(గత సంచిక తరువాయి)
ఒకసారి విజయనగరం నుంచి రోటరీక్లబ్ వారు అమ్మ దగ్గరకు వచ్చి మాకు ఏదైనా సందేశం ఇవ్వమ్మా అని అడిగారు. వాళ్ళకు సమాధానంగా అమ్మ “చేయవలసింది చాలా ఉన్నది నాన్నా! అనాథలై అనేకులు ఉన్నారు. వికలాంగులైన వాళ్ళు ఆధారమేమీలేని వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు. వారందరినీ ప్రేమగా చూడండి. తాము తమ కాళ్ళ మీద నిలబడలేని వారికే కదా కర్ర ఆసరా. వారికి తోడ్పడండి. అయితే అది వారిపై జాలితో చేసే సహాయం అని అనుకోక వారిని భగవత్స్వరూపులుగా భావించి వారికి సేవ చేయండి. ఆ సేవలో కలిగే తృప్తే ముక్తి” అని వివరించింది. మరొక సందర్భంలో “కాలంతో పాటు మనమూ మారాలి. పూర్వం ఒక మనిషి రూపమో, నామమో, భావమో, ఆధారం చేసుకొని తరించేవారు. ఎప్పుడూ విధానం ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు. అది వ్యక్తిగతమైన సాధన. కానీ అంతకంటె సులభమైన మార్గం ఉన్నది. అది పది మంది కోసం పదిమందితో కలిసి పని చేయడం, మమకారాన్ని చంపుకోవడం గాక పెంచుకోవడం, పరిమితమైన ప్రేమను విస్తృతం చేసుకోవడం నేటి మానవ ధర్మం ఇదే అనుకుంటున్నాను. ఇది మానవుడు మాధవుడుగా మారడానికి మంచి దారి” అని సందేశం ఇచ్చింది. అమ్మ చెప్పిన శిలాశాసనం లాంటి సందేశం ‘నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అమ్మ జీవితమంతా పరచుకొని ఉన్నది. అమ్మ దృష్టిలో నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టడం అనేది ఒక్క భోజన విషయం లోనే కాదు’ అన్ని విషయాలలో సాటివారిని ఆదుకోవాలన్నదే అమ్మ ఉద్దేశం. మనిషిలో దినదినాభివృద్ధి చెందుతున్న స్వార్థాన్ని తుడిచి వేసి త్యాగభావాన్ని మానవతా విలువలను పెంపొందింప చేయడానికే అమ్మ చేస్తున్న ప్రయత్నం అని అమ్మ ప్రబోధాల వలన సువిదితమవుతుంది.
నేటి సమాజంలో ఆకలి తీరడంతో పాటు అత్యంత ఆవశ్యకమైనది విద్య. ఎంతో మంది చదువుకోవాలని ఉన్నా, అవకాశం లేక ఉన్నత స్థితిని పొందలేకపోతున్నారు. నిరుపేద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించాలనీ,కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా ఆసక్తే అర్హతగా అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలనే మహదాశయంతో అమ్మ 1971 ఆగస్టు 6వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలను నెలకొల్పింది. ఈ ఆశయానికి అనుగుణంగానే ఈ కళాశాలలో నాటి నుండి నేటి వరకూ రాష్ట్రం నలుమూలలనుండి ఎందరో విద్యార్థినీ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరందరికీ కలిమి లేములతో కులమతాలతో సంబంధం లేకుండా భోజనం, విద్య ఉచితంగా అందిస్తున్నది అమ్మ ఏర్పాటు చేసిన శ్రీ విశ్వజననీపరిషత్ ట్రస్ట్. అమ్మ సూచన మేరకు కేవలం బ్రతుకు తెరువు కోసమే విద్యను పరిమితం చేయకుండా ఉన్నత విద్యతో పాటు విద్యార్థులలో సేవా దృక్పథం, సర్వమానవ సౌభ్రాత్రం, ఆధ్యాత్మిక ధార్మిక చింతన పెంపొందే విధంగా పవిత్రమైన ఆశయాలతో ఈ కళాశాల పని చేస్తోంది.
మానవుని కనీస అవసరాలు తిండి, బట్ట, వైద్యం, విద్య. అమ్మ అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణాలయం ఏర్పాటు చేసింది. మాతృయాగం పేరుతో వచ్చిన వారందరికీ భోజనంతో పాటు బట్టలు పెట్టింది. జిల్లెళ్ళమూడి వైద్య సౌకర్యం లేని చిన్న పల్లెటూరు కాబట్టి స్థానికుల కోసం, యాత్రికుల కోసం, గ్రామస్థుల కోసం ఉచిత వైద్య సౌకర్యంతో 1978 లో మాతృశ్రీ మెడికల్ సెంటర్ ను ప్రారంభించి ఒక మోడల్ సొసైటీ ని ఏర్పాటు చేసింది. ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో సామాజిక సేవా కార్యక్రమాలకు ఇంత ప్రాధాన్యం ఇచ్చి అందులో తాను పాల్గొని ఇతరులకు, ప్రబోధాన్ని ఉత్తేజాన్ని అందించడం అమ్మలోని మానవతావాదానికి తార్కాణం.
మానవతా లక్షణాలన్నీ మాతృతత్వంలో అంతర్భాగంగా ఉంటాయి. సాటి మనిషిని ఒక మనిషిగా భావించి ఆదరించడం మానవత్వం. సాటి మనిషిని బిడ్డగా భావించి ప్రేమించడం మాతృతత్వం. అందరికీ ఆ భావన అలవరచాలని అమ్మ ఆలోచన. ఆ దృక్పథంలో నుంచి వచ్చిన వాక్యమే “నీ బిడ్డ యందు దేనిని చూస్తున్నావో, అందరి యందు దానిని చూడడమే బ్రహ్మ స్థితిని పొందడం”.
“ఆత్మవత్సర్వభూతాని” అన్నట్లుగా లోకాన్ని తన వలె చూడడం గాక లోకాన్ని బిడ్డగా ప్రేమించడం అనే ఒక క్రొత్త విధానానికి శ్రీకారం చుట్టింది అమ్మ. సర్వ జీవులను బిడ్డగా చూడమనీ, మన బిడ్డలను ఎలా ప్రేమిస్తామో అందరినీ అలాగే ప్రేమించమని అమ్మ సందేశం. ప్రతి వ్యక్తిని బిడ్డగా భావిస్తే వాడి బాగునే కోరడం జరుగుతుంది. ఏ విభేదాలు లేని ఆదర్శ సమాజం ఏర్పడుతుంది. ఈ విధంగా అమ్మలో శతపత్రమై విరిసి ప్రేమ పరిమళాలు వెదజల్లే మానవత్వం అందరికీ ఆదర్శమైంది. ఒక సామాన్య వ్యక్తిగా జీవితం కొనసాగిస్తూనే తన విశ్వజనీన మాతృత్వంతో అవ్యాజవాత్సల్యంతో మానవతా మణిదీపాన్ని ప్రతి హృదయం లోనూ వెలిగించాలన్నదే అమ్మ దృక్పథం.