జిల్లెళ్ళమూడి అనసూయేశ్వరమాత పాదద్వయాలను స్వయంగా పూజించి తరించిన వారెందరో అమ్మ శ్రీచరణాల నుండి ఆశీస్సులు అభయాలు అందుకున్నారు. శ్రీ చరణప్రతిష్ఠ సందర్భంగా సంపాదకీయం కొన్ని ఆలోచనల్ని రేకెత్తించింది. శ్రీ చరణాలు గురించి అమ్మే ఒక సందర్భంలో ఇలా చెప్పింది “పాదాలు ముట్టుకుంటే మంటలు వస్తాయంటారు. పాదాలు తాకితే ఎదుటివాళ్ళ పాపాలు వల్ల పాదాలు మంటలు పుడితే వాళ్ళలోని గొప్పతనం కూడ అంటుకోవాలంటూ” అమ్మ నిత్యం తమ అనేకులకు తాకిన అనేక మంది తన పాదాలకి నమస్కారం చేస్తున్నా ఆమెకెప్పుడు ఆ మంటల అనుభవం లేదన్నది. ఇంకొక సందర్భంలో శ్రీ చరణాలకి నమస్కరించాలనే భావన రావటమే మనస్సులకి ప్రశాంతత చేకూరుతుందన్నది. అమ్మ పాదాల గురించి వ్రాస్తూ “భరతుడు ఆరాధనోత్తముడట. అందుకే తనని భరతుడిని చేయమని అమ్మ దగ్గర విన్నపాలు చేసాడొక కవీంద్రుడు. నిజంగా ఈ భావనా సముదాయాల వేడికోలు భక్తులకు ఊరటనే కాక ప్రశాంతత కూడా చేకూరుస్తున్నాయి. కాకపోతే జిల్లెళ్ళమూడి అమ్మకి అకుంఠితభక్తుడై యుండి అమ్మ పాదాలు ఆశ్రయించి ”నీకుంకుమ నాకు శ్రేయస్సును కలిగిస్తుంది”, “నీ పాదతీర్థం నాకల్మషాలను కడిగివేస్తుందని” అమ్మ పాదాలని స్వయంగా కడిగి “అమ్మా ఇవి బ్రహ్మకడిగిన పాదాలా”ని అడిగితే “మీరంతా బ్రహ్మలు కాదటరా” అని చెప్పించుకొని కల్మషాలు కడిగే “పాదాలను శరణువేడి తనని చేయమంటే ఏ పాదమైనా సంతసించి దీవించకుండా ఉంటుందా ? అతడు పదను తెలిసిన రైతు కనుక తన పొలం పండించుకోవడానికి అమ్మనడిగి భరతుడౌవుదామను కోవటము సహజమే. సమంజసం కూడ. |
ఇలాగే చాలా మంది కవులు పాదాలను ఆశ్రయించి తమపదగమనాలను శ్రీచరణాల వైపు మళ్ళించిన సంఘటనలు కోకొల్లలు. న్యూఢిల్లీలోని జాజి శర్మ అనే కవీంద్రుడు.
నీపాద రేణువుల అణువైన గాని
ఏ పరమ పదమైన సమానమవునా,
ఆ పాద మస్తకం వర్ణించి మేను
పులకించిపోయేను పుణ్యభాగ్యాన
తిలకించాను తిరుమల క్షేత్రాన
నామదిని ఉన్న అంబుజాక్ష
బ్రోవగరావయ్య శేషాచలవాసా.
ఓ అంటే ఓ అనే అయ్యా ! ఓం వేంకటేశా” యని వ్రాసుకున్నాడు. ఆయనకి అమ్మపాదాలు వేదాలట. కరములు అభయములట. పక్షము విశ్వగవాక్షమట. శిరము తిమిరహారమట. ఇంతటి భావోద్వేగపూరిత వేడికోళ్ళు సామాన్య భక్తులకు ఆధ్యాత్మిక మార్గ గమనాలు.
ఈ ఉపమానాలు ఉపమేయాలు అమ్మ దగ్గరికి మనని చేర్చటానికి సోపానాలు. ప్రవహిస్తున్న కాలువ హొయలు. దాని వేగపు పరవళ్ళను అలాంటి రచయిత రసవత్తరంగ వ్రాయగలడు గాని, ఆ ప్రవాహాన్ని ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా అమ్మ శ్రీ చరణాల వైపు మళ్ళించే ప్రయత్నం నిజంగా అభినందనీయం. ప్రవహిస్తున్న కాలువనీరు త్రాగాలంటే రేవు అవసరమైనట్లే, సర్వత్రా వ్యాపించి యున్న చైతన్యాన్ని గుర్తించటానికి దేవాలయం అవసరమైనట్లే అమ్మ శ్రీచరణ ప్రతిష్ట అమ్మ ఆశీస్సులను అభయాలను అందచేస్తుందనే విషయాన్ని నేర్పుగా చెప్పగలగటం. దేవ్యుపాసక సిద్ధులకే సాధ్యం.
ఈ చరణాల సేవయనెడి ప్రక్రియ అనాదిగా వస్తున్నదే తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కరించి వ్రాయునది యని ఉత్తరాలలో కూడా పాదద్వయాలకి భక్తి పూర్వకంగా నమస్కరిస్తాము. ఇది సంప్రదాయం. ఇక దివ్యమైన శ్రీ చరణాల ఆశ్రయం గురించి ఎంత చెప్పినా తక్కువే. భగవంతునికి – భక్తులకి బింబ ప్రతిబింబసామ్యం అని చెప్పుకొనే స్థితిలో ఈ సామ్యం శ్రీ చరణాల విషయంలో వీరిద్దరు వేరు కాదు యని తెలియ వస్తుంది. అమ్మ వసుంధర అక్కయ్యల సామ్యం ఇట్టిదే కదా! అమ్మ నీకు చేస్తే నాకు చేసినట్లు కాదా? నాకు చేస్తే నీకు చేసినట్లే అని చెప్పటం”. వింతగా అనిపించినా అది సత్యదూరం కాని విషయం. భాగవతంలో “సంపద్విశేషోన్నతుల్” ఇవ్వగల శక్తి పరమాత్మకి ఉన్నదని కుచేలుని భార్య చెపితే దానికి కుచేలుడు “నీవు సెప్పినయట్ల రాజీవనేత్రు పాద పద్మంబు లాశ్రయింప గనుట పరమ సంతస” మని శ్రీకృష్ణ పాదాశ్రయం కోసం బయలుదేరతాడు. పరమాత్మ కుచేలుని కెదురేగి పాన్పు మీద కూర్చుండబెట్టి “కలశ సలిలంబుచే కాళ్ళు గడిగి, భక్తి దజ్జలంబులు దనదు మస్తకమున దాల్చి” భక్తుని పాదాలే భగవంతుడు కడిగి వైనం పోతనగారు పై విధంగా వర్ణించారు. ఇక్కడ బ్రహ్మ ఎవరు ? కడగాలనుకొన్న దెవరు ? కడిగిన దెవ్వరు ? కడగబడిన పాదాలెవ్వరివి ? పాదతీర్థం శిరస్సున జల్లు కొనవలసిన దెవ్వరు ? జల్లు కొన్న దెవ్వరు ? ఇలా శ్రీ చరణాల వింత విషయాలు అవలోకిస్తే శ్రీవారి చరణాలలో అమ్మ వసుంధరక్కయ్యల రమణీయ రమ్యమైన గాథల పోలికలు, సామ్యాలు హృద్యానందంగా గోచరిస్తాయి మనకి. శ్రీ చరణాలు అంటే మోక్షశ్రీకి, యోగశ్రీకి స్థానమైనవని సంపాదకీయంలో చదివాము. మోక్షశ్రీయైన అమ్మ శ్రీ చరణాలు ఎల్లప్పుడు మనకి మంగళకరమైన చరణాలే. ఇక్కడ యోగశ్రీకి స్థానమైన చరణాలు యోగసిద్ధుడైన కుచేలుని చరణాలకి బింబ ప్రతిబింబం సామ్యం దర్శించ గలగడం. పరమాత్మ లీలల్లో ఒక భాగం అని గ్రహించాలి. తెలుగువారినోట సదా కీర్తించే పద్యం “నీ పాదకమల సేవయు – నీ పాదార్చకుల తోడి నెయ్యము” దయసేయమని అడిగే పద్యానికి ఇవ్వబడిన వరమే పైన ఉదహరించిన పరమాత్మ – కుచేలుని వింతగాథ.
అంత ప్రాముఖ్యతను కలిగియున్న శ్రీ చరణ ప్రతిష్ఠ మనందరికి ఆనందదాయకం. అంత దయగల శ్రీ చరణాలను ఆశ్రయించగలగడంం సర్వదా శతధా అనుసరణీయం. ఇక ఈ శ్రీ చరణాలు ఎటువంటివో పరిశీలిస్తే… “యోగి సుమనస్సంప్రార్థిత శ్రీదముం
గరితామరమాలలాట పదవీ కస్తూరికాశాదమున్
నళినామోదము రత్ననూపురితా నానా చేదముంపాదమున్”
బలిచక్రవర్తికి కడగమని ఇచ్చిన కుడిపాదం యోగులు, దేవతలు కోరుకునే వరాలు ప్రసాదించేవట. భక్తితో లక్ష్మీదేవి నమస్కరిస్తున్న కస్తూరి రజస్సుతో కూడినదట. ఆ పాదం వేదాలరాశియట. అందుకే జిజి శర్మ “నీ పాదాలు నాకు వేదాలు” అన్నారేమో. బలిచక్రవర్తి ఇచ్చిన మూడడు గుల దానాన్ని స్వీకరించిన పరమాత్మ” బ్రహ్మాండ కటా పూముంబగిలి వేండ్రంబై పరుల్ గానరా కొకడై వాగృ గలభ్యుడై హరి విభుండొప్పొరె విశ్వాకృతిన్” అలా పెరిగిన పరమాత్మ పాదాల్ని ఆ సమయంలో బ్రహ్మగారు వీక్షించి నాభిస్థానాన్ని తన పుట్టినిల్లుగా భావించి ఆ పాదాల్ని అక్కడి నుండే కడిగాడట. అందుకనే అన్నమయ్య “బ్రహ్మ కడిగిన పాదము” యంటూ పరవశించి పోయాడు.
ఇంకా భక్తప్రహ్లాదుడు “అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్తచిత్తమే రీతి నితరంబు చేరనేర్చు వినుతగుణశీల మాటలు వేయునేల” అంటాడు. మందార పుష్పాల మకరందం గ్రోలే తుమ్మెదలు సాధారణ కొండ పువ్వులనెలా చేరవో పూర్ణచంద్రుని వెన్నెలకి పరవశించిపోయే చకోరపక్షి తెల్లని పొగమంచు వైపుకి ఎలా వెళ్ళదో విష్ణుపాద ధ్యానామృతాన్ని త్రాగిన మత్తులో ఉన్న నా చిత్తము ఇతర విషయాలవైపు మళ్ళదు” అని శ్రీ చరణాల విశిష్టతను తండ్రికే తెలియపర్చిన భక్తుడు ప్రహ్లాదుడు.
శ్రీ చరణాలకి ఇంత ప్రాముఖ్యత సంతరించుకొని ఉన్నందుననే ఆ పాదాలు కావాలని కనీసం ఆ పాదాల్ని అర్చించేవారి స్నేహమైనా కావాలని కోరుకొనే ఆరాటం కలిగి ఉండటం శ్రేయస్కరమే కదా ! శ్రీ జిల్లెళ్ళమూడి అమ్మ సన్నిధిలో మనకి సంప్రాప్తమైన శ్రీ చరణ ప్రతిష్ట విశేషలబ్ధి గలదని అనటంలో అతిశయోక్తి లేదు. అమ్మ పాదాలను సూర్యచంద్రులతో పోల్చటంలో ఒక పాదం వేడి ఒక పాదం చలువ అనే పోలిక అత్యంత ఐశ్వర్య ప్రదాయకం. అమ్మ శ్రీ చరణాలు ఎవ్వరికి మాత్రం అవసరం కాదు. అమ్మ చరణాలు నిత్యం స్మరించుకోవటం ఆ క్షేత్రానికి వెళ్ళునప్పుడు శ్రీ చరణాలని దర్శించుకొని పూజించుకోవటం ఆనంద దాయకం.
శింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజా శ్రీ అనసూయేశ్వరి చరణం శరణం ప్రపద్యే”.