1. Home
 2. Articles
 3. Mother of All
 4. అమ్మ వాక్యం ‘Sense తో కూడిన Science’

అమ్మ వాక్యం ‘Sense తో కూడిన Science’

A.Hyma
Magazine : Mother of All
Language : English
Volume Number : 12
Month : April
Issue Number : 2
Year : 2013

ముందుగా ‘Senseతో కూడిన Science’ అనే సమాసానికి కొంచెం వివరణ నివ్వాలి. ప్రయోగశాలల్లో పరిశోధనా పరంగా శాస్త్రజ్ఞులు సత్యాన్ని ఆవిష్కరించిన విధానాలు సామాన్యునికి ఒక్కొక్కసారి యాదృచ్ఛికం, అర్థరహితం అనిపిస్తాయి.

 1. X-rays
 2. Radio Activity
 3. Buoyancy
 4. Earth’s Gravitational Force
 5. Penicillin – మున్నగు వానిని కనుగొనటం. 

అంతే కాదు. ఒక్కొక్కసారి సామాన్యునికి అర్థవంతమైన భావనలు శాస్త్రజ్ఞులకి అర్థరహితం అనిపిస్తాయి.

 1. The sun rises in the East and sets in the West.
 2. The letters ‘N’ and ‘S’ on a magnet means its North pole and South pole respectively.
 3. ‘a, e, i, o, u’ – the five letters are vowels in English Language వంటివి.

అమ్మ వాక్యం ‘Senseతో కూడిన Science’ అని అంటే, అది శాస్త్రీయ దృక్పధం (Scientific attitude)ని కలిగి ఉంటుంది. మహర్షులు కూడా దీనినే సమర్థించారు –

‘పురాణ మిత్యేవ న సాధు సర్వం

న చాపి కావ్యం నవ మిత్యవద్యం | 

సనః పరీక్షాన్యతరత్భజంతే 

మూఢః పర ప్రత్యయనేయ బుద్ధిః ॥’ – అని.

(ఏనాటి నుంచో ఆచరిస్తున్నాం అని అనటం సరికాదు; ఉదా. బాల్య వివాహాలు, సతీసహగమనం. క్రొత్తగా చెపుతున్నారు; నిరసించాలి – అనే వైఖరీ సరికాదు. సత్పురుషులు వివేచన (Discrimination) తార్కికమైన ఆలోచన (Reasoning) కలిగి పరీక్షించిన తర్వాతే అంగీకరిస్తారు. మూర్ఖులు గ్రుడ్డిగా ఇతరులను అనుసరిస్తారు). ఉదా:

“తిధులు విధిని మార్చలేవు” అన్నది అమ్మ. అష్టమి నవమిలు కష్టదినాలు, ద్వాదశి దగ్ధ యోగం … అంటూ కొన్ని తిధుల్ని విసర్జిస్తాం. దుర్గాష్టమి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, మహర్నవమి, క్షీరాబ్ది ద్వాదశి, వినాయకచవితి, సుబ్రహ్మణ్య షష్టి… అన్నీ దేవుని కళ్యాణ తిధులే, ప్రతి తిధీ శుభతిధే అని గుర్తించమంటుంది. “అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు” అంటూ విధి – శిలాశాసనం అని ఎరుకపరుస్తుంది.

అమ్మ తార్కిక ఆలోచన, వివేచనలకు కొన్ని ఉదాహరణలు :

 1. దైవం పంపిన మనిషి దైవం ఇష్టప్రకారం దైవంలోకి పోతే మధ్యలో మనకి ఏడు పెందుకు?
 2. ధనం మూలం ఇదం జగత్ కాదు; ‘తను’ మూలం ఇదం జగత్.
 3. బాల వాక్యం బ్రహ్మ వాక్యం కాదు; భ్రాంతిలేని వాక్యం బ్రహ్మవాక్యం.
 4. అన్నం బ్రహ్మైతే అశుద్ధమూ,

ప్రజ్ఞానం బ్రహ్మైతే అజ్ఞానమూ, శబ్దం బ్రహ్మైతే, నిశబ్దం బ్రహ్మ ఎందుకు కాదు?

ఈ దృష్టితో అమ్మ సన్నిధిలో మరి కొన్ని సన్నివేశాల్ని వీక్షిద్దాం.

అది మే నెల; గ్రీష్మతాపం. సాయం సమయం. అమ్మ ఆరుబయట నాలుగు అడుగులు వేస్తోంది. “చాల ఉక్కపోతగా ఉంది. వర్షం వస్తుందేమో”. – అన్నది. ‘అదేమిటి? మనకి ఉక్కపోతగా ఉందని వర్షం వస్తుందా?’ అని అనుకుంటున్నాను. కొద్ది సేపటికి అమ్మ గదిలోపలికి వెళ్ళింది. మరి కొద్దిసేపటికి వర్షం రానే వచ్చింది. నేను Science graduateని. అయినా వాస్తవం ఆ క్షణంలో స్ఫురించలేదు. ఉక్కగా ఉన్నదీ అని అంటే వాతావరణం నీటి ఆవిరితో అతి సంతృప్తస్థితి (Super Saturated State) లో ఉంది. నీటి ఆవిరి శాతం అత్యధికంగా ఉంది. అది ఏక్షణంలోనైనా వర్షించ వచ్చు. అదే జరిగింది.

ఒకసారి ఒక సోదరునికి జ్వరం వచ్చింది. ఇంజక్షన్ చేయాలి. వేడినీళ్ళు కావాలన్నారు వైద్యులు. అది రాత్రి సమయం. నేటి Gas stove ల సదుపాయం అప్పట్లో లేదు. అమ్మ, “నీటిని ఏడుసార్లు కొద్ది ఎత్తులో తిరగబోస్తే చాలు. ఆ గుణం వస్తుంది. నీటిలో అగ్నితత్వం ఉన్నదిగా” అన్నది. నిజం. అణువుల చలనము, ఘర్షణ వలన వేడిమి వస్తుంది. చదువుకున్న వారంతా అయోమయ స్థితిలో ఉన్నారు. జ్ఞాన సర్వస్వం అయిన అమ్మకు తెలియని దేమున్నది?

‘మన వాళ్ళు సామాన్యంగా శిశువుకు ఆరో నెలలో ప్రాణం వస్తుందంటారు. అదేమిటమ్మా?’ అని అడిగితే అమ్మ, “అదేమీ కాదు. (సంయుక్త) బీజం (Zygote) ఏర్పడిన దగ్గర నుండి అది అనుక్షణం రక్తాన్ని గూడు కట్టుకుంటూనే ఉంటుంది. ప్రాణం ఎప్పుడో రావటమేముంది? బీజం (సంయుక్త బీజకణం)లో ప్రాణశక్తి లేకపోతే పెరుగుదల ఎక్కడి నుండి వస్తుంది?” అన్నది.

ఒక సందర్భంలో అమ్మ అన్నది; ‘శ్వాస ఆగినంత మాత్రాన ప్రాణం పోయినట్లు కాదు’ అని. ఆక్సిజన్ లేని సమయాల్లోనూ, జీవులలో, శ్వాసక్రియ జరుగుతుంది. దానిని అవాయు శ్వాసక్రియ (Anaerobic Respiration) అని

ఒక వైద్యుడు, ‘అమ్మా! దైవం ఎలా ఉంటాడు?’ అని అడిగితే అమ్మ, “నాన్నా! నువ్వు కలుషితమైన నీళ్ళు త్రాగావనుకో. శరీరం దానిని శుభ్రం చేసి మంచి నీటినే రక్తంలోకి పంపిస్తుంది. అలా శుభ్రం చేసే శక్తే దైవం” అన్నది.

‘మంగళ సూత్రరూపేణా భర్త భార్యతోనూ, యజ్ఞోపవీతరూనేణా భార్యభర్తతోనూ సదా ఉంటారు” అన్నది అమ్మ. సతీపతులకు వియోగం అనేది లేదు – అనేది అమ్మ దివ్య ప్రబోధం. బ్రహ్మచారికి యజ్ఞోపవీతం ఒక్కపోగు మాత్రమే ఉంటుంది. వివాహసమయంలో కన్యాదాత వరునికి రెండవ పోగును ఇస్తాడు. అదే సౌభాగ్యకర భార్య రూపం.

అమ్మ ప్రబోధించిన అర్థనారీశ్వర తత్వాన్ని తత్త్వతః ఎందరు ఆకళింపు చేసుకున్నారు? సభ్యసమాజానికి భావి తరాలవారికి అందజేశారు?

ఒక సంఘటనకి పూర్వాపరాలు, కార్యకారణ సంబంధం మొదలైన ప్రధానాంశాల్ని సున్నితంగా, సునిశితంగా పరిశీలించి విజ్ఞతతో అమ్మ అనేక సమస్యలకి అద్భుతమైన పరిష్కారాల్ని అనుగ్రహించింది.

ఒక సోదరుడు ‘దయ్యాలు ఉన్నాయా, అమ్మా?’ అని అడిగితే, “నాన్నా! కొన్ని రోగాలు ఉన్నాయి. డాక్టర్లకి తెలుసు; మందులు వేస్తే తగ్గుతాయి. కొన్ని రోగాలు ఉన్నాయి. డాక్టర్లకి తెలుసు; కానీ మందులు లేవు. కొన్ని రోగాలు ఉన్నాయి; అవి డాక్టర్లకీ అంతు పట్టవు. ఇది అలాంటి మానసిక వ్యాధి” – అని వైద్యాశాస్త్రాన్ని వస్త్రగాళితం చేసింది అమ్మ. ఒక అంధవిశ్వాసాన్ని మూఢ నమ్మకాన్ని కూకటి వ్రేళ్ళతో పెకలించి వేసింది. సత్యాన్ని ప్రేమించడమే. Scientific attitude.

మనోవిదళనము (Schizophrenia) అనే మానసిక రోగగ్రస్థుని నేను కళ్ళారా చూశాను. దిగ్భ్రాంతి చెందాను. నన్ను నేనే ‘ఎక్కడ ఉన్నాను?’ – అని ప్రశ్నించుకోవాల్సిన అయోమయ పరిస్థితి ఏర్పడింది. శారీరక అనారోగ్యం కంటె మానసిక అనారోగ్యం ప్రమాదకరమైనది.

ఒక కుర్రవాడు ఇల్లు విడిచి పారిపోయాడు. తిరిగి ఇంటికి వస్తాడో రాడో, సజీవంగా ఉన్నాడో లేడోనని వాడి తల్లిదండ్రుల మనస్సు అతలాకుతలమైంది. కన్నీటితో అమ్మపాదాలను అభిషేకించారు. గుండెలు అవిసేలా రోదించారు. వారి కన్నీటిని తుడుస్తూ, వారిని కొన్ని ప్రశ్నలు వేసి అమ్మ నిర్ధారించింది. “విచారించకండి, మీ పిల్లవాడు తప్పకుండా ఇంటికి తిరిగివస్తాడు” – అని. వాడు ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు రెండు జతల బట్టలు, జేబు నిండా సొమ్ము వెంట తీసికొనే వెళ్ళాడు. “ప్రాణాలు తీసుకునే వాడికి ఇవన్నీ ఎందుకు?” అని తర్కించింది అమ్మ. ఆశ్చర్యం. ఆ నాలుగు రూపాయలు ఖర్చు కాగానే నాలుగు రోజుల తర్వాత వాడు తిరిగి ఇంటికి రానే వచ్చాడు.

ఇంత వరకూ మన ప్రయాణ మార్గంలో Laboratory, Society, Philosophy వంటి అనేక చోట్ల మజిలీ చేశాం. ‘There is a Super Physical Power governing this Universe” అని అంటారు Albert Einstein; ఒక అలౌకిక శక్తి ఈ విశ్వాన్ని పరిపాలిస్తోంది అని. సాధారణంగా మనిషికి తెలిసింది. చాల తక్కువ. రకరకాల పరిమితులతో కూడిన మానవమేధస్సు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిలో అనూహ్యంగా ప్రస్ఫుట మౌతుంది. దీనిని Clever hunches అని అంటారు. అది ఒక Input Device మాదిరిగ భగవంతుడు ఇచ్చే అసాధారణ అరుదైన ప్రేరణ.

అమ్మ దృష్టిలో శాస్త్రం (Science) అంటే ఏమిటి?

“అనుభవమే శాస్త్రం.

ఎవరి అనుభవం వారికి శాస్త్రమే.

శాశ్వతంగా విలువ కలిగేది శాస్త్రం.

శాసించేది శాస్త్రం.

అట్లా నడుపుతున్నది నా దృష్టిలో సృష్టియే.

తతిమ్మా వన్నీ మార్పు చెందుతున్నాయి.” – అనేది; అమ్మ మాట ప్రత్యక్షర

సత్యం.

ఒకనాడు ‘Atom is invisible and indivisible’ అని వేనోళ్ళచాటారు. కాలక్రమంలో అది తప్పు అని నిరూపించారు.

Mendeleev’s Periodic Table (1869) కాలక్రమంలో Henry Moseley’s Periodic table (1887) గా మార్పు చెందింది. 

Rutherford atomic structure (1911) కాలక్రమంలో Niels Bohr atomic structure (1922) గా మార్పు చెందింది. పరిణతి చెందింది.

అమ్మ వాక్యాలు నిత్య సత్యాలు.

శాస్త్రజ్ఞులు ఆవిష్కరణలు ఒకనాడు సత్యం; మరొక నాటికి కావచ్చు, కాకపోవచ్చు.

జగన్మాత రూపాంతరమైన జగత్తే శాస్త్రమూ, శాస్త్రవేత్త.

శాస్త్రవేత్త ఊపిరి నిరంతర సత్యాన్వేషణ. తన గమ్యం చేరే వరకు, లక్ష్య సిద్ధి కలిగే వరకూ ప్రయోగశాలలో తపించి జీవితాన్ని ధారపోసి సృష్టిలో అంతర్లీనంగా విరాజిల్లే సార్వకాలీన సత్యాల్ని దర్శించే ద్రష్ట. ఒకనాటి తన పరిశోధన. పరిణతి దిశగా పరిణామం చెందితే, ఆ నూతన ఆవిష్కరణని సంతోషంగా స్వీకరిస్తాడు – స్వాగతిస్తాడు. అక్కడ అంధవిశ్వాసానికి మూఢనమ్మకానికి స్థానం లేదు. ఇదే శాస్త్రీయ దృక్పధం.

కనుక Science ఎప్పుడూ Senseతో కూడినదే.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!