అమ్మ సాహిత్యం 1954 నుండి శ్రీకారం చుట్టబడింది అని అనవచ్చును. 1954 నుండి రాజు బావగారు అమ్మ దగ్గర ఆయన వుండి అమ్మ చరిత్రకు సంబంధించిన కొన్ని తన అభిప్రాయాలను, అనుభవాలను పాటల రూపంలో వ్రాశారు. ఆ పాటలను విని చీరాల సోదరులు స్పందించి ఇక్కడకు కొంతమంది వచ్చారు. తరువాత 1957-58లలోనే డాక్టర్ ప్రసాదరాయకులపతి, మిన్నికంటి గురునాథశర్మ, వాడరేవు సుబ్బారావు, విద్యాసాగర్ శర్మ, వాకాటి పాండురంగారావు, పోతరాజు పురుషోత్తమరావు, కోన సుబ్బారావు, పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్, బ్రహ్మాండం సుబ్బారావు మొదలగు వారు ఈ యజ్ఞంలో పాలుపంచు కున్నారు. తరువాత ఉద్దండుడైన దివాకర్ల వెంకటావధాని, కాశీ కృష్ణాచార్యులు, జమ్మలమడక మాధవరామశర్మ, తుమ్మల సీతారామమూర్తి, ఏలూరిపాటి అనంతరామయ్య, మల్లాప్రగడ శ్రీరంగారావు, మాడుగుల నాగఫణిశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, దివాకర్ల వెంకటావధాని, ఉషశ్రీ, కరుణశ్రీ, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, పొత్తూరి వెంకటేశ్వరరావు, పన్నాల రాధాకృష్ణశర్మ, కొండముది శ్రీరామచంద్రమూర్తి, కోగంటి సీతారామాచార్యులు, బృందావనం రంగాచార్యులు, శ్రీ లక్ష్మణ యతీంద్రులు, కొండముది రామకృష్ణ మొదలగు వారు కూడా ఇందులో భాగస్వాములైనారు. తర్వాత ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, వార్త, ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రికలలో అమ్మ మీద వ్యాసాలు ప్రచురించారు. ఆనంద వికటన్ లాంటి బహుళ ప్రచారంగాల తమిళ వారపత్రికలో వరుసగా మూడూ, నాలుగు పత్రికలలో వ్యాసాలు ప్రచురింపబడి తమిళలోకంలో సంచలనం కలిగించింది. సోదరి కుమారి భవాని, వసుంధర, బాలాత్రిపురసుందరి, సోదరులు గరుడాద్రి సుబ్రహ్మణ్యం మొదలగువారి నిరంతర కృషివల్ల అమ్మ దినచర్య వ్రాయబడి శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు లాంటి వారికి అమ్మ – అమ్మ వాక్యాలు. అమ్మతో రామకృష్ణ. గోపాలకృష్ణగార్ల కృషితో అమ్మ జన్మదినోత్సవ సంచికలు వరుసగా 62, 63, 64, 65, 66 సంవత్సరములలో తీసుకొని రాబడి అమ్మ జన్మదినోత్సవాలలో అమ్మకు నివేదింపబడినవి. తరువాత 1966 నుండి శ్రీ అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య సంకల్పముచే మాతృశ్రీ మాసపత్రికలు కల్యాణ దినోత్సవ సంచిక నుండి ప్రారంభింపబడినవి. అవి తరువాత 1968 నుండి మాతృశ్రీ పబ్లికేషన్స్ పేర అవిచ్ఛిన్నముగా దాదాపు 25 సంవత్సరాలు శ్రీ కొండముది రామకృష్ణ ఎడిటర్ గాను, కె.బి.జి. కృష్ణమూర్తి మేనేజింగ్ ఎడిటర్ గాను పబ్లిష్ చేయబడినవి. తరువాత 2001 సంవత్సరం నుండి విశ్వజనని మాసపత్రికగా రూపొందించబడి మాతృశ్రీ పబ్లికేషన్స్ పేర పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ ఎడిటర్గాను, కె.బి.జి. కృష్ణమూర్తి మేనేజింగ్ ఎడిటర్గాను, శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యంగార్ల సహకారంతో అవిచ్ఛిన్నంగా ప్రకటింపబడుతున్నవి. ఈ పత్రిక మాతృశ్రీ ఇంగ్లీషు పత్రికలు ఎక్కిరాల భరద్వాజ, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, వీరమాచనేని ప్రసాదరావు, దినకర్, ధర్మసూరి మొదలగు వారిచే తీర్చిదిద్దబడినవి. కుమారి మొసలికంటి ఉష, డాక్టర్. టి.యస్. శాస్త్రి, డి. కామరాజు, ఎమ్.కె.ఆర్ రావ్ మొదలగు వారి ఆధ్వర్యంలో హైద్రాబాద్ నుండి విశ్వజననీ ట్రస్ట్ పేర “Mother of All” అని ‘ఇంగ్లీషు తెలుగు భాషలలో త్రైమాసిక పత్రికలు 1999 నుండి ప్రచురింపబడుచున్నవి. ఇంగ్లీషు రిచర్డ్ షిఫ్మన్ అలెగ్జాండర్ రోడ్నీ, వెస్టర్ లాండ్, & ప్రొ. శివరామకృష్ణ, యస్. మోహనకృష్ణ మొదలగు అనేక రచయితలచే పుస్తకాలు ప్రచురింపబడినవి. అవికాక తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ, మరాఠీ భాషలలో అమ్మ సాహిత్యం తీసుకురాబడింది.
1971లో అమ్మ ప్రచార భాగంగా రెండు రీళ్ళ బ్లాక్ & వైట్ కలర్లో థియేటర్స్లో చూపించటానికి వీలుగా 35 మీ.లలో శ్రీ చుండూరు సీతారామయ్య సహాయంతో, శ్రీ పామర్తి వెంకటేశ్వరరావు డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్ గా శ్రీ చంద్రమోహన్ కెమేరామెన్గా వీడియోగ్రాఫర్గా సుందరరావు నెహతా వారి లేబరేటరీలో శ్రీ శంకర శ్రీ రామారావ్ టైటిల్ సాంగ్ వ్రాయగా శ్రీమతి యస్. జానకీ తన గాత్రముతో శ్రావ్యముగా – జిల్లెళ్ళమూడిలో శ్రీ రూపధారిణియై” అనే పాటను పాడి ప్రేక్షకుల మన్ననను పొందింది. దీనికి శ్రీ కొండముది రామకృష్ణ స్క్రిప్టు వ్రాయగా శ్రీ కొంగర జగ్గయ్యగారు ఈ డాక్యుమెంటరీకి నేపధ్యగాత్రం వినిపించారు. తరువాత 1972 నుండి 1975 వరకు షూటింగ్లతో అమ్మను గూర్చి అమ్మ టూర్స్న జిల్లెళ్ళమూడిలో జరిగే అన్ని ఉత్సవములను 3 సంవత్సరములలో పూర్తి నిడివికల 15 రీళ్ళ కలర్ పిక్చర్ మాతృశ్రీ పబ్లికేషన్స్ ట్రస్ట్ పేర శ్రీ కె.బి.జి. కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా 35 ఎమ్.ఎమ్.లో తీసుకొని రాబడినది. దీనికి శ్రీ కొండముది రామకృష్ణ స్క్రిప్టు వ్రాయగా శ్రీ పి.యస్. శర్మగారు తన గాత్రం నేపథ్యంలో వినిపించారు. శ్రీమతి పి.సుశీల, యస్.జానకీ, పి.లీల, శ్రీ యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బాలమురళీకృష్ణ, రామకృష్ణ, ఘంటసాల నేపధ్య గాయనీ గాయకులుగా వ్యవహరించారు. దాదాపు 10, 12 శ్రావ్యమైన పాటలను వారి సొంత ఖర్చులతో వచ్చి అమ్మ మీద వున్న భక్తి విశ్వాసములతో పాడటం వారి అదృష్టమనే చెప్పాలి. శ్రీ నూనె ఆదిశేషయ్య గారి ఆర్థిక సహకారం అనేకంగా తోడ్పడింది. దీనికి మొదటి సారిగా శ్రీ పామర్తి వేంకటేశ్వరరావు తరువాత శ్రీ సుసర్ల దక్షిణామూర్తి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. శ్రీ ఎమ్.యస్. ఎన్ మూర్తి గారు ఎడిటర్ గాను డైరెక్టర్ గాను వ్యవహరించి సహాయ సహకారాలు అందించారు. ఇది అనేక థియేటర్స్ లో ప్రదర్శింపబడింది. అమ్మను నేరుగా చూపించే గం.2-15 ని.ల పిక్చర్లో అమ్మ కోరినట్లు లక్షమందికి ఒకే పంక్తిలో భోజనం పెట్టబడ్డ చరిత్రాత్మకమైన సన్నివేశం దానికి చేసిన ఏర్పాట్లతో సహా చిత్రీకరింపబడింది. అమ్మను భావితరాల వారికి ఈ తరం వారికి చూపించటానికి ఈ డాక్యుమెంటరీ చిత్రం ఎక్కువగా దోహదపడుతుందని ఆశిస్తున్నాను.
తరువాత శ్రీ గంటి కాళీప్రసాద్ ఒక టెలీఫిలిమ్ రూపొందించారు. అది అనేక యాక్టర్స్తో తియ్యబడింది. ఆయన తీసిన పిక్చర్ శ్రీ శివానందమూర్తిగారు అమ్మను గూర్చి చేసిన సంభాషణ హైలేట్. అమ్మ మీద ఇంగ్లీషులో 7 రీళ్ళ డాక్యుమెంటరీని 35 ఎమ్.ఎమ్.లో తీశాము. శ్రీ ఎమ్. దినకర్ స్క్రిప్టు వ్రాయగా శ్రీ జేమ్స్ కాంపియన్ ఇంగ్లీషు కామెంటరీ ఇచ్చారు. దీనిని విదేశాలకు పంపాలని ఆశించాము. కాని కారణాంతరముల వలన అది వెలుగు చూడలేదు.
1958 నుండి డాక్టర్ పోట్లూరి సుబ్బారావుగారు దాదాపు 10,000 ఫోటోలు 1985 దాకా తీశారు. అమ్మ మీద 8 mm, 16mm లలో చలన చిత్రాలను 1962లో అమ్మ ఓడరేవు వెళ్ళినప్పటివి, జిల్లెళ్ళమూడిలో జరిగే పండుగలలోనూ, ఉత్సవములలోనూ అమ్మచే నిర్వహింప బడిన అనేక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆయన తీసిన ఫోటోలను, చలన చిత్రాలను అనేకమంది అమ్మ మీద వ్రాసిన పాటల సిడిలను అమ్మ మీద వ్రాసిన సాహిత్యమును మాతృశ్రీ మాసపత్రిక 25 భాగములను విశ్వజననీ మాసపత్రిక మొదటి నుండి ఇప్పటివరకు తీసుకురాబడిన వాల్యూమ్స్న శ్రీ జేమ్స్ కాంపియన్ ఆర్థిక సహాయంతో కె. రాజేంద్రప్రసాద్, శ్రీ ఎమ్. యస్. శరచ్చంద్రకుమార్ మాతృశ్రీ డిజిటల్ సెంటర్ పేర డిజిటలైజ్ చేసి Sri Viswajanani Website లో ప్రదర్శింపబడుటకు తగిన ఏర్పాట్లు జరుపబడుచున్నవి. ఈ సాహిత్య ప్రచారరధం అన్నపూర్ణాలయం వలెనే జగన్నాధ రధంలా సాగుతుందని అభిలషిస్తున్నాను.