అనంతమైన శక్తి పరిమితమైన రూపాన్ని ధరిస్తే దానిని మనం అవతారం అంటున్నాం. ఏ అవతారమూర్తికి అయినా జగదుద్ధరణమే – గాడి తప్పిన వ్యవస్థను సన్మార్గంలోకి తేవడమే ఏకైక లక్ష్యం. దానినే మనం ‘ధర్మ సంస్థాపన అంటున్నాం.
లాలనతో లోకాలను పాలించే జగన్మాతగా అవతరించిన అమ్మ ప్రేమకు మరో రూపం. “తల్లికి తప్పే కనిపించదు” అని దుష్టశిక్షణ కాక; దుష్టత్వ శిక్షణను తన లక్ష్యంగా ఎంచుకున్న అమ్మ విధానం ఎంత విశిష్ఠమైనదో అంత విలక్షణమైనది. “మీరు నా బిడ్డలేకాదు నా అవయవాలు కూడా” అని మనతో తాదాత్మ్యాన్ని ప్రకటించిన అమ్మ ముందుగా తన ఆశయాలకు అనుగుణంగా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది మన ద్వారా తన సందేశాన్ని భావితరాలకు అందించాలనీ సమాజాన్ని వర్గం లేని స్వర్గంగా రూపొందించాలనీ ఆకాంక్షించడం ఎంతైనా సహజం.
కాలగమనంలో మానవసంబంధాలు శిధిలమై అనుబంధాలు అదృశ్యమై స్వార్థమే పరమార్థంగా సాగిపోతున్న సమాజంలో శాంతి సౌఖ్యాలను సుసంపన్నం చేయటానికి అమ్మ ప్రేమను దివ్యాస్త్రంగా మలచుకుంది. సహనం, సానుభూతి, కరుణ, త్యాగం, ప్రేమ అనే ఆ వృక్షానికి కొమ్మలూ రెమ్మలే. సమాజమంటే వ్యక్తుల సమాహారమే. సమిష్టి చైతన్యానికి ప్రతీక వ్యక్తి. నింగిని తాకే నూరంతస్తుల మేడకైనా నేలలోని పునాదులే ఆధారం కదా! ఎంతటి బృహత్తర కార్యక్రమానికైనా వ్యక్తి నిర్మాణంతోనే శ్రీకారం. వివేచనతో చూస్తే వ్యక్తిత్వరూప కల్పన వల్ల మనిషి క్రియాశీలి అవుతాడు. కార్యదక్షుడు అవుతాడు. కర్మయోగి అవుతాడు. పరిణతి చెందిన వ్యక్తుల ప్రవర్తన, ఆలోచనా సరళి చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. సుసంపన్నం చేస్తాయి.
మనిషి వ్యక్తిత్వం వ్యక్తిగతమని సామాజికమని ద్విముఖంగా సాగుతుంది. మనిషి తనకోసం తాను ఏర్పఱచుకునే అభిరుచులు, అలవాట్లు, ఆలోచనలు వ్యక్తిగతమైనవి. సమాజం పట్ల మనిషి దృక్పథం, దానితో ఏర్పఱచుకునే సంబంధ బాంధవ్యాలు సామాజిక విషయాల పట్ల అవగాహన, బాధ్యత, నిబద్ధత వంటివి సామాజికమైనవి. మనిషికి వ్యక్తిగత శీలం ఎంత ముఖ్యమో సామాజిక స్పృహ అంతే అవసరం. ఇందులో ఏది లోపించినా మనిషి జీవితం అసమగ్రకావ్యంలా అర్ధం లేనిదవుతుంది. అందుకే డా॥ సి. నారాయణ రెడ్డి
‘అక్షరం నా నిధి అంబరం నా అవధి సముద్రాలు దాటోచ్చినా సమాజం నా పరిధి’ – అని ప్రకటించారు. కాబట్టి వ్యక్తిత్వ నిర్మాణం అంటే పరోక్షంగా సమాజనిర్మాణమే.
సాటి మనిషి పట్ల స్పందన కరవై ఊసరక్షేత్రాలుగా మారిన మానవ హృదయాలను ప్రేమ కేదారాలుగా మార్చటానికి కరచరణాదులు, కదలివచ్చిన కారుణ్యరస సింధువు అమ్మ. ఎలా జీవిస్తే మనిషి జీవితానికి సార్ధకత లభిస్తుందో, ఎలా ప్రవర్తిస్తే మనిషి తనకే కాక తన చుట్టూ ఉన్న సమాజానికి శాంతి సౌఖ్యాలు సమకూర్చగలదో అమ్మ ఆచరణాత్మకంగా ప్రబోధించింది. అపారమూ, అవ్యాజమూ అయిన తన ప్రేమ ద్వారా పరిపూర్ణమైన జ్ఞానం ద్వారా నరుడు నారాయణుడుగా, మానవుడు మాధవుడుగా పరిణతి చెందటానికి సులభమూ, సుగమమూ అయిన మార్గాన్ని మానవాళికి అందించింది. అమ్మ ఆచరణే మనకు అందించిన సందేశం. ఎవరైనా సహజంగా మంచివాళ్ళను ప్రేమిస్తారు. చెడ్డవాళ్ళను ద్వేషిస్తారు. కానీ అమ్మ కులమత వర్గాలకే కాదు గుణాలకు కూడా అతీతంగా అందరినీ తన బిడ్డలుగా ప్రేమిస్తుంది. ఆదరిస్తుంది. “మంచి వాళ్ళను లోకమెలానూ గౌరవిస్తుంది. చెడ్డవాళ్ళకు నా ఒళ్ళోనైనా స్థానం లేకపోతే ఎలా?” – అని వాత్సల్యంతో అక్కున చేర్చుకుని ఆదరించిన సందర్భాలు, జాలరి, మంత్రాయి వంటి వారిని సంస్కరించిన సంఘటనలు ఎన్నో. మనిషి ప్రవర్తనలోని మంచి చెడులకు అతని ప్రమేయం లేదు, మనస్సే కారణం. ఆ మనస్సులో కలిగే ప్రేరణ, సంకల్పం భగవంతుడిదే అని చెప్పి మన మనస్సులలో చెడ్డవాళ్ళపట్ల ఉండే ద్వేషాన్ని చల్లార్చి సరికొత్త ఆలోచనకు తెరతీస్తుంది అమ్మ.
మమత, సమత మానవత ఇవే అమ్మలో కనిపించే ప్రత్యేకతలు. – “సర్వసమ్మతమే నా మతం” అని ప్రకటించిన అమ్మ అన్ని మతాలను సమానంగా ఆదరించింది. ఒక సందర్భంలో “చర్చలంటే ఇష్టం లేదు కానీ చర్చి యిష్టమే” అని చమత్కరించిన అమ్మ తన పర్యటనలో ఎన్నోమార్లు చర్చిలకు వెళ్ళింది. అస్పృశ్యతా భావం వేళ్ళూనుకున్న కుటుంబ వాతావరణంలో పుట్టి పెరిగినా బాల్యంలోనే జారి పడ్డ పాకీపిల్లవాణ్ణి ఎత్తుకుని భుజాన వేసుకుని ఆపద నుంచి కాపాడింది. అది చూసి జానకమ్మగారు (అమ్మకు అమ్మమ్మ) లబలబలాడుతూ, ‘మా బ్రాహ్మణత్వం మట్టి కలిపింది’ అంటే, “ఆ! బ్రాహ్మణత్వం మట్టి కలిసింది. కనుకనే పసివాణ్ణి ఎత్తుకోలేకపోయా’రని సమాధానం చెప్పింది. బ్రహ్మతత్వమే బ్రాహ్మణత్వమని నిర్ద్వంద్వంగా ప్రకటించింది. అమ్మ గుడివాడ పర్యటనలో ప్రక్కనున్న వాళ్ళు ఒక ముస్లింని ‘ఇతను ముసల్మాను’ అని అమ్మకు పరిచయం చేశారు. అమ్మ “నేనూ ముసలమ్మనేలే” అని నవ్వుతూ పలకరించింది (అంటే ముసల్మాన్కూ అమ్మనే అని). అమ్మ చిన్నతనంలోనే ఖాసిం, మౌలాలి వంటి ముస్లిం సోదరులు, మంత్రాయి వంటి క్రైస్తవులు అత్యంత సన్నిహితులై అమ్మ ఆదరణకు పాత్రులయ్యారు. “ఆచరించే వాడికి బైబిలు, ఖురాను, గీత ఒకటే” అని అన్ని మతాల పట్ల సమదర్శనాన్ని ప్రకటించింది. పూలు వేరైనా పూజ ఒకటే, మతాలు వేరైనా మానవత ఒకటే కదా! కులమతాల పేరుతో మారణ హోమాలు సృష్టిస్తూ స్వప్రయోజనాల కోసం సమాజాన్ని వర్ణాలుగా, వర్గాలుగా ప్రాంతాలుగా విడదీసి పాలిస్తున్న నేటి రాజకీయ నాయకులకు మతమౌఢ్యం తలకెక్కి మానవత్వం మరుగునపడి ఆత్మాహుతి దళాలుగా మారుతున్న ఉన్మాదులకి గొడ్డలి పెట్టుకదా అమ్మ మాట. సమన్వయ సూత్రంతో సర్వమానవ సౌభ్రాతృత్వానికి దారి తీసేది కదా అమ్మ బాట.
ప్రతి మనిషీ సుఖసంతోషాలతో ఆనందంగా జీవితం గడపాలని కోరుకుంటారు. తన కష్టాలను కడతేర్చమని భగవంతుణ్ణి ప్రార్ధిస్తాడు. ఒక సందర్భంలో విజయవాడ నుండి వచ్చిన ఒక సోదరుడు తన సమస్యలు, కష్టాలు అమ్మకు చెప్పుకుని బాధల నుండి విముక్తి ప్రసాదించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని లోకానికి గీతా ప్రబోధం చేసినట్లు అమ్మ ఈ సందర్భంలో, “నాన్నా! ఎక్కడ ఉన్నా ఏం చేసినా ఎవరి దయావీక్షణాలు ఉన్నా కష్టాలు తప్పవు. ఎందుకంటే జీవితంలో అవీ ఒక భాగం. కాలగతిలో కష్టం రూపం మారవచ్చు కానీ కష్టం తప్పదు. ఒక కష్టం తొలిగితే, మరొక కష్టం. ఒక సమస్య పరిష్కారమైతే మరో సమస్య తప్పదు. ఇక యీ జపాలూ, ధ్యానాలూ నామస్మరణల వల్ల కష్టాలు అనుభవిస్తున్నా బాధ అనిపించదు. భరించేశక్తి వస్తుంది. అంతే-” అని అనంతమైన జీవనసత్యాన్ని ఆవిష్కరించింది. “ఈ ఆవరణలో ఇంతమంది ఉంటున్నారు. ఎవరినయినా విచారించు. కష్టాలు, సమస్యలు లేని వారున్నారేమో! కాకపోతే ఎవరికి తగినవి వారికుంటాయి. ఎవరి జీవితం వారికి ప్రత్యేకమైనట్లే ఎవరి కష్టం వారికి ప్రత్యేకమైనట్లే ఎవరి కష్టం వారికి ప్రత్యేకం. ఎవరికి ఏది యిష్టం కాకపోతే అది వారికి కష్టం. ఎవరు ఏది భరించలేక పోతే వారికది బాధ” అని అపూర్వంగా నిర్వచించింది. బుద్ధుడు చావులేని యింటి నుండి గరిటెడు ఆవాలు తెమ్మని కనువిప్పు కలిగించినట్లు అడిగిన వారికేకాక అందరికీ సత్య సందర్శనం చేయించింది.
ఎంతటి వారికైనా జీవన సమరంలో సమస్యలతో పోరాటం తప్పదని హెచ్చరించింది. జీవితమంటేనే సమస్యల తోరణం కదా! అమ్మ జీవితాన్నీ పరిశీలిస్తే తల్లిలేని పసిప్రాయం నుండి విశ్వజననిగా వినతులందుకునే దశవరకూ బాధల పల్లకీ విహారమే. పుటపాకంతో బంగారం వన్నె పెరిగినట్లు బాధలు మనిషి వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతాయి. అందుకే అమ్మ “బాధే చైతన్యం. బాధలేకపోతే జీవితంలో అందమే లేదు” అని చెప్పింది. నిజమే. చీకటి లేకపోతే వెలుతురుకు విలువలేనట్లు బాధలేకపోతే సుఖం విలువ తెలియదు. ఎండ తీక్షణతను భరించిన వాడికే తొలకరి జల్లుల అందం, ఆనందం అనుభవంలోకి వస్తుంది. ద్వంద్వాలతో కూడినదే జీవితమనే సత్యం మనిషికి భ్రమలు లేని బ్రతుకును అందిస్తుంది. ఈ విధంగా ద్వంద్వానుభవమే ఆనందమనే అవగాహనను నిశ్చలమూ, నిర్వికారమూ అయిన మనస్తత్వాన్నీ అమ్మ మనకు ప్రసాదిస్తుంది.
ఒకానొకదశలో శారీరకంగా, మానసికంగా అమ్మ చుట్టూ ఎన్నో సమస్యల వలయాలు – అవి సృష్టించే విలయాలు. అమ్మ ఒక గృహిణిగా ‘సరే’ మంత్రాన్ని జపించి వాటిని జయించింది. బాధలనే పూజా ద్రవ్యాలతో సహనదేవతను ఆరాధించిన సహనశ్రీ మన అమ్మ. ‘క్షమయాధరిత్రీ’ అన్నదానికి అమ్మచరితం అక్షరసత్యం. “అనుభవమే శాస్త్రానికి మూలము” అన్నది అమ్మ స్వీయ అనుభవసారమే. అమ్మ ప్రబోధం మన అంతరంగాలలో దోబూచులాడే అవివేకపు తెరలను తొలగిస్తుంది. అచ్చమైన విజ్ఞానపు వెలుగులో కఠోరమైన జీవిత సత్యాలను కమనీయంగా దర్శింప జేస్తుంది. జీవన సమరాంగణంలో అలసి సొలసిన మనిషిని కర్మవీరునిగ తీర్చిదిద్దుతుంది. ఒక పని మంచి అని చేయబోతే చెడుగా మారటం, పూలమాల అని పట్టుకుంటే కాలనాగై కాటు వేయటం, చేతులు కాలాక మనం ఆకుల కోసం వెదుకులాడటం, పడిన కష్టానికి ప్రతిఫలం లేకపోగా నిందలుమోయవలసి రావటం, జరిగిన వాస్తవాన్ని ఎదుటి వాళ్ళకు ఎలా చెప్పాలో అర్థం కాక మనం అయోమయావస్థలో పడటం… ఇలాంటి చేదు అనుభవాలు ప్రతి మనిషి జీవితంలోను ఏదో ఒక సందర్భంలో తప్పవనుకుంటాను. అలాంటి స్థితిలో అమ్మ చేసిన యీ ప్రబోధం చీకటిలో వెలుగుబాటను వెలారుస్తుంది. “అనుకున్నది జరగదు, తన కున్నది తప్పదు, నాన్నా! మన క్రియలకు మనం కర్తలం కాదని తెలుసుకుంటే జీవితంలో ఒడిదుడుకులుండవు. ఏం చేసినా భగవంతుడు చేశాడను కోవటమే సుఖానికి మార్గం. అపుడంతా ఆనందమే”.
నిజమే. నిర్లిప్తంగా నిష్కామంగా ఒకపని చేయగలిగితే ఫలితం దానంతట అదే సిద్ధిస్తుంది. ‘కర్మణ్యేవాధికారస్తే’ అన్న గీతాప్రబోధ సారమదే కదా! కానీ ఫలాపేక్ష లేకుండా ధర్మమాచరించు. పుణ్యం చెయ్యి’ – అనే మాటలు వినటానికి బాగానే ఉన్నా ఆచరణలో సాధ్యమా? సామాన్యుని దృష్టిలో నిష్కామ కర్మాచరణ మంటే గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టే. అలాంటి సందర్భంలో అమ్మ “చేతలు చేతుల్లో లేవని” తెలుసుకుని “తోచిందేదో చెయ్యి. తోపించేది వాడే’ అన్నది. ఇది విని, ‘ఇదేదో బాగానే ఉంది. మంచి అవకాశం. ఏది అనిపిస్తే అది చేసేయవచ్చు” – అనుకుంటే అది మనభ్రమ. మనం చేసే ఏ పనికైనా ప్రేరణ భగవంతునిది అనే దృఢ విశ్వాసం, సంస్కారం ఉన్న మనిషి అంత తేలికగా తప్పు చేయలేడనేది వాస్తవం. ఒకవేళ తప్పు అని తెలిసీ తప్పించుకోలేని పరిస్థితులలో తప్పు చేసినా తనను తాను సరిదిద్దుకోవాలనే ఆలోచన ఆ వ్యక్తి మనస్సును వెంటాడుతూనే ఉంటుంది. నిరంతరం అంతరంగంలో ఆ తపన కొనసాగితే ఎన్నో సాధనల ఫలితం అప్రయత్నంగా సిద్ధించినట్లే. అనుభవసారంగా అమ్మ చెప్పిన ఏ వాక్యాన్ని తరచి చూచినా ఆచరణకు దారి తీస్తూ వ్యక్తిత్వ నిర్మాణంలో భాగమవుతుంది.
(సశేషం)