(అమ్మ మాటలపట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్)
అమ్మ సహజంగా చేసే ఈ విధమయిన పదప్రయోగంలో ఒక పరమార్థం, ప్రామాణికసత్యం ఉంటాయి. ఉదాహరణకి, సర్వకారణాలకి కారణము ‘అకారణ’ మంటుంది. అన్ని ఉపాధులు వాడివే కాబట్టి “నిరుపాధి”; అన్ని రూపాలు వాడివే కాబట్టి “విరూపుడు”; అన్ని గుణాలు వాడివే కాబట్టి “నిర్గుణుడు”; అన్ని వికారాలు వాడివే కాబట్టి “నిర్వికారుడు” అంటుంది. పరమాత్మ సృష్టి చేయడమో, సృష్టిగా మారడమో ఎందుకు జరిగిందనే ప్రశ్నవస్తే దానికి కారణం అకారణమే. సమస్తానికి కార్యకారణ సంబంధము ఆపాదించవచ్చుగాని, పరమాత్మకి మాత్రం ఉండుట, వ్యాపించుట, ప్రకాశించుట. ఆనందించుట (సత్, చిత్, ఆనంద) అనేవి వాని సహజ లక్షణాలు కాబట్టి వాడు “అకారణుడు”. ఉన్నాడు. ఎట్లాగ ఉన్నాడు? ఉండుటనే తన సహజశక్తి, ఉంటున్నాడు (అస్థిత్వశక్తి; సత్). ఆ ఉండటమన్నది సనాతనం. ఆది. మధ్య, అంత్యరహితంగా ఉంటున్నాడు. దేశ, కాల, వస్తు అపరిచ్ఛిన్నంగా ఉంటున్నాడు. అన్నింటికి ఆధారము, అధిష్టానమూ నిరాధారుడుగా ఉంటున్నాడు. తాను అన్నింటిని ఆవరించి యున్ననూ తాను మాత్రం నిరావరణంగా ఉంటున్నాడు. ఇది “సత్” దీన్నే ప్రమాణశాస్త్రాలు శుద్ధ బ్రహ్మమంటుంది. ఇది ఏకాకిగా ఉంటున్నది. అన్యమెరుగక, అన్యము లేకుండగ ఉన్నది. ఈ శుద్ధ బ్రహ్మము చైతన్య స్వరూపంగా ఉన్నది. (“చిత్”) స్వయం ప్రకాశాత్మకంగా ఉంటున్నది. సూక్ష్మాతి సూక్ష్మమైన స్వయంప్రకాశక చైతన్యశక్తిగా ఉంటూ, అంతా వ్యాపించి యున్నది. అది లేనిదిలేదు. అది లేని కాలమూలేదు. అది కానిది లేదు. సత్ యొక్క వ్యాపకశక్తి, ప్రకాశశక్తినే “చిత్” అంటుంది. ప్రమాణము. “చిత్” అంటే చైతన్యము. జ్ఞానము. అంటే ప్రకాశము. చేతనా చేతన జగత్తు అంతా ‘చిత్’ జ్ఞాన ప్రకాశమయం. “సత్” (ఉన్నది) చైతన్యమే కాకుండగ జ్ఞానస్వరూపమే కాక, ఆనంద రస రూపంగా ఉంటున్నది. ఈ జగత్తులో ఏఏ ఆనందములన్నీ ఉన్నదో అదే సత్, చిత్, ఆనందం. దీన్నే ప్రమాణం మరొక విధంగా అస్తి (ఉన్నది) భాతి (ప్రకాశము) ప్రియం (ఆనందం) అన్నది. ఈ విధంగా |వివరించబడిన ఏకాకి అయిన శుద్ధ బ్రహ్మ చైతన్యమే సాక్షీభూత చైతన్యం. అది అసంగము, అకర్త. దాని యందు అకారణముగనే కర్తృత్వ తత్వము కల్గిన ఒక కదలిక తన యందు అవ్యక్తముగా నున్న విక్షేప శక్తి కారణంగా మొదలయింది. (అద్వైతము ద్వైతముగా అచలము విచలముగా పరిణామం చెందింది). విస్తరంగ జలధిలో తరంగము పుట్టిన విధంగా విక్షేపించినది. నిశ్చల జలధి తరంగ రూపం దాల్చింది. తత్కారణంగా శుద్ధబ్రహ్మ చైతన్యము శబలబ్రహ్మ చైతన్యంగా మారింది. శబల బ్రహ్మచైతన్యం శుద్ధ బ్రహ్మ చైతన్యమునకు అభిన్నమైననూ శుద్ధ బ్రహ్మమునందున్న వేరొక అవ్యక్త ఆవరణ శక్తి మూలమున “ఏకాకి” “భూమి” (అనేకత్వము) రూపం దాల్చినది. కావున శుద్ధబ్రహ్మ చైతన్యమందు విక్షేపము, ఆవరణ కల్గుట అకారణముగానే (స్వతః సిద్ధముగానే) జరిగినవి. ఈ పరిణామమునకు వేరే కారణ శక్తి లేదు. అకారణమే కారణము. జీవ, జగత్తులు అకారణముగనే శుద్ధ బ్రహ్మ చైతన్యము నుండి ఆవిర్భవించినవి. శబల బ్రహ్మమే. ‘జీవసృష్టికి, జగత్సృష్టికి అధిష్ఠానమైంది. దీనినే లలితాసహస్రం “మిధ్యాజగదధిష్ఠానా” అంటుంది. అద్వైతాధిష్ఠాన చైతన్యం నుండి ద్వైతాధిష్ఠాన చైతన్యం పరిణమించినది. చైతన్యమంతా ఒకటే. అఖండం. అపరిచ్ఛిన్నం. అధిష్ఠాన చైతన్యం నుండి ప్రతిబింబేశ్వర చైతన్యం (శబల బ్రహ్మ చైతన్యం) అంతర్లీనంగా ఉన్న ఆవరణ, విక్షేపముల వలన ఏర్పడింది. ఈ అధిష్ఠాన శుద్ధ బ్రహ్మచైతన్యం రెండుగా, తర్వాత అనేకంగాను కన్పించడం కేవలము మిథ్య, కల్పితము, అభాస. మిథ్య అనగా “లేదు” అని అర్థం కాదు. (న, అస్తి అనికాదు). మిథ్య అనగా “కాదు” అని అర్థం మాత్రమే. అందుచేత అమ్మ అంటుంది అద్వైతంలో ద్వైతం ఉన్నది. కాబట్టి జగత్తు మిథ్య కాదు. బ్రహ్మము వలెనే జగత్తు కూడా సత్యమే. జగత్తు, బ్రహ్మముల ఏకత్వము తెలియకపోవడం అవిద్య, మాయావరణముల వలనే.
జీవ, జగత్తుల సమిష్టి చైతన్యం శబల బ్రహ్మము. జీవుడు వ్యష్టి చైతన్యం. శబల బ్రహ్మమునే పరాచిత్, పరాశక్తి, పరావాక్, చిచ్ఛక్తి, ప్రజ్ఞానము అని పిలుస్తారు. ఈ శబలబ్రహ్మము సర్వతంత్ర స్వతంత్రతతో “అహం” స్ఫురణతో, జీవజగత్తులకర్త యగుచున్నది. ఈ అహంస్ఫురణనే లలితాసహస్రము “మత్తా” అంటుంది. దీనినే “వరాహంత” అంటారు. అఖండ బ్రహ్మచైతన్యం నిరుపాధిగానునప్పుడు జీవునిలో “ప్రత్యగాత్మ” అంటారు. ప్రత్యగాత్మ, పరమాత్మ రెండూ అభిన్నములే. సమిష్టి చైతన్యం యొక్క ఉపాధి జగత్తు వ్యష్టి చైతన్యం యొక్క ఉపాధి శరీము. సమిష్టికి, వ్యష్టికి కూడా స్థూల, సూక్ష్మ కారణ శరీరాలు గలవు. జీవుడు మహాకారణము లేక ప్రత్యగాత్మ లేక కూటస్థ చైతన్యము. అతని స్థూల శరీరము యొక్క అధిష్ఠాన చైతన్యము విశ్వుడు. సూక్ష్మ శరీర అధిష్ఠానము తైజసుడు. కారణ శరీర అధిష్ఠానం ప్రాజ్ఞుడు. ప్రత్యగాత్మయే సాక్షీభూతచైతన్యము (మహాకారణము). సమిష్టి బ్రహ్మచైతన్యం యొక్క స్థూల రూపశక్తిని “విరాట్” అనియు, సూక్ష్మ రూపశక్తి అధిష్ఠానమునకు హిరణ్యగర్భుడని, కారణ రూపానికి వ్యాకృతుడని, మహాకారణమునకు పరమాత్మ అని పేర్లు. ఈశ్వరత్వమనగా సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వము, సర్వనియంతృత్వము. ఆ శక్తినే “ఈశ్వరి” అని లలితా సహస్రనామం చెస్తోంది. ఈశ్వరి యొక్క ఉపాధి “మాయ”, అని జీవుని యొక్క ఉపాధులు (స్థూల, సూక్ష్మ, కారణ ఉపాధులు) అవిద్య అని అంటారు. ఈశ్వరీయమైన చైతన్య శక్తియే నామ, రూప, వస్తు, క్రియాత్మక జగత్తుగా ఉన్నది. పరమాత్మ విరాట్గా, హిరణ్యగర్భుడుగా, వ్యాకృతుడుగా ఉంటే; ప్రత్యగాత్మ విశ్వుడుగా, తైజసుడుగా, ప్రాజ్ఞుడుగా ఉంటున్నాడు. మాయ, అవిద్య ఆవరణ శక్తులు. విక్షేపశక్తి సృష్టి కామన శక్తి, ఆవరణశక్తి ద్వైత భావన ప్రేరణ శక్తి.
ప్రస్తుతాంశం : “నేను నేనైన నేను” మొదటి నేను = పరాహంతయిన నేను. ఈశ్వరీయమైన నేను. విరాట్, హిరణ్యగర్భుడు, వ్యాకృతుడు అయిన నేను. ఇక రెండవ “నేను” విశ్వుడు, తైజసుడు (జీవ అహంకారము), ప్రాజ్ఞుడైన నేను మూడవ “నేను” = అనసూయా దేవి. “నేను” (పరాహంత) “నేనైన” (విశ్వుడు వగైరా) “నేను” (అనసూయను) అనగా పరమాత్మ, ప్రత్యగాత్మయిన నేను (అనసూయ) పరాహంత, జీవాంతరాత్మ అయిన నేను (అనసూయ). వ్యష్ఠి అయిన నేను, సమిష్టిగా ఉన్న నేను, శుద్ధ బ్రహ్మముగా ఉన్న నేను మాత్రమే ! (అనసూయ).
స్థూల శరీరంతో, జాగ్రదావస్థానుభవం కల్గించే చైతన్య శక్తిని “జాగరిణి” అంటుంది లలితా సహస్రం. సూక్ష్మ శరీరంతో స్వప్నావస్థానుభవం కల్గించే శక్తిని “స్వపని” అంటుంది లలితా సహస్రం. కారణ శరీరంలో నిద్రావస్థానుభవాన్ని కల్గించే శక్తిని “సుప్తా” అంటుంది లలితా సహస్రం. మహాకారణంగా ఉంటూ తుర్యావస్థలో కలిగే అనుభవమునకు కారణం “తుర్యా” అంటుంది లలితా సహస్రం.
“ఓం తత్పురుషాయ విద్మ హే
మహాదేవ్యై చ ధీమహి
తన్నో దుర్గిః ప్రచోదయాత్”