(ద్వైతంలో అద్వైతమూ, అద్వైతములో ద్వైతమూ ఉన్నాయి)
(అమ్మ మాటలపట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్) –
తానొకటి తలుస్తే దైవమింకొకటి తలుస్తాడన్నది సాధారణ నానుడి అనుభవమూ. దాన్ని మార్చి అమ్మ సిద్ధాంత ప్రతిపాదనచేస్తుంది. “దైవం తలుస్తేనే నీవు తలుస్తావు”. “నాది సరే మంత్రం”. మీ ఇష్టప్రకారం చేస్తున్నట్లు కన్పడినా, నా ఇష్ట ప్రకారమే చేయించు కొంటున్నానంటుంది. అందువల్లే నామంత్రం “సరే” మంత్రం. “తోచిందేదో చెయ్యి. తోపించేవాడు వాడేగా”. అందువల్ల “దైవ సంకల్పం కాదు; సంకల్పమే దైవ మంటుంది. (మానవ సంకల్పం వేరు, దైవసంకల్పం వేరు కాదు). ఇది అద్వైతం. దైవం (దొరకని వాడు; వాడు; అదే; శక్తి) సంకల్పంగా ఉన్నాడు; వచ్చాడు; అని అన్నపుడు సంకల్పం నెరవేరాలి కదా! అందరికి ఒకే సంకల్పం ఉండాలి కదా అని ప్రశ్న. “అమ్మా ! తప్పులెందుకు చేస్తారమ్మా?’ అంటే ‘తప్పించుకోలేక’ అని అంటుంది. కార్యకారణ సంబంధ భంగం కలుగ కూడదు కదా! కాని తలచినదంతా జరగడం లేదు కదా! అయితే, సంకల్పము, దైవమూ వేరా? (ద్వైతము). ఇక్కడ రెండు సమాధానాలు దొరుకుతాయి. : ఒకటి సంపూర్ణాద్వైతం సూచిస్తుంది. రెండవ సమాధానం ద్వైతాన్ని తెలుపుతుంది. ఒకటి కార్యమునకు, కారణము (సంకల్పము)నకు మధ్య కొంత కాలవ్యవధి ఉన్నది. ఈ కాలవ్యవధిలో జరిగేదంతా (ప్రయత్నలోపం కూడా) దైవమే అనుకోవాలి. కారణం దైవం; కాలం దైవం; కార్యము దైవం; పురుష ప్రయత్నం దైవం; ఫలము దైవం. అనుభవించేది దైవం. అనుభవించేవాడు దైవం. చేసేవాడు దైవం. కర్త, కర్మ, ఫలమూ అన్నీ దైవమే. ఈ దృష్టిలో సంకల్పము, వికల్పము, కాలము, తరుణము, తారతమ్యము, కార్యసిద్ధిత్వము, తత్సంబంధమైన ద్వంద్వానుభవం (భేద, మోదాలు) అంతా దైవమే! (Non-stop application of Advaita Vedanta)
రెండవది ప్రారబ్ధము. (పూర్వజన్మ, కర్మ; జీవుడు) మొదటి సమాధానంలో ప్రారబ్ధం లేదు. జీవుడు లేడు. జన్మలు లేవు. కర్తృత్వము లేదు. భోక్తృత్వము లేదు. ద్వంద్వ వాసనలు లేవు. జీవ ధర్మాలు లేవు. అహంకారం లేదు. | జన్మలేనపుడు మరణం లేదు. పునర్జన్మ లేదు (అద్వైతం).
రెండవ సమాధానంలో కర్మ ఉంది; జీవుడున్నాడు. పురుషకారం ఉంది. జీవధర్మాలన్నీ ఉన్నాయి (ద్వైతం). అమ్మ అంటుంది “మనస్సుకి, ప్రవృత్తికి, ఫలితాలకు పొంతన కుదరక ప్రారబ్ధమనుకున్నాడు” (అమ్మతో సంభాషణలు : 421 పే.) ఈ రెండవ సమాధానం కూడా ఒక రకమైన తృప్తే. దారిన పోతుంటే ఒకడు రాయి విసిరితే నీకు తగిలి, గాయం అయి బాధ కల్గింది. ప్రారబ్ధ సిద్ధాంతం ప్రకారంగా, వాడు రాయి విసరటం, నీవు గాయపడటం, బాధ పడటం – అన్నీ నీ ప్రారబ్ధవశాన జరిగాయి. నీదే బాధ్యత. వాడిదేమీ కాదు. అయితే వాడు అయి విసిరి నిన్ను ఎందుకు గాయబరచాలి? ఇపుడు వాడు నిన్ను గాయపరచాడు. వాడు ఎందుకట్లా చేసాడు? నీవు పూర్వం వాడికేదో చేయబట్టి. వాడికి నీవు పూర్వం అది ఎందుకు చేసావు? అది వాడి ప్రారబ్ధం! ఇట్లా వాడికి నీవు, నీకు వాడు అన్యోన్యపరంపరగా చేసుకుంటూ వెళితే ఈ గొలుసు ఎక్కడ మొదలయిందో తెలియదు. మీ యిద్దరి ఆదిజన్మల్లో వాడూ, నీవు ఏ ప్రారబ్ధం తెచ్చుకొన్నారని ఈ గొలుసు పరంపరలో తగులున్నారు? అందువలన జన్మలున్నాయనుకొంటే అవి యిస్తే వచ్చాయి. దైవమే ఈ గొలుసుకి కారణమయింది. మొదటి జన్మకి దైవమే తప్ప వేరే కారణం లేదు. అట్లాగే మొదటి జన్మకి ఏది కారణమో అదీ అన్ని జన్మలకి కారణం. కాబట్టి ప్రారబ్ధం లేదు.
ఇట్లా ఆలోచిస్తే ద్వైతం అద్వైతాన్కి దారిచేసింది. అందుచేత అమ్మ అంటుంది; ద్వైతంలో అద్వైతం అద్వైతంలో ద్వైతమూ ఉన్నాయి (అమ్మతో సంభాషణలు : 423.). ద్వైతము అద్వైతమూ సమన్వయపరుచుకోలేనివి కావు. అందుకనే అమ్మ అంటుంది. “సర్వ సమ్మతమే నామతం”. “నాకన్నిమతాలు సరిపడతవి”. శంకరులను ఎక్కువ చేయాలనిగాని, రామానుజులను తక్కువ చేయాలనిగాని అనిపించదు. మరి అద్వైతంలో ద్వైతం ఎక్కడ వస్తుంది? రెండు రకాలుగా చెప్పటం ద్వారా అద్వైతంలో ద్వైతం వస్తుంది. ఒకటి “అజాయమానో బహుధావిజాయతే”. తాను పుట్టకుండగ అనేక విధాలుగ ఉండుటగా కన్పించు చున్నందున. రెండు “ఏకోహం బాహుళ్యం” ఉన్న ఒకటే అనేకంగా అవడంమూలాన పరమాత్మ ప్రత్యగాత్మగా ఉండుటచే. అపరిచ్ఛిన్నం పరిచ్ఛిన్నం కావడంగా. నీరు బుడగలుగా మారినందున. అఖండాకార సముద్రం తరంగాకారం దాల్చడం వలన. అధిష్ఠానమైన శుద్ధ బ్రహ్మము తన ఆవరణ, విక్షేపశక్తులకారణంగా జగదుత్పత్తికి ఉపాదానమైన మాయాశబల బ్రహ్మగా ఉపాధిని ధరించడం వలన. (దేహిని, దేహన్ని వేరు పరచలేని కారణంగా) శబల బ్రహ్మము యొక్క గుణ ధర్మముల కారణంగా సృష్టి అవతరణ జరగడం మూలంగా నిర్భేదము భేద సహితమగుట వలన – అటుల తోచుట వలన. అట్లు తోచుట భ్రాంతి కావున (మిథ్యావాదము) (ఎవరికి భ్రాంతి? శుద్ధ బ్రహ్మము యొక్క భ్రాంతియా? లేదా, జీవుడి యొక్క భ్రాంతియా? ఆవరణ దోషమెవరికి? శుద్ధ బ్రహ్మమునకా? శబల బ్రహ్మమునకా? కార్యమైన సృష్టిలోని జీవులకా? భ్రాంతిని కల్గించుశక్తి సర్వత్రా నిండి ఉండుటవలన (మహామాయా) శబలబ్రహ్మము శుద్ధబ్రహ్మమునకు కారణమా? ఈ విధముగా ద్వైతమందు అద్వైతము (మిథ్యావాదము, బింబ ప్రతిబింబ న్యాయము, మాయా – వాదము) కలిసి యున్నది.
“అందరికి సుగతి” : ‘అందరికి సుగతి అన్నావు కదా! అదెట్లాగ? అని అడిగారు. దానికి కారణం ద్వైత సిద్ధాంతమే! ఎవరిగతికి వారే కారణం కాదుకనుక. ఏగతికి (బంధమునకు, మోక్షమునకు) ఎవరూ కారణం కాదు కనుక. (అంతా దైవమే!) అన్నింటికి ఏది కారణమో (ఆదిజన్మకి; జన్మపరంపరకి; జన్మగతులకి; జన్మానుభవాలకి), అందరిగతులకి ఏది ఆధారమైనదో దాన్ని గుర్తించటమే “సుగతి”. అయితే ఈ గుర్తింపు విచారణ పరులకి, బ్రహ్మజ్ఞానులకి మాత్రమే ఉంటుంది. మరి ఇతరులగతి? (అమ్మతో సంభాషణలు: 423 పే.)
భ్రాంతిని పోగొట్టుకొనుటకు, నిజమైన గుర్తింపు పొందుటకు బ్రహ్మసాధన, నిష్ఠ, అవసరముకాదా? దీనికి అమ్మ సమాధానం “నీకు సాధనాభిలాషకల్గితే చెయ్యి. వద్దనను. కాని ఆ అభిలాష కల్గించినది, నీచేత ప్రయత్నింపచేసేది, ప్రయత్న భంగంగాని, సఫలంగాని చేసేది – అంతా అదేనని మరువవద్దు. సాధ్యమయినదే సాధన. నీకు సాధ్యంకానిది ఎట్లా చేస్తావు? దేనికయినా “తరుణం” రావాలి. అదివస్తే సాధన మానాలన్నా మానలేవు. ఒకే శక్తి నీ కన్నీ అయినది. సాధనా ప్రక్రియలో నీసాధ్యవస్తువు నీకు సాయపడుతుంది. సాధ్యమే సాధనంగా అయి నీసాధనసాగుతుంది. సాధకుడు, సాధన, సాధ్యము, సాధనా సిద్ధి అంతా దైవమే. జీవనంలోను, సాధనలోనూ కూడా అద్వైత భావనే స్థిరీకరించు కోవాలి. సాధన సర్వసాధారణమైపోవాలి. సాధనవేరు, జీవనం వేరుగా ఉండకూడదు. సాధనమే జీవనం; జీవనమే సాధనగా పరిణమించాలి. నిరంతర ధ్యాసయే సాధన. సమత్వమే సమాధి. ఆవేదనే ఆరాధన. ఒకావిడ “అమ్మా! పూజ చేసుకోలేకపోతున్నానంటే చేసేదంతా పూజయే అనుకోమంది. సర్వత్రా అద్వైత భావనయే ఏకాగ్రత.