వెల : రూ.60/- గ్రంధములకు శ్రీ విశ్వజననీపరిషత్, జిల్లెళ్ళమూడి – 522113, బాపట్లమండలం,
గుంటూరుజిల్లా (ఆం.ప్ర.) ఇండియాలో నుండి పొందవచ్చు.
ఈ గ్రంథ రచయిత శ్రీ గోపాలన్నయ్య స్మితభాషి. హితభాషి, మితభాషి, మృదుభాషి, సౌహార్ధం, సౌజన్యం, శాంతం, సహనం ఆయనకు సహజాలంకారాలు. జిల్లెళ్ళమూడిలో అమ్మ ఏర్పరిచిన ‘అందరింటి’ బాధ్యతను నిర్వర్తించడానికి అమ్మ ఎన్నుకున్న బిడ్డలలో ప్రధానమైన వ్యక్తి శ్రీ గోపాలన్నయ్య. అమ్మ మాటే వేదంగా, అమ్మ వాక్కును శిరసావహించి సంస్థ నిర్వహణలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చెక్కు చెదరని విశ్వాసంతో మొక్కపోవని ధైర్యంతో కొన్నింటికి సూత్రధారులై, కొన్నింటికి పాత్రధారులై స్థిరంగా నిలిచిన ధీరోదాత్తులు శ్రీ గోపాలన్నయ్య. ఈ విధంగా సంస్థకు మూలస్తంభమై సంస్థకు సేవచేయడమంటే అమ్మను సేవించడమే అనీ ఆరాధనతో అమ్మ సేవకే అంకితమైన భక్తాగ్రగణ్యులు శ్రీ గోపాలన్నయ్య.
ఆరాధన అంటే సర్వకాల సర్వావస్థలందు తాను నమ్మిన దాని కోసం తన సర్వస్వాన్ని అర్పించడం. అటువంటి ఆరాధన కలిగిన వారు కనుకనే కొన్ని సందర్భాలలో అమ్మ కోసం ప్రాణాలను కూడా ఇవ్వటానికి కూడా సిద్ధపడిన శ్రీ గోపాలన్నయ్య, త్యాగానికి నిలువెత్తు రూపంగా కన్పిస్తారు. అమ్మ పట్ల అచంచల విశ్వాసం, అనన్యభక్తి కలిగిన అన్నయ్య ఎన్నో అనుభవాలను పొందిన ధన్యజీవి. “మధురస్మృతి కాదు, స్మృతే మధురమైనది” అని అమ్మ చెప్పినట్లుగా, అమ్మతో గడిపిన ప్రతిక్షణం ఎంతో విలువైనది, మధురమైనది. ఆ స్మృతులనే మధురమైన జ్ఞాపకాలుగా ఈ గ్రంథంలో అందించారు శ్రీ గోపాలన్నయ్య.
ఏ రచనకైనా అది పద్యమా, గేయమా, వచనమా అన్నది ముఖ్యం కాదు. అభివ్యక్తి ప్రధానమైనది. భాషరాదు అంటూనే రచయిత తాను పొందిన అనుభవాలను ఎంతో చక్కగా ఆవిష్కరించారు. ఈ గ్రంథంలోని వ్యాసాలలో కొన్ని అమ్మతో ఆయనకున్న అనుబంధాన్ని కొన్ని అమ్మ ఆయనకు అనుగ్రహించిన అనుభవాన్ని, కొన్ని అమ్మ ప్రబోధించే ప్రేమతత్త్వాన్ని, కొన్ని అమ్మ అందించే ఉపదేశాన్ని, కొన్ని అమ్మ దివ్యత్వాన్ని తెలియజేస్తున్నాయి. కాని వీటన్నింటిలో అంతస్సూత్రంగా వ్యక్తమయ్యేది అమ్మ దివ్య మాతృత్వం.
“మనం అమ్మను ఎట్లా చూడాలి” అనే వ్యాసంలో అమ్మ ప్రేమతత్త్వాన్ని ఎలా ప్రబోధించింది రచయిత ఈ విధంగా తెలియజేశారు. “నాన్నా! నీకు బ్రహ్మోపదేశం చేస్తాను అది నీవు అనుసరించు. నీ హృదయం గంగాళం పాలలాంటిది. ఆ పాలలో ఒక విషపు చుక్క పడ్డా గంగాళం పాలు విషపూరితం అవుతాయి. కనుక ఆ విషబిందువు నీ హృదయంలో పడనీకు” అని అమ్మ చెప్పిందట. అమ్మ అన్నా, బ్రహ్మ అన్నా ఒకటే కదా. ఇక ఆ క్షణం నుంచి ఆ అమ్మోపదేశమే రచయితకు సాధన అయ్యింది. దానిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించారట. అప్పటి నుండి ఎవరు ఎలా వున్నా, ఏమి అన్నా, వారు తనతో మాట్లాడకపోయినా, వారిని పలకరించడం, ప్రేమించడం అలవాటు చేసుకున్నారట. అమ్మ కోరుకున్నది అదే కదా. అమ్మ ఎప్పుడూ చెప్తూ వుండేది, “కారణాలతో కూడినది ప్రేమకాదు అవసరమనీ, ఎదుటివారు ఎవరైనా, ఎలాంటి వారైనా, ఏమి చేసినా, ప్రేమించగలిగితే అదే నిజమైన ప్రేమ అని ప్రేమకు సరికొత్త నిర్వచనం చెప్పింది అమ్మ.
1974లో అమ్మ వాత్సల్యయాత్రలో భాగంగా మద్రాసు వెళ్లింది. దానిలో భాగంగానే తిరువణ్ణామలై కూడా వెళ్ళింది. అపుడు అక్కడే వున్న శ్రీ చలం గారిని చూసి అమ్మ ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకుంది. అపుడు ఆయన గద్గద స్వరంతో “ఎవరైనా ఈశ్వరుడు ఎక్కడ అంటే ఇదిగో ఇక్కడే. ఈ అమ్మే ఈశ్వరుడని నాకు చెప్పడానికి సులువైంది” అంటూ అమ్మకు నమస్కరించారు. మరి ప్రేమకు మించిన దైవం ఎక్కడ ఉంటుంది. ఈ విషయాలన్నీ మనకు కళ్లకు కట్టినట్లుగా “జగన్మాత జగద్గురువు” అను వ్యాసంలో రచయిత వివరించారు.
బ్రహ్మాండమే తానైన అమ్మ ఉదరం నుండి సుప్రభాతం వినడం, శేషగిరిరావు అన్నయ్య గారి ఉచ్ఛ్వాసనిశ్వాసాల నుండి “అంఆ” అని అమ్మ నామం వినడం, తాను అనారోగ్యంతో బాపట్లలో ఉన్నప్పుడు అమ్మ తనను చూడాలి అని అనుకోగానే అమ్మ ఆ కోరిక నెరవేర్చడం, ఇలా ఎన్నో ఎన్నెన్నో గోపాలన్నయ్యకు అమ్మ ఇచ్చిన అనుభవాలు అంతేకాదు ఎవరైనా తమ అనుభవాలను అమ్మదగ్గర ప్రస్తావిస్తే ఏమో నాన్నా! నాకేమీ తెలియదు అంటూ వుండేది అమ్మ. కానీ గోపాలన్నయ్య “కొన్ని అనుభవాలు ఇవి నాకెందుకిచ్చావమ్మా” అని అమ్మను అడిగితే “మరుగే నా విధానం” అనే అమ్మ” “ఏమో ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను” అని సూటిగా చెప్పడం గోపాలన్నయ్య చేసుకున్న అదృష్టం.
న్యూస్ పేపర్లో నున్న రమణమహర్షి ఫోటోకి అమ్మ ఎంతో ఆప్యాయతతో, అనురాగంతో, ఆనందంతో గోరుముద్దలు తినిపించినట్లుగా వేరుశనగపప్పు పెట్టడం, ఆ సమయంలో అమ్మ చూపిన వాత్సల్యం చెప్పనలవి కాదంటూ “అమ్మ ఒడిలో ఆనందడోలికలు” అనే వ్యాసంలో ఆ దృశ్యం మనకు సాక్షాత్కరించేటట్లుగా రచయిత వర్ణించారు. మరి అవతారమూర్తులైనా, అవధూతలైనా అమ్మకు బిడ్డలే కదా.
“తనను తాను విమర్శించుకోవడం వివేకం. ఇతరులను విమర్శించడం అవివేకం” అన్న అమ్మ వాక్యాన్ని రచయిత ఒక వ్యాసంగా తీసుకు వచ్చారు. మనం ఎవరినైనా విమర్శించినపుడు అమ్మ ఎంత సున్నితంగా మందలించేది ఈ వ్యాసంలో తెలియజేశారు. అంతేకాదు, అమ్మ వాక్యాన్ని అవగాహన చేసుకొని రచయిత ఆచరించి చూపారు.
“ఆవలబోయిన వెన్కనాడుటెన్నడు లేదు.
మొగము ముందర అంట మొదలు లేదు”
అంటూ ఎవరి లోను తప్పువెదకని తత్త్వం ధర్మరాజు యొక్క ప్రత్యేక లక్షణంగా, చేమకూర వేంకటకవి విజయవిలాసంలో వర్ణించాడు. ఆ లక్షణం మనకు గోపాలన్నయ్యలో కనిపిస్తుంది. ఎవరినీ విమర్శించకపోవడం, ఎవరితోను పరుషంగా మాట్లాడక పోవడం గోపాలన్నయ్య ప్రత్యేకత.
“ఒరులేయవి ఒనరించిన
నరవర ! అప్రియము తన మనంబున కగు తా
నొరులకునవి సేయకునికి
పరాయణము పరమధర్మపథముల కెల్లన్!” ఈ మహత్తర ధర్మాన్ని అక్షరాల పాటించిన వారు గోపాలన్నయ్య.
“అనన్యాశ్చింతయంతోమాం యేజనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహం”!||
అని గీతాచార్యుని ప్రబోధం. ఆ అభయవచనాన్ని సాక్షాత్తు అమ్మ నుండి అందుకున్న అదృష్టవంతులు ఈ గోపాలన్నయ్య. ఈ గ్రంధం జిల్లెళ్ళమూడి.