అమ్మ “నాకు అంతా వర్తమానమే. త్రికాలాలు ఏకమవటమే తురీయం” అన్నారు. అమ్మ నిత్య జాగృతమూర్తి. ఇప్పుడు రాముని విషయంలో అమ్మ చెప్పిన విషయం చూద్దాం” విరామం లేని వాడు రాముడు” – అని వివరించారు. పైన అమ్మ తన విషయంలో చెప్పిన విషయమే రాముని విషయంలో తాత్వికంగా సమన్వయం అవుతుంది. అమ్మ సహజ సహనానికి, సహజ మాతృవాత్సల్యానికి సాకారరూపం. రాముడు సాకారరూపం దాల్చిన ధర్మం అని చెబుతారు. అయితే అమ్మ మాటలలో “ప్రేమకంటే ధర్మం గొప్పది. నీతి నిజాయితే దైవం” అని వున్నది. ఇప్పుడు రాముని ధర్మతత్వం, అమ్మ నీతికి ధర్మానికి ఇచ్చిన ప్రాధాన్యత ఒక్కటే. ఇదే వ్యక్తికి సమాజానికి ఆదర్శమవుతుంది; ఆరాధ్యం అవుతుంది.
ఆకర్షణ – వికర్షణ
అమ్మతో ఒకసారి సంభాషణ చేస్తున్నప్పుడు శక్తి యొక్క స్పందనలని గురించిన విషయం వచ్చింది. అప్పుడు నేను అమ్మ అన్న మాటకి ఈ విధంగా నా అభిప్రాయము తెలియ చేశాను – “ఆకర్షణ – వికర్షణ రెండూ ఒకే శక్తి యొక్క స్పందనలు. రెండూ ఒకే చోట ఉన్నయ్” – అని. అమ్మ చూస్తూ ఊరుకుంది. నేను ఆకర్షిస్తున్నాను అనుకుంటే అది ద్వైతం, అహంకారం అవుతుంది.
రామకృష్ణ పరమహంస ఒకసారి వారి సొంత గ్రామంలో దుర్గానవరాత్రులు జరుపుతారు. దుర్గాదేవీ ప్రతిమను గంగలో నిమజ్జన చేయటానికి అందరూ సమాయత్తమవుతూ వుంటారు. ఇవి నచ్చని ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ” ఈ మృణ్మయాన్ని ఎందుకు పూజిస్తారు;” అంటే, పరమహంస “మృణ్మయం అనెదరేల? ఇది చిన్మయం కదా?” అంటారు. అంటే మృణ్మయంగా వున్నది. చిన్మయమే. “మనస్సు ఎక్కడ లయమైతే అదే ఆలయం” అని అమ్మ అన్నారు. ఆలయం ప్రదక్షిణాలు ఒక స్థాయిలో అవసరమైన వారికి మంచిదే. కాని అది సర్వం కాదు. మొట్టమొదట అడుగు పెట్టడానికి పనికి వస్తుంది. ఆలయాలు, మహాత్ముల సందర్శనం, క్షేత్రాలకి వెళ్ళటం మంచిదే.
విశ్వం అంతా తానైన అమ్మ శక్తి సంచాలనం సర్వత్రా వుంటుంది. అటువంటిది తన క్షేత్ర పరిధి అనేది లేదు. పరిధి అంటే పరిమితం అవుతుంది. పూర్వం అమ్మ చెంత వున్న పిల్లలు ఓంకారనది ఒడ్డున చెట్టెక్కి మంత్రపుష్పం. చదువుతుంటే, అది తెలిసి భద్రాద్రి రామశాస్త్రిగారు “అదేమిటి? మంత్రపుష్పం అమ్మ సన్నిధిలో చదవాలికాని ఎక్కడ పడితే అక్కడ చదవటమేమిటి?” అంటే, అమ్మ “అదేమిటి? నేను అంతటా ఉన్నాను అంటూ నా సన్నిధికి గిరిగీస్తావేమిటి?” అన్నారు. సమయానికి తగు మాటలు ఆడి ఎట్లా సర్దిచెప్పాలో తెలిసిన అమ్మ ఎవరికి తగ్గట్లుగా వారితో అంటుంది.
మనస్సు లయమయినప్పుడు చేయటమనేది వుండదు. అంటే దాని స్థితి ఏమిటో అనుభవించవలసిందే. “మనస్సు లయమగునట్లు ఒక్కసారి చేసినా చాలు” అని ఒక వ్యక్తితో అమ్మ అనటాన్ని బట్టి చూస్తే ప్రదక్షిణాల విషయం కూడా అంతే. “దీని వల్ల అది వస్తుంది. దాని వల్ల ఇది వస్తుంది అంటారే కాని దీనికి కర్త ఎవ్వరో చెప్పరు” అన్నారు అమ్మ. క్రియ, కర్మ, కర్త లోనివే” అని అమ్మ ప్రబోధం. మరొక సందర్భంలో ఎక్కడికక్కడ అంతా పరిపూర్ణమే అని వివరించారు అమ్మ. అట్లాంటప్పుడు చేసేది ఏమిటి?’, ‘పొందేది ఏమిటి?’ రెండూ అదే అయివున్నది. ఇది అనుభవంలోకి వచ్చేటప్పటి వరకు ఎవరి మార్గంలో వారు నడవటం జరుగుతుంది. “నారాయణ అనేది పేరు అయింది, మంత్రం అయింది. ఏదైనా చెప్పినందు వలన కాదు. మననంతో మంత్రమయింది.” – అని అమ్మ వాక్యం. అట్లాంటప్పుడు “ఇన్నిసార్లు చేస్తే ఏం లాభం మనస్సులయం కానప్పుడు” అనేది ఒకదాని కొకటి విరుద్ధం.
రామాయణ వ్యాఖ్యాత ఒకరు “ఒక లక్ష్యాన్ని ఉపకరించే ఆలోచనా బాహుళ్యం కూడా ఏకాగ్రతలో భాగమే” అని చక్కని వివరణ ఇచ్చారు. స్వామి రామతీర్థ “చాలా మందికి సాధనలో వచ్చే సంశయం మనస్సు కుదరటం లేదని. మనస్సు కుదిరినా, కుదరక పోయినా నీ సాధన నువ్వు చేయి. చాలా మందికి ఇటువంటి సంశయాలతోనే ప్రయత్నశీలం పోతుంది” అంటారు. మరొక సందర్భంలో ఒకరు అమ్మని ఈ విధంగా అడుగుతారు “ఆధ్యాత్మికంగా ఏదైనా చేయటానికి కుదరటం లేదు” అని. అప్పుడు అమ్మ సమాధానం “చేయాలని మనసు ఉండటమే కుదరటం” అప్పుడు ప్రదక్షిణాలు చేయాలని మనస్సు ఉండటమే కుదరటం కదా! “మనస్సు లయం అగునట్లు ఒక్కసారి చేసినా చాలు. కానప్పుడు వందసార్లు ఏం ప్రయోజనం?” అని అమ్మ అన్నారంటే ఆ సందర్భాన్ని బట్టి చెప్పటమే కాని అదే సర్వం కాదని తెలియ చేస్తుంది.
ఈశ్వర ప్రాప్తికి సంసిద్ధత, అర్హత అనేవి ఎక్కడి నుండి వస్తయ్ ? సంసిద్ధత, అర్హత ఈశ్వరుని నుండి వచ్చేవే. అర్హత, అనర్హతలకి ఈశ్వర ప్రాప్తికి సంబంధం లేదు. “ప్రయత్నానికి వెనకాల ప్రేరణ వుంది. ఆ ప్రేరణ నేనే” అని అమ్మ స్పష్టం చేసింది. ఈ లెక్కలో అర్హత సంసిద్ధత ఎక్కడవి? అమ్మతో ఒకరు, “నిశ్చలాయై నమః అన్నారు కదమ్మా!” అంటే, “దాని ప్రక్కనే ‘చంచలాయైనమః’, ‘చపలాయైనమః’ అన్నారు కదా!” అని వివరించారు. మరి అనేకసార్లు చేయటంలో వున్నది కూడా అదే కదా. “ఫలానుపాతాన్ని బట్టి కర్మకాని, కర్మానుపాతాన్ని బట్టి ఫలం కాదు” – అని శ్రియానందనాధుడు చెప్పినట్లు సూక్ష్మాతి సూక్ష్మమయిన మూలంలో నుండి జరిగేవే ఇవన్నీ అని విశదమవుతుంది.
ఇకపోతే ఆకర్షణ – వికర్షణ రెండూ ఒకే శక్తి యొక్క స్పందనలు అయినప్పుడు ఏది అవును – కాదు అనేది నిర్ణయించటం కష్టసాధ్యమవుతుంది. “అర్హత అన్నది నీది కాదుగా” అన్నారు అమ్మ. అటువంటప్పుడు సంసిద్ధత – అర్హత అనేవి కూడా భగవంతుని ద్వారా వచ్చేవే. ఇంకా సంసిద్ధత ఉండటమేమిటి? కనుక అమ్మ ప్రబోధం, తత్వాన్ని బహుముఖంగా అధ్యయనం చేసినప్పుడు సంశయ ధూమాలు – భయ బీజాలు తొలగుతయ్. మహోన్నతమైన రీతిలో మన అంతరంగాలను నిలిపినడిపే భావ బీజాలను నాటే పంధాలో మనల్ని నడపాలని అమ్మని వేడుకుని పయనిద్దాం. ఈ విధమైన పంధాలో రచనలు సాగితే సమన్వయ సారధ్యంతో కూడుకున్న సౌజన్యత ఏర్పడుతుంది.