బ్రహ్మర్షి విశ్వామిత్రుడు త్రిశంకుడిని బొందితో స్వర్గానికి పంపించాలని సంకల్పించి యజ్ఞం చెయ్యటానికి పూనుకున్నాడు. ఆ యజ్ఞానికి ఋత్విక్కులలో ఒకడుగా ఉండటం కోసం “ఆదిశేషుడ్ని” ఒప్పించటానికి వెళ్ళాడు. అయితే ఆదిశేషుడు దానికి అంగీకరించలేదు. భూభారాన్ని తాను వహించాలి కనుక విశ్వామిత్రుడి వెంట రాలేనన్నాడు. అయితే విశ్మాఇత్రుడు అందుకు అంగీకరించక ఆదిశేషుడిపై వత్తిడి పెంచాడు. విశ్వామిత్రుడి శాపానికి వెరచి ఆదిశేషుడు భూభారాన్ని తొలగించుకొని విశ్వామిత్రుడి వెంట నడవటానికి ప్రయత్నించాడు. అంతే భూమి అమాంతంగా పాతాళానికి జారిపోవటం ప్రారంభించింది. ఆదిశేషుడు, విశ్వామిత్రుడు ఎంత ప్రయత్నించినా దానిని నివారించ లేకపోయినాడు. ఇంతలో నారదమహర్షి అక్కడ ప్రత్యక్షమైనాడు. ఏదైనా పుణ్యకార్యాల ఫలం ఉంటే విశ్వామిత్రుడ్ని ధారపోయమన్నాడు.
విశ్వామిత్రుడు మహారాజుగా తాను చేసిన ధర్మకార్యాల ఫలాన్ని ధారపోసి అయినా భూమి పాతాళానికి జారిపోవటం ఆగలేదు. మహర్షిగా తన తపఃఫలాన్ని ధారపోశాడు. అయినా ఫలితం లేదు. చివరికి నారదుడు సలహా ఇచ్చాడు. ‘సజ్జన సాంగత్య’ ఫలాన్ని ధారపోయమన్నాడు. విశ్వామిత్రుడు సిగ్గుపడుతూ తానెప్పుడు సజ్జన సాంగత్యము నెరపలేదన్నాడు. అప్పడు నారదుడు మరో సలహా ఇచ్చాడు. ‘సజ్జనుడి సమక్షం’ లో నిలబడిన పుణ్యఫలాన్ని దానము’ ఇవ్వమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు “మహాత్మా ! బుద్ధిపూర్వకంగా నేనెప్పుడు సజ్జనుడి సమక్షంలో నిలబడలేదు. అయితే వశిష్టమహర్షి ‘కపిల’ను సంగ్రహించడానికి ప్రయత్నించినపుడు మహర్షి ఆగ్రహించి నాతో యుద్ధం చేశాడు. అదిగో అప్పుడు ఆ సజ్జనుడి సమక్షంలో నిలబడిన పుణ్యంలో అర్థ భాగాన్ని ధారపోస్తున్నాను” అన్నాడు. అంతే పాతాళానికి జారిపోతున్న భూమి యధాస్థానానికి వచ్చి నిలబడింది.
ఆహా ! అదృష్టం అంటే మనదే కదా ! సజ్జనుడి సమక్షంలో నిలబడితేనే ఇంత శక్తివంతుడు అయితే, ఫలితం ఇంత అద్భుతంగా ఉంటే, సాక్షాత్తు ఆ జగన్మాత అవతారమైన జిల్లెళ్ళమూడి ‘అమ్మ’ సమక్షంలో నిలబడగల్గిన మన భాగ్యము ఏమని వర్ణించగలము. అమ్మను జీవన ‘ సహచరిగా పొందిన ‘నాన్నగారు’, అమ్మ రక్తము పంచుకు పుట్టిన అమ్మ సంతానం ‘సుబ్బారావు అన్నయ్య’ ‘రవి అన్నయ్య’, ‘హైమ అక్కయ్య’, రక్త సంబంధం కల్గిన అమ్మ బంధువులు, వీరి యోగ్యతను వివరించడానికి ‘వ్యాసమహర్షి’కి కూడా సాధ్యం కాదు.
ఇక అమ్మకు స్వయంగా పూజలు చేసి అమ్మతో ఇష్టాగోష్టి నెరపిన సోదరుల పుణ్యమే పుణ్యం. అమ్మకు స్నానాదికాల సేవ చేసిన అక్కయ్యల అదృష్టాన్ని ఎవరు లెక్కించగలరు. దాదాపు రెండు దశాబ్దాలపైన అమ్మకు సకల సేవలు చేసిన ‘వసుంధర అక్కయ్య’ ఏ పూలతో పరమాత్మని సేవించిందో ఈ భాగ్యం అబ్బటానికి. ఇక “అమ్మ మంచానికి అయిదో కోడు”గా ప్రసిద్ధి కెక్కి, అమ్మకు పూజారిగా, ‘ఆంతరంగిక కార్యదర్శి’గా రెండు దశాబ్దాలుకు పైగా అనుక్షణం అమ్మతో గడిపిన ‘కొండముది రామకృష్ణ అన్నయ్య’ భాగ్యం వర్ణించడానికి ‘ఆదిశేషుడి’ తరం కూడా కాదు. మనందరికి ఈ అదృష్టం కలుగచేసిన అవ్యాజాను రాగమూర్తి అమ్మకు శతకోటి వందనాలు.
(23.8.2013 కొండముది రామకృష్ణ 15వ వర్ధంతి సందర్భంగా అక్షర నీరాజనం)