(అమ్మ మాటలపట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్)
అమ్మ అంతా దైవమే, ఆ చైతన్య శక్తి విలాసమే కాని మన మనేది గాని, మనదనేది గాని ఏమీ లేదంటుంది. పురుషకారాన్ని, కర్తృత్వం, భోక్తృత్వం, క్రియత్వం ఏమీలేవని తీసివేసింది. సంకల్ప, వికల్పాలు కూడా దైవమే అంది. మన బాధ్యత ఏమీలేదంది. ద్వైతభావన, త్రిపుటి భావన కేవలం జీవ అహంకార స్వభావమంది. చేతలు చేతుల్లోలేవు (క్రియాశక్తి) తోచిందేదో చెయ్యి, తపించేది వాడేగా! (ఇచ్ఛాశక్తి, సంకల్పములు, కోరికలు). భగవంతుడు తలుస్తేనే తాను తలుస్తాడంది (ప్రేరకశక్తి). మీరు కనిపెడితే కనబడను, నేను కనబడితే మీరు కనిపెడ్తారంది (జ్ఞానశక్తి – గుర్తించే తెలివి). ఇట్లాగ సర్వమూ అద్వైత పరంగానే, ఈ సృష్టిజాలాన్నంతటిని కూడా అఖండాద్వైత చైతన్య భావనగా చూసింది, చూడాలంది. జన్మకారణ సిద్ధాంతం ఏమంటుంది? కోరిక వల్ల కర్మ, కర్మ వల్ల జన్మ పరంపర చక్రం తిరుగుచున్న దంటుందా సిద్ధాంతం. అమ్మ సమాధానం : కోరిక వల్ల కర్మ, జన్మ, వస్తే మనకి మొట్టమొదటి జన్మ (ఆదిజన్మ) ఎట్లా వచ్చిందంటుంది? అసలు ఆదిలో మనకి జన్మ లేనపుడు యికకోరిక, కర్మ ప్రశ్న రానేరాదు. అంటే, మన ఆది జన్మకారకులం మనం కాదు. కారణం మనం మొట్టమొదట జన్మకు పూర్వం లేము కాబట్టి. అంటే కాలంలో ఎక్కడో, ఏదో తెలియని కారణంగా, ఏదో తెలియని శక్తి ప్రేరణ రీత్యా మనం మొదటి జన్మనెత్తినామన్న మాట. అక్కడ నుంచి సంసార చక్రం తిరగడం ప్రారంభం అయిందన్న మాట. అమ్మ చెప్పిన సిద్ధాంతం ప్రకారం మన ఆదిజన్మ కారణం ఆ ఆదికారణశక్తి, మూలకారణశక్తియే అది అకారణం అంది.
“నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో
నెవ్వడాడు; మునులు, దివిజులు కీర్తింప
నేరరు, ఎవ్వని వర్తన మొరులెరుగరు,
అట్టి వానినే భజింతున్” అన్నారు.
ఇదే అమ్మ సిద్ధాంతం. అయితే ఈ జన్మ పరంపర సంసారచక్రంలో ప్రతి జన్మకి ఒక్కొక్క కారణం ఉందా? లేదా, మనం మొదటి జన్మకి పూర్వం ఎక్కడున్నామో అక్కడికి మరలా చేరేంతవరకు ఈ కాలప్రవాహంలో వచ్చే జన్మలన్నింటికి ఒకేసారి నిర్ణయం జరిగిందా? దీన్నే అమ్మ “విధి” యని “విధానమే విధి” అని అంది. అంటే అర్థం మోక్ష పర్యంతం మనకు వచ్చే జన్మ పరంపర అంతా మొట్టమొదట్లోనే ఒకేసారి విధి విధానంగా నిర్ణయింపబడిందన్న మాట. అందుకే ATT అనుగ్రహంకావాలమ్మా” అంటే, “అనుగ్రహం మొదలు నుంచి ఉన్నదే. ఇంకా వేరే క్రొత్తగా అనుగ్రహించాల్సిందేముంటుంది” అంటుంది. అంటే కాల గమనంలో మన పరిణామ క్రమం అంతా ఆదిలోనే నిర్ణయాత్మకంగా అనుగ్రహింపబడింది. ఇక అంతా దైవమే కాక, వేరే పురుషకారం ఏముంది? నిర్ణయం చేసినవాడే నిర్ణయానికి కట్టుబడి ఉంటాడంది. ఇక మధ్యలో మార్పులు, చేర్పులు, రద్దులు ఏమీలేవన్న మాట. మరి పంచకృత్యాలలో “అనుగ్రహం” కూడా ఉందిగా? దాని మాట ఏమిటి అంటే అనుగ్రహం కూడా మొదట్లోనే నిర్ణయింపబడిందన్న మాట. దేనికయినా “తరుణం” రావాలంటుంది. తరుణం అంటే తప్పించలేనిది, సంకల్పించకపోయినా, యత్నించకపోయినా, సంప్రాప్తమయ్యేది. సంకల్పించి, యత్నించినా జరుగనిది అని అంటుంది. అనుకొన్నవన్నీ జరుగవు, తనకున్నవి తప్పవు అంటుంది ఏది చేయిస్తే అదే జరుగుతుంది. ఏది ఫలింప చేస్తే అదే ఫలిస్తుంది. ఇదీ “విధి విధానం” తిథులు “విధి”ని మార్చలేవు. జరిగిందే ముహూర్తం, పెట్టింది కాదంది.
ఈ సిద్ధాంతం అమ్మ సాధనకి, సాధకులకి కూడా వర్తింపజేస్తుంది. సాధన చేయించేది గాని, చేసేది కాదు. ఒకవేళ సంకల్పించి, ఉపక్రమించినా అది సాగదు. ఏ శక్తి ప్రేరణ చేత నీకు సాధనచెయ్యాలని కోరికపుట్టిందో, తత్ప్రయత్నం జరిగిందో ఆ శక్తే నీ ‘తరుణం’ (అంటే మనకి నిర్ణయించిన కాలం) వచ్చినపుడు దాన్ని ఫలవంతం చేస్తుంది. సాధనకి ఏ శక్తి ఆటంకం కల్పిస్తోందో, అదే శక్తి నీ ‘తరుణం’ రాగానే నీకు సాయం చేస్తుంది అంటుంది. అంటే ఇహమందు, పరమందు జన్మ పరంపరలందూ, సాధనా ప్రక్రియలోను, మోక్షప్రాప్తియందు సర్వానుభవంలోను
మనం దైవం మీదే ఆధారపడి ఉన్నామన్న మాట. అందుకే సర్వాన్ని (అనగా, జన్మలకి, జన్మవాసనలకి, కర్మవాసనలకి, భోగవాసనలకి, అనుభవాలకి, ప్రవర్తనకి, ప్రవృత్తులకి, సాధనకి, కర్మత్రయాన్కి, మోక్షాన్కి) సర్వం (పరబ్రహ్మ చైతన్య శక్తి) ఆధారం అంటుంది. ‘వివేక చూడామణి’లో భగవంతుడు మానవునికి మూడు వరాలిచ్చాడంటారు శంకరులు. అవి 1. మనుష్య జన్మ 2. ముముక్షత్వం 3. మహాపురుషసంశ్రయం. ఈ మూడు వరాలేగాని, సంపాదితాలు కావు. అదే అనుగ్రహం. శ్రీ రమణ మహర్షి “అనుగ్రహం కావాలని తపించడం ఎట్లా ఉందంటే, నెత్తిమీద అన్నం మూట పెట్టుకొని, ఆకలితో అలమటించడం లాంటిది”, “గంగా ప్రవాహంలో కొట్టుకుపోతూ దాహంతో తపించడంలాంటిది” అంటారు. ఆత్మ యొక్క స్వభావమే అనుగ్రహం అంటారు. అది అంతా ఉన్నదే, అది ఎపుడూ ఉన్నదే. అది వేరే పొందవలసిందికాదంటారు. అంతా కాలనిర్ణయం – అదే విధి నిర్ణయం, అదే ఆది విధానం. అదే అమ్మ చెప్పే “తరుణం”.
ఈ భావాన్నే లలితా సహస్రనామం “శ్రీమాతా” అన్న నామం ద్వారా తెలియజేస్తుంది. “శ్రీ మాతా” అన్నది ప్రప్రథమనామం. “మాతా” అనగా కొలుచునది (మాతా), కొలత (మానం) మేయం (కొలవబడేది) అనే అర్థాలు చెప్తారు కీ॥శే॥ మల్లాప్రగడ శ్రీరంగారావుగారు. అంటే ఏ జీవికి ఏ విధి, విధానం ప్రకారం, ఆదికారణ – కార్యరూపంగా ఏదియివ్వాలో, ఎంత యివ్వాలో, ఏ దేశ, కాల, పరిస్థితులలో యివ్వాలో నిర్ణయించేది అని ఈనామాన్కి అర్థం. అసలు సృష్టికి పూర్వమే లేనటువంటి మానవుడు, జన్మ ఎత్తి వచ్చాడంటే వానికొక విధి నిర్ణయంగా, ఒక విధానపరంగా, దైవేచ్ఛగా ఒక పాత్ర యివ్వబడింది. ఈ జగన్నాటకంలో సూత్రధారి, పాత్రధారి, పాత్రనిర్ణేత, పాత్ర నియమావళి, పాత్రానుగత అనుభవం, ప్రకటన, ప్రవర్తన అంతా దైవమే! నాటకం వాడిదే! ప్రేక్షకుడూ వాడే, రచన వాడిదే, డైరక్షన్ కూడా వాడిదే. రంగం వాడిదే, జగత్కర్త, భర్త, భోక్త అంతా వాడే! సృష్టికి సంబంధించిన పంచకృత్యాలు వాడివే. జగత్తుకి, జగన్మాతకు అభేదమేగాని, ద్వైతం లేదు. అదంతా మహామాయా చైతన్య చిద్విలాసనమే! శ్రీమాత లీల! ఈ లీలానాటక విలసనము, భేదమూ అంతా అమ్మేచేస్తుంది. అందుకే అమ్మని “లీలానాటక సూత్ర భేదనకరి, మోక్షద్వారకవాట పాటనకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి” అని అన్నపూర్ణాష్టకం కీర్తిస్తుంది. పంచదశీ మంత్రస్వరూపి అయిన అమ్మ అనుగ్రహించుగాక.