‘హృదయవచశ్శరీరముల నెంతయు పుణ్య సుధాప్రపూర్ణులై వదలక సాధుసద్గుణలవంబులు కొండలు కొండలుగాక మెచ్చుచున్ మదిని వికాసయుక్తులగు మాన్యులు కొందరు వొల్తురిద్ధరన్’ – అనేది సుభాషితము, సూనృతవాక్యము. ఇది మహితాత్ముల విలక్షణమైన తీరు. కొండలు కొండలుగాగ యున్న వ్యక్తుల అవలక్షణాల్ని పట్టించుకోరు; గోరంత దీపంబు కొండలకు వెలుగు అన్నట్లు లేశంగా ప్రకాశించే సద్గుణ లవంబును మేల్కొలిపి కీర్తిస్తారు, మార్గదర్శనం చేస్తారు, ఉద్ధరిస్తారు, మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతారు.
రాజహంస ముంగిట పాలు ఉంచితే దానిని పాలు, నీరుగా విభజించి పాలనుమాత్రమే స్వీకరిస్తుంది. “తల్లికి తప్పేకనపడదు” అంటూ అమ్మ వ్యక్తులలోని గుణాలనే దర్శిస్తుంది. “ఎదుటి వానిలో మంచిని చూస్తున్నంత సేపూ నీలో దైవత్వం కలుగుతుంది” అని ఒక అపూర్వ ధర్మ సూక్ష్మాన్ని ఆచరణాత్మకంగా ప్రబోధిస్తుంది.
సద్గుణలేశానికి, కొద్దిపాటి మంచితనానికే అమ్మ కొండంత సంబరపడుతుంది. కొన్ని ఉదాహరణలు :
- కొమ్మూరు వాస్తవ్యులు శ్రీ గంగరాజు లోకనాధరావుగారు, శ్రీ రాజు బావగారి మామగారు. ఒకసారి వారి కాలులో ముల్లు దిగి సెప్టిక్ అయి గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి నాన్నగారు ప్రియమిత్రులు; అమ్మ అలౌకిక శక్తి సంపన్న – ఆప్తబాంధవి. కనుకనే వారిని చూడటానికి నాన్నగారితో అమ్మ గుంటూరు వచ్చింది. రావటంతోనే తన పినతల్లి కూతురు సావిత్రమ్మగారింటికి వెళ్ళింది. అక్కడికి రాజుబావగారిల్లు దగ్గరే. రాజు బావగారి తల్లిదండ్రులు అమ్మను తమ ఇంటికి తీసుకురమ్మని రాజుబావగారినే పంపారు. ఆయన వెళ్ళి అమ్మతో ‘రిక్షా తీసుకు వస్తానమ్మా’ అన్నారు. “నాన్నా! ఎంత దూరం ఉంటుంది?” అని అడిగింది అమ్మ. ‘దగ్గరే నమ్మా’ అన్నారాయన. అయితే నడిచి పోదామన్నది. దారిలో రాజుబావగారు ముందునడుస్తూ ‘అమ్మా! ఇక్కడ రాళ్ళున్నాయి, ముళ్ళున్నాయి, గాజు పెంకులూ, గోతులూ, గొప్పులూ…. అపరిశుభ్రంగా ఉన్నది జాగ్రత్త!’ – అంటూ మార్గదర్శనం చేస్తూ వారింటికి తీసుకువెళ్ళారు.
కొన్ని ఏళ్ళ తర్వాత కాలంలో అమ్మ ఆ సన్నివేశాన్ని పురస్కరించుకొని, “నాన్నా! ఆ సమయంలో నాకు అనిపించింది – నువ్వు నాకు ఇప్పుడు దారి చూపిస్తున్నావు కదా! జీవితంలో కూడా నువ్వు నాకు దారి చూపిస్తావు” – అని అన్నది.
దిక్సూచికి దిక్కుని, పరంజ్యోతికి వెలుగుని ఎవరు చూపగలరు?
రాజుబావగారి సతీమణి ప్రభావతి అక్కయ్య కూడా అమ్మను సేవించి తరించిన ధన్యజీవి. అమ్మను సేవించటం అంటే అమ్మదర్శనార్థం వచ్చీ పోయే అన్నయ్యలకు, అక్కయ్యలకు అన్నపానాదులను ఆదరంగా సమకూర్చటం. అమ్మ అనుజ్ఞ, అనుగ్రహాలను పొందిన రాజుబావగారు వ్రాసిన “అనుభవసారం” పాటల సుమహారం అమ్మవరం, మనోజ్ఞం, అవ్యక్త మధురం, నిగూఢ ఆధ్యాత్మిక సత్య సమన్వితం, సమ్మతం, సంశోభితం. శ్రీ రాజాపాటలు అమ్మతత్వానికి అమ్మ స్వీయ అనుభవాలకి నిలువెత్తు దర్పణం పడతాయి.
“నీ విచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో” అని అమ్మను ప్రార్థించటమే మనకర్తవ్యం.
- ఒకనాడు అమ్మ గదిలో మంచం మీద కూర్చొని ఉన్నది. అమ్మ కూర్చొని ఉన్నా, వరండాలో నిలబడి ఉన్నా, ఆరుబయట నాలుగు అడుగులు వేస్తున్నా… అమ్మ ఉనికి, సాన్నిధ్యమే దేవాలయం.
దుర్గపిన్ని గారబ్బాయి సో॥ శ్రీ కె. నరసింహమూర్తి గారు సతీసమేతంగా అమ్మ శ్రీచరణాలను క్షీరాభిషేక పూర్వకంగా అర్చించుకున్నారు. అనంతరం అమ్మ, “నాన్నా! నువ్వు నన్ను పాలతో అభిషేకించావు, నేను నీ పాల పడ్డాను” అన్నది. అమ్మ పలుకులు వారి పట్ల యదార్ధమైనయ్, అమోఘ ఆశీస్సుల్ని వర్షించినయ్. జిల్లెళ్ళమూడి సంస్థ అభివృద్ధి పరంగానూ; దేశ ఆర్థిక వ్యాపారరంగాల్లో ఉన్నత స్థాయిలలో శ్రీ నరసింహమూర్తిగారి సేవలు అమూల్యం; సలహా, సంప్రదింపులు, మార్గదర్శకత్వం అవశ్యం శిరోధార్యం అవుతున్నయ్.
“నిన్నారాధింపగ నియుమమ్మ! అనసూయా! ఆపదుద్ధారిణీ!” అని జగదాధార, జగదారాధ్య అయిన అమ్మను ప్రార్ధించటమే మనకర్తవ్యం.
- సుమారు 40 ఏళ్ళక్రితం ఒకసారి అడవులదీవి సో॥ శ్రీ వై.వి. శ్రీరామమూర్తిగారు జిల్లెళ్ళమూడి వస్తూ పూలూ పండ్లూ ఇత్యాది వస్తు సామగ్రితోపాటు Kit (tooth paste, brush, soap, hair oil, comb)ను కొని తన వెంట తెచ్చుకున్నారు. అమ్మ దరిచేరి తెచ్చుకున్న పుష్పాలతో అమ్మ శ్రీచరణాలను అర్చించుకుని, అమ్మను పుష్పమాలాలంకృతను చేసి, చేతికి సభక్తికంగా ఫలాల్ని అందించి నమస్కరించి సుఖాసీనులైనారు. ఆ కిట్ను కూడా అమ్మచేతికి అందించారు. వెంటనే అమ్మ దానిని అందుకుని అందుండి దువ్వెన తీసికొని తన చెంపలను ఇటు అటు సవరించుకున్నది. అనంతరం, “నాన్నా! నువ్వు నా చిక్కును తీసేశావురా” అన్నది. భవిష్యత్లో ఏ సంఘటనని అమ్మ దర్శిస్తోందో! అయినా గుప్పెడు అటుకులు, ప్రేమతో పిలుపుచాలు; పరమాత్మ పరమానందభరితుడౌతాడు. అందరినీ సమస్యల సుడిగుండాల్లోంచి. రక్షించి పోషించే అమ్మకి నిత్యం చిక్కులే, ఎటు చూసినా చింతలే.
చిరకాలం నుంచీ జిల్లెళ్ళమూడి వచ్చే చీరాల, గుంటూరు, అడవులదీవి, హైదరాబాద్, విశాఖపట్టణం వంటి గ్రామాలు, పట్టణాలు, నగరాల సోదరీసోదరులు తరతరాలుగా అమ్మ ఎడల ఆదరాభిమానాలు భక్తి ప్రపత్తులతో అశేషసేవాకార్యక్రమాల్ని ఎంతో ఇష్టపడి నిర్వహిస్తున్నారు. అమ్మ అనుగ్రహానికి పాత్రులై అమ్మ సేవలో ఉపకరణాలుగా భాసిల్లేవారే చరితార్థులు, సార్ధకజీవనులు, ఐశ్వర్యవంతులు.
అనసూయమాతగా దివ్య మాతృప్రేమ దిగివచ్చి నిలిచింది. కనుక అమ్మ సగుణమూర్తి. వ్యక్తులలోని మంచిని మాత్రమే గ్రహించి దానిని దశదిశలా పరివ్యాప్తం చేస్తోంది. కనుక అమ్మ సద్గుణ మూర్తి.
వ్యక్తి పరిమితి, పరిమాణం ఎంత? వాని శక్తి ఎంత? విశ్వాసం ఎంత? సాగరజలాన్ని దోసిట్లోకి తీసికొని మరలా సాగరంలోకే విడిచి పెడతాం అర్ఘ్యప్రదానం అంటూ. అదీ మన సత్తా, సేవ; వాస్తవం.
తనను సేవించటానికి వ్యక్తికి మహదవకాశాన్ని అనుగ్రహిస్తుంది దయతో అమ్మ; ‘మూకం కరోతి వాచాలం’ రీతిగా దుర్బలుని శక్తివంతునిగా తీర్చిదిద్దుతుంది. మనోమాలిన్యాల్ని కడిగి శుభ్రం చేసి శ్రీ కైవల్య పదాన్ని అనాయాసంగా అనుగ్రహిస్తుంది. కనుక అమ్మ సద్గురుమూర్తి,
ఈ వ్యాససారాంశాన్ని ఒక సన్నివేశం ద్వారా వివరిస్తాను. ఒకసారి పాలకొల్లు ఆడిటర్ సో॥ శ్రీ కాశీనాథుని రాజగోపాల కృష్ణమూర్తి (గోపి) గారు “అమ్మా! నా జీవితంలో గొప్ప విషయం ఏమిటి?” అని ప్రశ్నించారు. అందుకు అమ్మ, “నన్ను చూడటమే” అన్నది. “జన్మకర్మచమే దివ్యం” అన్నారు కృష్ణ పరమాత్మ.
అమ్మను దర్శించుకోవటం సాలోక్యం,
అమ్మను అర్చించుకోవటం సారూప్యం,
అమ్మను సేవించుకోవటం సాయుజ్యం.