‘సుందర మందహాస పరిశోభితమైన ముఖారవిందమున్
పొందుగ దివ్యకాంతి పరిపూరితమై వెలుగొందు నేత్రముల్
అందము నాకృతిం గలిగి హాటకశోభకు నాలవాలమై
చందము పొందియున్న వికచందము రూపము అమ్మ దాల్చగా –
ఈ సమస్త సృష్టికి మూలం అమ్మ, నదిపించేది అయించేది అమ్మ.
విశ్వప్రేమను విశ్వానికి అందించే నిమిత్తం మానవ రూపంలో మన్నవ గ్రామంలో అనసూయగా ఆవిర్భవించింది. జిల్లెళ్లమూడిలో కాలు పెట్టి, తన ఇంటికి అందరిల్లు అని నామకరణం చేసింది. లక్ష మందికి ఒకేసారి భోజనం పెట్టి, వారు తింటుంటే ఆనందపడి తృప్తిగా ట్రేపుమని త్రేన్చే తత్వం అమ్మది.
అమ్మ మాటలలో ఉపన్యాస ధోరణి లేదు. కేవలం వాడుక మాటలే అమ్మ మాటలు, కానీ మాటలశక్తి అపారం, అవి హృదయాంతరాలలోకి చొచ్చుకుపోగల ఆణిముత్యాలు.
అమ్మ అనుభవమే అమ్మ మాట, జీవితాన్ని నిస్సందేహంగా దర్శింపజేసే అమృతధార. ప్రేమ పాఠంలో అందరినీ ఒక్కటిగా కట్టి వేయటమే అమ్మతత్త్వం. తరగని తన అనురాగజలధి నుండి అందరికీ అవ్యాజంగా ప్రేమను పంచుతూనే ఉన్నది.
ఎవరికి వారు అమ్మలో తమ కన్నతల్లినే కనుగొంటూ ఆ అనురాగ బంధంలో పులకించి పోతున్నారు. ఆ లాలనలో తృప్తిని హాయిని కాంతిని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అమ్మను తమ సినలైన కన్నతల్లిగా దర్శించి పరవశిస్తున్నారు.
అవతారమూర్తి అమ్మ చేతిలోని అనురాగాస్త్రమే సమ్మోహనాస్త్రం, బ్రహ్మాస్త్రం. అమ్మ అవతార పరమలక్ష్యం. సర్వజీవకోటి సముద్ధరణ.
ఆది మూలము అమ్మ, సర్వజీవ జీవన సంజీవని అమ్మ..
విశ్వం అమ్మ, విశ్వసవిత్రి అమ్మ