(మాతృశ్రీ సూక్తులు : పరిణామం, గణితం)
(అమ్మ మాటలపట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్)
గత భాగంలో బ్రహ్మమే సర్వభూతగణాలకి మాత, భర్త, లయకర్త అని శ్రుతి పరంగా చెప్పుకొన్నాం. దీన్నే శ్రీ లలితా సహస్రం ‘శ్రీమాతా, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరీ” నామాలతో ప్రారంభిస్తుంది. అయితే, ఆ బ్రహ్మము స్త్రీయా? పురుషుడా? లేక అలింగమా అని ప్రశ్న వస్తోంది. అందుకనే “యతో” (విశేషణలేని) పదం వాడబడిందని అర్థం అవుతోంది. నిర్విశేష శుద్ధ పరబ్రహ్మమునకు ఏ విశేషణం ఆపాదించినా అమరుతుంది. అయినా ఈ గడబిడ అంతా అవుసరంలేదని, నిష్కలం, నిశ్చలం నిష్క్రియం, నిరంజనం, నిర్లేపం, శాంతం అయిన పరబ్రహ్మమును అన్నీన్ని మాటలలో చెప్పాల్సిన పనిలేకుండా అమ్మ రెండే రెండు మాటలతో వర్ణించుతుంది. అవి “శక్తి”, “అగణితం” అగణితుడు గణితుడవ్వడమే సృష్టి అంటుంది. అదే మాదిరి సమిష్ఠి వ్యష్ఠి కావడమే సృష్టి అంటుంది.. జగత్తు సత్యమంటూనే తానుచూచిందల్లా బ్రహ్మ అంటుంది. దీనికి మించిన అన్యమైన బ్రహ్మము వేరే తనకి కన్పడలేదంటూ, తాను చూడలేనిది ఊహమాత్రమే! కాబట్టే, జగత్తు సత్యం, బ్రహ్మ మిధ్య అంటుంది. ఇక్కడ గమనించవలసిన దొకటుంది.
బ్రహ్మమును జగత్తుగా చూడడం ఒకటయితే, జగత్తును బ్రహ్మముగా చూడగల్గడం వేరొకటి. బ్రహ్మమును (బ్రహ్మముగా కాక) జగత్తుగా చూడడం. అనగా చూడబడుచున్నదంతా జగత్తే. (బ్రహ్మములేదు, ఇది అద్వైత దర్శనమే, అద్వైత భావమే. ఇక, ప్రత్యక్షంగా ఇక్కడ, ఇప్పుడే చూచుచున్న జగత్తును బ్రహ్మమనుకోవడం (ఇక్కడ, ఇప్పుడు చూడ బడటం లేదు) ద్వైత భావమే కాక (జగత్తూ, బ్రహ్మమూ రెండూ ఉన్నాయి) అందులో ఒకటి ప్రత్యక్షం, రెండవది భ్రమ, భ్రాంతి కావచ్చు. అయితే అమ్మ చూచిన జగద్రూప బ్రహ్మము ఒక శక్తి కాసారం. (జగత్తు = బ్రహ్మము = శక్తిసాగరం). జగత్తు శక్తిమయం అంటే అందరికే అంగీకారమే. అమ్మ “శక్తి” పదాన్ని చాలవిరివిగా, అనేక సందర్భాలలో వాడుతుంటుంది. అమ్మని యథాతథంగా (Quote) చేద్దాం : (Ref. : కోన వెంకటేశ్వరరావు, 1999 : జ్ఞానమయి అమ్మ).
“ఒకే శక్తి అనేకమయింది. (పే.3) దారాన్కి కట్టే శక్తి ఉంది. పూవుకి కట్టబడే శక్తి ఉంది. అన్నింటికీ ఆ శక్తే కారణం. ఆ శక్తి చేయించినట్లు చేస్తాం. దానిని బ్రహ్మమను, (లేదా) ఏ పేరుతోనైనా పిలు (పే. 4) ఆశక్తి జన్మలిస్తే ఉన్నాయి. లేకుంటే లేవు (4). ఆ శక్తే అనేకమయింది (5) జ్ఞానానికి, అజ్ఞానానికి ఆ శక్తే కారణం. శక్తే ఆత్మ అనుకొంటున్నానను. (5). ఈ స్వరూపాలన్నీ దానివే అనుకుంటున్నాను (5) ఏదీనీవు చేయలేనప్పుడు, ఏదో శక్తి నిన్ను నడుపుతున్నప్పుడు పాప, పుణ్యాల గురించి, జన్మలగురించి ఎందుకు ఆలోచన (5). ఆ శక్తి ఏదో అర్థం కావడం లేదు. కంటికి కనబడడం లేదు. (6) నీవు వెతకలేవు. నిన్ను వెతుక్కుంటూ వచ్చే వాడు కావాలి (7). అట్లా అహర్నిశలూ నిన్ను వెన్నంటే ఉండేది ఒకటే శక్తి (7) మంచికీ, చెడుకీ, వాడే (శక్తిమయుడు లేక రూపుడు) ఆధారం (7) సంకల్పమూ, ఆలోచన రెండూ వాడే (శక్తి స్వరూపుడు). శరీరం వదిలిన మనస్సు సర్వవ్యాపకమైన శక్తి అవుతుంది. (9) పరిమితంగా ఉన్న ఈ శక్తి సర్వవ్యాపకమైన శక్తిలో కలిసిపోయింది (నిద్రలో). ఆ శక్తి ఎంతగా ఉన్నదంటే గుర్తించలేనంతగా ఉన్నది. శక్తి రూపంలో తప్ప మరొకరకంగా గుర్తించలేము. శక్తినే చైతన్యం అనుకొంటున్నాము (9) శక్తిగా ఉండి, అన్ని రూపాలుగా ఉండి, జరిగే ప్రతి పనిగా ఉండేదే ఆత్మ అంటున్నాను. (10) అంతా వాడి శక్తేనని అనుకోగల్గితే వంట పనిచేసినా, పాకీపనిచేసినా సాధనే (11). అసాధ్యమైన పనులు, అసాధ్యమైన ఆలోచనలు ఎన్నెన్నో ఆ శక్తి చేయిస్తుంది. వద్దనుకొన్నది చేస్తున్నాం. కనుక మనకతీతమైన శక్తి ఇంకొకటి ఉన్నదనే ఆలోచన కల్గుతున్నది. (11). ఏశక్తి చేత నీవు ఏర్పడ్డావో, నీ జీవితంలో జరిగే పనులు అన్నీ కూడా ఆశక్తిచేత నిర్ణయింపబడ్డమే. నిర్ణయమంటే మార్చడాన్కి వీలులేనిది – మారబడనిది (15) ఇంతమంది దేవుళ్ళున్నారని నాకు తెలియదు. అదేదో మనకు మించినది మనకు అర్థంకానిది ఒక శక్తి ఉన్నది. (30) అసలు ఆశక్తి ఒకచోట ఉండి, మరొక చోట లేకపోతేగా (29). నీతో ఏది చేయించినా నాతో చేయించినా, ఏదైనాకాని అంతా ఆ శక్తి వల్లనే జరుగుతున్నది. ఇందులో ఎవరి గొప్ప తనాలు, తక్కువతనాలు లేవు (29-30).
పదార్థం లేనప్పుడు శక్తి అర్థం కాదు. గుర్తించడమనేది రూపం ఉన్నప్పుడే (31), శక్తి చేతనే వస్తువు ఏర్పడ్డది. కాబట్టి వస్తువూ దైవమే (31). దైవాన్ని తెలుసుకొన్నా మనుకొంటాం. తెలుసుకోవడం కాదు. తెలియబడతాడు. తెలుసుకోవాలనే ప్రయత్నం మనకు ఎక్కడ నుంచి వచ్చింది? అదీ ప్రేరణే (33)”.
“సర్వఖల్విదం బ్రహ్మ” అనే మహావాక్య వివరణే ఇదంతా అని గ్రహించాలి.
వేదాంతులనే బ్రహ్మమునే అమ్మ “అగణితం” అని, “శక్తి” అని అంటోంది,ఇక్కడ (శక్తికి) లింగ, రూప, వస్తు వివేచన అవుసరం లేదు. బ్రహ్మమూ శక్తియే. జగత్తూ శక్తియే. సారాంశంగా, అమ్మ = బ్రహ్మ = శక్తి – శివ = విష్ణు = చతుర్ముఖబ్రహ్మ = చేతనా, అచేతనా భూతజాతం. సర్వం శక్తిమయం. సర్వాధారం శక్తియే. శక్తి క్రియాంతరాలు, శక్తి రూపాంతరాలే విశ్వపరిణామం. శాస్త్రం చెప్పుతున్నది – బ్రహ్మం అయిదు విధాలుగ ఉంటుంది. అవి (1) అస్తి (2) భాతి (3) ప్రియం (4) నామం. (5) రూపం. వీటిలో 1, 2, మరియు 3 బ్రహ్మపరము – బ్రహ్మ సంబంధం. 4 మరియు 5 జగత్పరం – జగత్సంబంధం. శ్రీ లలితా సహస్రంలో మహాశక్తి (217), పరాశక్తి (572), ఆదిశక్తి (615), ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి (658), చిచ్ఛక్తి (416), జడశక్తి (418) నామాలున్నాయి.
(సశేషం)