కుండలినీ దివ్యదర్శనం యిచ్చిన జిల్లెళ్ళమూడి అమ్మః మౌలాలీ అనుభవం
(మూలం : అమ్మ సచ్ఛరిత్ర మూడవభాగం : ఎ. కుసుమకుమారి 259-271)
జిల్లెళ్ళమూడి అమ్మకి అపుడు 12 సంవత్సరాల వయసు. తన ఇంట్లో తన వారికెవరికి తెలియకుండా, వారికి తనను వెతకాలనే ఇచ్చలేకుండా చేసి 23 రోజులు ఏకదాటిగా, రాత్రింబవలు ఒక చింతలతోపులో ఒక చింత చెట్టు క్రింద కూర్చుని కళ్ళు మూసుకుని అంతర్ముఖియై ఉంటుంది. అంతకు ముందే మౌలాలీ అనే ముస్లిమ్ అమ్మదగ్గరికి వచ్చి, అమ్మ పెట్టిన ప్రసాదం తింటూ, అమ్మతో సంభాషిస్తూ ఎప్పుడూ అమ్మ దగ్గరనే వుండిపోవాలనే గాడేచ్చతో వుంటుంటాడు. మౌలాలీ బ్రహ్మంగారి భక్తుడు. ముసలివాడు. దృష్టి లోపంగలవాడు. బ్రహ్మంగారి మనుమరాలు, ఈశ్వరమ్మగా అమ్మ అతనికి కన్పిస్తుందని గుర్తిస్తాడు. అమ్మ చింతలతోపులో సహజ ధ్యాన సమాధిలో ఉంటున్నపుడు రోజూ అమ్మ దగ్గరికి వచ్చి అక్కడే కూర్చొని అమ్మను చూస్తూ, ధ్యానం చేసుకొంటూ ఉంటాడు. అమ్మ తనకి క్షణక్షణమూ రూపాలు మారుస్తూ అనేక దివ్యరూపాలతో కన్పడుతుంటుంది. చిన్నపిలలలాగ కన్పించినా అమ్మలాగే ఉంటుందంటాడు. ముసలిదానిలాగ కన్పించినా అమ్మలాగే ఉంటుందంటాడు. పురుషుడిలాగ కనపడినా అమ్మేనంటాడు.
అమ్మ 11 రోజుల తర్వాత ఒకసారి కళ్ళు తెరిచి బాహ్యంలోకి వస్తుంది. కళ్ళు తెరిచేటప్పటికి దాహంతో నాలుక పిడచకట్టుకుపోతూంటుంది. దగ్గరలో మంచినీళ్ళు కూడా లేవు. ఆ చెట్టుమాను వైపే ఒక అర్ధగంట చూస్తూ కూర్చుంటుంది. మాను పగిలి పోయింది. అది పగిలినపుడు వచ్చిన పెద్ద ధ్వని ఊరంతా విన్పడేలాగుంటుంది. అది ఓంకార నాదంగా విన్పిస్తుంది. వెంటనే మేఘాలు కమ్మి పెద్ద వర్షం కురుస్తుంది. ఆ గ్రామంలో అదే తొలకరి వాన – ఊరంతా చల్లబడుతుంది. ఊరంతా ఐదురోజుల్లో పచ్చబడుతుంది. అమ్మ ఆ వానలో అక్కడే ఉంటుంది. పగిలిన మాను నుంచి రసం నురుగు, నురుగుగా వస్తుంది. దోసిళ్ళతో ఆ రసాన్ని అమ్మ త్రాగుతుంటుంది. ఆ రసం అమ్మ దాహం తీరేదాక స్రవిస్తుంది. దాన్ని “తింత్రిణీసుధ” అంటారు. ఎటు చూచినా చింతచెట్లు, నాగజెముడు చెట్లు. అమ్మకి ఆకలి, దప్పికల గురించిన చింత లేకుండా ఆ చింతరసమే ఉపయోగపడ్తుంది. ఒకే చొక్కా. ఒకే పరికిణి,, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అక్కడే ఇంకో పదకొండురోజులుంటుంది. మౌలాలీ దొప్పలపూడిలో అడుక్కుంటూ రోజూ తోటలోని అమ్మ దగ్గరకి వచ్చి, వెళ్తుంటాడు. 23 రోజులు అట్లాగే చెట్టు క్రింద గడిచిపోతాయి. మౌలాలీ కూడా ఎక్కువ సమయం తోటలోనే ఉంటాడు. అమ్మను గురించి ఏవో భావాలు మెరుస్తుంటాయి. కాని వర్ణించగల్గిన భాషగాని, చదువుగాని లేదని బాధ పడ్డాడు.
అమ్మ సాన్నిధ్యంలో కూర్చుంటే ఏదో మత్తు పారవశ్యం పొందుతాడు. అమ్మ, తనూ కూడా పరస్పరం మాట్లాడుకోక పోయినా అమ్మతో సంభాషిస్తూనే ఉన్నట్లు ఉందనిపిస్తుంది. (మౌనవాఖ్య) రకరకాల రూపాలు కన్పడుతుంటాయి. యెన్ని రూపాలు గాంచినా అమ్మలాగే తోస్తుంది. పురుషరూపమైనా అమ్మలాగే కన్పడుతుంది. ఈ అనుభవం యిదివరకు అంతలేదు. వారం రోజుల నుంచి ఎక్కువగా అనిపిస్తుంది. ఒక అనుభవమనేది లేదు. అమ్మని వదిలి అడుక్కుందామని అనిపించదు. ఆకలి కూడా అతన్ని అంతగా బాధించినట్లుండదు. ఇవన్నీ చూస్తుంటే తన ప్రయత్నం అంటూ ఏమీ లేదనుకుంటాడు. ఆ నిశ్చయము, విశ్వాసము దృఢపడ్తాయి. అమ్మ అతను చెప్పేవి అన్నీ వింటూ కళ్ళు మూసుకొని, తలవంచుకొని అట్లాగే కూర్చుంటుంది. అలా అయిదు రోజులుంటుంది. మౌలాలీ అమ్మను చూస్తూ అమ్మతో కలిసి పోయిన వాడిలాగ, నిశ్చేతనంగా, కన్ను ఆర్పకుండగ అమ్మనే చూస్తుంటాడు. (అనిమేఘడవుతాడు) అమ్మ శరీరం మీద అనేక పక్షులు వచ్చి వాలుతున్నా కొట్టాలనుకుంటాడు కాని, కొట్టలేడు. అనేక రకాల పురుగులు ప్రాకుతున్నా తీసి పారవెయ్యడానికి చేతులు రావు. కాళ్ళు కదలవు. కంటిరెప్పవాల్చడానికి కూడా శరీరం స్వాధీనం లేదు. కన్పిస్తున్నదంతా చూస్తుంటాడు. కాని సంకల్పాలేవీలేవు. ఈ విధంగా అయిదు రజులు గడిచిపోతాయి. ఆ రోజు నిండు పూర్ణమి. రాత్రి పన్నెండు గంటలు. ఒక సర్పం అమ్మ చుట్టూరా చుట్టేసుకొని పైన గొడుగులాగ పడగవిప్పి అసంఖ్యాకమయిన శిరస్సులతో (సహస్రారకమలం) గొడుగులాగ పడగ విప్పి, తల ఊపుతూ, వెన్నలకాంతిలో మెరిసిపోతుంటుంది. మరల ఈ దృశ్యమంతా పోయి అమ్మ ఒక్కతిగానే కన్పడుతుంది. ఆ దృశ్యానుభవం ఎపుడూ ఉండాలనే తపన పడ్తుంటాడు. తన జన్మకి మూలం అమ్మేనని మనోవాక్కాయ కర్మలా గుర్తించటమే “బ్రహ్మ”ను తెలుసుకోవటం అనేది అర్థమవుతుంది. వీరబ్రహ్మంగారు అదే చెప్పినట్లు తెలుసుకొంటాడు.
అమ్మతో నీ నెత్తిన గొడుగులాగ పాము ఉంది ఏమిటమ్మా అని అడుగుతాడు. అమ్మ ఈ మధ్య తనకి ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా, ఏమి చూచినా అట్లాగే కన్పడుతోంది అంటుంది. అమ్మ చివరకు అదంతా తనలోని దేనని గ్రహించినట్లు చెపుతుంది. తనలో అది ఎక్కడ ఉన్నదనే ఆలోచన తనకే వచ్చిందని వివరించింది. అదే బ్రహ్మదండి కుండలిని చైతన్య శక్తి అనీ అమ్మ అర్థం చెబుతుంది. అయితే బయట సర్పమల్లే కన్పడటం ఎందుకమ్మా అని అడుగుతాడు మౌలాలీ. లోపలి ఏముందో బయటా అదేనని రెండు కాదని చెబుతుంది. ఆ బ్రహ్మదండిని సృష్టించింది కూడా నీవే కదా, మరి నీకు కన్పడటమేమిటని అనుకుంటాడు. మాకు బోధ చెయ్యడానికేమో అనుకొంటాడు. సూదిమొన మోపలేకుండా ఉన్నావు. సూదిగా కూడా ఉన్నావు. అన్నీ ఎందుకు పెట్టుకొన్నావమ్మా, ఇంత యాతన దేనికమ్మా అంటాడు. భరించలేనపుడే కదా అది భారం. బాధ అవుతుందని అమ్మ సమాధానం చెపుతుంది. బాధ, భరించడం బాధారాహిత్యం, భరించేవాడు, అనుభవించేవారు అంతా తానే అయినపుడు, అంతా ఒకటే అయినపుడు, అంతా అద్వైతమేగాని, ద్వైతం లేనపుడు, ద్వందమూ తానే, ద్వంద్వాతీతము తానే అయినపుడు, త్రిపుటి కూడా తానే అయినపుడు: అవస్థాత్రయము, తురీయము, తుర్యాతీత అవస్థ తానే అయినపుడు; సాక్షి, సాక్ష్యము, బాహ్యమూ; అయినపుడు; కార్యకారణ వినిరుర్రక్తగా తానున్నపుడు జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత తానుగానే ఉన్నపుడు; ధ్యానము ధ్యాత, ధ్యేయము తానే అయినపుడు, భారం ఏమిటి? బాధ ఏమిటి? అంతా నిర్వికార, నిరవయవ, నిరవధిక, నిత్య, సత్య అనంతపూర్ణ జ్ఞానానందంగాక మరేమి? అమ్మ సహజ స్వభావసిద్ద సహన శక్తికి అదే మూలం. అమ్మ అవ్యాజ ప్రేమ, మాతృత్వాన్కి అదే మూలము, ఆధారము, కారణము) అవ్యక్త పరహ్మతత్త్వం, వ్యక్తావ్యక్త, వ్యక్తబ్రహ్మగా ప్రకటితమైనపుడు, సహనము, కారుణ్యము, ప్రేమ, అనుగ్రహము ప్రకటిత బ్రహ్మకు సహజము, సిద్ధము, స్వభావంగా ఉంటాయి. అమ్మే చెప్పింది తన ఓర్పు నేర్పుతో వచ్చింది. తెచ్చి పెట్టుకున్నది కాదని. తనకేదీ కావాలని ఉండదు, వద్దని ఉండదు అని చెప్పింది. (నిష్కామ్యస్థితి). బాధలు, మాన, అవమానములు అన్ని నిర్వికారంగా, సాక్షిభూతంగా, ఆహ్వానించింది. తనకి ఆకలిలేకున్నా ఇతరుల ఆకలి గురించి ఎపుడూ తలంచేది. తినకపోతే మీకు పెట్టుకోక పోతే నేనూ చిక్కి పోతామన్నది. ఎవ్వరూ నన్నుకొట్టిగాని, తిట్టిగాని ఏం లేదు. వారి మంచితనమే నన్ను ఏడ్పిస్తుందని అన్నది. మీరు ఆపదల్లో ఉన్నపుడు నన్ను పిలవక్కర్లేదు, తలవక్కర్లేదు. మీ బాధే నన్ను రప్పిస్తుందని, | తన రక్షణ అందచేస్తుందని చెప్పింది. ఎవ్వరూ తనని వెతకాల్సిన పని లేదు. నేను మీరెక్కడున్నా వెతికి నా దగ్గరికి లాక్కుంటానది. అది నా మాతృధర్మం. అంది. అడిగితే కాని తల్లైనా పెట్టదన్న వారికి అడగక పెట్టేదే తల్లి అంది. ఇంకా తల్లి అంటే ‘తొలి’ అని నేను మిమ్మల్ని అందర్ని మొదట కని, మీమీ తల్లులకి పెంపు యిచ్చానంది. ఇంకా తల్లితత్వం యిట్లా వివరించింది. అంతులేనిది. అడ్డులేనిది, అర్థం కానిది అంది. రూపం పరిమితం, శక్తి అనంతం అంది. తను “ఆదెమ్మ” అంది. తన దగ్గరికి వచ్చే వారంతా ఎవరిది వారు తీసుకొనడానికే వస్తారు అంది. తనేదో వారికి పెడ్తున్నానని కాని, యిస్తున్నాని గాని అనుకోవడం లేదంది. అందుచేత పాత్రత, అర్హత, డ్రస్సు, అడ్రసులత పని లేదంది. తాను పంచి యిచ్చేదాంట్లో తన పదాన్యతగాని, త్యాగంకాని ఏమీ లేదంది. ఎవరిదివారు పట్టుకు వెళ్తుంటే పాత్రత, అపాత్రత, పాపపుణ్యాల ప్రసక్తి ఎట్లా వస్తుందన్నది. తన నివాసం అందరిల్లు అంది. మీరు చేసేది మీకు జరిగేది అంతా దైవమే అనుకోమంది. తను జరిపే పంచకృత్యాలలో (సృష్టి, స్థితి, లయం, తిరోధానం, అనుగ్రహం) ఎవరి బాధ్యత లేదంది. తనకంతా సమదర్శనం అంది.