ఒకసారి అమ్మతో నేను “అమ్మ! బాపట్లలో రైలు 2 నిమిషాలు మాత్రమే ఆగుతుంది. అందుకని ముందు పిల్లల్ని గబగబా దింపుకున్నాను. తర్వాత సామాను దింపుకున్నాను” అని అన్నాను. దానికి రామకృష్ణ అన్నయ్య “అదేమిటి అక్కయ్య! ఎంత పొరబాటు చేశావు! ఎవరైనా ముందు సామాను దింపుకుంటారుగానీ, పిల్లల్ని దింపుకుంటారా? పిల్లలు రైల్లో వెళ్ళిపోయినా మళ్ళీ పుడతారు. సామాను డబ్బుతో పనికదా” అని జోకు విసిరితే నవ్వని వారు లేరు.
(ఎక్కిరాల రాణీసంయుక్తగారి ‘అమ్మ’తో నా మధురస్మృతులు నుండి). నాన్నగారు అమ్మను ప్రతిరోజూ కొంచెంసేపు నడవమని సలహా ఇచ్చారు.
ఒకసారి.
ఒక సోదరుడు అమ్మతో “ఈ తిరగటం వల్ల నీకు రిలీఫ్గా వుందా?” అని అడిగాడు. “రిలీఫ్ ఏమోగాని, ఆ మాట మీద రిలీఫ్ ఇస్తున్నదన్న బిలీఫ్ వున్నది”
అమ్మ సమాధానం.
ఏమరుపాటున కూడ నాన్నగారంటే చెక్కుచెదరని గౌరవం.. అమ్మకు తలంటిపోసి, ఒకావిడ – “చిక్కు తీసేదా అమ్మా? అని అడిగింది. “నా చిక్కు ఎవరు తీస్తారూ? ఎవరూ తియ్యరు. అందరూ చిక్కుల్లో
పడేసేవారే.”
అమ్మ ఏవో కబుర్లు చెబుతూంటే అవి త్వరత్వరగా రాస్తున్న భవానీని చూసి “ఇప్పుడు నేను అన్నమాట వినబడిందా?” అని అడిగింది. ఆ అమ్మాయి (రోషంగా) : “నేనేమీ నీ కోడలిని కాదమ్మా – వినబడక పోవడానికి!”
అమ్మ : “నా కోడలివి కాదు. నా కూడలివి”