1988 లో మా కుటుంబముతో తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో ‘శ్రీవారి’ పాదములు దర్శించుట జరిగినది. 2005-2006 సంవత్సరములో నాగేశ్వరాలయము, విఘ్నేశ్వరాయలము కట్టిన తరువాత ‘అమ్మ శ్రీచరణములు’ కూడా పెడితే బాగుండును అని మనసుకు గట్టి సంకల్పము కలిగి, ఒక శిల్పికి ఆర్డర్ ఇవ్వటము జరిగినది. 2012 జూన్ నాటికి ‘అమ్మ’ శ్రీ చరణాలు చేరాయి. మేడిచెట్టు క్రింద గానీ, రావి చెట్టు క్రిందగానీ ప్రతిష్ఠ చేయాలని అనుకొన్నాను. కానీ కాకులు, కొంగలు రెట్టలు వేస్తాయని భయపడి యాగశాలలో వుంచి ఎక్కడ ప్రతిష్ఠ చేయాలని ఆలోచనలో వుండగా “నాగేశ్వరాలయములోని ఉత్తరం వైపు స్థలం స్ఫురించింది.
రహి ఈ విషయం విని ఎంతలో పూర్తి అవుతుందని 2, 3 లక్షలతో అనుకొని ప్రారంభించమన్నాడు. కట్టుబడి మొదలు పెట్టాక మా బాబాయి మనుమరాలు జ్యోతి.. తాను తన సహకారాన్నందిస్తానంది. ఆ ఇద్దరి సహకారంతో కట్టుబడి పూర్తి అయింది. తేలికలో వాయు ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించాము. కానీ బెంగుళూరు రాజరాజేశ్వరీ పీఠాధిపతి అయిన “శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామిజీ” మీరు తేలికగా అనుకొని చేయవద్దు.
“అమ్మపాదాలు అంటే అమ్మ అక్కడ వున్నట్లే” అమ్మ పాదాలకు అవి ప్రతిష్ఠ చేసే స్థలాన్ని తలచినపుడల్లా వెంట్రుకలు గగుర్పాడుస్తున్నాయి అని రహికి చూపించి, ముందు కాలములో ఆ పాదములు స్పర్శించిన వారంతా ఆ తృప్తిని పొందుతారు. అందువల్ల మామూలుగా పూర్తి విగ్రహ ప్రతిష్ఠ చేస్తే చేయవలసిన క్రతువు మొత్తము చేయాలని రహిని ఆజ్ఞాపించారు. అందువల్ల పూర్తిక్రతువు త్రయాహ్నిక దీక్షతో ప్రతిష్ఠా కార్యక్రమమును అనుసరించి చేయటమైనది. ఈ ప్రతిష్ఠా కార్యక్రమ విధానముతో పాటు రుద్రహోమము, చండీహోమము, శ్రీ విద్యాహోమము కూడా జరుపబడినది.
అమ్మ పాదుకలకు కుంభాభిషేకము, శిఖరకలశానికి కుంభాభిషేకము, నాగేశ్వరాలయములో మహ రుద్రాభిషేకము, యాగశాలలో శ్రీ విద్యాహోమము ఏకకాలములో జరుపబడినవి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ ప్రతిష్ఠ కార్యక్రమము 11 గంటల నుండి 2 గంటల వరకు హోమ, అభిషేక, పూర్ణాహుతులు జరుపబడినవి.