1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మ – వ్యక్తిత్వ నిర్మాణం

అమ్మ – వ్యక్తిత్వ నిర్మాణం

Dr. U. Varalakshmi
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 11
Month : October
Issue Number : 4
Year : 2012

(గత సంచిక తరువాయి)

సహజంగా ఇది కావాలనుకోవడమే కోరిక అనుకుంటాం మనం. వద్దనుకోవడమూ కోరికే అన్నది అమ్మ. ఒక సోదరుడు, ‘స్థిత ప్రజ్ఞ సాధించలేకపోతున్నాను’ అని బాధపడుతుంటే అమ్మ “అది సాధించాలనే కోరిక కూడ లేకపోవడమే స్థితప్రజ్ఞ” అని స్థిరంగా పలికింది. అంటే మనస్సు విస్తరంగ నీరాకరంలా ఏ అలజడీ ఆరాటమూ లేకుండా సర్వాన్నీ అనుభవిస్తూనే సర్వాన్నీ విడిచిపెట్టాలి. ‘అంతా అదే’ అన్న సత్యాన్ని అంతరాంతరాలలో దర్శించగలగాలి. అదే ఆత్మ సాక్షాత్కారం. అదే నిశ్చల జ్ఞానం. అంతా ఆత్మగా తోచటమే ఆత్మ సాక్షాత్కారం కదా !

భర్త వైముఖ్యాన్ని భరించ లేక తనకు మొరపెట్టుకున్న ఇల్లాలితో అమ్మ అన్న యీ మాటలు మనసు మర్మాన్ని విప్పి చెప్పే వ్యాఖ్యానాలు. “ద్వేషానికి ప్రేమకంటే మందు లేదు. హింసను సహనంతోనే జయించాలి” – వినగానే సంసారంలో సర్దుబాటు లా కనిపించినా, కాలగమనంలో అవి ఎదుటివారిలో దిద్దుబాటుకు దారి తీస్తాయనేది వాస్తవం. వేదాంత ప్రవచనాలలో వినిపించే కొన్ని మాటలకు అర్థం తెలిసినట్లున్నా భావం బోధపడక, ఒకప్పుడు భావం తెలిసినా ఆచరణలో సాధ్యపడక తికమకపడే అక్కయ్యల ఆర్తిని గమనించి అమ్మ చెప్పిన యీ మాటలు అందరి జీవితాలలో వెలుగులు నింపే మణిదివ్వెలు : ‘తపనే తపస్సు’, ‘దిగులే జిజ్ఞాస’, ‘ధ్యాసే ధ్యానం’, ‘ఆవేదనే ఆరాధన’, ‘కూతురిని, కోడలిని ఒకటిగా చూడటమే అద్వైతము’. ఇలా శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్దులారగించినంత స్నిగ్ధ సుందరంగా భావబంధురంగా సాగిన యీ సంభాషణల సారాన్ని సమన్వయించుకుంటూ సాగితే జీవితమే ఒక సాధనగా సత్యశోధనగా మారదూ !!

ఒకప్పుడు జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో ఉండే శాయమ్మగారిని తెలియని వారుండరు. ఆమెను అందరింటి ఆవరణలో ఉండే ఒకరు ఏదో అన్నారని కష్టపెట్టుకుని అమ్మకు చెప్పారు. అప్పుడు అమ్మ “నువ్వు చెయ్యనిది అంటే వాళ్ళన్నారు కాని నేను చేయలేదుగా అనుకో. నువ్వు చేసింది అంటే చేశాను గదా వాళ్ళన్నారు అనుకో” అని చెప్పారట. శాయమ్మ గార్కి అమ్మ అంటే అచంచల విశ్వాసం. ‘ఇదేదో బాగానే ఉన్నట్లుంది’ – అని అనుకుని ఉంటారు. బోయవాడు ‘మరామరామరా’ అంటూ ఉంటే తారకమంత్రమైనట్లు శాయమ్మ గారికి ఇది నిత్యస్మరణగా మారింది.

ఆ తర్వాత పేచీలు లేవు. ఫిర్యాదులు లేవు. ఇంతకూ అమ్మ ఆమెకి ఏం చెప్పినట్లో మనిషి తత్త్వం తెలిసి అమ్మ వేసిన మాటల పందిరాయిది? ‘సరేలేమ్మా! వాళ్ళేమన్నా పట్టించుకోకు’ అని అమ్మ అని ఉంటే అసంతృప్తితో ‘అదెట్లా కుదురుతుంది?’ అనిపించేది. ఇలా అమ్మ తన ప్రేమతోనే కాక’ మాటలతోను మంత్రముగ్ధులను చేసిన సన్నివేశాలు ఎన్నో. అమ్మ తత్త్వాన్ని ఇదమిత్థంగా చెప్పలేక ‘రాజుబావ’ తెలియని వారికి తెలిసిన నీవు, తెలిసిన వారికి తెలియవదేమో!!’ అన్నారు. నిజమే తెలుసుకునే తెలివిని కూడ అమ్మ అనుగ్రహించ వలసిందే కదా !

మనిషి జీవితమంతా వెలుగునీడల్లా పరుచుకుని వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసేవి సుఖదుఃఖాలు. సుఖదుఃఖాల గురించి వాటికి మూలమైన మనస్సు గురించి అమ్మ చేసిన విశ్లేషణ మనిషి మనిషిగా మారేక్రమంలో సమదర్శనానికి సోపానమే అవుతుంది. “కష్టం, సుఖం పడేవి కాని పెట్టేవి కావు. ఒకరు సుఖపెడుతున్నా దాన్ని అర్ధం చేసుకోకపోతే అది కష్టం అనుకోవచ్చు. ఒకడికి భార్య పిల్లలు, ఇల్లు వాకిలి, కోరినగుడ్డ, తిండి… అన్నీ ఉన్నప్పటికీ వాడికి ఇవన్నీ వద్దనిపిస్తాయి. ఏ చెట్టుక్రిందన్నా కూర్చుందామనుకుంటాడు. వాడు చెట్టుదొరకక పోతే దుఃఖపడతాడు. ఒకడు చచ్చిపోవాలనుకుని బ్రతికి వున్నానే అని వాపోతాడు. అది ఏదైనా సరే లేని దాని కొరకు ఆశించి పొందలేకపోతే దుఃఖం. ఉన్నది చాలనుకునేది సుఖం.”

ద్వంద్వాలలో మునిగి కలవరపడే మనిషి సుఖదుఃఖాలకు మూలం మనస్సు అని గ్రహించి దానిని పట్టుకోగలిగితే అదుపులో పెట్టుకోగలిగితే అంతాసుఖమే. ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ – అన్నారు కదా! ఒక విధంగా ఆలోచిస్తే సుఖదుఃఖాలనేవి మన మనస్సు కల్పించే భ్రమలే. ఒకరికి ఒకటి సుఖమైతే మరొకరికి అదే దుఃఖం. ఒక మనిషికే ఈనాడు సుఖమనిపించింది రేపు దుఃఖంగా తోచవచ్చు. మన స్థితిగతులకు ఉత్థానపతనాలకు మనస్సేకారణం. జ్ఞానపీఠాన్నధిష్ఠించిన డా॥ సి.నారాయణరెడ్డిగారు.

‘మనసొక మహాసాగరం

 తాను కట్టుకున్న చెలియల కట్టను 

తానే కబళించాలని చూస్తుంది.

మనస్సాక వృక్షమూలం

 తనను నరికే గొడ్డలికి 

తానే ఆధారంగా నిలుస్తుంది.

 అది అగమ్యం

అన్వేషిస్తుంది గమ్యం’ – అన్నారు.

సంక్షుభిత సాగరం లాంటి మనస్సును చిరుకెరటాల సవ్వడి లేని నిశ్చల సరోవరంగా మార్చుకుంటేనే మనిషి ప్రశాంతంగా మనుగడ సాగించగలడు. ‘ఏం సాధన చెయ్యమంటార’ని కొందరు సోదరులు అమ్మని అడిగితే ‘ఏది సాధ్యమైతే అదే సాధన’ అని చెప్పింది. కఠోర నియమాలు, జపతపాలు, ఉపవాస దీక్షలు, మౌనవ్రతాలు, ఆడంబరమైన పూజలు చెయ్యమని అమ్మ ఎప్పుడూ చెప్పలేడు. అయితే ఎవరికైనా చేద్దామనిపిస్తే వారించనూ లేదు. ఏ సాధన చేసినా మనస్సుకు ఏకాగ్రత సంపాదించుకోవడం కోసమే. ఆ ఏకాగ్రతతో శరీరాన్ని ఆశ్రయించుకొని ఉన్నమనస్సూ సర్వ వ్యాప్తమై ఉన్న మహాచైతన్యమూ ఒక్కటేనని తెలుసు కోవడమే జ్ఞానమన్నది. దాని వల్ల మనస్సుకు అనేక బంధాల నుండి బాధల నుండి భయాల నుండి విముక్తి కలుగుతుంది. అవిచ్ఛిన్నమైన అనిర్వచనీయమైన ఆనందం అనుభవంలోకి వస్తుంది. ఏ సాధన వల్లనైనా మనిషి కోరుకునేది తృప్తి ఆనందమేగా! అవి జ్ఞానం వల్ల కలుగుతాయి. జ్ఞానం మనస్సు వల్ల కలుగుతుంది. అందుకు ఏకాగ్రత కావాలి. అది ఎవరికి ఏ విధంగా లభ్యమైతే అట్లాగే చెయ్యవచ్చు. ఇంత విస్తృతమైన భావాన్ని “సాధ్యమైనదే సాధన” అన్న చిన్న వాక్యంతో అందరికీ ఆమోదయోగ్యంగా ఆచరణ సాధ్యంగా అందించింది అమ్మ.

అనూచానమైన ఆచారాలు సంప్రదాయాలు మంచివే అయినా కాలానుగుణంగా మనిషి ఆలోచనలు పద్ధతులు మార్చుకోవాలన్న సందేశాన్ని అమ్మ సూచ్యంగా కాక వాచ్యంగా చెప్పిన సంఘటన ఒకటి – శ్రీ వల్లూరి వీరభద్ర శర్మగారు టెలికమ్యూనికేషన్స్లో డివిజనల్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. ఆయన ఉద్యోగంలోని బాధ్యతల ఒత్తిడి వల్ల నిత్యం విధిగా చేయదలచిన దేవతార్చన నిర్వర్తించలేక ధర్మ సంకటానికిలోనై ఒక రోజు అమ్మ వద్ద ‘గాయత్రీ జపమైనా చేయలేక పోతున్నానమ్మా! ప్రయాణం చేస్తూనో, ఆఫీసులో కుర్చీలో కూర్చునో స్మరిస్తాను’ – అని బాధపడ్డారు. అందుకు అమ్మ, “కాలం మారిపోయింది నాన్నా! కాలాన్ని అనుసరించి మన ఆలోచనలు, పద్ధతులూ మారాలి. నువ్వు పుట్టిన కులాన్ని బట్టి జపతపాలు నీ స్వధర్మం అనుకుంటున్నావు. కులాలు వృత్తిని బట్టి ఏర్పడినై. ఇప్పుడు నీ వృత్తివేరు. దానిని బట్టే నీ ధర్మం. నీ ఉద్యోగంలో నీతి, నిజాయితీలతో ఉండడమే నీ ధర్మం -” అని కర్తవ్యమే దైవమని ప్రబోధించింది. మౌలికమైన తత్త్వచింతన చేసి నీకు వీలైనట్లు చేసుకో, నాన్నా సంకోచం వద్దని సమాధాన పరిచింది. ఇలాంటి సందర్భాలలో అమ్మ మాటలు మనలోని అపచారము అపరాధము.. అనే భావనల్ని పోగొట్టి అభయ ప్రదాలవుతాయి. చిన్న తనం నుండి అమ్మకు విచికిత్స స్వభావ సిద్ధం. అమ్మ చాలా సందర్భాలలో మూఢమైన ఆచారాలను ఖండించింది. మనస్సుకి ఎంతో ప్రాముఖ్యాన్నిచ్చింది.

“దేవులాడినా దొరకని వాడే దేవుడు, దేవుణ్ణి గురించి తెలుసు కోవటమంటే లేడని తెలుసుకోవడమే” – అన్న వాక్యాలు వింటే అమ్మ నాస్తికురాలేమో అని సందేహం కలుగుతుంది. కాని “జగన్మాత అంటే జగత్తుకు మాత కాదు జగత్తేమాత” అని విశ్లేషించిన అమ్మ దృష్టిలో దైవం సర్వాంతర్యామి కాడు: సర్వమూ తానైన వాడు. చీమలో దోమలో కాదు. చీమగా దోమగా అన్ని రూపాలలో ఉన్నది ఒకే పరతత్త్వమని ప్రవచించింది. తార్కికులు నేతివాదంతో బ్రహ్మతత్త్వాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తే, “అంతా అదే, నాన్నా! అది కానిది కనిపించదు” అంటూ శరీరాన్ని కూడా ఆత్మగా అంగీకరించింది అమ్మ. సతులు, సుతులు… అనే మోహం వద్దని వైరాగ్యమే అభయమని ప్రాచీన సంప్రదాయం ప్రబోధిస్తుంటే “సర్వత్రా అనురాగమే విరాగము” అని సరిక్రొత్త నిర్వచనం చేసింది. “నీ బిడ్డ యందు ఏమి చూస్తున్నావో అందరి యందూ దానిని చూడటమే బ్రహ్మ స్థితిని పొందటం” – అని ఆధ్యాత్మికానికి లౌకికానికి మధ్య తెరదించింది. మంచి చెడుల విచక్షణ లేకుండా అందరినీ కన్నబిడ్డల్లా ప్రేమించమంది. అసహాయంగా దీనంగా ఏ ఒక్కరు కనిపించినా అమ్మ చలించి పోయేది. తన వంటి మీది నగలనే కాదు బట్టలను సైతం తీసి ఇచ్చిన సంఘటనలు అమ్మ బాల్యంలో ఎన్నో. తాను కష్టపడి అయినా ఎదుటి వాళ్ళ అవసరాలు తీర్చటం అమ్మకు ఎంతో ఇష్టం. ఒకసారి భారతి అత్తయ్య ఇంకొల్లు – పావులూరు మధ్యలో గల ఆంజనేయస్వామి గుడికి ప్రదక్షిణలు చేసుకోవటానికి వెళ్ళి, కొన్ని రోజులు అక్కడే ఉన్నది. ఆమె తోపాటు ఉన్న అమ్మ రోజూ గుళ్ళో ప్రసాదంగా పెట్టిన వడపప్పును పచ్చడి చేసి ఆ దారినే పొలాలకు వెళ్ళే వాళ్ళను పిలిచి పెట్టేది. ‘అన్నం ఉన్నా దాన్ని తినటానికి ఆధరువు ఉండాలిగా’ అని అవసరం విలువైనది అని అతి చిన్నతనంలోనే అమ్మ గుర్తించింది. ప్రతి వ్యక్తీ ఇతరుల గురించీ వారి అవసరాల గురించి ఇలా ఆలోచిస్తే కక్షలూ కార్పణ్యాలూ కనుమరుగై ఈ ప్రపంచమే భూతల స్వర్గంగా మారి పోదూ ! “మీరు తినకపోతే చిక్కిపోతారు, నేను పెట్టుకోకపోతే చిక్కిపోతాను” అనే అమ్మ – “మీకు పెట్టడం మీ చేత పెట్టించటానికే” అని విస్పష్టంగా ప్రకటించింది. అది అన్నం కావచ్చు. బట్టలు కావచ్చు. ఆత్మీయత కావచ్చు. మనకు పంచిపెట్టి మన ద్వారా ఇతరులకి, వారి ద్వారా మరి కొందరికి ఇలా అంచలంచలుగా సాగి ఎల్లలోకం ఒకే ఇల్లై మనుగడ సాగించాలని అమ్మ కోరిక.

ఒకసారి విజయనగరం నుంచి వచ్చిన కుటుంబం వాళ్ళపిల్లవానికి అమ్మచేత అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. పలకా బలపంతోపాటు అమ్మకు నివేదన చేయటానికి చాక్లెట్లు కూడా తీసుకువచ్చారు. అక్షరా భ్యాసం అయింది. ‘ఓం’ అక్షరం వ్రాసి అమ్మ పిల్లవాని చేత దిద్దించింది, పలికించింది. మన దృష్టిలో కార్యక్రమం అంతటితో అయిపోయినట్లు. అమ్మ పిల్లవాని చేతిలోని పలకా బలపమూ తీసుకొని తల్లిచేతికి అందించింది. చాక్లెట్ ఒకటి తీసి పిల్లవాసి నోటికి ప్రేమగా అందించిది. వాడు దానిని సంతోషంగా చప్పరిస్తుండగా అమ్మ వాడి దోసిలి నిండా చాక్లెట్లు పోసి అందరికీ పంచమన్నది. వాడు అందరికీ పంచుతూంటే అమ్మ ఆనందంగా చూస్తూ, “ఇదే అసలైన అక్షరాభ్యాసం. జీవితంలో నేర్చుకోవలసిన ప్రథమ పాఠం, ప్రధాన పాఠం ఇదే” అన్నది. అమ్మ మనకు అందిస్తున్న సందేశసారమిది. ప్రకృతి ప్రసాదించిన యావత్సంపదను మనుష్యులంతా సమంగా పంచుకోగలిగితే ప్రపంచంలో దారిద్య్రం అనేది ఉండదు. కొద్ది మందిలో వెట్టితలలు వేసే స్వార్ధమే లోకంలో అశాంతికి ఎన్నో అకృత్యాలకు మూలం. మనిషి అధఃపతనానికి ఇదే కారణం. త్యాగమే మానవుణ్ణి మాధవుడిగా, నరుణ్ణి నారాయణుడిగా పరివర్తింప చేస్తుంది అని అమ్మ ప్రబోధం. నాల్లు, నావారు, నా ఊరు, నా జాతి, నాదేశం ఇలాపరిమితులతో కూడిన మమకారం మానవత్వ మని, పరిమితులు లేని మమకారమే మాధవత్వమని విస్పష్టంగా ప్రకటించింది. సాటివారి పట్ల స్పందన, సానుభూతి, ప్రేమ, కరుణ, త్యాగం, రాగం… ఇవన్నీ మానవుడు మాధవుడుగా ఎదిగే పరిణామ క్రమంలో సోపాన పరంపరలే.

ఒకొనొక సందర్భంలో విజయనగరం నుంచి రోటరీక్లబ్బు వాళ్ళు అమ్మ దర్శనానికి వచ్చారు. “క్లబ్బు తరపున మీరేం చేస్తారు?” అని అమ్మ అడిగితే, ‘సమాజ సేవ’ అని చెప్పారు. ‘మాకేదైనా సెలవివ్వండమ్మా’ అని అమ్మను అడిగారు. ఆచరణ వాది అయిన అమ్మ ఆనాడు మరి ఎందుకో తన అమృత సందేశాన్ని ఇలా అందించింది – “చేయవలసింది చాలా ఉంది, నాన్నా! అనాధలై అనేకులు ఉన్నారు. వికలాంగులు. ఏ ఆధారం లేని వాళ్ళ లోకంలో ఎందరో ఉన్నారు. వారందరినీ ప్రేమగా చూడండి. వారిపై ఆదరణ చూపండి. అందరూ ఒకరి కొరకు ఒకరు తోడుగా బ్రతుకును పండగ్గా చేసుకోవాలి. అయితే అది వారిపై జాలితో చేసే సహాయమని అనుకోక వారిని భగవత్స్వరూపులుగా భావించి సేవ చేయండి. కనిపించని దేవునిపై మనసు నిలవడం లేదని ఏకాగ్రత కుదరడం లేదనీ బాధపడక కనిపించే యీ దేవుళ్ళను ప్రేమతో ఆరాధించండి ఇలా అందించింది.

కాలంతోపాటు మనమూ మారాలి. పూర్వం మనిషి ఒక రూపమో, నామమో, భావమో ఆధారం చేసుకుని సాధన చేసి తరించేవాడు. అది వ్యక్తిగతమైన సాధన. కానీ అంతకంటే సులభమైన మార్గం ఉంది. అది పదిమందితో కలిసి పని చేయడం; పది మంది కోసం పని చేయడం. మమకారాన్ని చంపుకోవటం కాక పెంచుకోవటం. పరిమితమైన ప్రేమను విస్తృతం చేసుకోవడం. నేటి మానవ ధర్మం ఇదే ననుకుంటున్నాను అంటూ కాలానుగుణంగా ధర్మ మార్గాన్ని నిర్దేశించింది. ఆ దారిలో చేయిపట్టి నడిపించింది. పదిమంది కోసం పదిమందితో కలిసి పనిచేయడం అనేది ఈనాడు ఒక యాగం. అది ఒక యోగం.

ఆలయాల నిర్వహణ విషయంలోనో, సేవా కార్యక్రమాలు అమలు చేసే విషయంలోనో అందరింటి సభ్యుల ఆలోచనా సరళిలో భిన్నత్వం గోచరించవచ్చు. అది వైవిధ్యమే కాని వైరుధ్యం కాదు. గుహుని భక్తి తత్పరతలు కొందరివి. శబరి రక్తి మధురిమలు మరి కొందరివి. గోపకాంతల్లా ఆత్మార్పణం చేసే వారు కొందరైతే, అన్నమయ్యలా రస సంతర్పణ సాగించేవారు మరి కొందరు. గాడి పొయ్యినే యజ్ఞకుండంగా భావించి ఎందరు ఏ వేళ వచ్చినా ఆదరంగా వండి వడ్డించేవారు కొందరు. అన్న దాతలంతా అమ్మకు వారసులేనని మాతృయాగంలో పాలు పంచుకుని మురిసిపోయే వారు మరి కొందరు. అమ్మ కన్న కలను సాకారం చేయాలని వర్గం లేని స్వర్గంగా అందరింటిని రూపొందించాలని తమ విశ్రాంత జీవితంలో అవిశ్రాంతంగా తపించే అన్నయ్యలు కొందరు. కన్నవారే బరువై పోయిన ఈ కాలంలో అమ్మనే నమ్ముకున్న వృద్ధులను, అనాధలను అక్కున చేర్చుకుని ఆదరించే అక్కయ్యలు కొందరు. వారి సేవా విరాజిత సప్తవర్ణ శోభలతో హరివిల్లులా విరిసిన మీ అందరింటి ముఖ చిత్రమే అమ్మ సాగించిన వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రత్యక్ష సాక్ష్యం. రక్తసంబంధాలే రిక్తబంధాలుగా మారుతున్న నేటి సమాజంలో అమ్మ తన బిడ్డల అంతరంగాలను దివ్య మాతృమమకార బంధంతో అనురాగ మాలికను కూర్చింది. ఆ ఏకోదర సంబంధ బాంధవ్యమే విశ్వమానవ సౌభ్రాతృత్వానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి ఆదర్శప్రాయం.

(ఈ వ్యాసము 2011 నవంబరు 18-20 తేదీలలో జిల్లెళ్ళమూడిలో నిర్వహించబడిన “అమ్మతత్త్వచింతన మహాసదస్సులో సమర్పించడినది).

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!