భగవద్గీతలో భగవంతుడు అర్జునునితో విశ్వవిరాట్ స్వరూపుడైన తాను మానవ రూపంలో అవతారం ధరించివస్తే మాయా ప్రభావంచేత మనుషులు తనను సామాన్య మానవునిగానే భావిస్తూ వుంటారని అది సహజంగా జరుగుతుందని చెప్పాడు. అట్లాగే సర్వదేవతా స్వరూపిణి అయిన అమ్మ మన మధ్య సామాన్య గృహిణిలాగ తిరుగులాడుతూ సంసారబంధములలో తగుల్కొన్నట్లుగా కన్పించినా, శరీర యాతనలెన్నో అనుభవించినా, తాను అసామాన్య దైవస్వరూపిణి అని అడుగడుగునా నిర్దిష్టముగా నిరూపించుతూనే యున్నది. ఈ మాయామోహిత జగత్తులో తెలివి, తిమిరము రెండిటి మధ్య జిలిబిలి ఆడుతూ వెలుగు చూపుతూనే వుంది.
అమ్మ ఒక దేవతా స్వరూపిణిగా పూజలు అందుకొంటున్నప్పటికీ, మన సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు, పేరుకు పోయిన కాలుష్యానికి స్పందించి ఎంతో క్షోభను అనుభవించింది. అలాంటి సన్నివేశమే ఒకటి, వసుంధర రాసిన ‘శ్రీవారి చరణ సన్నిధి’ గ్రంధం అనే అమ్మ డైరీలోని విషయాన్ని రాస్తున్నాను. ఆమె భరద్వాజగారితో చేసిన ప్రసంగం చాలా ఘాటుగా వుంది. పవిత్రంగా భావింపబడుతున్న ఆధ్యాత్మిక రంగమనే తులసీవనంలో ఎన్నో గంజాయి మొక్కలు పెరిగి “సన్యాసం” అనే పేరునే అప్రతిష్టపాలు చేస్తున్నదని వాపోయింది. “గురుశిష్యులని పైకి పటాటోపంగా కన్పించడమే తప్ప ఆ గురువు చెప్పే దేమిటో ఈ శిష్యులకు తెలియదు. ఎంత వరకు ఈ శిష్యులు ఆచరిస్తున్నారో ఆ గురువుకు తెలియదు. పైగా వాళ్ళు చెప్పేది, ఆ దేవుడు మంచి వాడు కాదు, ఈ దేవుడు మంచి అని. పైగా ఆ మంత్రం చేస్తే నెత్తి అణుస్తుంది అనీ ఈ మంత్రం చేస్తే అపకారం జరుగుతుంది అనీ భయపెడతారు. ఈ శిష్యులకు ఎటూ మనస్సు నిలవక ఉభయ భ్రష్టులవుతారు. ఇంకా ఘోరం ఏమిటంటే తమ వద్దకు వచ్చే ఆడవాళ్ళను నాశనం చెయ్యడం. ఈ గురువు వేషాన్ని అడ్డం పెట్టుకుని ఇన్ని పాపాలు చెయ్యటం ఎందుకు? అదేదో బహిరంగంగానే తమ కోర్కెలు తీర్చుకోవచ్చుగా. ఈ కాషాయ వస్త్రాల ముసుగుకప్పుకుని వీళ్ళు ఆడుతున్న ఆటలు చూస్తూ వుంటే అసలు సన్యాసం పేరే చెడగొడుతున్నారనిపిస్తుంది. ఈ మధ్య ఈ ఘోరాలు చాలా ఎక్కువయ్యాయి. ఇట్లా నాశనం చెయ్యబడ్డ వారు నా వద్దకు వచ్చారు. వాళ్ళు చెప్పేది వింటూంటే ఎంత జాలి వేసిందో నాన్నా! నా బాధ ఎక్కడ వుందంటే శీలమే ముఖ్యమని, పాతివ్రత్యము ధర్మం అనుకున్న వాళ్ళతో ఇట్లా చేస్తున్నారా? ఇట్లనాశనం చెయ్యబడి నా వద్దకు వచ్చిన అమ్మాయి ఎంత మంచిదంటే నీకేమి కావాలని అడిగితే నాపతిలో భగవంతుడ్ని చూసే శక్తి ఇవ్వమని, అడిగే మనస్తత్వం కలది, రామభక్తురాలు. అటువంటి అమ్మాయి దెబ్బతిన్నదంటే ఎంత విచారకరమో చూడు” అని భరద్వాజతో అన్న.
ఇంకా అమ్మ చెప్పే మాటలకు వక్రభాష్యాలు కల్పిస్తూ జీవితాన్ని ఒక నియమం లేకుండా నిర్లక్ష్యంగా గడుపుతూ అట్లా గడపటానికి కారణం అమ్మ సంకల్పమేనని బూటకపు అర్థాలు చెప్పే మూఢుల్ని అమ్మ చాలా తీవ్రంగా మందలించింది. తాము చేసే తప్పుడు పనులకు అమ్మ సంకల్పమేనని తప్పించుకో చూచిన వారిని కూడా తగు రీతిలో శిక్షిస్తూ మాట్లాడింది. ఇంకా ఒకరిద్దరు ఆడవాళ్ళు తామే జిల్లెళ్ళమూడి అమ్మ వార్లమంటూ చాలా హడావుడి చేసే శిష్యుల్ని గూడా పోగు చేసుకుని తిరుగుతూ వుంటే వాళ్ళకి “జిల్లెళ్ళమూడి అమ్మ” పేరు తప్ప మరే పేరైనా పెట్టుకు తిరగమని చాలా తీవ్రంగా చెప్పింది. తను “అమ్మ” కాకముందు జిల్లెళ్ళమూడి కరణంగారి భార్యనని, అది గుర్తుంచుకోమని చెప్పింది. ఇట్లాంటి వారు ఎంతో మంది మహాత్ములుగా చలామణి అవుతూ లోకాన్ని వంచిస్తున్నారు. ఆత్మవంచన, పరవంచన చేస్తున్నారు. ఇట్లాంటి వారికి కాలమే సమాధానం చెప్తుంది.
ఒకసారి పీపానీళ్ళకు వెళ్ళిన అమ్మమ్మగారి అమ్మాయి ‘నెహ్రూ చనిపోయాడని రేడియోలో విన్నాం’ అని చెప్పగా అమ్మ దగ్గర వున్న వాళ్ళంతా నిశ్చేష్టులయ్యారు. అమ్మ అంతకు ముందే గోపాల కిష్ణ అన్నయ్యతో “పోతాడా? పోయాడా? అని అన్నదట. ఎవరు అని అన్నయ్య ప్రశ్నిస్తే అట్లా అన్పించింది ఏం చెయ్యాలి’ అన్నదట. అమ్మ అందర్నీ కాలవకు బయల్దేర తీసింది. “పోయినందుకు కాదు ఆయన త్యాగానికి నివాళులర్పిద్దాం” అన్నది. ఆమె ముఖం చాలా ప్రశాంతంగా వున్నది. కాలవ దగ్గర తన సంతాపాన్ని రకరకాల చర్యలతో చూపింది. ఆవు నేతితో ఒక జ్యోతిని, ఒక మామిడి పండు మీద కర్పూరం వెలిగించి దానిని నీటిలోకి వదిలింది. తన చీర నుండి ఒక నూలుపోగు తీసి నీటిలో కలిపి మూడు తడవలుగా నీటిని దోసిళ్ళతో తర్పణం వదిలింది. త్యాగమూర్తి అయిన నెహ్రూకి అమ్మ తన అనుగ్రహంతో తర్పణం వదిలి సద్గతి నిచ్చింది.
ఒకసారి బాపట్లలో 1973వ సంవత్సరం జూన్ 14, 15 తేదీలలో దారుణమయిన అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 600 కుటుంబాల ఇళ్ళూ వాకిళ్ళూ తగలబడి పోయాయి. అమ్మ వెంటనే వారికి ఆహార సదుపాయం కలుగ జేయమని విశ్వజననీ పరిషత్కు ఆదేశ మిచ్చింది. ఆవరణలో సోదరీ సోదరులందరూ అన్నం ప్యాకెట్లు కట్టడంలో నిమగ్నమైనారు. అప్పుడే దర్శనానికి వచ్చిన సోదరుడు అమ్మకు నమస్కరించి “నాకేదైనా సందేశం ప్రసాదించమ్మా” అని అర్థించాడు. అమ్మ నవ్వుతూ “నువ్వూ వారితో కలిసి అన్నం పొట్లాలు కట్టు. వాళ్ళు అక్కడ ఆకలితో ఎదురు చూస్తున్నారు. నలుగురు కలిస్తే త్వరగా వారికి అందించవచ్చు” అని అంది అమ్మ. జీవిత మంతా ఇదే సాధన. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టుకోవడం. అదే పూజ అదే మంత్రము. అక్కడికి వచ్చిన వారికిచ్చే
ఇక అమ్మ కర్తవ్య పరాయణత గూర్చి మాట్లాడవలసి వస్తే సర్వదేవతా స్వరూపిణి అయిన అమ్మ పతిసేవా పరాయణురాలు. ఒక మనస్సు, ఒక హృదయం, ఒక కన్ను, ఎప్పుడూ నాన్నగారి అవసరాలమీద వుంచేది. తను స్వయంగా చేస్తున్నట్లే అన్నీ అమర్చేది. ఒకసారి రామక్రిష్ణ అన్నయ్య అమ్మకు అభిషేకం చేయాల్సిన రోజు, ఆ రోజున నాన్న గారికి జ్వరమొచ్చింది. రామ క్రిష్ణన్నయ్యను గుడిలో పూజ చేసుకోమని చెప్పి అమ్మ నాన్నగారి మంచం పక్కన క్రిందనే పడుకుని ఆయనకు సేవ చేసింది. జ్వరం నార్మల్కు వచ్చాక నాన్ రొట్టె (బ్రెడ్డు) తాను దగ్గరుండి కాల్చి ఆయన చేత తినిపించింది. ఎన్ని పూజలున్నా నాన్నగారికి అవసరమయినపుడు అవన్నీ ప్రక్కకు పెట్టి ఆయన సేవ చేసేది. ఒక ప్రక్కన లోక కళ్యాణం కోసం తన అవతారం యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తూ మరో ప్రక్క నాన్నగారి అవసరాలు కనిపెట్టి చూసేది. నాన్నగారి ఆఖరి శ్వాస తీసుకునే వరకూ కనిపెట్టి చూసి ఆయన మృతి చెందాక ఆయన మృత శరీరంపై తన చేతిని గంటల తరబడి వుంచి ఆ విధంగా ఆయనకు శక్తి పాతాన్ని, తద్వారా దివ్యత్వాన్ని కలిగించి నాగేశ్వరునిగా ఆరాధనీయునిగా దేవతా మూర్తిగా ప్రతిష్ఠ చేసింది. పూర్వం రమణ మహర్షి ఇట్లాగే తన మాతృమూర్తి మరణించాక ఆమె తల మీద ఆయన చేతిని కొన్ని గంటలపాటు వుంచారు. దానివల్ల ఆమె కర్మ పూర్తిగా క్షయమయి ముక్తురాలయింది. ఆయన తన శక్తిపాతంతో ఆమెకు శివసాయుజ్యం కలిగించి మాతృభూతేశ్వరాలయంలో స్థాపించారు. ఇప్పటికీ ఆయన తల్లి సమాధి మాతృభూతేశ్వరునిగా పూజలందుకుంటున్నది. తన కుమార్తె హైమకు దైవత్వ సిద్ధిని కల్పించి ప్రతిష్ఠ చేసిన చోటు హైమాలయంగా రూపుదిద్దుకుంది. అత్త (బామ్మ) గార్కి కూడా చివరి దశలో సేవ చేసి తరింపచేసింది. తండ్రి, అన్నగార్లను అమ్మ సన్నిధిలోనే ఆమె ప్రేమతో సాగనంపింది. ఇట్లా ఒక కుటుంబ వ్యక్తిగా, గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ అవతార మూర్తిగా అనేక మంది వేలు లక్షల బిడ్డలకు ఆరాధ్య దేవత అయింది. ఈ విధంగా రెండు పడవలమీద తలా ఒక పాదం పెట్టి సంసారసాగరంలో ప్రయాణించి కృత కృత్యురాలవటం ఒక్క అమ్మకే సాధ్యం. అందుకే ఆమెను “జయహో మాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరీ శ్రీపరాత్పరి అని భజిస్తున్నాం.