(అమ్మ మాటలపట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్)
హరిదాసుగారు అమ్మకి జాకెట్టు కుట్టడం కోసం “ఆది రవిక ఇయ్యమ్మా” అని అడిగారు. అమ్మ సమాధానంగా “నా ఆది నాకు తెలియద”అన్నది. అంటే ‘అనాది’ అయిన తత్వాన్కి ఆది యేది? అంత్యమేది? ఆద్యంతములు లేనిది కాలం. నిర్గుణ పరబ్రహ్మ కాలస్వరూపుడు – కాలాతీతుడు కూడా! అందరి మరణాలకి కారకుడైన కాలునికి కూడా కాలం వంటి వాడని, అంటే సనాతనుడు, శాశ్వతుడు, నిత్యుడు, మహాకాలకాలం అని అర్థం. అట్టి కాలస్వభావుడు, కాలస్వరూపుడైన పరాత్పర బ్రహ్మ, విశ్వయోని, విశ్వంభరుడు, విశ్వరూపుడే కావచ్చు కాని స్వతహా విశ్వాధికుడు మాత్రమే! విశ్వాధికత్వం, కాలస్వరూపి యంటే నామ, గుణ, పదార్థ, రూప రహితం. అమ్మ చెప్పనే చెప్పింది. బ్రహ్మతత్వం అనిర్వచనీయమని. మహా కాలం + మహాకాశంలో అనేక విశ్వాలు పుట్టుచూ, తిరుగుచూ, గిట్టుచూ ఉండవచ్చు. (అండాండాలు, పిండాండాలు, బ్రహ్మాండాలు). అందుకనే పరమాత్మని సాక్షిభూతమంటారు. అంటే విశ్వసృష్టి, విశ్వలయము, విశ్వపునఃసృష్టి జరుగుతుంటాయి కాని, తాను మాత్రం దేశకాల పరిచ్ఛిన్నంగా నిత్యుడుగా, సనాతనుడుగా, శాశ్వతుడుగా, సాక్షిగా శేషిస్తూనే ఉంటాడు. అన్నింటికి అధిష్టానమై (base) దేనికి అంటనివాడుగా, సర్వజ్ఞుడుగా, సర్వవ్యాపకుడుగా, సర్వనియామకుడుగా, సర్వకారకుడుగా, సర్వసాక్షిగా, సమానాధికవర్ణుడుగా ఉండి పోతాడు. (ఏకోహం బహుస్యాం). ఈ కాలస్వభావము, స్వరూపం ఎట్లాగుంటుందో శ్రీ రమణ మహర్షి చెప్పిన ఒక వృత్తాంతము బాగా తెలియజేస్తుంది. (సూరినాగమ్మ: శ్రీరమణాశ్రమ లేఖలు, 5 భాగాల ఏకసంపుటి, 1979, పే. 430-434)
పూర్వం బ్రహ్మగారి కొకపర్యాయం తానే చిరంజీ వినన్న గర్వం కలిగి విష్ణు సన్నిధికి వెళ్ళి “నేనెంత గొప్ప వాడినో చూచావా? చిరంజీవిని” విష్ణువు “కాదు నాయనా! నీకంటె చాలా పెద్ద వారున్నారు” అంటాడు. “అందరినీ అన్నా. అ సృష్టించే వాడిని నేనే కదా! నా కంటే పెద్ద వారెవరున్నారు?” అని అడిగాడు బ్రహ్మగారు. సరే చూపుతాను రమ్మని విష్ణువు బ్రహ్మగారిని వెంటబెట్టుకొని రోమశమహాముని దగ్గరకు, అష్టావక్రమహాముని వద్దకు తీసుకొని వెళ్తాడు. అటుపై జరిగిన కథ తెలుసుకొనే ముందు బ్రహ్మగారి ఆయుష్యు గురించి తెలియనగును.
బ్రహ్మవయస్సు : నాల్గు యుగములు కలిసి ఒక మహాయుగం అగును. ఒక కలియుగం, ఒక ద్వాపరయుగం, ఒక త్రేతాయుగం, ఒక కృతయుగం కలిస్తే ఒక మహాయుగం. కలియుగ కాలపరిమాణం 4,32,000 సంవత్సరాలు. ద్వాపరాన్కి 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగంలో 12,96,000 సంవత్సరాలున్నాయి. కృతయుగ కాలపరిణామం 17,28,000 సంవత్సరాలు. ఒక మహాయుగంలో మొత్తం 43,20,000 సంవత్సరాలు. ఇటువంటి వెయ్యి మహాయుగాలు బ్రహ్మకి ఒక పగలు. అనగా 1000 × 43,20,000 సంవత్సరాలు. లేదా 4320,000,000 సంవత్సరాలు. బ్రహ్మగారి రాత్రికి కూడా అదే కాల పరిమాణం. అంటే బ్రహ్మగారి ఒక రోజు గడిస్తే మనకాలయానంలో 8640,000,000 సంవత్సరాలు. బ్రహ్మగారి కొకరోజు పూర్తిగా గడిస్తే అది ఒక కల్పం. అల్లాంటి 360 కల్పాలు బ్రహ్మగారికొక సంవత్సరం. అల్లాంటి 100 బ్రహ్మ సంవత్సరాలు బ్రహ్మగారి ఆయుష్యు పరిమాణం (100x360x8640,000,000 సంవత్సరాలు). ఇదీ ఒక బ్రహ్మగారి ఆయుః పరిమాణం. ఇపుడు రోమశ మహాముని వద్దకు వద్దాం.
రోమశ మహామని వద్దకు బ్రహ్మను తీస్కుని వచ్చిన విష్ణువు ఆ మహామునిని ప్రశ్నించాడు : “అయ్యా! తమకిప్పుడు వయస్సెంత? ఇంకెంత కాలం వుంటారు?” అని రోమశుడు సమాధానం చెప్తున్నాడు. “ఒక్కొక్క బ్రహ్మగారు గతించినపుడు నా శరీరాన్కి ఉన్న ఒకే ఒక్క రోమం ఊడుతుంది. అట్లా ఎన్నో రోమాలు నా శరీరం నుంచి రాలిపోయాయి. అట్లా పోగా యింకా ఎన్నో మిగిలి వున్నవి. ఇవన్నీ ఎపుడు ఊడితే అప్పటికి నా ఆయుర్దాయం పూర్తి అవుతుంది నాయనా!” అని చెప్పాడు రోమశ మహాముని.
అక్కడ నుంచి విష్ణువు బ్రహ్మగార్ని తోడ్కొని అష్టావక్ర మహాముని వద్దకెళ్ళాడు. వారిని కూడా “మీ ఆయుష్యు ఎంత?” అని అడిగితే అష్టావక్రుడు “రోమశమహామునులు ఒక్కొక్కరు గతించినపుడు నా శరీరంలో ఒక్కొక్క వంకర సరిపడుతుంది. ఈ విధంగా ఈ ఎనిమిది వంకరులెప్పుడు సరిపడతాయో అపుడు నా ఆయుర్దాయం సరి” అన్నారుట అష్టావక్రమహాముని. అంతటితో బ్రహ్మగారి గర్వం గుభేలున కూలింది.
ఇదీ కాలాతీతుని, మహాకాలకాలుని కాలస్వరూపం, స్వభావం. దీన్నే అమ్మ సింపుల్గా నా ‘ఆది’ నాకు తెలియదు అంది. మరి అమ్మ “ఆదెమ్మ” ఎట్లాగయింది? ఈ ప్రకారంగా చూస్తే అమ్మ ఆదెమ్మ కాదుగా? అనాద్యమ్మ అవ్వాలి. ఎట్లాగో చూద్దాం! తప్ప అన్య లేని పరమశివునికి తాను అనేకం కావాలని, సృష్టి చెయ్యాలని ప్రథమ స్పందన, సంకల్పం ఎప్పుడు కల్గిందో అపుడే ఆ మహాశివుని నుంచి అమ్మ ఉద్భవించింది. అందుకే సృష్టి కల్గిన మహాశివుడు కామేశవరుడయితే అమ్మ ఆదెమ్మ అయి, మహాకామేశ్వరి అయి, విశ్వయోగినిగా, విశ్వంభరిగా, విశ్వధారిణిగా, విశ్వరూపిణిగా వచ్చింది. ఇదీ శివశక్తి విలసనము. శివ, శక్తి ఐక్య రూప ప్రకటనం, ప్రకాశ, విమర్శతత్వము. సనాతనుని నుండి ఉద్భవించిన అమ్మ ఆదెమ్మ, అనాద్యమ్మ కూడా.