అమ్మ ఎవరు అని తెలుసుకోవాలి? అనే ప్రశ్న అమ్మను 1923-1985 మధ్య భౌతికంగా శరీరంతో చూచిన వారికి ఆ తర్వాత జిల్లెళ్ళమూడి వచ్చిన వారికి వచ్చే ఒక గొప్ప ప్రశ్న. అమ్మ సజీవమూర్తిగా మన మధ్య నడయాడినప్పుడు అమ్మను అమ్మగా చూచి, ఆమె ప్రేమను, మాతృత్వ మాధుర్యాన్ని, దయాగుణాన్ని, అందరినీ ఒకటే విధంగా ఆదరించే సమానత్వాన్ని చూచి అమ్మకు ఆకర్షితులై ఆరాధించిన వారు వున్నారు, వారు “అమ్మ” ఒక మానవ శరీరం ధరించి అవనిపై నడయాడే ఒక మామూలు గృహిణిగానే గాక, లోకమాతగా, సకల దేవతా స్వరూపిణిగా వారి వారికి కలిగిన అనుభవాల కారణంగా తెలుసుకొని ఆ రకంగా పూజించి దర్శన, స్పర్శన, సంభాషణల ద్వారా ఒక దివ్యానుభూతిని పొందారు. ఇక వారికి అమ్మ ఎవరు? అని వెనక్కి తిరిగి మరల ప్రశ్నించుకోవాల్సిన అవసరం కలగదు. నేను అమ్మను ప్రత్యక్షంగా దర్శించి, ఒక సాధారణ స్త్రీ మూర్తి దేవత కాగలదా? అనే సందేహంతో అమ్మనే అడిగాను. అమ్మా! నువ్వు దేవతవా? అని. అమ్మ సమాధానం “రెండు చేతులు, రెండు కాళ్ళతో ఈ మంచం మీద కూర్చున్న అమ్మనే “అమ్మ” అనుకోవద్దు” అని అంటే దాని అర్థం స్థూల శరీరంలో ఉన్న “అమ్మ” నిజమైన అమ్మ కాదు. అన్నిటికి ఆధారమైన పరదేవతను “నేను” అని అమ్మ నిగూఢంగా విశదీకరించింది. స్థూల శరీరంతో “అమ్మ” ఒకప్పుడు జిల్లెళ్ళమూడిలో ఉన్నది. ఇప్పుడు సూక్ష్మ శరీరంతో పరాత్పరి అయి అన్నిచోట్ల ఆవరించి ఉన్నది. జిల్లెళ్ళమూడిలో వున్నప్పుడు కూడా సూక్ష్మ శరీరంతో పలుచోట్ల దర్శనమిచ్చి తన విభూతిని ప్రదర్శించింది. కరుడు కట్టిన కమ్యూనిస్టు కోడలిని డాక్టరై అతని కళ్ళముందే సర్జన్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఆపరేషన్ చేసి బతికించింది. ఆ కమ్యూనిష్టు అమ్మ భక్తుడిగా మారిపోతే తన తోటి వారు కమ్యునిస్టువై ఇలా బాబాలను, అమ్మలను నమ్మితే ఎలాగా? అని ప్రశ్నిస్తే, కళ్ళముందు కనిపించిన దానిని అంగీకరించకపోతే నేనెలా కమ్యూనిష్టునవుతాను? అని తిరిగి ప్రశ్నించాడు. అందుకే అమ్మ ఆర్త జనులకు పరాత్పరియైన దేవతా స్వరూపిణి.
“అమ్మ” తన చిన్నతనంలోనే నాగేశ్వరుడే తనకు ఆధారం. తనను చుట్టుకున్న నాగేశ్వరుడే తనకు భర్త అవుతాడు అని చెప్పింది. అప్పటికి అమ్మ వయస్సు 5 సంవత్సరాలు. ఆ తర్వాత బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు (నాన్నగారు) తన భర్త కావడం, తన భర్తను ఆరాధ్య దైవంగా, ఆయన పాదపద్మాలే సర్వస్వంగా తలచి, మనకు తీర్థం వేసే అర్హత తాను తన భర్త పాదాలు కడిగినందువల్లనే వచ్చిందని తెలియజేసింది. నాన్నగారు సైతం అమ్మను దేవతగా పూజించిన సందర్భం వుంది. అంటే భార్యను భర్త, భర్తను భార్య దైవంగా ఆరాధించినప్పుడే, ఒకరి నొకరు గౌరవించినప్పుడే జీవితానికి పరమావధి అని స్థూలంగా చెప్పినట్లయింది. అమ్మ ఆలయ ప్రవేశం జరిగిన తర్వాత లక్ష్మణ యతీంద్రులు అమ్మ-నాన్న గార్లు ఎక్కడికీ పోలేదు. అర్థనారీశ్వర తత్త్వంతో సూక్ష్మంగా అంతటా వ్యాపించి వున్నారన్న విషయం వారి అనుగ్రహభాషణలో వ్యక్త పరిచారు. ఈనాడు అమ్మనాన్నగార్లను అర్థనారీశ్వరులుగా తలచి నిత్యమూ, అభిషేకాలు చేసి, సర్వభక్త కోటి తమ ఈప్సితాలను నెరవేర్చుకుంటున్నారు. అమ్మ స్థూలంగా ఆలయంలో ఉన్న అర్థనారీశ్వర తత్త్వంలో ఈ భూమిపైనే కాక, సకలలోకాలను ఆవరించి ఉ న్నది.
మనం అభిషేకం చేసేటప్పుడు ఈశ్వరుని ధ్యానం చేస్తాము.
“ఆపాతాళ సభ స్థలాంత భువన బ్రహ్మాండ మావిన్ఫురత్
జ్యోతిస్పాటిక లింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః
అస్తో కాప్లుత మేక మీశమనిశం రుద్రానువాకాం జపేత్
ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభి షించే చ్ఛివం”
అంటే అమ్మ అంతటా నిండి వున్నది. పృధివి, ఆకాశం, పాతాళం అనే కాకుండా బ్రహ్మాండమంతా, జ్యోతి స్వరూపంగా తేజోమూర్తిగా వెలుగొందుతూ మన ఈప్సితాలను నెరవేర్చుతున్నది అని అర్థనారీశ్వర తత్త్వంతో అమ్మను, నాన్నగార్లను అభిషేకంతో అర్చిస్తున్నాం. అది నిజం. దానికి తార్కాణ మేమిటి? అమ్మను సజీవంగా చూడని వారు అమ్మను వాళ్ళ కలల్లో, సుషుప్తిలో దర్శించి. జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మతత్త్వాన్ని అర్థం చేసుకుని అమ్మ భక్తులుగా మారటం జరుగుతోంది.
అమ్మను ప్రత్యక్షంగా చూడని ఎందరో కవులు, రచయితలు అమ్మను గురించి పుంఖాను పుంఖాలుగా రచనలు, కవిత్వాలు వ్రాయటం మనం చూస్తున్నాం. అమ్మ అప్పట్లో స్థాపించిన విద్యాలయం, వైద్యాలయం, అన్నపూర్ణాలయం, నిరాటంకంగా ఎంతో సమర్థవంతంగా నిర్వహించబడటం అమ్మ విభూతి కాదా!
అమ్మను దర్శన, స్పర్శన, వాక్కులతో చూచి అనుభూతి చెందిన అప్పటి తరం క్రమేణా కనుమరుగౌతున్నా, అమ్మ ఇచ్చిన సందేశం సౌభ్రాతృత్వం, అక్కయ్యా, అన్నయ్యా అనే పిలుపులు, దీన జనసేవా కార్యక్రమాలు దేశ, విదేశాల్లో విస్తరిస్తుండటం అమ్మ విభూతి కాదా! కనుక “అమ్మ” అంతటా అర్థనారీశ్వర తత్త్వంతో నిండియున్న శివశక్యైత్సరూపిణి.
‘అమ్మ’ను బాల్యంలో, ఆ తర్వాత కూడా చిన్ని కృష్ణునిగా శ్రీరంగధాముడిగా, విష్ణు అవతారంగా భావించి తరించి, తరిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అమ్మను మనం దేవునిగా భావిస్తే అమ్మ మనలో దైవాన్ని చూచింది. ఈనాడు అమ్మ చూపించిన బాటలో అందరిలో దైవాన్ని చూస్తూ అందరినీ అక్కయ్యలు, అన్నయ్యలుగా భావిస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న అమ్మ భక్తులు అమ్మని విష్ణు స్వరూపంగా భావించుకుంటున్నారు. అంటే అమ్మను సర్వభూతములలో వసించే వాసుదేవుడిగా స్మరిస్తున్నారు. అమ్మ స్వర్ణోత్సవం సమయంలో లక్షమందికి అన్నప్రసాద వితరణ చేసినప్పుడు, ఇంకా ప్రసాదం మిగిలిపోతే సకల జీవరాశుల క్షుద్బాధను కూడా తీర్చింది. సకల జీవరాశులలోనూ తానే నిండివున్నానంది. సర్వత్రా దైవాన్ని సందర్శింపజేసింది. భిన్నత్వంలో ఏకత్వమైన పరమాత్ముడు అన్నిచోట్లా నిండి నిబిడీకృతమైనట్లు లింగేశ్వరరావు అనే భక్తునికి దర్శింపజేసింది.
వాసనాద్వాను దేవస్య వాసితం తే జగత్రయం సర్వ భూత నివాసోసి శ్రీవాసుదేవ నమోస్తుతే సర్వవ్యాపకమైన అమ్మ విష్ణు స్వరూపమే. అందులో సందేహం లేదు.
సకల జీవరాశులను సృష్టించి, పాలించే “అమ్మ” బ్రహ్మగాక మరెవ్వరు? అమ్మ అవతారం బ్రహ్మ, విష్ణు, శివాత్మకం.
త్రిమూర్తులకు కూడా అతీతమైనది. రాజరాజేశ్వరి, లలితా స్వరూపిణిగా అమ్మ తన తత్త్వాన్ని విస్తృతంగా తెలియపరుస్తోంది. అమ్మ స్వయంగా “శ్రీ లలితా సహస్రనామ పారాయణాన్ని” ప్రోత్సహించింది.
దసరా మహోత్సవాలల్లో “అమ్మ”ను సన్నిహితంగా సేవించిన రామకృష్ణ అన్నయ్య తదితరులు ఆ తేజస్సును దగ్గరగా చూడలేక వేదిక దిగిన సందర్భాలు వున్నాయి.
అమ్మల గన్నయమ్మ ఆమె అనసూయమ్మ. తలలు పండిన పండితులు, తత్త్వవేత్తలు, సిద్ధ పురుషులు, యతీశ్వరులు, పామరులు, పిల్లలు అనే భేదం లేకుండా లాలించి పాలించి గోరు ముద్దలు తినిపించింది. ఇది ఎక్కడైనా కన్నామా? విన్నామా? ఆనాడు అనసూయా దేవి త్రిమూర్తులను పసిబిడ్డలను చేసి, లాలించి పాలించింది. ఈనాడు కలియుగంలో మన “అమ్మ” అదే చేసింది. అమ్మ అక్షరాలా ఆదిశక్తి – పరమేశ్వరి – సకల దేవతా స్వరూపిణి.
అమ్మ స్థూల శరీరంతో కనపడటం లేదు కాబట్టి అమ్మను ఏ ఆధారాలతో తెలుసుకోవాలి? ఏమి తెలుసుకోవాలి? అనే ప్రశ్నలు కొందరు తత్త్వ విచారణ చేసే వారి సందేహాలు.
పూర్వం అమ్మతో సన్నిహితంగా మసిలిన వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, అనుభూతులు, అనుభవాలు ఒక ఆధారం. శాస్త్రంతో భగవంతుడికి ఏ అవతార లక్షణాలు ఉంటాయో అవి దయ, కరుణ, సౌభ్రాతృత్వం, దివ్యత్వం, ఆకర్షణ, అనుభూతి, ప్రశాంతం, రక్షణ, శిక్షణ మొదలైనవి అమ్మ దగ్గర చూచాం. ఇప్పటికీ అమ్మను ఆశ్రయించి, శరణాగతి పొందిన వారికి ఆ అనుభూతులు, విభూతి తప్పక కలుగుతున్నాయి. దానికి ఉదాహరణ జిల్లెళ్ళమూడి వస్తున్న అశేష జనవాహిని.
ఒకప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి వివిధ కారణాల వల్ల దూరమయి రాలేని వారు తిరిగి అమ్మను చేరడం మరొక ఉదాహరణ. అమ్మ సంకల్పించిన, అదృశ్యంగా ప్రేరణ ఇచ్చిన అనేకమైన ప్రాజెక్టులు అద్భుతంగా సాకారం కావడం మరొక ఉదాహరణ.
అమ్మ స్త్రీ యా, గృహిణియా, ప్రవక్తా, అవతారమా, దైవమా? అన్న శంకరానంద స్వామి లాంటి వారు, పరిశోధకులకు సమాధానం ఒక్కటే. దైవం ఎక్కడో ఉండదు. మన అంతరాళాల్లో శోధిస్తే, అమ్మ తత్త్వాన్ని మానసికంగా, లౌకికంగా, సామాజికంగా, అమ్మగా మారితే తెలుస్తుంది. ఇది నా నిశ్చితాభిప్రాయం.
జయ హెూమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరీ శ్రీ పరాత్పరీ!