ”గాను, జీవసంబంధముగా “అవిద్య”లు అందురు. వీని కారణమున ద్వైత భ్రాంతి, స్వతంత్రత్వభ్రాంతి, కర్తృత్వ భ్రాంతి ఉదయించును. జీవ, జగత్తు సృష్టులు రెండూ (వ్యష్టి, సమిష్టి) స్థూలరూపము, సూక్ష్మ రూపము, కారణరూపమున ఉండును. జగత్సృష్టికి సంబంధించి వీనినే విరాట్ (స్థూల లేక జగత్తు), హిరణ్య గర్భుడు (సూక్ష్మ ఉపాధి), వ్యాకృతుడు (కారణ ఉపాధి) అనిన్ని, జీవుని విషయంలో విశ్వుడు (స్థూల శరీరమున అభిమానుడు), తైజసుడు (సూక్ష్మశరీరాభిమాని), ప్రాజ్ఞుడు (కారణ శరీరాభిమాని) అని అందురని తెలుసుకొన్నాము. ఒకే పరమాత్మ (అధిష్ఠాన శుద్ధ బ్రహ్మచైతన్యము) ఆవరణ, విక్షేప, తిరోధాన శక్తి విశేషమున ఇన్ని రూపాలుగా జీవ, జగత్తులుగా పరిణామంచెంది, చివరికి జీవుని యందు శుద్ద చైతన్య ప్రత్యగాత్మగా అవతరించి యున్నాడు. ఈ విధముగా అస్తి, భాతి, ప్రియము నామ, రూప, గుణ, క్రియాత్మకమైన వ్యష్టి, సమిష్టి సృష్టిగా వచ్చినది.
“నేను నేనైన నేను” అనుదాన్ని అమ్మయే తనమాటల్లోనే డా॥ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి సంకలనం చేసిన “అమ్మతో సంభాషణలు”లో అక్కడక్కడ వివరణ యిచ్చినట్లు తెలియుచున్నది. (ఉదా: పే. 208, 405, 463, 489, 490, 491, 492).
అమ్మ ప్రశ్నించుచున్నదిః జీవుడంటే ఎవరు? “నేను” అంటే ఎవరు? “నేను” అన్నా, జీవుడన్నా శరీరమా, ప్రాణమా, మనస్సా? శరీరము 36తత్వాలతో కూడినది. ఇందులో ఏ ఒక్కటీ “నేను” కాదు. అన్నీకలిపినదే (సమిష్టి) “నేను”. కన్ను, చెవి, విడివిడిగా “నేను” కాదు. ఈ ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటున్న మనస్సు కూడా “నేను” కాదు. శరీరము, ప్రాణములు, మనస్సు ఇవన్నీ కలిపినదే “నేను”. (ఇట్లే జగత్తు విషయం). ఇవేవీ నేను కాదు అని చెప్పే తెలివి, అహంస్ఫురణే “నేను”. ఇవేవీ “నేను” కాదనేది తెలియ చెప్పడాన్కి ఇవన్నీ అవసరమయ్యాయి. ఇవేవీ లేకుండా “నేను” అనేది ఎక్కడుంటుంది? “నేను”, “శరీరము” – ఈ రెండూ పరస్పరాధారము. ఉపాధి లేని సృష్టి లేదు. శరీరములేని “నేను” వేరు. (సృష్టినే మనం పైన నామ, రూప, గుణ, క్రియాత్మకమని నిర్వచనం చేసాము). ప్రామాణికులు సృష్టి “ఆది” కాదంటారు. సృష్టికి కాలంలో ఆరంభము, ప్రళయమూ చెప్తారు. (కల్పాలు, మన్వంతరాలు, యుగాలు రాక, పోకడలున్నట్లు చెప్తారు. “ఆది” ఏమిటంటే అర్ధంకానిదంటారు. (దేవులాడినా దొరకనిది) ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చాలా చాలా దూరం పోయి (నేతి; న, యితి) చివరికి “అదే ఇది”; “ఇదే అది” అనేది అమ్మ సిద్ధాంతం. దీన్నే అమ్మ సామాన్యంలోంచి విశేషాన్ని వేరుచేసి; తిరిగి విశేషాన్ని సామాన్యం చెయ్యడం అంటుంది. అదే ఇది, ఇదే అది అన్నప్పుడు రెండు లేవుగా, “అది” తెలియడంలేదు. (బ్రహ్మమిధ్య) “ఇది” తెలియుచున్నది. (జగత్తుసత్యం)
“నేను” అన్నిటా ఉందంటారు. (ఆత్మ) అన్నింటికి మూలమైందంటారు. (పరమాత్మ – ప్రత్యగాత్మ) విరాట్, హిరణ్యగర్భుడు, వ్యాకృతుడు ముగ్గురూ పరమాత్మయే. ఆ పరమాత్మయే విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యగాత్మ, పరమాత్మకి ఉపాధులు విరాట్, హిరణ్యగర్భుడు, వ్యాకృతుడు. ప్రత్యగాత్మ (మహాకారణము)కి ఉపాధులు ప్రాజ్ఞుడు, తైజసుడు, విశ్వుడు. జీవపరంగా చెప్పినచో ఆ అఖండచైతన్యమే “ఆత్మ”. జగత్తు పరంగా చెప్పితే అదే “పరమాత్మ”. అదే జీవ అహంకారము (నేను). అదే “పరాహంత” (స్థూల, సూక్ష్మ, కారణజగత్తుల “నేను”). అపరిమితమైన శక్తి పరిమితంగా ఉంటే (ఆచ్ఛాదనతో) “నేను” అయింది. నిరుపాధితత్వము అనేకంగా ఉపాధిసహితమయితే “నేను”లు అయింది. “నేను” అంటే ఏ రూపంకాని (స్థూలమైన, లేదా సూక్ష్మమయిన, లేదా కారణమయిన) రూపాన్ని ధరించివస్తే, నిర్గుణం గుణందాల్చి వస్తే, “నేను”గా ఉంది. ఆ “నేను” బ్రహ్మ. (ప్రత్యగాత్మ, పరమాత్మ) ఆశక్తి అనేకంగా ఉందికాబట్టి “నేను” అనేకంగా ఉంది. ఇది అనుభవంలోకి రావడమెట్లాగ? “నాకు అట్లాగ గోచరించింది కాబట్టి అన్ని “నేనులు నేనైన నేను” అని నాకు అనిపించి ఆ మాట అన్నాను.” (491). నేను ఏ పసిపిల్లగా ఉన్నప్పుడో ఈ ఆలోచన (స్ఫురణ) కల్గింది. ఇదంతా నేను అనిపించింది నాకు. దీన్ని ఎంత పరిశీలించినా “అదే” అనిపించింది (491). ఇంతెందుకు? ఉన్నదే “అది(( నీవుగా, నేనుగా” (492).
తత్పురుషాయ విద్మహే మహాదేవ్యైచ ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్