(ఏప్రిల్, 2010 సంచిక తరువాయి)
ఒకసారి మహాలక్షమ్మ అనే స్త్రీ అనేక బాధలు పడుతూ దీనస్థితిలో అమ్మ దగ్గరకు వచ్చింది. ఆమె అమ్మతో “తల్లీ ఈ దరిద్రురాలు ఎక్కడకు వెళ్లలేదు. ఏమీ చెయ్యలేదు. కనీసం అందరిలా పూజలూ, పునస్కారాలూ లేకపోయినా, చేసుకున్న పెనిమిటికి ఇంత అన్నం వండి పెట్టుకోలేని నిర్భాగ్యురాలిని తల్లీ ! పిల్లలూ లేరు, తినడానికి కడుపు నిండా వున్నది. ఎవరికైనా చెప్పుకొంటే ‘ఆడవాళ్ళకు పతివ్రతా ధర్మం చాలదా అని అంటారు. దగ్గర లేని పెనిమిటిని – ఎట్లా ఆరాధించాలో తెలియటం లేదు. మీరైనా చెప్పండి తల్లీ’ అని అడిగింది. అందుకు అమ్మ “కొలుస్తూనే వున్నావు కదమ్మా! ఏది కొల్చేదీ? ఏది కొల్చేదీ? అని కొలుస్తూనే వున్నావు. ఎవరు దగ్గర లేరనుకుంటున్నావో, ఎవరు కావాలనుకుంటున్నావో వారిని ఆవేదనలో ఆరాధిస్తూనే వున్నావు. ఆరాధన అంటే ఆవేదనేనమ్మా”. అందుకామె “ఈ ఏడు పేనా తల్లీ” అని అన్నది. దానికి అమ్మ “ఏడుపంటే కన్నీళ్ళు కావుగా అమ్మా. హృదయాన్ని దగ్ధం చేసే అగ్ని ప్రవేశించి దహనం చేస్తున్నది. ఆ దహనం సర్వమమకారాలూ, రాగద్వేషాలు దహనం చేసే మహాయాగం, అదే భక్తి. సర్వకాల సర్వావస్థల యందూ ఉన్నప్పుడు అదే జ్ఞానం. అదే నిష్కామకర్మ. అదే సర్వమని నా అభిప్రాయం” అని అన్నది.
“ ఇదంతా ఈ ఏడుపులో ఈ బాధలో వున్నదని నేను అనుకోవటం లేదుగా అమ్మా! అందరి మాదిరిగా వుండలేకపోతినే అని ఏడుస్తున్నాను. ఇదంతా జ్ఞానమని, భక్తి అనీ ఏడవటం లేదుగా అమ్మా” అని అన్నది. అందుకు అమ్మ “తెలిసి చెయ్యనిదీ తెలియకుండా జరిగేది, అందరికీ ఉపయోగపడేది. తనకు తెలియనిది దీపకాంతి. వెలుగుతున్నదని తనకు తెలియదు. ఆ దీపాన్ని వెలిగించే వాడు వేరే వుండవచ్చు. దీపం హెచ్చు తగ్గులు వెలిగించిన వాడికే తెలుసు. కానీ దీపానికి సహాయకారి వంటిదే నీ వేదన. ఆవేదన పూర్తి అయినపుడు స్త్రీల పాలిటి ఆరాధ్య దైవానివి నీవే” అని ఓదార్చింది. ఆ స్త్రీ భర్త కోసం పడే ఆరాటం, ఆవేదనే, ఆరాధనగా, ప్రేమ తపస్సుగా అమ్మ అభివర్ణించింది. ‘ఆవేదనే ఆరాధన’ అని అమ్మ చెప్పిన దానికి ఉదాహరణగా మరి యొక సంఘటన వివరిస్తాను.
ఇంటింటికీ తిరిగి కరివేపాకు అమ్ముకునే ఒక స్త్రీ అమ్మ సంగతి విని అమ్మను చూడాలన్న ఉత్సాహంతో మరుసటి రోజు త్వరగా లేచి తన మామూలు పద్దతి ప్రకారం కరివేపాకు బుట్ట తీసుకుని అమ్మడానికి బయలుదేరుతూ కనీసం ఒక అర్ధణా కరివేపాకు అమ్ముడు పోయినా రెండు అరటి పళ్ళు కొనుక్కొని అమ్మ చేతిలో పెట్టి ఆమె పాదాలు తాకి పునీతమవుదామని అనుకొన్నదట ! ఆమె హృదయం ఎంత తపన చెందుతున్నదో. ఆనాడు విచిత్రంగా ఒక్కరు కూడా కరివేపాకుకొన్నవారు లేరు. కనీసం ఆమె మొర వినిపించుకున్నవారు లేరు. “అయ్యో! అర్ధణా అయినా చేతికందలేదే, అరటి పళ్ళు అయినా చేతిలో పెట్టకుండా అమ్మను చూచే దెట్లాగ?” అనుకుని కరివేపాకు బుట్టతో, వేదనా పూరిత హృదయంతో చిదంబరరావు తాతగారింటికి చేరి పంచలో నిలుచున్నదట! భక్తులు కొందరు పూజా ద్రవ్యాలు తెచ్చి అమ్మకు సమర్పించి. నమస్కరిస్తున్నారు. అందరూ అమ్మ సన్నిధిలో కూర్చున్నారు. భక్తుల ఆవేదనే తనను రక్షిస్తుందని భావించే అమ్మ త్వరత్వరగా ఆమె వద్దకు వెళ్ళి “ఎందుకమ్మా ఏడుస్తావు?” అంటూ తనతో లోపల్నించి బయటకు వచ్చిన వాళ్ళను చూపించి “వీళ్ళంతా నన్ను చూడటానికి వచ్చారు. నేను నిన్ను చూడటానికి వచ్చాను” అంటూ, ఆమెను దగ్గరకు తీసుకొని “అమ్మను చూడటానికి పండ్లు వుంటేనేనా వచ్చేది? వీళ్ళంతా టెంకాయలూ, పూలూ తెచ్చారు. నీవు తలపండే హృదయం ఇచ్చావు. పండ్లు అన్నిటికంటే విలువైనదీ, గొప్పదీ అదేచూడు, “నీ, కరివేపాకు. ఎంత రుచిగా వుందో?” అంటూ మూడు రెబ్బలు కరివేపాకు నమిలి మ్రింగింది. ఆమెకు మాటలు రాక అమ్మ కౌగిలిలో అట్లాగే వుండిపోయింది. అమ్మ ఆమెను చూస్తూ “ఆవేదనే నివేదన అమ్మా” అని అంది. ఈ దృశ్యం ద్వాపరయుగంలో కుచేలుని అటుకులు శ్రీకృష్ణుడు ప్రేమగా ఆరగించటం గుర్తుకు తెస్తున్నది.
అమ్మ మనుషులనే కాదు పశుపక్ష్యాదులకుకూడా విందులు చేసేది, అన్ని రకాల పశువులనూ ఒక చోట చేర్చమని వాటి వద్ద సన్నాయి మేళం పెట్టమని ఆదేశించింది. గ్రామంలో ఆవులు, గేదెలు, దున్నలు, మేకలు, గొట్టెలు అన్నీ వెయ్యికి పైనే వున్నాయి. “సంగీతం మన కంటే అవే ఎక్కువగా విని ఆనందిస్తాయనే, ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి అని వినలేదా’ అని అందరికీ జ్ఞాపకం చేసింది. పశువులకు దగ్గరుండి దాణాలు తినిపించింది. వాటి ఆరోగ్యం ఎట్లావున్నదీ ఎట్లా మేస్తున్నదీ విచారించి ఎప్పుడు పశువులను ఎలా చూడాలో వివరించి చెప్పి సలహాలిచ్చి అదంతా మీరు భగవంతునికి చేసే నివేదనగా భావించమని సందేశాన్ని ఇచ్చింది. (శ్రీవారి చరణసన్నిధి – పేజీ. 450)
ఒకసారి అనంతపద్మనాభ చతుర్దశి నాడు (20.1.1983) అమ్మ పూరీలు చేయించమని ఆజ్ఞాపించింది. అమ్మ పూరీలను ముక్కలుగా తుంచి ఆరుబయటకు వచ్చి, ఒకొక్క ముక్క ఎగరవేస్తే కాకులు ముక్కుతో అందుకుని ఎగిరిపోయాయి. అమ్మ వేసే ముక్కలు చూసి కాకులు పోగయి ముక్కలను క్రింద పడనీయకుండా ముక్కుతో అందుకుని ఎగిరి పోతూంటే అమ్మ ఆనందమే ఆనందం. ఒకసారి ఒకచోట పోగయిన కాకులను చూసి ‘భోంచేశారా’ అని అడిగి అన్నం కలుపుకు తెమ్మని వాటికి ఒకొక్క ముద్ద వేస్తె అవి క్రింద పడకుండా కరుచుకుని ఎగిరి పోతుంటే అమ్మ చిన్న పిల్లలా కేరింతలు కొడుతూ సంతోషించింది. ఒకసారి మమ్మల్ని నేతి గారెలు చేయమంటే చేశాము. అప్పటికప్పుడు అవి ముక్కలుగా ఎగురువేసి కాకులకు విందు చేసింది. “అమ్మా వీటికోసమా నన్ను నేతితో గారెలు చేయమంది” అవి వసుంధర అడిగితే “పాపం వాటికి నేతి గారెలు ఎవరు పెడతారు?” అని అంది జాలిగా. ఒక్కోసారి పేలాలు వేయించమని వరండాలో పచార్లు చేస్తూ కాకులకు వేస్తూ వాటితో ఆటలాడే అమ్మలో పసిపిల్ల ఆనందం కనపడుతుంది అవి కావు కావు మని అరుస్తూంటే ‘నన్ను అమ్మా! అమ్మా! అని అంటున్నాయి.’ చూడు అని సంతోషంతో పొంగిపోతుంది. ఆ కళ్ళల్లో ఎంత ఆనందం!! (శ్రీవారి చరణసన్నిధి – పేజీ 457)
‘ఆదరణతో అన్నం పెట్టి వస్త్రం ఇవ్వటమే” మాతృయాగమని పేరు పెట్టటమే కాక ఆచరణాత్మకంగా చూపెట్టింది. తన చివరి క్షణాల్లో కూడా అమ్మ ‘అన్నయ్యకు కొత్త బట్టలు ఇచ్చావా! నిన్న వాడి పుట్టిన రోజు కదా!’ అని వసుంధరను అడిగింది. అంత జబ్బులోనూ అన్నయ్య పుట్టిన రోజును పట్టించుకున్నది. “అమ్మా! నీ పరిస్థితి ఏమిటి? నువ్వు పడ్డ బాధేమిటి? నువ్వెట్లా వుంటావో అన్న భయంతో వున్న స్థితిలో బట్టలు పెట్టడ మేమిటమ్మా’ అని అంది. “నాకు బాగా లేక పోతే నీకు బాధ్యత లేదా” అని కేకలేసి బట్టలు పెట్టించింది.
మాటమాట్లాడలేని స్థితిలో సైగలతో చెప్పి వస్త్రాలు పెట్టించింది. ఎంతసేపూ ఎవరికి ఏం పెట్టుకోవాలా అన్న తాపత్రయమే ఆమెకు. ప్రేమే ఆమె జీవితం, ప్రేమే ఆమె శ్వాస ఆఖరి శ్వాసకూడా ప్రేమలోనే విడిచింది. అమ్మ అంటే అంతులేనిది అడ్డులేనిది అన్నింటికీ ఆధారమైనది. అమ్మ అక్కడ ఆశ్రమంలో మంచం మీద కూర్చున్న నాలుగు అడుగుల పది అంగుళాల వ్యక్తి కాదు. అమ్మ “రూపం పరిమితం శక్తి అనంతం”, “మీరంతా నేనే మీదంతా నేనే ఇదంతా నేనే”, “ఈ సృష్టి నాది” అని స్పష్టం చేసి, అమ్మ మనలో ఉండి మనతో ఉండి మనను తన ఆటపాటలతో మురిపించి తన ప్రేమానురాగాలను పంచి ఇచ్చి ఎవరికి వారే అమ్మ నా సొంతం నాకు చెప్పిందే నిజమన్న ఆత్మీయ బంధాన్ని పెంచి ఇప్పుడు రూపం కనుమరుగయింది. ఇది బాధగా వున్నా ఏమీ చేయలేము. అమ్మ జ్ఞాపకాలను, అనుభవాలను స్మరిస్తూ అమ్మ సందేశాన్ని ఆచరణలో పెడితే అమ్మ మనని వీడనట్లే.
(సమాప్తం)