నేను శ్రీ వల్లూరి జగన్నాధరావుగారి మూడవ అమ్మాయిని. మా నాన్నగారు గుంటూరులో మాజేటి గురవయ్య ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ అనంతరం జిల్లెళ్ళమూడిలో ‘మాతృశ్రీ విద్యాలయం’ ప్రిన్సిపాల్ గా పనిచేశారు. వారికి అమ్మ ఎడల అమితమైన భక్తి. వారు జిల్లెళ్ళమూడి వస్తూ మమ్మల్ని కూడా తీసుకునివచ్చేవారు. వారి కోరిక – మేమంతా అన్నపూర్ణాలయంలో సేవ చేసుకోవాలని.
ఈ ఏడాది అమ్మ శత జయంతి మహోత్సవాలు జిల్లెళ్ళమూడిలో జరుగుతున్నవని తెలిసి స్వచ్ఛంద సేవకులుగా మా పేర్లు నమోదు చేయించుకున్నాము. నా వయస్సు 55 ఏళ్ళు పైనే. చిన్న చిన్న ఇంటి పనులు చేసినా Spondylosis సమస్యతో చేయి నొప్పి వచ్చి రాత్రి నిద్ర పట్టేదికాదు. ఈ పరిస్థితిలో నేనేమి సేవచేయగలనని మా అక్క కుమారుడు P. గిరిధరకుమార్ (SVJP Managing Trustee) తో అన్నాను. “మీరేమి దిగులుపడవద్దు. అమ్మే మిమ్మల్ని పరుగెత్తిస్తుంది. వచ్చేయండి” అన్నాడు. ఆ మాట ధైర్యా న్నిచ్చింది. అమ్మ (Photo) ముందు నిలబడి “అమ్మా! మాకు నీ సేవ చేసుకునే భాగ్యం, మా నాన్నగారి కోరిక సఫలం అయ్యేట్లు అనుగ్రహించు, ఆశీర్వదించు” అని వేడుకున్నాను.
కాగా అమ్మ శతజయంతి ప్రారంభం కావటానికి వారం రోజుల ముందు నాకు జ్వరం వచ్చి తగ్గింది; బాగా నీరసంగా ఉంది. కనీసం అమ్మ దర్శనం అయినా చేసుకోగలనా – అనే అధైర్యం వచ్చింది.
అమ్మ కృప అన్ని అవరోధాల్నీ అవలీలగా ప్రక్కకు నెట్టింది. జిల్లెళ్ళమూడి వెళ్ళాను. అంతేకాదు. అనుదినం ఉదయం గం. 7.30 ల నండి గం. 9.30 వరకు అన్నపూర్ణాలయంలో కూరలు తరగటం, క్రమం తప్పకుండా మధ్యాహ్నం, రాత్రి భోజన సమయాల్లో వడ్డన చేయడం, సాయంకాలం అమ్మ దివ్య సన్నిధిలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో – పాల్గొనే అదృష్టం కలిగింది.
ఆశ్చర్య అలా వారం రోజులు క్రింద కూర్చొని కూరలు తరిగినా, వంచిన నడుం ఎత్తకుండా వడ్డనలు చేసినా కాళ్ళు – మోకాళ్ళ నొప్పులు, చెయ్యినొప్పి రాలేదు. దీనిని మహిమ అనాలో, లీల అనాలో, కృప అనాలో – ఎలా అర్థంచేసుకోవాలి? ‘నేనుసైతం’ అన్నట్లు ఆ మహోత్సవ సంరంభవేళ కించిత్ సేవ చేసుకోగలిగాను – అనే సంతృప్తిని అమ్మ ప్రసాదించింది. అంతే.
హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమై గుంటూరు దాటాను. చెయ్యినొప్పి మొదలైంది. నేను ఉన్నాను అని గుర్తు చేసింది. tablet వేసుకున్నాను, శాంతించింది;
జిల్లెళ్ళమూడిలో అమ్మ సేవ చేసుకున్న ఐదు రోజులు రాత్రి గం. 10.00 లకు పడుకుంటే ఉదయం గం. 5.30 కి మెలకువచ్చేది. అతః పూర్వం మాదిరిగా నిద్రపట్టకపోవటం అనే సమస్య తలెత్తలేదు. కాబట్టి – మంచి నిద్ర కావాలంటే అంత శారీరక శ్రమ అవసరమని ఒక మంచిమాటని ఈ అనుభవం ద్వారా అమ్మ ప్రబోధిస్తోందా అనిపించింది.
వచ్చేముందు ప్రేమమూర్తి, వాత్సల్యామృత వర్షిణి అయిన అమ్మ ఆలయానికి వెళ్ళి మా నాన్నగారి కోరిక నా అభ్యర్థన నెరవేర్చినందుకు నిండు మనస్సుతో కృతజ్ఞతతో అమ్మ శ్రీ చరణాలకు నమస్సుంజలులను సమర్పించాను.