(మాతృశ్రీ సూక్తులు సర్వం శక్తిమయం)
(అమ్మ మాటలపట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్)
శక్త్యాత్మకమైన లలితా సహస్రనామాల అర్థం, వ్యాఖ్యానం తెలిసికొనే ముందు మరికొన్ని వివరణ పూర్వకమాటలు వ్రాయాల్సి వుంది.
అమ్మ తన్ను బ్రహ్మశక్తి, విశ్వశక్తి, జడ, జీవ శక్తిగా భావించి, అనుభవించింది కాబట్టి సృష్టి యావత్తు సత్యమనేకాకుండా (ఆది, అంతమూలేనిది) విశ్వప్రేమను (సర్వత్రాఅనురాగమే) విశ్వంలో తాదాత్మ్యమును పొందుచూ, విశేషాన్ని, సామాన్యాన్ని ఏకం చేయడమే ఆధ్యాత్మిక సాధన అంటుంది. సాధనంటూ వేరే ఏమీలేదని, జీవించటమే సాధనంటూ, “సమత్వదృష్టి” జీవన ప్రవృత్తి, విధానమే కావడం యోగమని చెప్తుంది (సమత్వం యోగముచ్చతే – భ॥గీత). సమదర్శనం, సమత్వం అనే పదాన్ని శ్రీ కృష్ణుడు గీతలో చాలాసార్లు ఉపయోగిస్తాడు. “పండితా స్సమదర్శనాః” అంటాడు. సమస్త ద్వంద్వాలందూ సమభావస్థితినే “స్థితప్రజ్ఞత్వం” అంటాడు. అటువంటి భావస్థితి కల్గిన వాడే నాకత్యంత ప్రియమైన భక్తుడంటాడు. అయితే, ఈ సమభావన, తదనుగుణ్యమైన ప్రవృత్తి ఎట్లా కల్గుతాయి జీవుడికి? అంతా శక్తిమయంగా భావనలో నిశ్చయము చేసికోవాలి. ఏది చూచినా, ఎవ్వరిని చూచినా, ఏది చేసినా, ఏది జరిగినా, జరగకపోయినా, ఏది ఉన్నా, లేకపోయినా అంతా ఒకే శక్తి యొక్క ఫలమే అని నిశ్చయాత్మక బుద్ధియేగాక, అనుభవైకవేద్య బుద్ధి, ప్రవృత్తిగా మారడమే మానవ జీవిత పరిణామం (వ్యష్టి, సమిష్టిగా). ఒక వస్తువుని వస్తువుగా చూస్తే, ఒక వ్యక్తిని వ్యక్తిగానే చూస్తే ఇది సంభవం కాదు. అన్ని పదార్థములను, జీవాలను, అనుభవానికి వస్తున్న సర్వాన్ని, “శక్తి”గా చూచి, ప్రవర్తించగల్గిన నాడు గొప్పదైన ఒక పరిణామం సిద్ధిస్తుంది. అమ్మ అంటున్నది కదా! అంతా ఒకే శక్తి చేయిస్తున్నదనుకొన్నప్పుడు ఎవరికీ గొప్పతనాలు, తక్కువ తనాలు లేవని. అదియే నిరహంకార స్థితి. అదియే అహమత్వ, మమత్వ రహితమైన సమస్థితి. అదియే విశిష్టాద్వైతులు చెప్పే భక్తి, ప్రపత్తి. అదియే సర్వత్రానురాగమైన ప్రవృత్తి. వైరాగ్యమంటె జగత్తునందు నిరాసక్తి, భగవంతునియందే ఆసక్తి కాదని అమ్మ భావం. సామాన్యమందు కూడ విశేషాన్ని దర్శించగల్గడమే అద్వైతదర్శనం అంటుంది. సామాన్యంలో నుండి విశేషాన్ని వేరు చేసి మరలా విశేషాన్ని సామాన్యం చేయడం అంటుంది. నేతి, నేతి, అనే నిషేధ వాక్యాలతో వదలి వేసిన దాన్నే తిరిగి ఇదంతా అదేనన్న స్థితికి రాగల్గడమేనంటుంది. అద్వైతం చెప్పినా అదే చెప్పుచున్నది. జగత్తుని “మిధ్య” (లేనిది) అనుకోవద్దు. జగత్తుని కూడా బ్రహ్మముగా చూడడమే అద్వైతం. ఆస్థితికి రాగల్గినప్పుడు బ్రహ్మమొక్కటే తప్ప వేరే యేదీలేదు. ఈ స్థితి రావడానికే అమ్మ “శక్తి” అనే పదాన్ని ఎంచుకొన్నది. అందరూ ఒకే శక్తి యొక్క ప్రతిరూపాలు కాబట్టి “మీరు కానిదేది నేను కాను” అంటుంది. అందర్ని దైవంగా చూస్తే అందరూ నిన్ను దైవంగానే చూస్తారంటుంది. కూతుర్ని ఎట్లా చూస్తారో కోడల్ని కూడా అట్లాగే చూడమంటుంది. భార్యకు భర్త దైవమైతే, భార్య కూడా భర్తకి దైవమే. వైద్యుడు దైవం అయితే రోగికూడా అంతేనంటుంది.
శ్రీ లలితా సహస్రం “సామరస్య పరాయణా”, “ప్రేమరూపా” “ప్రియంకరీ” అంటుంది. జగత్తునందు సమరస భావన కల్గియుండడం సామరస్య పరాయణత్వం. ప్రేమరూపా అనగా ప్రేమరసం రూపైనది. తనస్వరూపమైన జగత్తునందు తాను ప్రేమరసపూర్ణా. రసాలన్నింటిలో ప్రేమరసం, ఆనందరసం, శాంతరసం ఉత్కృష్టమైనవి. ప్రేమంటే ప్రమోదమే. ప్రేమ, ప్రమోదం, ఆనందం, అన్ని ఒకటే. ప్రేమించడంలో ప్రమోదం పొందడమే ఆనందం. ఆనందమున్నప్పుడే శాంతం. ఆ రసాలు ఒక దానికొకటి రూపాంతరసాఫల్యాలు. కాని, ఏకత్వ, అద్వైత భావన రావడం కష్టం. వచ్చినా నిలబడ్డం కూడ కష్టమే అమ్మ మానవజీవితం నవగ్రహాలమీద ఆధారపడిలేదు – రాగ, ద్వేషాలనే రెండు గ్రహాలమీద ఆధారం అంటుంది. బ్రహ్మజ్ఞానము కల్గిన పిదప కూడ మరల వ్యష్టిత్వము, ద్వైత, అనేకత్వ భావనలో కల్గడం సాధారణమే. ద్వైతానేకత్వ భావాలు మనఃనిర్మితాలు. మాయా కల్పితాలు. గీతలో భగవానుడు, “గుణమయిమమమాయా దురత్యయా” అంటాడు. ఈ మాయను అధిగమించడం బహుదుర్లభమే. మాయ తన అధ్యక్షతనే ప్రవర్తిస్తూ ఈ సృష్టి కార్యంనడుపుతుంటుంది. (సహస్రంలో మూడు నామాలు: మాయా, మహామాయా, విష్ణుమాయా). అందువలనే ఉపాయం కూడా తానే నంటాడు గీతాచార్యుడు. ప్రపత్తి వహించి తన్నేశరణం పొందమంటాడు. అమ్మ కూడా ఇదే సూచిస్తుంది. కాని, అవే మాటల్లో కాదు. నాకూద్వైతభావన – కలదంటుంది. అదిలేక పోతే మీకెట్లా పెట్టుకోగలను? మిమ్మల్ని ఎట్లా ప్రేమించగలను? నాకూ ఆశ, అసంతృప్తి ఉన్నాయంటుంది. మీకింకా, ఇంకా పెట్టుకోవాలనే ఆశ ఉంది. మీకేకాక, అందరికి పెట్టుకోవాలనే ఆశకలదంది. ఈ ప్రపంచంలో ఆకలి, దారిద్ర్యం లేని రోజు ఎప్పుడు వస్తుందా అనే ఆశ, అసంతృప్తి ఉన్నాయంటుంది. ఇట్లా చెప్తూనే నాకు ఆ ఆశ పోయిననాడు ఈ సృష్టి ఆగిపోతుందంటుంది. అంటే, ఇవన్నీ సృష్టిలోని అంశాలే కాని వేరుకాదు. ఈ ద్వంద్వాలు, భేదాలు, తరతమ అంతరాలన్ని సృష్టి లక్షణములు, సహజములే అని అర్థం. అందువలన భావంలో అద్వైతం, క్రియలో ద్వైతం ఉండాలంటుంది. క్రియ కూడ భావమే ప్రధానం కనుక క్రియకంటే భావమే ముఖ్యం – తారకమూ అంటుంది. అందరి ఒకే లాగ చూడడమే ఆత్మ సాక్షాత్కారం అంటుంది. భిన్నత్వం లేని మనస్తత్వమే దైవత్వమంటుంది. అట్లాగే, అంతా వాడే చేస్తున్నాడనుకోమంటుంది (ప్రపత్తి). ప్రాణం యిచ్చినవాడే తీస్కుంటాడు. కలిమి కల్గించినవాడే లేమి కూడ కల్గిస్తాడంటుంది. రెండు శక్తులూవానివే. కృష్ణుడు చెప్పిన ఆత్మార్పణం అన్నా, అమ్మ చెప్పిన అనుగ్రహం, నిర్ణయం, తరుణం అన్నా ఇవే అర్థాలు. కోరికలు తీరడం, తీరకపోవడం అనుగ్రహమే. ఇక్కడే అమ్మలోని విశిష్టాద్వైతం తొంగి చూస్తుంది. జీవాత్మ యొక్క శేషిత్వము, పారతంత్ర్యము, భగవంతుని యొక్క సర్వస్వాతంత్ర్యము, స్వామిత్వమూ విశిష్టాద్వైతంలో ప్రధాన సూత్రాలు. జీవుడు భగవంతుని పరికరణము, సేవకుడు, కింకరుడు అని వారి సిద్ధాంతం. జీవ – బ్రహ్మతాదాత్మ్యము, సమానత్వం వారు అంగీకరించరు. వారి దృష్టిలో పరమప్రాప్యము వైకుంఠంలో కైంకర్యమే. సేవానందమే బ్రహ్మానందం వారికి. పంచమముక్తి, కేవలముక్తి వారి లక్ష్యం కాదు. బ్రహ్మములో కలిసిపోడం, లీనమైపోవడం కాదు వారికి కావల్సింది. వారికి నిత్యకైంకర్యమే ఆపేక్షేయం. =
– (సశేషం)