1. Home
  2. Articles
  3. Mother of All
  4. అమ్మ – సమ సమాజస్థాపన

అమ్మ – సమ సమాజస్థాపన

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 22
Month : July
Issue Number : 3
Year : 2023

భారతదేశ రాజ్యాంగ ఉపోద్ఘాతం (Preamble)లో ప్రజలకు (Justice) న్యాయము, (Liberty) స్వేచ్ఛ, (Equality) సమానత్వం, (Fraternity) సహోదర భావం… లను – చేకూరుస్తామని ఉద్ఘాటింప బడింది. అది మహోన్నతము, ఆదర్శప్రాయం – ఏ నాటికైనా చేరుకోవలసిన గమ్యం.

కాగా, వాటిని ఏ మేరకు ప్రజలకు అందజేశారనేది ప్రశ్నార్థకమే. భాష, ప్రాంతము, కులము, మతము పరంగా అసమానతలు, విభేదాలు, శతృత్వాలు పెచ్చు పెరిగి హింసని సృష్టిస్తున్నాయి.

విశేషం, ఆశ్చర్యం ఏమంటే ఒక సామాన్య గృహిణిగా కనిపించే ఒక మాతృమూర్తి జిల్లెళ్ళమూడి అనే కుగ్రామంలో ఈ ఆదర్శాలన్నిటినీ అలవోకగా ప్రశాంతంగా ఆచరణలో చూపింది.

ఆమె పేరు అనసూయ. తను వివాహం చేసుకున్నది. తాను తల్లినని ప్రకటించింది. తన భర్తని తండ్రిగా పరిచయం చేసింది. ఉన్నవారూ – లేని వారు, ప్రయోజకులు – అప్రయోజకులు అనే భేదం లేక అందరినీ తన బిడ్డలుగా ప్రేమించింది, ఆదరించింది, ఆదుకున్నది. ఒక విశ్వకుటుంబ భావనని పెంచి పోషించింది. బిడ్డలందరూ నివసించటానికి అందరింటినీ స్థాపించింది. ఆకలి దప్పులు తీర్చేందుకు అన్నపూర్ణాలయం రూపేణ భోజన వసతి కలిగించింది. ఆరోగ్యం కోసం ఆస్పత్రిని, జ్ఞాన సముపార్జన కోసం ప్రాచ్యకళాశాలని స్థాపించింది. అలా మౌలిక అవసరాల్ని తీర్చింది.

అమ్మ స్థాపించిన సేవాసంస్థలకి పునాది మాతృప్రేమ, నిర్వాహణకి మూలం ‘అందరం ఒకే తల్లి పిల్లం’ అనే ఏకోదర బాంధవ్యం.

అందరిల్లు ఒక ఆశ్రమం కాదు, ఆశ్రయం. అక్కడ అందరూ అందరికోసం శ్రమిస్తారు. “తను తిని తన కష్టంతో నలుగురికి అన్న వస్త్రాలు పెట్టాలి” అని అమ్మ ఉగ్గు పాలతో బిడ్డలకి ఒక సందేశాన్ని రంగరించి పోసింది.

వ్యవసాయ పనులు, అందరింటి భవన నిర్మాణ పనులు, సేవా సంస్థల పనులు అందరింటి సభ్యులే నిర్వహిస్తారు. వారిలో విద్యావంతులు, విద్వాంసులు, పండితులూ ఉన్నారు. ఎవరి సామర్థ్యానికి తగిన పని వారు త్రికరణశుద్ధిగా చేస్తారు. సోదరీమణులు కూడా ఇటుకలు, సిమెంటు బస్తాలు మోశారు. వ్యవసాయ పనుల్లో, సున్నపు గానుగ పనిలో చేతులు పుండ్లు పడ్డ పిల్లలను చేరబిలిచి అన్నం కలిపి ప్రేమతో ముద్దలు వారి నోటికి అందించేది. అమ్మ,

అందరూ ఒకే పంక్తిలో భోజనం చేస్తారు – చింతకాయ పచ్చడి, చారు, మజ్జిగ, ఏది లభిస్తే అది. ‘అన్నయ్యా!’ ‘అక్కయ్యా!’ అనే సంబోధనలతో ఆ వాతావరణం ప్రతిధ్వనిస్తుంది. అందరి మనుగడకి ఆనందానికి మూలం – అమ్మ ఆదరణ, ఆప్యాయతలు. జిల్లెళ్ళమూడి పల్లెను వ్రేపల్లెగా, వర్గంలేని భూతల స్వర్గంగా అమ్మ మలిచింది. అక్కడ ఎవరికయినా తోటివారి కష్టసుఖాలతోనే కానీ కులగోత్రాలతో ప్రమేయం లేదు. న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం, సహోదరభావం ప్రోది చేసినట్లే కదా!

ఇంతకీ ‘సమసమాజ స్థాపన’ దిశగా అమ్మ ఆశయం, లక్ష్యం ఏమంటే – “అన్ని గ్రామాల్లో అందరూ అందరి ఆస్తుల్నీ కలుపుకుని ఎవరి వృత్తి వారు చేసుకుంటూ ఒకే చోట ఉంటూ ఒకే రకంగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది!” అనేది.

(Secularism) సర్వమత (అభిమత) సమానత్వం అనే చంద్రుడు అమ్మ సన్నిధిలో జిల్లెళ్ళమూడి గడ్డపై పదునారు కళలతో ప్రకాశిస్తాడు, ప్రశాంత శీతల కిరణాల్ని విరజిమ్ముతాడు. అందరిదీ ఒకే మతం – మానవత్వం. అమ్మ బిడ్డలుగా హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు సహజీవనం చేస్తారు. అందరూ కలిసి మెలసి

అమ్మ అశేష సోదరీ సోదరులపై వర్షించే మమకారం అనన్యం, అసదృశం. ‘నిరంతరం వచ్చిపోయే వందలు, వేలమందికి అన్న వితరణ (దానం) ఎలా చేస్తున్నారు? అని ప్రశ్నిస్తే అమ్మ, “మనం పెట్టటం కాదు, ఇక్కడ ఎవరి అన్నం వారు తింటున్నారు. తల్లి బిడ్డలకు అన్నం పెట్టుకోవటం దానం ఎట్లా అవుతుంది?” – అని తిరిగి ప్రశ్నిస్తుంది. కర్త, కర్మ, క్రియ తానే అయినా ఆ ప్రేమమూర్తి తన కర్తృత్వాన్ని అంగీకరించదు. తను ఏం చేసినా అది, మాతృ ధర్మం అట. ఆ ధర్మ పాలనలోనే ‘సమసమాజ స్థాపన’ చేసింది.

(Fraternity) విశ్వమానవ సౌభ్రాతృత్వ భావనకి దర్పణం పడుతూ James Kirkup “Remember, no men are strange, no countries foreign – Beneath all uniformes, a single body breathes ” అన్నాడు.

అది విశ్వవ్యాప్తం కావాలనే ఆవేదనతో అమ్మ “అందరూ ఒకే తల్లి పిల్లలు అనే భావం కలిగి ఉండండి. ఎవరైనా ఆపదలో ఉంటే రక్షించండి” – అని ఒక సందేశాన్ని ఇచ్చింది; ఆచరింప చేసింది. ఆ ఆచరణే ‘The Preamble of Indian constitution’ కి సాకార రూపం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!