అమ్మ మాట వెలుగుబాట. అమ్మ అన్నం – అమృతం సమానార్థకాలు. అవి సంపూర్ణత్వానికి, వికాసానికి ప్రతీకలు. మనసులో అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ స్మృతి మధురం. అంటే తుష్టిని పుష్టిని కల్గించి ధైర్యాన్నిచ్చి జీవితంలోని ఒడుదుడుకులకు కుంగు పొంగులు లేకుండా చేస్తుంది.
“మానవుని నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు; రాగద్వేషాలనే రెండే గ్రహాల మీద. ఆ రెండింటికీ ఆధారం నేను” – అమ్మ.
మనకు అతీతమైన శక్తివల్ల జీవితం నడుస్తుంది. ఆ శక్తిని దైవం, ప్రకృతి అంటున్నాం. దాని ప్రభావం వల్ల అనుకూలంగా, ప్రతికూలంగా సంఘటనలు జరుగుతాయి. సుఖం-దుఃఖం, మానం-అవమానం, జయం-అపజయం వీటిలో కొంత భాగం ఇష్టం, కొంత అనిష్టం. అదే రాగద్వేషాలు నవగ్రహాలు సమయాల్ని బట్టి మనకు కొంత అనుకూలం, కొంత ప్రతికూలం కదా!
అయితే, ఈ రాగద్వేషాలు ఎవరికి? నాకు. అంటే నేను. ‘నేను’ అనే భావన లేకపోతే ద్వంద్వాలు లేవు. “భవో యం భావనామాత్రం” భవబంధాలు అంటాం.
“విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతమ్
పశ్యన్నాత్మని మాయయా బహిరివో ద్భూతం యథానిద్రయా”
దక్షిణామూర్తి స్తోత్రం. ‘నేను’ ఆధారంగా మాయవల్ల (మారే స్వభావం కల శక్తి) అద్దంలో మన ప్రతిబింబం కనిపించినట్లుగా నిద్రనుండి మేల్కొనట్లుగా ప్రపంచం మనకు సుఖదుఃఖ అనుభవాల్ని కలిగిస్తోంది. ఈ స్థితికి మూలం “నేనే” కదా!
సూటిగా, తేటగా, తియ్యగా సందేశాన్ని అందించడం అమ్మ ప్రత్యేకత.