భగవతత్వము మానవ దేహంలోకి అవతారంగా దిగివచ్చినప్పుడు, ఆ అవతారం యొక్క లీలలను వర్ణించటం సామాన్య మానవులకు సాధ్యంకాదు. అట్లాగే అమ్మను పూర్తిగా అర్థంచేసుకోవాలంటే మనం కూడా అమ్మలం కావాలి. కాని అది సాధ్యంకాదు. కనుక మహాసముద్రం దగ్గరకి ఎవరు ఎంత పాత్ర పట్టుకెలితే అంతే నీరు నింపుకోగలుగుతారు. “చెంబెడైతే చెంబెడు, గరిటెడైతే గరిటెడు అన్నట్లు అమ్మ మహోదథిలోని తరంగాలను ఎవరికి ఎంత శక్తి వుంటే అర్హతను బట్టి గ్రహించగలుగుతారు. భగత్తత్వం నిండిన మహోన్నత వ్యక్తుల జీవితాలు విచిత్ర స్వభావము వారి లీలలు చిత్ర విచిత్రముగా నుండి చూసే వారికి ఆశ్చర్యం కలుగజేస్తుంది. అందుకే గీతలో శ్రీకృష్ణుడు అవతార పురుషలీలలు గురించి చెబుతూ “ఆశ్చర్య వదవత్, ఆశ్చర్యవత్పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి, శృత్వాప్యేనం వేదన దైవకశ్చిత్.” అటువంటిది చూడటానికి, వినటానికి, చెప్పటానికి కూడా ఆశ్చర్యం కలిగించే లీలలను వేదములు కూడా వివరించలేక వెనక్కు తగ్గాయి.
ఇక మన అమ్మ, అడుగడుగునా, తాను ఒక కరణంగారి భార్యనే ననీ, శారీరకంగా బాధలు పడుతున్న మామూలు రోగిలాగే మూల్గుతూనే అందరినీ మాయలో పడేసి అనేక ప్రమాదాల నుండి రక్షించడం లాంటి వెన్నో చేసింది. కానీ చూసేవారికి ఆమెకు ఆ లీలలతో ఏమీ సంబంధం లేనట్లుగా కనిపిస్తూ ఎంతో మామూలు మనిషిగా దర్శనమిస్తూ మనల్ని మాయలో పడేస్తూ వుంటుంది. ఎంతో సన్నిహితంగా వుండేవారు కూడా ఆమె అద్భుత తత్వాన్ని గ్రహించలేకపోయారు. ఇక్కడ అమ్మ తన భక్తులను ప్రమాదాలనుంచీ, గండాలనుంచి తప్పించిన కొన్ని సంఘటనలను వివరిస్తాను (వసుంధర అందించిన ‘శ్రీవారి చరణ సన్నిధి’ పుస్తకం ఆధారంగా)
ఒకసారి వంతెనవారిపాలెం నుంచి యల్లాప్రగడ నరసింహారావుగారూ, వీరి తమ్ముడూ అమ్మ దర్శనానికి వచ్చారు. నరసింహారావుకు పెళ్ళి అయిన 25 సంవత్సరాలకు కూడా పిల్లలు కలగలేదు. అమ్మ దగ్గరకు రావటం మొదలు పెట్టాక ఒక రోజు అమ్మ ఆయన స్వప్నంలో సాక్షాత్కరించినదట. అప్పుడు ఆయన అమ్మ పాదాలను గట్టిగా పట్టుకుని “నాకు సంతానం ఉన్నదా? లేదా?” అంటూ పాదాలను వదలలేదట. అప్పుడు అమ్మ “ఉన్నదిలే ముందు ఈ ఇడ్లీ తిను” అని అమ్మ ఇడ్లీ నోట్లో పెట్టిందట! ఆ తర్వాత ఆయన భార్య (అమ్మ అనుగ్రహం వల్ల) గర్భవతి అయిందట! ఆడపిల్ల కలిగింది. ఆ పిల్ల పేరు రమా రేవతి. ఆ పాపకు 3 సం॥ల ప్రాయంలో పంపుసెట్లు, ఇనుపచువ్వలు ఉన్న లోతైన ప్రదేశంలో ఒక గుంటలో పడిపోయిందట. తల్లి దండ్రుల ఆదుర్దా చెప్పనక్కరలేదు. తల్లి అమ్మ ఫోటో ముందు కూర్చొని అమ్మకు మొరపెట్టుకుని ఏడ్చిందట. తండ్రే పిల్లదగ్గరకు పరుగెత్తాడట “పడ్డావా అమ్మా!” అని పాపను అడిగితే ఆ పాపేమో చాలా సంతోషంగా “అమ్మ కుర్చీలో కూర్చొని నన్ను పట్టుకున్నది నాన్నా!” అని అన్నదట!!
ఆ పాపే 8 సం|| వయసులో ఒక బాబుని ఎత్తుకుని నడుస్తూ పడిపోయి కాలు విరిగిందట. కాలికి తగిలిన దెబ్బ తగ్గదేమోనని భయపడ్డారుట. పాపకు అమ్మ కనిపించిందట. ఆ రోజే డాక్టరు పాపకు సెట్టయిందని చెప్పాడట. ఆ పాపను అమ్మ అడుగడుగునా కాపాడుతూనే వున్నదట (శ్రీవారి చరణ సన్నిధి; పేజి 449).
క్రితంసారి పాపను కాపాడినట్లే అమ్మ అనేక మందిని కాపాడిన సంఘటనలు ఉన్నాయి. 1978 సెప్టెంబరులో వరద వచ్చి తగ్గిన తర్వాత నీళ్ళు మలినమయిన కారణంగా నీళ్ళ టాంకులో బ్లీచింగ్ పౌడరు కలిపితే బాగుంటుందని నిర్ణయించారు. అక్కడ కాలేజీలో చదువుకునే విద్యార్థి రఘునాథ్’కి ఆపని అప్పజెప్పారు. అతను పైన టాంకులో కలపడానికి బ్లీచింగ్ పౌడర్ కలిపిన బొక్కెనతో పైకి వెళ్లాడు. ఆ టాంకుకు వెళ్లాలంటే కర్రల వంతెన మీదగా ఎక్కి వెళ్ళాలి. అది సుమారు 30 అడుగుల ఎత్తున వున్నది. క్రింద నాపరాళ్ళు పరచి వున్నాయి. పై నుంచి క్రిందకు చూస్తే చాలా భయానకంగా వుంటుంది. అమ్మ లోపల స్నానం చేస్తున్నది. ఇంతలో “దభీ” మను పెద్ద శబ్దం వినిపించింది. అమ్మ గదిలోకి కూడా వినిపించింది. అందరికీ గుండెలు గుభేలుమన్నాయి. రఘునాధ్ ఎక్కిన కర్రల వంతెన విరిగి వ్రేలాడుతున్నది. అతను క్రింద రాళ్ళపై బడి ‘అమ్మా! అమ్మా!’ అని విలపిస్తున్నాడు రామక్రిష్ణన్నయ్య క్రిందకు పరుగెత్తాడు. అతనిని చేతులపై తీసుకువచ్చి హోమియో హాస్పిటల్ లో పడుకోబెట్టారు. డా॥ సత్యం, డా॥ ఇనజ కుమారి
ప్రాథమిక వైద్యం చేశారు. పరిస్థితి ఎలావుంటుందో చెప్పలేమన్నారు. షాక్ వల్ల మెదడు దెబ్బ తిన్నా తినవచ్చు. ఎముకలైనా విరుగవచ్చు. ఏమీ చెప్పలేమన్నారు. రాత్రంతా అందరకీ ఆందోళనే. అతడు అమ్మ ఒడిలో ఉన్నట్లు హాయిగా నిద్రపోయాడు. ఎవరికీ నిద్దర్లు లేవు. మరునాడు ఉదయానికి ఆ విద్యార్ధి లేచి తిరగటం మొదలు పెట్టాడు. అతనికి ఒక్క ఎముక విరగలేదు. బాలా మాములుగా వున్నాడు. ‘ఎట్లా వున్నాది రఘూ!’ అని అడిగితే ‘బాగానే వున్నది’. అనేవాడు. అమ్మ మాత్రం “రఘు ఎలా వున్నాడు?” అని చాలా సాదాగా అమాయకంగా మొహం పెట్టి అడిగింది. రక్షణ తానే అయిన అమ్మ అంతకంటే ఏమంటుంది? (శ్రీవారి చరణ సన్నిధి పె. 450).
9-6-1972లో అక్కడ స్థానికంగా వుంటున్న డి.ఎస్.పి సత్యనారాయణ, లలితాంబా గార్ల కుమార్తె సత్యవతి కూడా సుమారు 25 అడుగుల ఎత్తు నుంచి రాత్రి 9.30గం|| ప్రాంతంలో పడిపోయింది. అమ్మకీ వార్త తెలిసి తన నివాసం నుండి బయటికి వచ్చింది. దాదాపు 2 గం॥ పైగా అమ్మ ఆమె దగ్గర కూర్చుని నడుమనుంచీ పాదాల వరకు ఆమె శరీరాన్ని నిమురుతూ ధైర్యం చెప్పింది.. అమ్మ అమృత హస్త స్పర్శకే సగం ధైర్యాన్ని పొందిన సత్యవతి అమ్మ కబుర్లలో తన బాధనే మర్చిపోయింది. మధ్య మధ్య పాలు తాగిస్తూ నవ్విస్తూ ఉపచర్యలు చేసింది. నడుమ దగ్గర ఉబ్బింది. అది అమ్మ కర స్పర్శతో అంతరించింది.
అక్కడ వున్న డాక్టరు చాలా ఆశ్చర్యపోయింది. చాలాసేపటికి సత్యవతి నొప్పిగా వున్నదని అన్నది. అందుకు అమ్మ “నీవు పడటం వల్ల నాకు నొప్పులుగా వున్నాయి. లేకపోతే నీవు శోకాలు పెట్టేదానివి.” అని అంది. (అనగా ఆమె బాధ తాను తీసుకుని అనుభవించిందని భావం).
అమ్మ చమత్కారంగా ఆ విషయం చెప్పింది. తర్వాత అమ్మ పుత్తూరు రాజులకు కబుకు చేసింది. పుత్తూరులోగాని వైద్యం చేయ్యటం కుదరదని పట్టుబట్టిన డాక్టర్లు అమ్మ ఆదేశానుసారం జిల్లెళ్ళమూడిలోనే వైద్యం చేశారు. డాక్టర్లు అనుకోని విధంగా సత్యవతి ఆరోగ్యం కుదటపడింది. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. మహామహిమాన్వితమైన అమ్మ మహత్యాన్ని కొనియాడారు. వారి భార్య ఆయాసంతో బాధపడేదట. అమ్మ కుంకం వల్లనే నయమయిందని డాక్టర్లు చెప్పారు. దానికి అమ్మ “మీకు నా కుంకుమ మందయితే నాకు ఇద్దరు డాక్టర్లు ఉన్నార”ని ప్రక్కనే వున్న డా॥ సత్యాన్ని, డా॥ ఇనజ కుమారిని చూపెట్టింది! ఇదీ అమ్మ వరస!!
ఎన్ని సందర్భాల్లో తన శక్తితో రక్షించినా ఆ విషయం అమ్మ ఎంత మాత్రం ఒప్పుకోదు. అదే మాయ. అంటే ఆఖరికి అమ్మ తనకు ప్రియాతి ప్రియమైన వసుంధరను ఎంత చిత్రంగా అనారోగ్యం నుంచి కాపాడినదీ క్లుప్తంగా వివరిస్తాను.
1972వ సం॥లో వసుంధర తీవ్రమైన అనారోగ్యానికి గురిఅయినది. ఆమె హాస్పిటలులో చికిత్సలో వుండగా (డిశంబరు 15న ముక్కోటి ఏకాదశికి “అమ్మ దగ్గరలేనే” అని బాధపడుతున్నది) హాస్పిటలు ఎదురుగా వీరరాఘవ స్వామి ఆలయమున్నది. అమ్మ చింతనలో ఉన్న వసుంధరకు అమ్మ శంఖచక్ర కిరీటధారిణియై, మహోజ్వలమైన దర్శనం ప్రసాదించింది. ఇంతలో అమ్మ డాక్టరు ఇంటికి వచ్చినట్లు కబురు వచ్చింది. తెల్లారితే ముక్కోటి అయితే, అమ్మ రావటమేమిటని విస్తుపోయింది. వసుంధర అమ్మ పాదాలపై అమాంతం పడి ఏడ్చింది. అమ్మ పైకి లేవనెత్తి తీర్థం, ప్రసాదం ఇచ్చి తన అమృత స్పర్శతో పులకింపజేసింది. అమ్మ అన్నట్లు ‘మీ ఆవేదనే నన్ను రప్పిస్తుంది’ అనే విషయం ఇప్పుడామె విషయంలో స్పష్టంగా ఋజువైంది. చీరాలలో వైద్యం కుదరక మద్రాసులో న్యూరో సర్జన్కి చూపించారు. డాక్టర్లు జాయింట్ల టి.బి. అని నిర్ణయించారు. అక్కడ వెన్నుపూసకి ఆపరేషన్ చేయాలని చెప్పారు.
గుంటూరు వైద్యులు 6 నెలలు పూర్తిగా రెస్టు, భోజనం కూడా పడుకునే చేయాలని చెప్పారు. అయిదు నెలల వైద్యంలో స్వప్న దర్శనమేకాక, వసుంధర తనను చూడనిదే ఉండలేదని రెండు నెలలకొకసారి స్వయంగా వచ్చి ఊరట కలిగించింది. ‘అమ్మలేకుండా ఆపరేషన్ చేసుకోను’ అని వసుంధర పట్టు పట్టడంచేత ఆమెను కారులో పడుకోబెట్టుకుని మదనపల్లిలో వున్న అమ్మ వద్దకు చేర్చారు. అమ్మ దగ్గరకు వచ్చినా వసుంధర కదలలేక లేవలేని నిస్సహాయస్థితిలో వుంది. అమ్మ చేయి అందించి లేవమంది. నడవమంది. వసుంధర శరీరం బాధతో గజగజలాడిపోయింది. ‘నడవలేనమ్మా!’ అని అన్నా వినిపించుకోకుండా నడవమని శాసించి తనచే బలవంతంగా నడిపించింది. కారుదాక నడిపించి ప్రక్కన కారులో కూర్చోపెట్టుకున్నది. మధ్య మధ్యన తను విజిల్ వేసిన చోటల్లా కారు ఆపి దిగి నడవమన్నది.
ఋషివాలీ స్కూలు హరిజనవాడ చూసి హర్మ్స్ హిల్స్కి వెళ్ళాక ఆ కొండలు ఎక్కవలసినపుడు “వసుంధరను పట్టుకొని నడిపించండి” అని అన్నది. విశ్రాంతి బంగళాకు చేరుకున్నాక, వసుంధరను ఒక మంచం మీద పడుకోపెట్టి, తాను స్నానం చేస్తూ, వసుంధరని పిలవమని నీళ్ళు పోయమంది. “నీకు నా గురించి దిగులు తప్ప వేరే రోగం లేదు” అని అన్నది. వసుంధర అమ్మకు స్నానం చేయించ గలిగింది. అడుగుతీసి అడుగువేయలేని వసుంధరను అమ్మ తన అధికారయుతమైన శాసనంతో ఆరోగ్యవంతురాలిని చేసింది. అప్పటినుంచి ఏ కంప్లెయింట్ లేక అమ్మ సేవలో ఆరోగ్యంగా తిరిగింది వసుంధర. (శ్రీవారి చరణ సన్నిధి; 10వ పేజీ)
అమ్మ తన శరీరం మీదేగాక ఇతరుల శరీరం మీద కూడా అనిర్వచనీయమైన అధికారం వున్నట్లు అనేక సంఘటనల వల్ల తెలుస్తుంది.
1965 సెప్టెంబరులో ‘అమ్మ తండ్రిగారైన సీతాపతి తాతగారు’ మరణించారు అని డాక్టర్లు ధృవపరిచారు. కుటుంబీకులంతా విచారగ్రస్తులైనారు. అమ్మ తదేకంగా తాతగారివైపు కొన్ని క్షణాలు చూసింది. తర్వాత కొన్ని గంటల పిమ్మట తాతగారు పునర్జీవితులైనారు. తర్వాత మళ్ళీ నెలరోజులకు పరమపదించారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమే కదా! (‘సర్వం తన ఇచ్ఛానుసారమే’ శ్రీవారి చరణ సన్నిధి, అనే శీర్షికలో 10వ పేజీ).
అమ్మ ఎన్ని వేదాంత సమస్యలు చర్చించినా జీవితంలో ప్రేమ, ఆరాధన అన్న అంశాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. ఆమె జీవితమంతా వీటితోనే నిండిపోయివుంది. చివరకు అందరికీ ఉపదేశించినది ప్రేమతో ఆచరణ, ఆవేదనతోనే ఆరాధన, జీవిత సార్థకత, పరిపూర్ణత నిండివున్నదని చెబుతూ వచ్చింది. ఆవేదనతో, ప్రేమతో చమర్చని హృదయానికి పరమార్థం, భక్తి, శుష్కవేదాంతాలుగానే మిగిలిపోతాయి. అమ్మ ప్రేమ కేవలం మానవులకే పరిమితంకాక సకల చరాచరముల మీద పశుపక్ష్యాదుల మీద కూడా నిండు ప్రేమావాత్సల్యాల్ని చూపడం మనం అమ్మ జీవితంలో గమనించవచ్చును.
– (సశేషం)