1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మ మాటలు ఒక అవగాహన (మాతృశ్రీ సూక్తులు భ్రాంతి భ్రాంతి వల్లనే పోతుంది)

అమ్మ మాటలు ఒక అవగాహన (మాతృశ్రీ సూక్తులు భ్రాంతి భ్రాంతి వల్లనే పోతుంది)

C. R. Prasad Rao
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 9
Month : July
Issue Number : 3
Year : 2010

(అమ్మ మాటల పట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము – ఎడిటర్)

భ్రాంతిపోతే బ్రహ్మమే అంది అమ్మ. ఆ భ్రాంతి ఎట్లా పోయిందని ప్రశ్న వచ్చింది. భ్రాంతి భ్రాంతి వల్లనే పోతుందన్నది. అమ్మకి సహజమైన మాటల, భావాల పజిల్ ఇది. అసలు భ్రాంతికి కారణం ఏమిటి? పంచజ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించి వస్తు నిర్వచనం, నిశ్చయం, జ్ఞాననిర్మాణం, చేసే మనస్సుకి (అంతరేంద్రియం అంటారు) భ్రాంతి ఎందుకు కలగాలి? భ్రాంతి దానికి సహజ లక్షణమా? అసలు అట్లా గుర్తించిన వస్తువు భ్రాంతిజన్యమని ఎట్లా తెలుసుకోగల్గుతున్నాం? ఎండమావుల, తాడు – సర్పముల దృష్టాంతములు (రజ్జుసర్ప భ్రాంతి) చూపి మనస్సుకి భ్రాంతి కలుగవచ్చునని జవాబిస్తారు. Mind does not receive knowledge directly from things. The knowledge we get by our mind is indirect, mediated, constructed knowledge. There may be perception errors and cognitional gaps and distortions, ఇది మామూలుగా Scientific గా యిచ్చే జవాబు. మరి అమ్మ ఆధ్యాత్మికంగా యిచ్చిన జవాబు చూద్దాం. రజ్జుసర్ప భ్రాంతి ఎప్పుడు కల్గుతుందంటే, రెండూ, అనగా రజ్జు (తాడు) సర్పము గురించిన జ్ఞానానుభవం ఉన్నవానికే కల్గుతుందంటుంది. ఏ ఒక్కటో తెలిసిన వానికి భ్రాంతి లేదంటుంది. బ్రహ్మము, జగత్తుల విషయంలో: జగత్తు భ్రాంతియని కేవలం జగత్తునే ఎరిగిన వాడికి లేదు. కేవలమూ బ్రహ్మ మొక్క దానినే ఎరిగిన వానికి జగత్తనే ఎఱుక లేదు. రెండూ ఉన్నాయని తెలిసిన వానికి మాత్రమే (అది స్వానుభవంకావచ్చు; లేదా విశ్వాసమూ కావచ్చు) జగత్తు భ్రాంతి అని, బ్రహ్మము సత్యమని; లేదా జగత్తు సత్యమని, బ్రహ్మము భ్రాంతి యని ఎఱుక కల్గుతుంది. (డా॥ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి : అమ్మతో సంభాషణలు, ఎస్.వి.జె.పి., పి.పి.399-400) రెండూ తెలిసినవాడే యిబ్బంది, భ్రాంతి పడతాడు. ఈ భ్రాంతి యిబ్బంది అనేక రకాలుగ ఉండవచ్చు. 1. రెండూ సత్యములే 2. రెండూ భ్రాంతులే!

  1. బ్రహ్మము సత్యము, జగత్తుమిధ్య, 4. జగత్తు సత్యము, బ్రహ్మముమిధ్య, 5. జగత్తు, బ్రహ్మము కాక మూడవది మరొకటి ఉన్నది. అదే బ్రహ్మముగాను, జగత్తుగాను తోపింపచేస్తూ భ్రాంతిని కలిగించుచున్నది – (విశ్వాసము; తర్కము). స్వప్నానుభవం జాగ్రదావస్థలో భ్రాంతి. జాగ్రదావస్థలోని అనుభవం తురీయావస్థలో భ్రాంతి. మరి తురీయావస్థానుభవం తుర్యాతీతావస్థలో భ్రాంతి. తుర్యాతీతాన్కి ఇంకా అతీతమయినది, లేదు అని చెప్పేవారు లేరు. (సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ).

భ్రాంతి అంటే ఉన్నదాని యందు (తెలియక) మరొకటి కల్పించిగాని, అనుభవించిగాని ఆరోపించుట. బ్రహ్మమొక్కటే ఉన్నదనే సత్యము అనుభవానికి (విశ్వాసానికి) వచ్చిన వానికి అదీ అద్వైత సిద్ధాంతమే. కేవల జగత్తు మాత్రమే ఉందన్న వానికి (ఉదా : Atheist) ఈ సిద్ధాంతమూ అద్వైతమే. Science కి ప్రకృతి ఒక్కటే సత్యము కాబట్టి అదీ అద్వైతమే. పురుషుడు (God) and ప్రకృతి (Nature) రెండూ ఉన్నాయన్న మతంలో భ్రాంతికి తావు కల్గుతుంది. ఇదే అమ్మ చెప్పింది. రెండూ ఉన్నపుడే భ్రాంతికి తావుంది. పైగా అంటుంది : సత్యము రెండుగా ఉంది కాబట్టే భ్రాంతి ఉన్నది. (పే.399) శంకరాద్వైత సిద్ధాంతం బ్రహ్మమును శుద్ధబ్రహ్మముగాను (ఏమి చేసేది కాదు) మాయతో కలిసిన బ్రహ్మమును శబలబ్రహ్మముగాను ప్రతిపాదించింది. శుద్ద బ్రహ్మమును శబల బ్రహ్మముగాను ప్రతిపాదించింది. శుద్దబ్రహ్మము జడమువంటిదే! శబల బ్రహ్మము కార్యనిర్వహణా దక్షత కలిగి జగత్తును సృష్టించడమో, లేక జగత్తుగా రూపొందడమో చేస్తుంది (ఈశ్వర సృష్టి, ఈశ్వరుడు); ఒకటి నిర్గుణ నిరాకార పరబ్రహ్మము, రెండవది మాయాయుక్త సగుణ, సాకార పరబ్రహ్మము. నిర్గుణ, నిరాకారపరబ్రహ్మమునకు మాయ (అవిద్య) అనే ఉపాధి కల్గినపుడు అది ఈశ్వరుడు, ఈశ్వరసృష్టికి కారణం అవుతోంది. అమ్మ, సత్యము నిరాకారంగాను, సాకారంగాను ఉందంటుంది. రెండుగా ఉన్నది కాబట్టే భ్రాంతికి అవకాశం కల్గిందంటుంది. నిరాకారసత్యము, సాకారసత్యమూ రెండూ ఎఱిగిన వాడే భ్రాంతి పరుడగును. ఇక్కడ భ్రాంతి అంటే సాకారమందు నిరాకారం చూడటం. లేదా నిరాకారమందు సాకారసత్యము నారోపించడం. ఉదా : ఆదిశంకరులు ఛండాలుని శివుడిగా, గుర్తించ లేకపోవడం) అమ్మ ఆత్మయే సృష్టి అంటుంది. ఆత్మ అవాగ్మానసగోచరము, సర్వవ్యాపకము. అపరిచ్ఛిన్నమైన ఆత్మకి పరమాత్మయని, పరిచ్ఛిన్నమైన (ఆవరణాదులున్న) ఆత్మకి జీవుడని పేరుపెట్టుకొన్నాం. మరి జీవుడంటే ఎవరని ప్రశ్నిస్తుంది అమ్మ? జీవుడు అనగా శరీరమా? మనస్సా? ప్రాణమా? శక్తియా? అమ్మ అంటుంది. ఆత్మ = శక్తి = సృష్టి = జగత్తు.

సారాంశం : సత్యము రెండుగా ఉన్నప్పుడు (బ్రహ్మము; జగత్తు) తత్కారణంగా వచ్చే భ్రాంతికి పరిహారమేమిటి? అమ్మ సమాధానం భ్రాంతి, భ్రాంతి వల్లే పోతుంది. (సంభాషణలు : పే. 412). నేను భ్రమపడ్డాను గతంలో అని అనుకోవటం భ్రమకాదని ఎట్లా తెలుస్తుంది? ముందర భ్రాంతి కల్గింది. “అయ్యో! నేను భ్రమపడ్డాను!” అని మరొక భ్రాంతికి గురికావచ్చుగా! రెండవ భ్రాంతి వల్ల మొదటిది భ్రాంతి అని తెలుసుకున్నాను. 3వ భ్రాంతి వల్ల 2వ భ్రాంతి కూడా భ్రాంతియేనని తెలుసుకోవచ్చుగా. ఇట్లా అవిరళంగా ఒక భ్రాంతిని, మరొక భ్రాంతి, ఈ భ్రాంతిని ఇంకనూ మరొక భ్రాంతి (endless chain of illusions) లో యిరుక్కొనవచ్చు. అందుకనే భ్రాంతి, భ్రాంతి వల్లే పోతుందంటుంది. అయితే భ్రాంతుల పరంపర (గొలునుకి ఎక్కడ అంతం? అసలు అంతం ఉందా?

ఉన్న భ్రాంతి పోయింది. అసలు వస్తువు (సత్యం) తెలిసింది. ఈ అసలుగా తెలియబడిన వస్తువు (సత్యం) కూడా భ్రాంతికాదని ఎట్లా తెలుసుకొనడం? దీనికి ప్రమాణమేమయినా ఉందా? భ్రాంతి మన సహజ లక్షణం అయితే ఒక భ్రాంతి 2వ భ్రాంతి వలన, 2వ భ్రాంతి మూడవ భ్రాంతి వలన – ఇట్లా భ్రాంతుల సుడిగుండం అవుతుంది కదా మన పని! అట్లాగాకుండా, భ్రాంతి సహజ లక్షణం కాదు; అది శాశ్వతం కాదు; పరిష్కారమార్గం ఉందనుకుంటే భ్రాంతిపోయి సత్యం తెలుస్తుంది. సాకారపరబ్రహ్మ (ఈశ్వరసృష్టి) సమసిపోయి (మహా ప్రళయం – భ్రాంతినాశనం) నిర్గుణనిరాకార పరబ్రహ్మం అనుభవాన్కి వస్తే (తెలిస్తే) జగత్తు అనే భ్రాంతి వదిలి బ్రహ్మమనే సత్యానుభవజ్ఞానం కల్గుతుంది. కాని ఇక్కడే మరొక సమస్య వస్తుంది. నిర్గుణ, నిరాకార, శుద్ధ పరబ్రహ్మ తెలియబడేవాడు కాడుగదా? ఇంద్రియాల వలనగాని మనోబుద్ధుల వలన గాని, వాక్కువలనగాని తెలియబడేవాడు కాడు గదా! ఆత్మను (లేదా పరమాత్మను) గీతాచార్యుడు కూడా అనిర్వచనీయమంటాడు గదా! (అచలమ్ అనిర్వచనీయమ్; అప్రమేయం సర్వగమ్; ధ్రువమ్; కూటస్థమ్). దేనివల్లా తెలియబడనివాడు, దేనికీ అందని వాడ్ని (అప్రమేయం) సత్యమని, వాని ఉనికిని తెలుసుకొనేదెవరు? ఎట్లా తెలిసికొనేది? అందుకే అమ్మ అంటుంది దేవులాడినా దొరకనివాడు దేవుడని; జగత్తు సత్యం, బ్రహ్మ మిథ్యయని… ఈ కారణంగానే అమ్మ భ్రాంతి భ్రాంతి వల్లే పోతుందంటుంది… నిరాకారశుద్ధ పరబ్రహ్మ ఉన్నాడనేది కూడా ఒక భ్రమ కావచ్చు అంటారు కొందరు. గీతాచార్యుడు కూడా విశ్వరూప సందర్శన భాగ్యమే యిచ్చాడు కాని విశ్వాతీతుడుగా విశ్వాధికుడిగా దర్శింపబడలేదు||

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!