కరాగ్రే వసతే అనసూయే । కరమధ్యే హైమవతీ |
కరమూలేతు నాగేశః | ప్రభాతే కరదర్శనమ్ ॥
అమ్మ ఒక చమత్కార మంజరి. అమ్మ మాటలలోని విరుపులు ఎంతటి పండితుడినయినా ఆలోచింప చేస్తాయి. పండితులమని విర్రవీగేవారికి అమ్మ మాటలు విన్నాక ఇదేనా మన పాండిత్యం అని అన్పిస్తుంది. ఇట్లాంటి సందర్భాలు అమ్మ చరిత్రలో మనకు అనేకం కన్పిస్తాయి వాటిలో కొన్ని –
భగవంతుడు సాకారుడా, నిరాకారుడా అనే చర్చ జరుగుతుండగా ‘నిరాకారుడు’ అన్న వారి మాటకు “ప్రత్యేక రూపం లేదు కనుక ‘రూప రహితుడు’ అన్నది. ఈ వాక్యం అజ్ఞాత బ్రహ్మను కరతలామలకం చేస్తున్నది.
“మానవుని జీవిత గమనానికి ఆధారంగా రాగద్వేషాలే కనబడుతున్నాయి నాకు” నిజం అంతే కదా! కైవల్యం అంటే? “వైకల్యం లేనిదే కైవల్యం”. రాగద్వేషాలు రెండుగాకాక ఒకటిగా కనబడితే కైవల్యం కాక మరేమిటి?
“సత్రం అంటే సర్వులకు స్వతంత్రమైన దేనని” అమ్మ వాక్యం.
“గణనకు అందనిది గండమట”, “సహించలేనిది హింస”ట. అమ్మ ఆమాటనే మడత పెట్టి పొదుపు చేస్తారు. ఇంకొకప్పుడు యతిప్రాసలు సాయమౌతాయి. “భరించలేనిది బాధ”. పొట్టి శ్రీరాములు గారికి ఆమరణాంతము నిరాహారదీక్ష బాధ లేదు. ‘ఇష్టం లేనిది కష్టం’. సామాన్యంగా కొందరికి ఇంటిలో సేవ కష్టం. “సవరణ అవసరము లేనిదే వివరణ”.
ఒక శబ్దముతో సామరస్యము ఉన్న ఇంకొక శబ్దమే గాని దాని అర్థ సాహచర్యము మనకు సామాన్యముగా స్ఫురించదు. “ఇతరులతో తగాదా ఆడటం పోరాటం” ఈ పదం వినగానే సామాన్యముగా మనకు ఆరాటం అనే పదం తడుతుంది. అమ్మ మాటల్లో ‘ఇతరులతో తగాదా ఆడటం పోరాటం’ ‘తనలో తాను పోరాడటమే ఆరాటము’ ఇట్లాంటి వాక్యాలు అమ్మ మనస్సులో స్ఫురించడానికి క్షణకాలము కూడా పట్టదు. ఇలాంటివే “తనకోసం చేసేది రాగము కొరకు చేసేది త్యాగము”. ఆస్తిక, నాస్తికులను గూర్చి అమ్మ ఇలా అన్నారు” వాడికి – దైవం తప్ప రెండోది నాస్తి, వీడికి ‘నేను’ తప్ప రెండోది నాస్తి” అలాగే “భావం మారేది, స్వభావం మారనిది” “తనను తాను విమర్శించు కోవడం వివేకం. ఇతరులను విమర్శించటం అవివేకం”. అన్న ఈ రెండు వాక్యాలలో మాటల బిగింపే కానవస్తుంది. “అక్షరాలలో తప్పులు సవరిస్తే ఎడిటరూ, అంకెల్లో తప్పులు సవరిస్తే ఆడిటరూ”.
ఇది ఒక తెలుగు భాషలోనే కాదు చిదంబరరావు తాతగారు ఒక సందర్భములో లోపల గానా? పైగానా? అని అడిగారు అమ్మను. అమ్మ వెంటనే ‘లోపల గానా, బయట బజానా’ అన్నారు. “వస్తాం కానీ నలుగురిలో అభాసు చేస్తే” అన్నది హైమక్క “శభాసు అంటారు” అన్నారు అమ్మ. మగవాళ్ళననటానికి నాకు లైసెన్సు లేదమ్మా అని గోపాలన్నయ్య అంటే “ఒరేయ్ నీవు సైలెన్సుగా ఉండు” అన్నారు అమ్మ. “నాన్నగారు తిరగమన్నారు సరే మీకేమయినా రిలీపు ఉన్నదా” అని ఆడపిల్లలు అడిగితే ‘రిలీఫేమోగాని బిలీఫ్ ఉన్నది” అన్నారు అమ్మ. “మా కోడలు మీకు ప్రెజంటు చెయ్యాలని వచ్చిందట” అని ఒక అత్తగారు అంటే “నేను ఆబ్సంటు అయానని మానుకుందా?” అన్నారు అమ్మ. హైదరాబాద్ పోగానే ఏముంది? డన్లప్” అని కృష్ణశర్మగారు. శ్రీ అన్నపర్తి కృష్ణశర్మగారు డన్లప్ కంపెనీలో పని చేసేవారు) అంటే అమ్మ ‘డన్లప్ డెవలప్’ అన్నారు.
“అద్వైతమంటే మీ ఉద్దేశ్యమేమిటి? అని శ్రీ మూల్పూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అడిగితే “అంతా తానే అయినది” అన్నారు. మహాపండితుడై యుండి తన అన్నగారిని ఈ జవాబు వ్రాసుకోమన్నారు. శ్రీ వావికొలను సుబ్బారావు గారు ఏమి కావాలమ్మా? అని అడిగితే చిరు ప్రాయములోనే అమ్మ “ఏమీ కావాలనేది అక్కర లేకుండా కావాల”న్నారు. జవాబుకు వెతుక్కోవమ్మా? అని ఎవరో అంటే ‘ఎక్కడైనా పెట్టి మరిచిపోతే కదా?’ అన్నారు. “ఆ మేధా సంపత్తి ఏమెట్టు మీద ఉన్నట్టు” అని మూల్పూరి సుబ్రహ్మణ్యం గారిని ఎవరో అడిగితే ‘మనకంటే ఒకటో అరో ఎక్కువ అని చెప్పారట ఆ సంగతి విని అమ్మ ‘అయితే మెట్లెన్నో కనుక్కో నాన్న’ అని అన్నారు.