(మాతృశ్రీ సూక్తులు సర్వం శక్తిమయం: పరిణామం, గణితం)
(అమ్మ మాటలపట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్)
దేని వల్లనైతే సమస్త భూతగణాలు ఉదయించి, జీవించి, తిరిగి దీనిలోనికే నిర్గమిస్తున్నాయో, అది బ్రహ్మం శక్తి. అద్దాని కార్యాత్మక ప్రకటనాత్మకమైన పరిణామమే స్థూల, సూక్ష్మ కారణరూపుగొన్న విశ్వశక్తి, జడశక్తి, జీవశక్తి. ఈ పరిణామం బింబ, ప్రతిబింబ న్యాయంగా సంభవించింది. బింబం ప్రతి బింబంగా ప్రకాశించడాన్కి కారణ భూతమైనది, నిష్క్రియమైన నిస్పందమైన బ్రహ్మశక్తిలో ఒక స్పందన. అది “ఆదిశక్తి” (615వ నామం) కేవలానందమయుడై, పూర్ణుడయి, నిస్సంగమైన బ్రహ్మకు సృష్టి కార్యమునకు ఉన్ముఖుని చేసిన ఇచ్ఛాశక్తి స్వరూపురాలు ఆదిశక్తి. అచింత్యమైన వైభవం కలది. శివ సహస్రనామాల్లో “భవః” “విభుః” అని రెండు నామాలున్నాయి. భవః అనగా ఇతరుల అపేక్షలేకుండగ విశ్వమును సృష్టించువాడు. విశ్వమునకు ప్రళయము కల్గించువాడు. అంతయూతానే అయినవాడని అర్థములు. విభుః అనే నామాన్కి అర్థాలు: ఎవని నుండి ఈ భువనములు విగతమైనవో అతడు. సర్వ వ్యాపకుడు, సర్వాంతర్యామి. వివిధ రూపములతో నుండువాడు. ‘విభు’ పదం నుండి వచ్చినదే విభూతి. భగవద్గీతలో విభూతియోగం చెప్పబడింది. “భూతభావనః” అనే మరొక శివనామం. సంకల్పమాత్రముగానే సృష్టించువాడు. అనగా సంకల్ప శక్తి ప్రభావం. భావనాశక్తి. సారాంశము: శివునికి, శివశక్తికి భేదంలేదు. శ్రీలలితా సహస్రంలో 999వ నామం “శివశక్యైక్యరూపిణి”. ఆయన “శివ” అయితే ఈవిడ “శివా” (998) ఆయన “సత్”” అయితే ఈవిడ “సతీ” (820) ఆయన “మృడ” అయితే ఈవిడ “మృడాణి” (564) ఆయన “భైరవు”డయితే ఈవిడ “భైరవి” (276) ఆయన బ్రహ్మమైతే ఈవిడ “బ్రహ్మణి”. (822) ఆయన “ఈశ్వర” అయితే ఈవిడ “ఈశ్వరీ” (271), ఆయన ఈశుడయితే, ఈవిడ “ఈశా” (712). ఆయన భవుడైతే ఈవిడ “భవానీ” (112). ఆయన శర్వ అయితే, ఈవిడ “శర్వాణీ” (124). ఇట్లాగే, శాంకరీ, శాంభవీ నామాలు ఇట్లాగ
ఇద్దరికీ నామ సామ్యం ఉంది. ఇతర సామ్యాల గురించి (అదిష్టాన, అనుష్టాన, అవస్థా, రూప) ఇదివఱకే తెల్సుకున్నాం. మనందరికీ అర్థనారీశ్వరత్వం బాగా పరిచయమైనదే. సర్వమూ శివశక్త్యాత్మకం అని మనం గ్రహించాలి.
అందువలననే “ఆదిశక్తి” నామం. ప్రథమ సృష్టి ప్రేరణకి పూర్వం నుంచీ సృష్టి అంతమువఱకూ, ఆ తర్వాత కూడా, దేశకాల వస్తుపరిచ్ఛిన్నత లేకుండా ద్వయత్వంలో ఒకటి రెండుగా ఉండటం, వర్తించడం- దీన్నే అమ్మ గణితం అంటుంది. గణితం అనగా సంయోగ వియోగాలు; కలవడం, విడిపోవడం; కూడిక, (plus) తీసివేత (minus)) ఏకత్వంగా, సమరసంగా ఉండేదే బ్రహ్మమూ – శక్తీ బ్రహ్మశక్తి, విశ్వశక్తి, జీవశక్తి, జడశక్తి అంతా ఒకే శక్తియే. ఆ ఏకశక్తియే విశ్వంగా జీవుడుగా జడభూతగణములుగా పరిణామం పొందవచ్చు. అవన్నీ నామ, రూప భేదాలే. తత్త్వతః భేదం లేనివి. ఆ ఏకశక్తియే స్థూలంగా, సూక్ష్మంగా, కారణంగా, కార్యంగా, వ్యక్తంగాను, అవ్యక్తంగాను ఘనీభవస్థితి (అస్తిత్వం) పొందవచ్చు. అదే సృష్టి పరిణామం. ఆ శక్తియే వర్ణాల (అక్షరాల) రూపంలో పరిణామం చెందితే వేదంగా భాషా, సాహిత్యంగా అవుతుంది. (పరా. పశ్యంతీ, మధ్యమా, వైఖరీ వాగ్రూపాలు) భావంగా, తలపులుగా, ఆలోచనలుగా పరిణామం చెందితే తెలివి, ఎఱుక, జ్ఞానం అవుతుంది. వికల్ప శూన్యమైన స్థితిలో కూడ ఎఱుక, తెలివి ఉండనే ఉంటాయి అని కదా అమ్మ అంటుంది. దీన్నే శ్రీ రమణ మహర్షి తన సంభాషణంలో “భావశూన్య సద్భావ సుస్థితి అని అంటున్నారు. దీని అర్థం: మనోగతమైన సర్వ ఇతర భావాలు (సంకల్ప, వికల్పాలు) శూన్యమైన స్థితితో భావ శూన్యత అవిరళమైన ఏక భావస్థితి ఏర్పడినపుడు, అనగా “సత్” భావస్థితిలో (సద్భావస్థితి) – ఆ సుస్థితిలో ఉన్న అనుభవజ్ఞానం. అమ్మ ఎప్పుడూ “సత్” భావన లేని అవస్థలో లేదు. (సత్, చిత్, ఆనందలోని “సత్ భావం) ఆ ‘ఏకైక’ ‘సత్’ భావ స్థితిలోనే తాను అమ్మగా వచ్చింది. మన మధ్య మెలిగింది. “సత్” యొక్క ఎఱుక తెలివి అమ్మకి ఎప్పుడూ ఉన్నాయి. అందుకనే ప్రతీది వాడే చేస్తున్నాడు – ఉన్నదంతా అదే – ఇదంతా అదే – ఏదో తెలియని శక్తి మనల్ని నడిపిస్తుంది – అంతా నిర్ణయంలోనే ఉంది. జన్మలు లేని కర్మలు లేవు – ఈ విధంగా అంటూండేది. అదే ధోరణిలోనే జగత్తు సత్యం, చెప్తూ, బ్రహ్మమే జగత్తయినాడంటుంది. ఈ భావాన్ని, అర్ధాన్ని తెలియచేస్తాయి రెండు లలితా సహస్రనామాలు. అవి 1) మూలవిగ్రహరూపిణీ (840) 2) వివిక్తస్థా (835). దీని వ్యాఖ్యానం ఈ విధంగా చెయ్యబడింది. వివిక్తస్థా : వివిక్తమంటే విజనం – జనులులేనిది. అంటే ఏకాంతం. ఇక్కడ జనులు అనగా సృష్టి – సర్వచేతనాచేతన భూతజాతమున్నూ. అనగా తాను విశ్వరూపిణి అయినా కూడ ఏకాంతిగానే ఉన్నది. జగత్తుగా పరిణమించి వృద్ధి చెందియున్నప్పటికీ విడిగా ఉంటున్నది. జగత్తుకి తానే నిమిత్తంగాను ఉపాదానంగాను ఉన్నప్పటికీ, నామరూపాత్మకమై, అనేకంగా ఉంటున్న జగత్తుకి విడిగానే ఉంటున్నది. బహురూప అయినా కూడా విభిన్నంకాని ఏకరూపంగానున్నది. ఇదే బ్రహ్మము యొక్క పంచవిధ స్వరూపం (అస్థి, భాతి, ప్రియం, రూపం, నామం). (అన్ని నేనులు నేనయిన నేను). ఉన్నదంతా ఏకైకమైన “సత్” (బ్రహ్మము). అదే నామ, రూప, గుణాత్మకమైన జగత్తుగా భాసిస్తున్నది. నిర్వకల్ప సమాధిలో జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం – ఈ మూడూ కూడ ఒకే ఒక బ్రహ్మముగా పరిణమించిన స్థితి అది. జ్ఞాత బ్రహ్మమే | జ్ఞానం బ్రహ్మమే | జ్ఞేయం కూడా బ్రహ్మమే బ్రహ్మమే తప్ప వేరేమియు లేదు. ఆ జ్ఞాతయే జ్ఞానంగా, ఆనందంగా స్వస్వరూప జ్ఞాన ప్రకాశకస్వాత్మానందముగ, శాశ్వతుడై, నిత్యుడై, సర్వవ్యాపకుడై, సర్వశక్తియుక్తుడై ఉంటున్నాడు. ఇక “మూల విగ్రహరూపిణీ” నామం. దీని వ్యాఖ్యానం ఈ విధంగా చేయబడినది.
బహు రూపములుగ ప్రభవింప వలెనన్న సంకల్పము కలిగినపుడు ప్రప్రథమంగా ఆవిర్భవించిన ఇచ్ఛాశక్తియే మూలవిగ్రహము. అది అవ్యక్తం. కేవలమైన సత్వగుణయుతము. ప్రకాశ (బ్రహ్మ) విమర్శముతో అది విమర్శము. అవ్యక్తము, ప్రథమ విగ్రహము. పరమేశ్వరి తద్రూపిణి.
ఈ ప్రపంచమంతా అనంతమైన బ్రహ్మకళాత్మకము (కలాత్మకం). కల(ళ) అనగా అంశము అని అర్థం. పరబ్రహ్మము జ్ఞానయుతుడు లేదా ప్రకాశయుతుడు (చిత్) శక్తి యుతుడు, ఆనందయుతుడుగా చెప్పబడిన కారణంగా బ్రహ్మకలలు అనేకవిధములయినవి. అవి జ్ఞాన ప్రకాశకళలు, ఆనందకళలు, శక్తికళలు. బ్రహ్మము పూర్ణ (అనంత, సమిష్టి) కళాస్వరూపం. ఈ ప్రపంచం ఈ నానావిధ కళల యొక్క అంశలతో ఆవిర్భవించింది. (పురుషసూక్తంలోని ఏకపాదం: భగవద్గీతలో చెప్పిన ఏకాంశం). కళ అనగా సామర్థ్యమూ, రసానుభూతి అని కూడా తెలియవలెను. (వేదం: రసోవైసః) బ్రహ్మము రసస్వరూపుడు. రసములనేకములు కదా! అందరికీ తెలిసినవే నవరసాలు (శృంగారం, భయం, భీభత్సం, రౌద్రం, హాస్యం, వీరం వగైరా). ఇంకా, ఆనందరసం, అనుగ్రహరసం, భక్తిరసం ప్రేమ రసం. ఇవన్నీ అనుభూతులే కాని అనిర్వచనీయాలు. అనుభవించి తెలియదగినవేకాని పూర్తిగా ప్రకటన రూపంగా తెలియబడేవికావు. ఒక మంచి దృశ్యం చూస్తే కల్గి ఆనందానుభూతి కేవలం అనుభూతి వేద్యమే ఒక మధురమైన సంగీతం వింటే కలిగే అనుభూతి అటువంటిదే । ఒక మంచి భావం కల్గితే వచ్చే అనుభూతి అట్లాంటిదే ।
– (సశేషం)