(మాతృశ్రీ సూక్తులు అడగకుండానే పెట్టేదే అమ్మ)
ఈ సూక్తిని లౌకికార్థంలోగాని, సామాన్య వ్యవహారిక భాషాపరంగా గాని చూడరాదు. అమ్మ పూర్ణ జ్ఞాని. పూర్ణజ్ఞాని యొక్క తత్వం, కర్మవిధానం విచిత్రంగాను, గుప్తంగాను ఉంటాయి. జ్ఞాని యొక్క తత్వం నిరవధికమైన ప్రేమ. అవధులులేని ప్రేమే దైవత్వం అంది. సర్వత్రా నిండియున్నది. తన అనురాగాన్ని కూడా సర్వత్రా వ్యాప్తి చేస్తుంది. కారణం సర్వం తనలోనిదే, తాను సర్వంలోనున్నదే, సర్వం తానుగా నున్నదేకాబట్టి. అందుకనే “మీరు నన్ను పిలవాల్సిన పని లేదు. మీ బాధే నన్ను రప్పిస్తుంద”ంటుంది. ఇదే అడగకపోయినా పెట్టే మాతృత్వం. అయత్నంగా, అసంకల్పితంగా మనకి జన్మ వచ్చింది. జీవనం, నడక ఏర్పడ్డాయి. మన ప్రయత్నం లేకుండానే మన శరీరధర్మాలు చాలా భాగం పనిచేస్తాయి. గుండె కొట్టుకోవటం, ఉఛ్వాస నిశ్వాసాలు జరుగుతుండడం, తిన్న ఆహారం జీర్ణమై శక్తినివ్వడం, అవస్థలు మారడం, నిద్రరావడం, పోవడం – ఇదంతా మన యత్నంగాని, సంకల్పంగాని, మన శక్తి వినియోగంగాని లేకుండానే ఏదో ఒక జీవశక్తి, జీవధర్మం, ప్రాణశక్తి, ద్వారా జరుగుతున్నాయి. ఇదంతా అడగక యిచ్చే ప్రేమ, అనుగ్రహమే కదా. చతుర్విధ పురుషార్దాలు (ధర్మ, అర్ధ, కామ, మోక్ష) సాధించడానికి కావలసిన దేహం మనకి వచ్చింది – ఇవ్వబడింది. మనం కోరుకొని, ఎన్నుకొని తెచ్చుకొన్నది కాదు. ఇంత అనుభవం మనకి నిత్యం జరగుచున్నా “మనది”, “నాది”, “నేను” అన్న భావాలు ఎక్కడనుంచి వచ్చాయి? అదే భ్రాంతి. అదే పై నుంచి తెచ్చుకొన్న ఆభాసభావం. అదే మాయ. లలితా సహస్రం శరీరంలోని అంగదేవతల గురించి, వారి రూప శక్తుల గురించి, అవి శరీరాన్ని ఎట్లా కాపాడి పోషిస్తున్నవి, శుక్లశోణితాల కలయిక దగ్గర్నుంచి పిండోత్పత్తి, పిండవృద్ధి పరిణామం- ఇవన్నీ అమ్మయొక్క పరివార దేవతల ద్వారా జరుగుతోంది కదా! డాకిని, రాకిని, శాకిని, యాకీని మొదలగు సప్త యోగినుల నామ, రూప, క్రియా వర్ణనలు లలితా సహస్రంలో చూస్తున్నాం కదా! మరి యిదంతా అడిగి చేయించుకోవడమా? లేక, అడగకుండా ప్రసాదించ బడుతోందా? అందుకనే అమ్మ అంటుంది అనుగ్రహం మొదట్లోనే ఉంది. ఈ భూమి మీదకి నీ శరీరం ఎందుకు వచ్చిందో, దానికి కారణ శక్తియూ, అదే నీవు వచ్చినపని అంతా చూసుకొంటుందంటుంది. ఒకే ఒక శక్తి యిదంతా నడుపుతోంది. ఆ శక్తి అదృశ్యం. కన్పడదు. కాని ఫలం మనం అనుభవిస్తున్నాం. నడిపించే ప్రేరణ కన్పడదు. నడక నడుస్తున్నాం. ప్రేరణ కన్పడదు కాబట్టి మనకు మనమే నడుస్తున్నామని అనుకొంటామంటుంది అమ్మ. ఇదే అసలైన మాతృత్వం, మాతృప్రేమ, అనుగ్రహము. మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఈ శరీరంలో సృష్టి, స్థితి, లయం అనుగ్రహం జరగుతూనే ఉన్నాయి. పంచకృత్యాలు బయటా లోపల, అంతటా, అన్ని వేళలా జరుగుతూనే ఉన్నవి. అందుకనే అంతా చైతన్యమే, జడమే లేదు అంటుంది అమ్మ. మీరు నన్ను కాదు నేనే మిమ్మల్ని పట్టుకొన్నాను అన్నది. మనకి భగవంతుడి “టచ్” ఎపుడూ ఉన్నది. మనకే ఆయనతో “టచ్” లేకపోవచ్చు – మన భ్రాంతిలో.
ఇక రమణ మహర్షి ఏమి చెప్తారో చూద్దాం…. మహర్షి దగ్గఱకి వచ్చిన భక్తులు కొందరు మహర్షితో “మీరు జ్ఞానులు కదా! మరి మీలాంటివారు ఏమి చెయ్యక యిట్లా కూర్చుంటే ఎట్లా? లోకం అశాంతితో అల్లకల్లోలం అయిపోతుంటే అంటారు. దానికి మహర్షి చెప్పిన సమాధానానికి అమ్మ చెప్పే దాని చాల సామ్యం ఉంది. బాహ్యానికి జ్ఞాని ఏమీ చెయ్యనట్లు కన్పడినా, ఆయన ఉనికి, శక్తి తెలియకుండా ఎన్నో పనులు చేస్తూనే ఉంది. కాని అదంతా తామే చేస్తున్నామని అహం ప్రకటించుకోడు జ్ఞాని. జ్ఞాని హృదయం (ఆత్మస్థానం)లో కల్పవృక్షం, కామధేనువు అష్టసిద్దులుంటాయి. అవి జ్ఞాని యొక్క సంకల్పం లేకుండానే వాటి పని అవి చేస్తుంటాయి. భక్తుని ఆర్తి, అర్ధి యొక్క విజ్ఞాపన వాటికి సోకగానే వాటి పని అవి automatic గా చేస్తాయి. దీన్నే వారు Automatic Divine Action అన్నారు. తాను చేస్తున్నాని మాత్రం అనడు. దివ్య దర్శనాలు యివ్వడం కూడా అంతే. ఈ action అంతా అవతలవారి అర్హతనుబట్టి, అవుసరాన్ని బట్టి, ప్రాప్తాన్ని బట్టి జరుగుతుంది. ఎవరి కొలత వారికేర్పడు తుంటుంది. దాని ప్రకారమే కొలిచి యివ్వబడుతుంది.. (మాత, మానం, మేయం ఇదే శ్రీమాత లలితా నామం). అందుచేతనే మీరు కోరాల్సిన పని లేదు, అడగకుండానే యివ్వబడుతుందంటుంది. జ్ఞానికి స్వఇచ్ఛాప్రారబ్ధం లేకున్నా, అనిచ్ఛా ప్రారబ్ధం, పరేచ్ఛా ప్రారబ్ధం ఉంటాయి. అవతారపురుషులకీ అంతే. ఈ రకమైన ప్రారబ్ధ వశంగానే జ్ఞానికి జన్మ, శరీరం వచ్చాయి. ఆ ప్రారబ్ధ అనుసారం వారిపనులు చెయ్యాల్సి ఉంటే అవి చేస్తుంటారు. కాని వారి కేవీ అంటవు. వారి అనుగ్రహం కూడా అట్లాగే పని చేస్తుంటుంది. కాని వారు తాము చేస్తున్నామని చెప్పక, ఏదో ఒక శక్తి అంతా చేస్తోందంటారు. కారణం, వారు తాము వేరు, ఈశ్వరుడు, ఈశ్వరశక్తి వేరు అని అనుకోరు. అందుచేత అంతా వాడే చేస్తున్నాడంటారు. ప్రకృతిని వశం చేసుకొని, మార్పుచేసినా, చెయ్యకపోయినా (ఉదా. వర్షం కురిపించడం, కురిసేదాన్ని ఆపడం) అంతా వాడే అంటారు. కాని తాము చేస్తున్నామని చెప్పరు. కారణం ప్రకృతి కూడా తామే కదా! వారు కాక అన్యంకాదు. అట్లాగే లోకంలోని సుఖశాంతులు కూడా వాడి అధీనమే అంటారు. జ్ఞాని వలన శిష్యులు, భక్తులు, ఉదాసీనులు, పాపాత్ములు కూడా లాభం పొందుతూనే ఉన్నారంటారు. శిష్యుడు పరమపదం సాధిస్తాడు. భక్తులు పావనులౌతారు. ఉదాసీనులు క్రమ పరిణామంలో భక్తులౌతారు. పాపాత్ములు పాపవిముక్తులౌతారు. అందుకే అమ్మ కూడా ‘అందరికి సుగతే’ అంటుంది. జ్ఞాని ఏమి చెయ్యనట్లున్నా అంతా చేస్తునే ఉన్నాడు. అంతా చేస్తున్నా ఏమి చెయ్యనట్లుగానే ఉంటాడు. అసలు చేతలు ప్రధానంకాని మాటలతో ప్రకటనలతో పని ఏముందంటుంది అమ్మ. వారు చేసి, అనుభవం యిచ్చి, లేక పరివర్తన తీస్కుని వచ్చి, లేదా బాధా విముక్తుల్ని చేసో, లేదా కామపూరణ చేసో విశ్వాసం, భక్తి పెంచుతారుకాని మహత్మ్యాలు ప్రదర్శించరు. మహాశక్తికి మిరకల్స్తో పని లేదంది అమ్మ. దుష్టులపట్ల ఉపేక్ష, సత్కర్మలపట్ల ముదము, దీనుల యెడకరుణ, సదాచారుల పట్ల మైత్రి వారి సహజగుణాలు.