అమ్మతో కలిసి సహజీవనం చేసినవారు, అమ్మ దగ్గరకు వచ్చి పోయేవారు – వీరంతా అమ్మతో కలిసి జీవించినవారు. వారు ధన్యులు. వారి అనుభవాలు కోకొల్లలు. చదువుతూనే వున్నాము. వీరు ఒక శ్రేణి క్రిందికి వస్తారు. రెండవ శ్రేణికి చెందినవారు అమ్మ పేరు విని, అమ్మను దర్శించాలని వచ్చేవారు, వారు కేవలం ఆసక్తి కొద్ది వచ్చి చూచి, దర్శించినవారు. దర్శనమాత్రం చేతనే వారికి అమ్మమీద భక్తి కుదరడం, అమ్మ వాత్సల్యాన్ని చవి చూడడం, అమ్మ పట్ల వారికి అపార భక్తి పెరిగి, అమ్మకు దగ్గర అయినవారు. అమ్మ ఆశీస్సులు పొందినవారు లెక్కకు మించి వున్నారు. ఇక మూడవ శ్రేణికి చెందిన అమ్మ బిడ్డల కథ చూడండి. వీరికి అమ్మ ఎవరో తెలీదు. జిల్లెళ్ళమూడి విషయమే తెలీదు. నా విషయం చెప్తే బాగా అర్థమవుతుందని వ్రాస్తున్నాను.
మాది చిన్న పల్లెటూరు. 2 వేల జనాభా వుంటుంది. మాది కరణాల ఇల్లు. శుక్రవారం (నెల నెల ఒకసారి) నామస్మరణ, పూజ ఒక గంట రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పెట్టినాము. అమ్మ నామస్మరణ 30 నిమిషాలు, హైమ నామస్మరణ 15 నిముషాలు చేసేవారం. మేము ఎవరినీ ‘రండి, రండి’ అని పిలువలేదు. మా అంతకు మేము కార్యక్రమము . నడుపుకొనేవారం. జనులు. ఇరుగు పొరుగువారు తొంగి చూచి, స్మరణలో కూర్చునేవారు. తీర్థప్రసాదాలు తీసుకునేవారు. అమ్మను గురించి 10 నిమిషాలు మాట్లాడి, చిన్నపటం, 2 కుంకుమ పొట్లాలు యిచ్చేవాడిని. రాను రాను 20, 30 మంది స్మరణకు తయారయ్యారు, వారు కాయ, కర్పూరాలు తెచ్చుకునేవారు. ఒక్కొక్కసారి వాళ్ళలో వాళ్ళే ప్రసాదాలు వండుకొని తెచ్చి నివేదన చేసేవారు. వారికి ఒక షరతు పెట్టినాను. ఎవ్వరూ హారతిలో నాణాలు, చిల్లర వేయరాదు. వాళ్ళ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత, రెండు చిప్పలు వాళ్ళే తీసుకెళ్ళి, ఇంట్లో నలుగురికి పంచుకోవాలి.
ఇది ఇంతవరకు పరిణమించిందంటే మేము జిల్లెళ్ళమూడికి ప్రయాణమైనప్పుడల్లా మా వెంట 20 – 25 మంది వచ్చేవారు. అమ్మ అనంతోత్సవము, అమ్మ కళ్యాణోత్సవము, అమ్మ జన్మదినోత్సవం యిత్యాది కార్యక్రమములలో పాల్గొనేవారు. వారికి అటు వసుంధరక్కయ్య, ఇటు శేషమ్మక్కయ్యగార్లు చీరలు పెట్టిన సందర్భాలున్నాయి. మా వెంట వచ్చినవారు ‘కౌంటర్’లో తమ శక్తి కొద్ది నగదు చెల్లించేవారు, మాతోపాటు రాలేని వారు మాకు పైకం యిచ్చి చెల్లించమనేవారు. రాను రాను వాళ్ళ అనుభవాలు వాళ్ళే చెప్పే స్థాయికి వచ్చారు.
కారణానికి అర్థం తెలిస్తే – కార్యాలన్నీ తానౌతాడు.