అమ్మయందు భక్తి ప్రపత్తులు, అమ్మసేవానురక్తిగల వారు అంటే – అమ్మ భౌతికరూపమైన అమ్మ సేవా సంస్థలు, అమ్మ బిడ్డలయందు సేవానురక్తి గలవారని అర్థం. అమ్మ ఆచరణాత్మక ప్రబోధమే వారికి ఆదర్శము, ఆచరణీయము. అట్టి భాగవతోత్తములలో శ్రీ వల్లూరి బసవరాజు అన్నయ్య ముఖ్యులు. వారి కృషి, తపనకి కొన్ని ఉదాహరణలు పూర్వం వలెనే జిల్లెళ్ళమూడి నుండి బాపట్లకి రాకపోకలను మెరుగు పరచి సోదరీ సోదరులకు సౌకర్యాన్ని
కలిగించేందుకు VAN ను పునరుద్ధరించాలని .
అమ్మ శతజయంతి మహోత్సవ సందర్భంగా అందరింటి సేవాసంస్థల నిర్మాణానికి నిర్వహణకి పునాది రాళ్ళుగా అంకితమైన పూజ్య సోదరీ సోదరులను సన్మానించుకోవాలని, పత్రికలో వారి సేవలను శ్లాఘిస్తూ రచనలు చేయాలని, –
అమ్మ శతజయంతి ఉత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు – నగర సంకీర్తన, అంబికా సహస్రనామ స్తోత్ర పారాయణ, లలితా సహస్ర నామ పారాయణ, సహస్రదీపాలంకరణ, సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణకు శ్రమకోర్చి జయప్రదం చేసిన మాన్య సోదరీమణులు మన్నవ సుబ్బలక్ష్మి, నందమూరు పాప ప్రభృతులను సమ్మానింపవలెనని – ఎలుగెత్తి చాటారు.
‘సతులకై కొన్నా ళ్ళాస్తికై సుతులకై కొన్నాళ్ళు’ అన్నారు త్యాగరాజస్వామి. అందుకు భిన్నంగా అమ్మ సేవయే జీవన సాఫల్యము, సార్ధకము, పరమార్థము అని నమ్మి సౌఖ్యాలకు దూరంగా ఒక తపస్విలా జీవిస్తూ జిల్లెళ్ళమూడిలో సంస్థాగత అభివృద్ధి కార్యక్రమాల్లో, పరిసరాల పరిశుభ్రత, అతిథిగృహాల పారిశుధ్యం, నామ సంకీర్తన, ఉత్సవాల్లో యాత్రికుల సౌకర్య పరికల్పన వంటి సేవా కార్యక్రమాల్లో అనుక్షణం యథాశక్తి పాల్గొంటూ “భాగవతసేవే భగవంతునిసేవ” అని ఆచరింది చూపిన ఆదర్శమూర్తి అన్నయ్య.
ఆచార్య ఎక్కిరాల భరద్వాజ వివరించినట్లుగా – జిల్లెళ్ళమూడిలో కర్మయోగము తక్కిన భక్తి జ్ఞాన వైరాగ్య యోగ పరాకాష్ఠ స్థితిని సిద్ధింప జేస్తుంది. ఇదే అర్కపురి వైశిష్ట్యం. వ్యక్తికి తాను సాధన చేస్తున్నానని, కఠోర తపస్సు నాచరిస్తున్నానని, నిస్వార్థంగా కర్మఫల పరిత్యాగ భావనతో పరహితార్థ కామనయే పరమ లక్ష్యంగా దీక్షగా శ్రమిస్తున్నానని తెలియకుండానే పరమపదాన్ని అనాయాసంగా పొందుతారు.
అదే బాటలో పయనించి తపించిన శ్రీ బసవరాజు అన్నయ్య 31-5-2023 తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్లో అమ్మ స్మరణతో అమ్మ స్ఫురణతో అమ్మలో ఐక్యమైనారు. పూజ్య సోదరుని కిదే సాశ్రు నివాళి.
సంపాదక మండలి
(రచన – ఎ.వి.ఆర్. సుబ్రహ్మణ్యం)