(“నాది తెలిసీ తెలియని స్థితి (తత్వం))”
(అమ్మ మాటల పట్ల వారికి కలిగిన అవగాహనను ప్రొఫెసర్ సి.ఆర్. ప్రసాదరావుగారు అందిస్తుండగా ఈ శీర్షికను ధారావాహికంగా ప్రచురిస్తున్నాము ఎడిటర్) –
“నాది తెలిసీ తెలియని స్థితి (తత్వం)” అంటుంది అమ్మ. ఇదొక చిక్కు సమస్య. దీన్ని అర్థం చేసుకోవడం, సమన్వయించడం అంత సులభంకాదనిపిస్తుంది. సర్వజ్ఞ అయిన అమ్మ తన తత్వం గురించి ఈ పజిల్ విసరిందేమిటనిపిస్తుందెవరికైనా. ఇది కేవలం మనల్ని విచారణపరుల్ని చెయ్యడానికేనా! లేదా, ఇంకా ఏదయినా విశేషమున్నదా అనిపించడం సహజం.
“నేను, నేనేది” ఉత్తమపురుష (తన్నుత్తమ; ఎదట మధ్యమ; ఎక్కడో ప్రధమ పురుష). ఎవరి కెవరు నేను, నేను అని సంబోధించుకోవడం ఉత్తమ పురుష, ఎదుట ఉన్నవారిని సంబోధిస్తే మధ్యమ పురుష. ఎక్కడో, పరోక్షమైనదాన్ని గురించి చెప్పడం ప్రధమ పురుష, అమ్మ తన్ను తానెపుడూ ఉత్తమ పురుషలోనే “నేను అమ్మని” అన్నింటికీ, అందరికీ అంటుంది కదా! ఇన్ని నామాలెందుకు నాయనా? అమ్మ అంటే సరిపోతుంది. అన్నది. తన మాతృత్వం ఎటువంటిదో కూడా చెప్పుకొంది. “నేను నేనయిన నేను” అని, “అన్ని నేనులు నేనయిన నేను” అని చెప్పుకొంది. శ్రీరమణమహర్షి అంటారు. “”ఉత్తమ పురుష తత్వమైన తన్ను తాను తెలియనంతవఱకు, నీవు, వాడు అనే మధ్యమ, ప్రధమ పురుషలుంటూనే ఉంటవి. (అంటే ద్వైతభావన, అనేకత్వ భావన) తన్ను తాను అంతర్విచారణ ద్వారా తెలిసి కొన్న ఉత్తమ పురుష తత్వజ్ఞానికి మధ్యమలు ప్రధమలు ఉండవంటారు”. (అద్వైత భావన; ఏకత్వ దృష్టి అభేదదృష్టి). జగత్తు, సృష్టిలోని వారయిన త్రిమూర్తులకి కూడా ఉత్తమ పురుష తత్వం (నేను అనేది) ఉన్నది. బ్రహ్మగారు ‘నేను సృష్టి కర్తను’ అనుకొంటారు. హరి ‘నేను సృష్టి భర్తను, పోషకుడ్ని’ అనుకొంటాడు. రుద్రుడు ‘నేను లయకారుడ’ను కొంటాడు. అందువలన సృష్టిలో ఉన్న సర్వజీవచైతన్యానికి అహం స్ఫురణ ఉండనే ఉంటుంది. మహర్షి అంటారు: చిదాకాశం (ఆత్మ) నుంచి అహంస్ఫురణ (చిత్తాకాశం) లేక మనోకాశం ఉద్భవిస్తుంది. ఇది సృష్టి ప్రారంభం ఇట్లాగు లేచివచ్చిన మనస్సు (మనోకాశం, లేదా చిత్తాకాశం, లేదా అహంస్ఫురణ, లేదా అంతఃకరణ చతుష్టయం) విజృంభించి భూతాకాశంగా మారుతుంది. మనస్సు యొక్క చిత్రం ఏమంటే, తనే ఒక నిర్మాణం, సృష్టి చేసి, ఆ సృష్టికి తాను ఎడమై, తనచే కావించబడిన సృష్టి, నిర్మాణం, వస్తువు, భూతాలను తనకు బాహ్య విషయంగా గ్రహిస్తూంటుంది (సాలిపురుగు సాలిగూడును తననుంచే నిర్మించి, ఆ గూడులో చిక్కుకొన్నట్లు). అట్లాగ భూతాకాశం వైపు చూస్తున్న మనస్సును మనోకాశం అని, అంతరంగా చిదాకాశం (ఆత్మ) వైపు తిరిగిన మనస్సుని “చిన్మయం” అని అంటారని మహర్షి చెప్తారు. అంటే సృష్టి, మాతృత్వం అంటే ఈ మనస్సు యొక్క తత్వమే. విషయవాసనలులేని చిత్తము (మనస్సు, చిత్తము బుద్ధి, అహంకారము – ఇవి అంతః కరణాలు. వాటి ప్రవృత్తిని బట్టి వేరు వేరు నామాలతో చెప్పడం జరుగు తుంది) చిన్మయం అవుతుంది. పంచకృత్య పరాయణిగా ఉన్నపుడు అమ్మ యొక్క తత్వం ద్వైతమే. (ఇది తెలియని స్థితి; మాతృదృష్టి) అపుడు అమ్మకి, “అమ్మ” “బిడ్డ” అనేవి రెండూ ఉన్నాయి. అదే అమ్మ తన్ను తాను కేవల పరమాత్మగా, పరాత్పరిగా భావించుకొన్నపుడు అమ్మ దృష్టి తత్వం “తెలిసినస్థితి” అంటే, అమ్మ దృష్టి ఎపుడూ ద్వైతా ద్వైతాల పరిణామస్థితి. ఇది మనకి అవగాహనకాని తత్వం. అదే అమ్మ చెప్పుకొన్న తెలిసీ, తెలియని స్థితి. తాను జగన్మాతగా, విశ్వజననిగా, విశ్వకారిణిగా, విశ్వయోనిగా తెలియుచున్నపుడు పరబ్రహ్మగాను, తన్ను తాను విశ్వమయిగా, విశ్వమే తానుగా, తనే విశ్వంగా అభేదస్థితిలో చూచుకొనేటపుడు పరాత్పర బ్రహ్మగాను ఉంటున్నది. అందుచేతనే అమ్మ రూపం పరిమితం (అంటే విశ్వరూపం కూడా పరిమితమే) శక్తి అనంతం, అపరిమితం, అమేయం, అవ్యయం, అక్షరం అంటుంది. బ్రహ్మపదార్ధం చైతన్యం అని, బ్రహ్మతత్వం అవాఙ్మనస గోచరమని చాటింది. తనది అవతారమూ, పూర్ణత్వము కూడా. తనుసాకారము, సగుణమే కాదు; తాను నిరాకారము, నిర్గుణమూ కూడా. అందుకనే అంటుంది అమ్మ, ‘నిర్ణయించిన వాడు కూడా నిర్ణయానికి బద్ధుడే – అగణితం, గణితం అయింద’ని తాను త్రిపుటి యేకాదు; త్రిపుటి రహితం కూడా. తాను ఓంకార త్రిపుటియే కాదు (అ+ఉ+ మ = బ్రహ్మ+విష్ణు+మహేశ్వర). తాను పరాత్పర త్రిపుటి కూడా (సత్+చిత్+ఆనంద). ఓంకారనాదం సర్వసృష్టి అయితే, తాను నాదాతీతము కూడా. అందుకే ప్రతి శబ్దంలోనూ ఓంకారం వినగల్గాలి అంది. కుక్క, పిల్లి అరుపుల్లో కూడా ఓంకారనాదం వినిపింప చేసింది.
అమ్మ ప్రయోగించే ద్వంద్వపదాలలో ఇదొకటి. ఇదీ గొప్ప “రిడిల్” (Riddle). మనల్ని కూర్చోబెట్టి ఆలోచింపచేస్తుంది. ఆశ్చర్యపరుస్తుంది. మనన శీలుణ్ణి చేస్తుంది. మననం చేసిన కొద్దీ అనేక భావాలు, అర్థాలు స్ఫురిస్తుంటాయి. ఈ రిడిల్స్, పజిల్సులో, అసలు అమ్మే ఒక గొప్ప “రిడిల్”, “పజిల్”. అమ్మ మాటల గురించి ఈ శీర్షిక ప్రారంభించి ఏదో వ్రాస్తున్నానే కాని నిజంగా నాకు అమ్మ అర్థం అయిందా అనేది ప్రశ్నార్థకమే. నేను అమ్మ మాటలను అమ్మ యొక్క మెంటల్ ఫ్రేములోంచే ఆలోచించి, మననం చేసుకొని వ్రాస్తున్నానా? అనే సందేహం నన్ను వెంటాడుతూనే ఉన్నది. అమ్మ మాటలు, సంభాషణల గురించి చదివిన కొద్దీ నాకీ సందేహం పదేపదే వెంటాడుతోంది. కాని సమగ్రంగా పునః, పునః అమ్మ సూక్తుల్ని పరిశీలించితే కొంత స్పష్టత, నిశ్చయత (Clarity and consistency) కన్పించక మానదు. దాన్ని ఆధారం చేసుకొని అమ్మ సిద్ధాంతాన్ని కొంతవఱకైనా నిర్మాణం గావించుకోవచ్చు.
ఆధ్యాత్మిక సాహిత్యంలో అమ్మ ఒక విప్లవాన్ని ప్రారంభించింది. అంతా “శాస్త్రం ప్రమాణం అంటే” అమ్మ నాకు శాస్త్రంతో పని, అవుసరం లేదు; ఆసక్తి లేదంటుంది. స్వానుభవమే ప్రధానమంది. అంతా పురుషకారం ఉందంటే, పురుషకారం లేనేలేదంది. భగవద్గీత పుట్టడం గిట్టడ మరలా పుట్టడం అనివార్యంగా, అపరిహార్యంగా – జరుగుతాయని అంటుంటె అసలు జన్మలేదంటుంది. జన్మలేనపుడు కర్మ ఎక్కడుందంటుంది? ఆది జన్మకి కారణం ఏదో జన్మ పరంపరకి అదే కారణమంటుంది. (ఇక్కడ మళ్ళీ జన్మ, జన్మపరంపర ఉన్నట్లే గోచరమవుతుంది) అంతా నిర్ణయంలోనిదే నంటుంది. శాస్త్రం చెప్పిన పద్ధతిలోనే మోక్షాన్ని చెప్పదు. ముక్తి, తృప్తి రెండూ ఒకటే అంది. సృష్టి కర్తలేడంటుంది. సృష్టియే కర్త అంటుంది. పన్నాలవారు, శ్రీపాదవారు, వీరమాచనేనివారు, కొండప్పగారు – ఇతర సోదరులు అమ్మతో గావించిన సంభాషణలు. చూస్తే అమ్మని ఏ సిద్ధాంతాల మూసలో బిగించుకోవాలో తెలియని పరిస్థితి. అద్వైతసిద్ధాంతం, ద్వైతమూ, బైబిలు, ఖురాన్ అన్నీ నాకు సరిపోతాయంది. దేన్నీ ఎక్కువ చేయడంగాని, తక్కువ చేయడంగాని లేదంది. అసలు “సిద్ధాంత”మంటే ఏమిటని అడిగి, సిద్ధాంతాలు వస్తుంటాయి, మారుతుంటాయి, పోతుంటాయి అని చెప్తూ తన “సూక్ష్మపరిణామ సిద్ధాంతాన్నే” సిద్ధాంతాలకి కూడా వర్తింప జేస్తుంది. ఎవరు చెప్పితే సిద్ధాంతమవుతుందంటుంది. కొంత మంది చెప్పింది అందరికీ సిద్ధాంతం అవుతుందా? అని అంది. ఎవరి అనుభవాన్ని బట్టి వారు ఎవరి కొలబద్దను బట్టివారు, ఎవరికి కావలసినది వారు చెప్తారంటుంది. తాను చెప్పింది శాస్త్రంలో లేకపోవచ్చు; ఉండవచ్చు; లేదా, శాస్త్రాతీతం కావచ్చు; లేదా అదే మరొక శాస్త్రం కావచ్చంటుంది. అమ్మ చెప్పినదాన్ని అర్థం చేసుకోవడాన్కి చాల పక్వత ఉండాలంటారు. ఉమామహేశ్వర . “నీ భాషకందని భాష’ అన్నారు మరొకరు. ఒక సోదరుడు “సహజాద్వైతం” అంటే సహజమే అద్వైతమని వారి మాటలనే మార్చి అర్థం, భావం మార్చి చెప్పింది. అమ్మతో సంభాషణలు : పే. 414). సర్వదేవ నమస్కారం అంటే సర్వం దేవతయిన వానికి నమస్కారమంది విడివిడి దేవతలకు పెట్టే నమస్కారం కాదు. నా దృష్టిలో మీరంతా నా దేవతలే అంది. నా పూజ అంతా మీకే అంది. ఇదంతా భావాద్వైతమా? క్రియాద్వైతమా? లేక ప్రకృతి ఆరాధనా? నిర్గుణోపసనయా? నాస్తికమా? చార్వాకమా? అద్వైతమనుకుంటే, అందుగల మాయావాదాన్ని, మిధ్యావాదాన్ని తిరస్కరించినట్లు తోస్తుంది. అట్లాగే అద్వైతంలో జీవుడు (వ్యష్ఠి) జన్మలు లేవు. కన్పడని దేవుడి కొఱకుగాక, కన్పడే ఈ జగత్తునే దైవమనుకొని జీవించమంటుంది. ఇదంటుంది. అంతా ఒకే శక్తి. ఆ ఉన్నదే ఇదంతా అయిందంటుంది. ఒకటి రెండు అయింది కాబట్టి, రెండుగానున్నది. కాబట్టి భ్రాంతి కల్గుతోందంటుంది. తరుణం వస్తేనేకాని ఏదీ తెలియదు. జరగదంటుంది. ఇట్లా నడుస్తుంది అమ్మతత్వం, బోధ. (అమ్మతో సంభాషణలు : పే. 438-39)
ఈ నేపధ్యంలో చూస్తే అమ్మ “నాది తెలిసీ తెలియని స్థితి” అంటే భావం ఏమిటి అనేది ప్రశ్న. నాకు కొన్ని సమాధానాలు స్ఫురించాయిః
- అనుభవం ద్వారా తెలిసి, శాస్త్రపరిచయం లేదు; ప్రమాణం నిరాకరించడం కారణంగా తెలియని స్థితి. తన స్వానుభవంలో ఏదో తెలిసింది. అది శాస్త్రంలో ఉందోలేదో తెలియదు. ఎవరైనా శాస్త్ర రీత్యా అమ్మని ప్రశ్నిస్తే వారిని అడగనిచ్చింది. వారి ద్వారా శాస్త్ర పరిచయం కొంత చేసుకుంటుంది. వారినే తిరిగి ప్రశ్నిస్తుంది. వారి మాటలతోనే వారికి తగిన సమాధానం యిస్తుంది. అడిగిన ప్రశ్నలోనే వారికి సమాధానం ఉందంటుంది. అడిగిందాన్ని బట్టి సమాధానం. దానంతట అదే తనకి తోస్తుందంటుంది. ఏదీ ముందుగా తెలిసి చెప్పడం కాదంటుంది. అందుకనే అమ్మది. తెలిసీ తెలియని స్థితి. అంటే ముందుగా తెలియకపోయినా, తర్వాత వారి ప్రశ్నల ద్వారా తన గురించి తాను తెలుసుకొంటున్నస్థితి. దీన్నే, స్వబోధ, సమాధానం కాదంటుంది. (అమ్మతో సంభాషణలు, పే. 452-53) అమ్మ వాళ్లకిచ్చే సమాధానం వారికి సమాధానంకాదు. తద్వారా తనకి “స్వబోధ” అంది. తద్వారా తన స్థితి తాను తెలుసుకొంటున్నానంటుంది.
- అమ్మ నాకు “మరుగే కాని, మరుపు లేదంది”. వివరణః – అమ్మకి శాస్త్ర పరిజ్ఞానము పూర్వజ్ఞానమే. సర్వజ్ఞత్వం కలవారికి శాస్త్రం అక్కర్లేదు. అందుచేత శాస్త్రం విషయాలు తనకి మరుపులేదు. కావాలంటే ఏదైనా చెప్పగలదు. చెప్పిన సందర్భాలున్నాయి. మరుపన్నది లేదు. సమాధ్యవస్థలో ఎక్కడెక్కడి వారితో, ఎన్నెన్నో భాషలలో మాట్లాడినట్లు తెలుస్తోంది. తనకి తెలియని అన్ని భాషలలో ఎట్లా. మాట్లాడగల్గింది? 50 ఏళ్ళు బాహ్యము, దేహము, నిద్ర, ఆహారాదులు లేక తదేక తపస్సులో ఉండిపోయి, తనువు చాలించిన బాలయోగి గురించి శ్రీపాదవారడిగితే “అన్వేషణ”లో ఉన్నాడని జవాబిచ్చింది. అది సర్వమూ తెలిసిన వారే చెప్పగలిగే సమాధానం మాత్రమే! ఇట్లాగ అన్నీ తెలిసినా అమ్మ తన సర్వజ్ఞత్వం మరుగు పరుచుకొని మామూలు తల్లిగా ప్రవర్తించింది. పెళ్ళి చేసుకుంది. బిడ్డల్ని కన్నది. బాధలు పడింది. హైమకు 25 ఏళ్ళు వచ్చేదాక పెళ్ళి ఆపుచేసి, ఆజన్మ బ్రహ్మచారిణిగా ఉంచి చివరికి దైవత్వం యిచ్చింది. ఆరాధ్యదైవంగా, బింబ ప్రతిబింబ న్యాయంగా ప్రతిష్ఠించింది. అందుచేత అమ్మకి మరుగే కాని, మరుపులేదు. అది తెలిసీ తెలియనట్లు అగుపించిన స్థితి. హైమ విషయం అమ్మకి అంతా ముందు నుంచి తెలుసు. అయినా ఏమి తెలియనట్లుగానే ప్రవర్తించింది. (హైమ – అమ్మల సంభాషణ చూడండి).
- “అం” (అమ్మ) అంటే అర్థం యిట్లా చెప్పింది: “అం” = అంతా అయినది; “అం’తు, ఆది లేనిది; “అంతు చిక్కనిది (అర్థంకానిది, అనిర్వచనీయం, అచింత్యం)
“ఆ” = అన్నిటికీ ఆధారమైనది; తాను ఆధార రహితమైనది (నిరాధారా), ‘ఆట’ అయినది. (సృష్టి కార్యం – సృష్టికారణమైన మూల ప్రకృతి, మూలకారణం – సృష్టి. స్థితి మొదలైన పంచకృత్యాలు). “ఆటంకములు లేనిది (ఘటనా ఘటన సమర్ధత) సర్వవ్యాపకత్వము: సర్వకామపూర్ణత, సిద్ధ సంకల్పం) ఈ నిర్వచనాల ప్రకారం “అమ్మ” శబల బ్రహ్మమూ “నిర్విశేష అధిష్ఠానశుద్ధ నిర్గుణ బ్రహ్మమూ” కూడా అయింది. (ఒకటి రెండయి, రెండుగా ఉన్నది) ఆమే జగత్తూ, బ్రహ్మమూ కూడా. కాని బ్రహ్మస్ఫురణ మరుగున ఉంచి, (దేవులాడినా దొరకని వాడు) “మాత” భావమునే ప్రకటించుకొన్న తత్వం అది. అందువల్ల తెలిసీ తెలియని స్థితినాదంది. “తల్లి” అంటె “తొలి” అంది. నేను “ఆదెమ్మ” నంది. అధిష్ఠాన శుద్ధబ్రహ్మమునకు విక్షేపమాయాశక్తి, “ఆవరణ” మాయాశక్తి, త్రివిధగుణ రూపాత్మకమైన “మాయ” ఉపాధియై, అదే శబల బ్రహ్మంగా సృష్టి కారణమున్నది. అందువలన అధిష్ఠాన బ్రహ్మమూ, మాయాయుక్త, మాయాశక్తి రూపక శబలబ్రహ్మము, రెండూ కూడా సత్యములే – బ్రహ్మచైతన్యములే. మరుగుపరుచు కొనినందున బ్రహ్మమిథ్య అంది. జగత్తుని ప్రకటింపచేసినందున ఆధిపత్యం అంది. అవతరణం అంటే సృష్టియే అంది. ‘అజాయమానో బహుధా విజాయతే’. తాను పుట్టకయే అనేక విధములుగ కన్పడుట.
తర్వాత, తర్వాత, మననంలో నాకు స్ఫురించిన మరి కొన్ని అర్థాలు : నాకు తెలిసినా మీకు తెలియని స్థితి. (అర్థంకాని అమ్మ అచింత్యమైన అమ్మ).
- నాకు తెలిసినా మీకు తెలుపగల్గడమెట్లాగో నాకు తెలియనిస్థితి. (Incommunicability) of knowledge
- నాకు తెలిసినప్పటికీ, తెలిసినట్లు నాకే తెలియని స్థితి. (Lack of knowing – No self – awareness of knowledge)
- 4. నాకు తెలిసినా తెలియకుండా మరచిపోయిన స్థితి. (Strange forgetfulness) నాకు తెలిసినా కావాలని మరుగు చేసికొన్న స్థితి. (Willful Disguise; concealment) నటన; దాగుడు మూతాట,
- నాకు ఎంతో తెలిసినా ఏమీ తెలియదనే స్థితి. (Humility about Infinity of knowledge జ్ఞానమనంతం కాబట్టి ఎంత తెలుసుకున్నా తెలిసికొన్నది చాల కొంచెమేనని తెలిసిన స్థితి. (అల్పజ్ఞత్వం) 6. ఎంత తెలిపినా, తెలిసిందంతా ఏమిటో తెలియని స్థితి. (సందేహాత్మక జ్ఞానము) లేదా, జ్ఞానమే అజ్ఞానమైన స్థితి. (All knowledge possibly is Ignorance)
- అజ్ఞానమే జ్ఞానముగా పరిగణింపబడుతున్న స్థితి (భ్రాంతి) తెలిసిందంతా భ్రాంతియేనని తెలిపినా, భ్రాంతిని పోగొట్టుకోలేని స్థితి. (భ్రాంతి భ్రాంతివల్లే పోతుంది. భ్రాంతుల సుడిగుండం, గొలుసు)
- తెలిసినదానికి ప్రమాణములు లేని, తెలియని స్థితి. ఏకొలతవల్ల గాని,
ప్రమాణముల వల్లగాని నిశ్చయింపగలిగినది కాదు అని తెలిపిన స్థితి. 9. తెలిసి తెలిసిందో తెలియని స్థితి.
- తెలిసిందెందుకు తెలిసిందో తెలియని స్థితి.
- తెలిసింది. దేశకాలాతీతమగునో కాదో తెలియని స్థితి (సర్వకాల, సర్వదేశ, సర్వఅవస్థలలో తెలియదగినదా? కాదా?)