అమ్మ శతజయంతి సంవత్సర శుభారంభ సందర్భంగా ఏప్రిల్ 10వ తేదీన వైభవంగా శోభాయాత్ర జరిగింది. ఉదయం 5గం.కు బాపట్లలో చిదంబరరావు తాతగారి ఇంటి ఆవరణలో అమ్మ నాన్నగార్లకు, హైమకు అర్చన చేసి నిర్వాహకులు యాత్ర ప్రారంభించారు.
బండిపై చిత్రపటం రూపంలో చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ, అమ్మ ఈ యాత్రకు తన ఆమోదముద్ర వేయగా, ఆ వెనుక ఊరేగింపుగా యాత్ర ప్రారంభమైంది.
బాపట్ల రైల్వేస్టేషను నుండి శివాలయం, అక్కడినుండి భావనారాయణస్వామి దేవాలయం, రథం బజారు, గడియార స్తంభం మీదుగా యాత్ర కొనసాగింది. పై వంతెన మీదుగా జిల్లెళ్ళమూడి వైపుగా అమ్మ బిడ్డలు విశేష సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొన్నారు. చీరాల, గుడివాడ, విజయవాడ ప్రాంతాలనుంచి కూడ ఎందరో సోదరీ సోదరులు వచ్చి ఈ యాత్రలో భాగస్వాము లయ్యారు. కొందరు తమ సొంత వాహనాలపై వచ్చి కలిశారు. ప్రతి మజిలీలోనూ మరికొందరు యాత్రికులు చేరుతూ రాగా, అందరూ కలసి పెద్ద బృందంగా ఈ యాత్రలో పాల్గొనడం ఆనందోత్సాహాలను కలిగించింది.
బాపట్ల పొలిమేరలోని ఆంజనేయస్వామి దేవాలయంవద్ద మజిలీవేసి, ఉ.9గం.కు ఈ యాత్ర జమ్ములపాలెం చేరింది.
అక్కడ గ్రామపెద్ద శ్రీ బసంత్, పాఠశాల ఛైర్మన్ శ్రీ రమేష్ ప్రభృతులు అమ్మను దర్శించుకుని, యాత్రికు లందరికీ చల్లని మజ్జిగ పాకెట్లు అందించి, ఆనందించారు.
6వ మైలు మజిలీలో కూడ అజ్ఞాత భక్తులు కొందరు యాత్రికులకు మజ్జిగ పాకెట్లు పంచారు. ఆ పై ముందుకు కదిలిన యాత్రలో 7వ మైలువద్ద జిల్లెళ్ళమూడి నుంచి అమ్మకు స్వాగతం చెప్తూ వచ్చి చేరిన సోదరీ సోదరులతో ఈ యాత్ర మరింత ఉత్సాహపూరిత మైంది.
బాపట్లలో 50మందితో ప్రారంభమైన శోభాయాత్ర 7వ మైలునుంచి 108మందితో పురోగమించింది. ఈ యాత్ర ప్రారంభమైన సమయంలో బాపట్లలో సోదరులు శ్రీ కొండముది సుబ్బారావు, శ్యామల దంపతులు, శ్రీ కొండముది ప్రేమకుమార్, సుబ్బలక్ష్మి దంపతులు, శ్రీ కొండముది రవి అమ్మను అర్చించుకున్నారు.
అక్కడి నుండి ప్రతి మజిలీలోనూ అమ్మకు హారతి ఇవ్వటం, కొబ్బరికాయ కొట్టి నివేదన చేయటం, అమ్మ నామసంకీర్తన సాగించటం విశేషం. సోదరులు సర్వశ్రీ మిన్నికంటి నాగరాజు, యల్లాప్రగడ వెంకటసూర్య రమణ, శ్రీరామమూర్తి, విశాలి దంపతులు, రవి, విజయ్, నాంచారయ్య, చి. భరద్వాజ, చి. రామకృష్ణ కాశ్యప్, బ్రహ్మాండం ప్రేమచైతన్య, శ్రీ గిరిధరకుమార్, డా. సిద్ధార్థ, వారణాసి ధర్మసూరి, తుమ్మలపల్లి హనుమంతరావు, వినాయకరావు, మోగులూరి ప్రేమకుమార్, అనసూయ, భానుమతి, మన్నవ నరసింహారావు మామయ్య, అన్నంరాజు సాయి దంపతులు, శ్రీ బూదరాజు శ్యామ సుందర్, శ్రీమతి బూదరాజు వాణి, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు, మేళ్ళచెరువు సాయిబాబు, శ్రీమతి లలితాంబ, శ్రీమతి బ్రహ్మాండం వైదేహి, శ్రీమతి వసుంధర అక్కయ్య ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. శోభాయాత్రికులు ఆలయంలో అడుగు పెట్టగానే వేదాశీర్వచనం జరిగింది. పిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆనందించారు. అమ్మ అనుగ్రహ సూచకంగా సోదరీ సోదరులకు కలిగిన అనుభవాలు అనిర్వచనీయం. డా.మాజేటి రామకృష్ణ వ్యాఖ్యానం, శ్రీమతి విశాలి, సుబ్బలక్ష్మి పాటలు, అమ్మ నామ సంకీర్తనం అడుగడునా అందరినీ ఉత్సాహ పరిచాయి. ఆ రోజున సూర్యుడు తన ప్రతాపం తగ్గించుకొని, యాత్రకు సహకరించటం మరింత విశేషం. అవసరం మేరకు యాత్రికులకు వాహన సౌకర్యం, టీ, కాఫీ, ఒ.ఆర్.యస్ పాకెట్లు అందించి, తగిన ఏర్పాట్లు చేసిన నిర్వాహకుల కృషి అభినందనీయం. దారి పొడవునా వివిధ వాహనాలపై ప్రయాణించే బాటసారులు ఈ యాత్రను తిలకించి, ఆనందించారు.
జిల్లెళమూడి నుండి శ్రీకాంత్, వల్లూరు ప్రేమ్రాజ్ ఈ కార్యక్రమాన్ని ఆద్యంతమూ వీడియో తీసి, భద్రపరిచారు.
అమ్మ పరిపూర్ణ అనుగ్రహానికి సంకేతంగా ఈ శోభాయాత్ర అందరికీ ఒక మధురానుభూతిని కలిగించింది.