‘నమామి మాతృపాద పంకజం
భజామి మాతృ నామనిర్మలం
వదామి మాతృ తత్త్వమవ్యయం
కరోమి మాతృ పూజనం సదా’
ఇది మాబావ శ్రీ బూదరాజు దుర్గా ప్రసాదరావు. నాతో స్వయంగా చెప్పిన అనుభవం.
శ్రీ బూదరాజు దుర్గా ప్రసాదరావు రామకృష్ణ అన్నయ్య రెండవ మేనల్లుడు. పెద్ద అక్కయ్య శ్రీమతి వసుమతి గారి రెండవ సంతానం. శ్రీ దుర్గా ప్రసాద్ వినయానికి నిలువెత్తు రూపం ఎన్ ఎఫ్ సి హైదరా బాద్ లో ఉద్యోగవిరమణ చేశాడు. తన చిన్ననాటి అనుభవం ఇలా వివరించాడు.
చిన్ననాటి నుండి శ్రీ దుర్గా ప్రసాద్ జిల్లెళ్ళ మూడి వస్తూ పోతూ ఉండేవాడు. మామయ్య రామకృష్ణ అన్నయ్య జిల్లెళ్ళమూడి లో ఉన్నాడు కనుక తాను వస్తూ ఉండే వాడే కాని పెద్దగా అమ్మ మీద నమ్మకం లేదు. అమ్మ మానవతావాదం మీద గురి ఉందిగాని అమ్మే దేవత అన్న విషయం మీద విశ్వాసం లేదు. దేవత అంటే నాలుగు చేతులు, శిరస్సున కిరీటం, చేతిలో త్రిశూలం ఉండాలని భావన.
అలాంటి శ్రీ దుర్గాప్రసాద్కు అమ్మ దగ్గర ఉపనయనం జరిగింది. అమ్మ మంత్రోపదేశం చేసింది.గాయత్రి మాత అవతారం అమ్మ చేతే ఉపదేశం పొందిన భాగ్యశాలి శ్రీ దుర్గా ప్రసాద్. రామకృష్ణ అన్నయ్య బంధు వర్గం మొత్తాన్ని అమ్మ అనుగ్రహించింది అనటానికి ఇదీ ఒక ఉదాహరణ.
శ్రీ దుర్గాప్రసాద్ ఉపనయనం పూర్తి అయింది.మరుసటి రోజు తిరిగి హైదరాబాద్ వెళ్ళాలని అమ్మని దర్శించుకున్నాడు.ప్రక్కనే ఉన్న రామకృష్ణ అన్నయ్య కుంకుమ పొట్లాలు ప్రసాదంగా ఇచ్చాడు. అమ్మ శ్రీ దుర్గాప్రసాద్ నుదుట కుంకుమ బొట్టు పెడుతూ “దుర్గా! మంత్రం గుర్తుందిగా. రోజూ జపించుకో.” అని అన్నది. గుర్తున్నది అని శ్రీ దుర్గా ప్రసాద్ తలూపాడు. అమ్మ పదే పదే ఇదే ప్రశ్న వేసింది. శ్రీ దుర్గాప్రసాద్ అన్ని సార్లు తలూపాడు.
శ్రీ దుర్గా ప్రసాద్ మరోమాట చెప్పింది. “నాన్నా! దుర్గాదేవత అంటే నాలుగు చేతులు, తలపై కిరీటం ఉండాల్సిన అవసరం లేదు. మనుషులలోనే దేవతలున్నారు నాన్నా. వారిని గుర్తించు. మనసులోని సందేహాన్ని శ్రీ దుర్గా ప్రసాద్ బయటకు చెప్పకుండానే అమ్మ పటాపంచలు చేసింది. అది సమస్త మానవాళికి అమ్మ ఇచ్చిన సందేశం.
“నాన్నా! దుర్గా!మామయ్య కుంకుమ పొట్లాలు ఇచ్చాడు కదా. నీకు కడుపులో నొప్పి వస్తే మంచినీళ్ళల్లో ఈ కుంకుమ కలుపుకొని తాగు. నొప్పి తగ్గుతుంది.”అని శ్రీ దుర్గా ప్రసాద్కు అమ్మ అభయం ఇచ్చింది. శ్రీ దుర్గా ప్రసాద్ కు ఎలాంటి నొప్పి లేక పోవటంతో నవ్వుకుని సరేనమ్మా అన్నాడు. అమ్మ దగ్గర, రామకృష్ణ అన్నయ్య. దగ్గర శెలవు తీసుకుని హైదరాబాద్ చేరాడు.
తెల్లవారి ఆఫీసుకు వెళ్ళటానికి సిద్ధమైనాడు. అంతే విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. తట్టుకోలేనంత నొప్పి, మంచినీళ్ళు తాగుదామని బ్యాగ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకున్నాడు. ప్రక్కనే కుంకుమ పొట్లాలు కనిపించాయి. వెంటనే అమ్మ ఇచ్చిన అభయం గుర్తుకు వచ్చింది. కుంకుమ కలిపి మంచి నీళ్ళు తాగాడు. అంతే నొప్పి తగ్గిపోయింది. తనకిలా నొప్పి వస్తుంది అని అమ్మ. కెలా తెలుసు. ? అమ్మ దేవతా?. ఆలోచనలు ముసురు కున్నాయి.
దానికి అమ్మే సమాధానం చెప్పిందిగా. మనుషులలో దేవతలు ఉంటారని. అయన అనుమానాలు అన్నీ ఆ క్షణం నుండి పటాపంచలైనాయి. అమ్మే ఆరాధ్య దేవత అయింది.
మరునాడు మా వసుమతి అత్తయ్య శ్రీ దుర్గాప్రసాద్ ను అడిగింది.. మంత్రం జపిస్తున్నావా అని.
నిజానికి ఆ మంత్రం వాయిద్యాల హోరులో చెవికి ఎక్కలేదు. అందుకే అమ్మ అన్ని సార్లు పదే పదే మంత్రం గుర్తుందా? అని ప్రశ్నించింది. అమ్మ సర్వజ్ఞతకు మరో మారు శిరసావందనం చేసుకుంటూ తల్లికి విషయం చెప్పాడు. వసుమతమ్మ గారు సలహా ఇచ్చింది కనీసం మామయ్యను అడిగి కనుక్కోమని. శ్రీ దుర్గా ప్రసాద్ రామకృష్ణ అన్నయ్య ను అడిగి మంత్రం తెలుసు కున్నాడు. మంత్ర జపం ఆపకుండా చేసుకుంటున్నాడు.
ఆ తరువాత అతని వివాహం కూడా సుబ్బలక్ష్మి ఆక్కయ్యతో అమ్మే తన సమక్షంలో ఘనంగా జరిపించింది.
అప్పటినుండి జీవితంలో ప్రతి మలుపులో అమ్మ అనుగ్రహం పొందుతూ అమ్మ చెప్పిన ఆ మనుషుల్లో దేవత అమ్మే అని ప్రగాఢంగా విశ్వసిస్తూ జీవిస్తున్నాడు.