జగమేలే పరమాత్మ ‘అనసూయమ్మ’గా భూమిపై అవతరించాడు. డా॥ సి.నారాయణరెడ్డి ఒక గజల్లో అన్నారు.
‘అమ్మ ఒక వైపు –
దేవతలంతా ఒక వైపు
సరితూచమంటే….
నేను ఒరిగేను.
అమ్మ వైపు’ – అన్నారు. దేవతల కంటే మిన్న అమ్మ. విశ్వకుటుంబిని అమ్మ ఒక సామాన్య గృహిణి వలె కనిపిస్తుంది. అమ్మ యొక్క ఆ రూపం పరిమితం, శక్తి అనంతం. అవాఙ్మనసగోచరమైన మహిమాన్వితమైన ఆ అనంతశక్తి స్వరూప స్వభావాన్ని యదార్థంగా తెల్సుకోవాలటే అమ్మ చరిత్రే ఆధారం. కారణం జ్ఞాన స్వరూపం అమ్మ; దయాస్వరూపం అమ్మ.
శ్రీరామానుగ్రహం కోసం ‘శ్రీమద్రారామాయణ పారాయణ’, శ్రీకృష్ణతత్వాధ్యయనం కోసం ‘శ్రీమద్భాగవత పారాయణ’ చేస్తాం. అలాగే శంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి జ్ఞానులు, యోగులు, సిద్ధపురుషుల విషయంలోనూ.
‘నామము’, ‘నామి’ అనే రెండు పదాలు ఉన్నాయి. ‘నామము’ అనేది ఆరాధ్యమూర్తి (నామి) యొక్క నాదరూప మంత్రం. ఉదా : ఓంనమశ్శివాయ, ఓం నమో నారాయణాయ. ఉపాసనకి ‘నామమే పట్టుగొమ్మ. నామము, నామి… రెండూ అభేదమే. ఆంజనేయస్వామి, తులసీదాసు, తుకారాం, త్యాగరాజు… వంటి భాగవతోత్తములు ‘నామము’ యొక్క ప్రభావాన్ని వేనోళ్ళ చాటారు. విధి – విధానాలకి కట్టుబడి అవతారమూర్తులూ శరీరత్యాగం చేస్తారు; కానీ ‘తారకమంత్రం’ ఆచంద్రార్కం ప్రకాశిస్తుంది, ఈశ్వరానుగ్రహాన్ని ప్రసారం చేస్తుంది.
సో॥ రాధాకృష్ణరెడ్డిని అమ్మ ముద్దుగా ‘రాధ’ అని పిలుస్తుంది. ‘రాధ అంటే ఆరాధన’. అమ్మ నామం ‘జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి’ – ని తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా, ప్రణవ స్వరూపంగా, రోజుల తరబడి నిద్రాహారాన్ని మరిచిపోయి తన్మయత్వంతో గానం చేసిన నాదయోగి రాధన్నయ్య, అమ్మ స్వయంగా పాలు పంపినా స్వీకరించేవాడు కాదు. భగవంతుని కంటే భగవన్నామమే శక్తివంతమైనదని, నామసంకీర్తనలో పరవశించేవాడు.
పురాణపురుషులు, అవతారమూర్తుల గాధలు, చరిత్రల పారాయణఫలం వ్యక్తిలోని వికారాన్ని, వాసనల్ని నశింపజేసి దైవీసంపత్తిని పెంచుతుంది; ఐహిక ఆముష్మిక ఫలాన్ని అందిస్తుంది. కనీసం సత్యనారాయణ వ్రతం, అనసూయావ్రతాల ఆచరణలో భాగంగా కొన్ని అధ్యాయాల్ని అయినా శ్రద్ధగా . విని మననం చేసికొంటే భోగమోక్షాలు కరతలామలకం అవుతాయి. గీతాచార్యులు, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదు మున్నగు ఆచార్యులు, ప్రవక్తల జీవితచరిత్రలను, ప్రవచనాలను సాధకుల సౌలభ్యం కోసం భద్రపరచి ఎన్నో భాషలలోకి అనువదించారు. ఆచరిస్తున్నారు. కాలక్రమేణా భావోద్విగ్నతకి, కల్పనాచాతుర్యానికిలోనై మూలాన్ని విడిచిపెట్టి, ఎవరికి తోచిన భాష్యాన్ని వారు చెప్పడం ప్రారంభించారు; ఒక్కొక్కసారి ఆ పురాణేతిహాస సంఘటనలు, సత్యాలు తెరచాటుకు పోగా వాస్తవాలు మరుగుపడ్డాయి. కాలప్రవాహంలో అటువంటి మార్పులు అనివార్యం. కానీ ఆ దివ్యమూర్తులే స్వయంగా తమ చరిత్రను, వృత్తాంతాన్ని వివరించి గ్రంథస్థం చేయించి ఉంటే ఎంత ప్రయోజనకరంగా
అద్భుతం… మానవాళి పురాకృత పుణ్యఫలం. ‘అమ్మ జీవిత మహోదధి’ పేరుతో వెలువడిన అమ్మ జీవితచరిత్ర, అమ్మ స్వయంగా వివరించి వ్రాయించినదే. అమ్మ జీవితంలోని అనేకానేక సంఘటనలు సాగరతరంగ సదృశములు. అమ్మ అనుంగు బిడ్డ, ఋషితుల్యుడు, శ్రీ యార్లగడ్డ భాస్కరరావు ||అన్నయ్య అమ్మ కొన్ని సంఘటనలను వివరించగా, వాటిని యథాతథంగా అక్షరబద్ధం చేశారు. సుందరకాండ పారాయణకి, భగవద్గీత-ఆచరణకి పెట్టింది. పేరు. కానీ అమ్మ జీవిత చరిత్ర పారాయణ, ఆచరణ సర్వశ్రేయోదాయకం;
భక్తి జ్ఞాన వైరాగ్య విభూతులను అనుగ్రహించే కల్ప వృక్షం: ఇహ పరసౌఖ్యాలను ప్రసాదించే పవిత్ర తీర్థం. అకారుణ కారుణ్య వారాశి అమ్మ.
విశ్వజనని అమ్మ విరాట్ స్వరూపాన్ని ఈ రెండు కళ్ళతో చూడలేము; సర్వ సృష్టికారిణి అమ్మ చర్యల్ని ఈ మనస్సుతో గుర్తించలేము. జన్మ ప్రభృతి అన్ని సంఘటనల్ని, ఆయా పాత్రల్ని, వారి వారి ఆలోచనాసరళిని పూసగుచ్చినట్లు విస్తరించి అమ్మ సాధికారికంగా చెప్పేది. ఇది సామాన్యులకు అసాధ్యము. ఎలా చెప్పగలుగుతున్నావమ్మా అని ప్రశ్నిస్తే, ‘అవన్నీ ఎప్పుడో జరిగినట్టు ఉండదు. ఇప్పుడు నా కళ్ళ ముందు జరుగుతున్నట్లు ఉంటుంది” అనేది. అమ్మకి త్రికాలములు వర్తమానమే. నిన్న, నేడు, రేపు అనే విభజన కాలస్వరూపిణి అమ్మకి లేదు. అంతటి పవిత్రగ్రంధం కనుకనే ప్రొ॥ శివరామకృష్ణగారు ‘అమ్మ జీవిత మహోదధి’ని ‘నేటి దేవీ భాగవతం’ అని ప్రస్తుతించారు. మరింత ఆశ్చర్యకరము, ఆసక్తికరము అయిన అంశం ఏమంటే అమ్మ ఆ పాత్రల్ని, ఆ సంభాషణల్ని ఆయా సందర్భాన్ని వివరిస్తోంటే అదృష్టవంతుడు భాస్కరరావు అన్నయ్యకి ఆయా వ్యక్తులు వారివారి కంఠ ధ్వనులతో అలనాటి సంభాషణలు వినిపించేవి. ఇవన్నీ చరిత్రకు అందని, అర్థం కాని అపూర్వ సత్యాలు.
ఈ సందర్భంలో అమ్మ అన్నది, “నా జీవితం అబద్ధం, చరిత్ర బద్ధం అని. అమ్మ జీవితం అబద్ధం అంటే దేనికీ కట్టుబడనిది. అమ్మ అక్షర పరబ్రహ్మ స్వరూపం. దేశ, కాల, రూప, గుణాలకి అతీతమైనది. కానీ తనని తాను వ్యక్తపరచటానికి పరిమిత రూపంతో వచ్చి ఒక సామాన్యగృహిణిగా చరించింది. 1923లో అవనీస్థలిపై అడుగుపెట్టి, 62 సం.లు ఈ ప్రపంచాన్ని పవిత్రీకృతం చేసి, 1985లో ఆలయప్రవేశం చేసింది. ఈ కాలంలో అమ్మ కదలికలు చరిత్రలో భాగం అయింది; కనుకనే తన జీవితం చరిత్రబద్ధం అని ప్రకటించింది. అమ్మకీ సామాన్యునికీ ఏ పోలికాలేదు. అమ్మ శరీరం పాంచభౌతికమైనది అనిపిస్తుంది. కానీ కాదు. అది నానాచ్ఛిద్రఘటో దరస్థిత మహాదీప ప్రభాభాస్వర స్వరూప సువర్ణ జ్యోతి. 1923కు ముందూ, 1985 తర్వాతా… ఎప్పుడూ ఉంటుంది అమ్మ. సృష్టిస్థితిలయ సంచాలకశక్తి అమ్మ.
అనేక విధాల అమ్మను హింసించి, అంతం చేయాలని యత్నించిన వాళ్లతో అమ్మ. “ఈ శరీరం లేకపోయినా, ఈ నామం “ఉంటుంది” – అన్నది సున్నితంగా.
అమ్మ జీవితనావ ఎప్పుడూ ఎదురుగాలి, తుఫాను, కల్లోలిత వాతావరణంలోనే పయనించింది. క్లిష్టమైన సందర్భాల్లో సంక్లిష్టమైన వ్యక్తుల్ని ప్రేమతో జయించింది. ఆ ఓర్పు, క్షమా గుణం స్వార్ధపూరిత మానవలోకానికి ఒక కనువిప్పు. చర్యకు ప్రతి చర్య కార్యసాధకం, ఫలప్రదం కాదు; పైగా విధ్వంసకం. అందుకు అమ్మ చేసిన సంస్కరణలు ఆదర్శం, రాచబాట, నిర్మాణాత్మకం.
ఇంటింటా పిడికెడు బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఆకలిబాధని, ఆకలి చావుల్ని రూపు మాపింది. ‘ఐకమత్యమే బలం’ అని అందరి మనస్సుల్ని ఏకీకృతం చేసింది. అమ్మ దివ్యమాతృప్రేమ మధురిమ ప్రభావానికి క్రూర మనస్కులూ, విషసర్పాలూ తలవంచి మయూరాలై నృత్యం చేశాయి. దౌర్జన్య పూరిత నేటి సమాజంలో ఇది సాధ్యమా అనిపించవచ్చు మనకి. కానీ విశ్వకళ్యాణం అమ్మ || సంకల్పమైనపుడు బిడ్డల్ని చేయిపట్టుకుని నడిపించే బాధ్యతా తల్లిదే.
సి చెట్టుకే కరకురాతి దెబ్బలు. ప్రతి యుగంలోనూ ప్రతితరంలోనూ ఒక మహాత్ముని హింసిస్తారు, ఊపిరితీస్తారు. ఆ త్యాగమే సభ్య సమాజానికి నవజీవన నాందీ ప్రస్తావన. వారు ముళ్ళబాటలో నడిచేది మిగిలిన వారిని పూలబాటలో నడిపించటానికి. ఉదా: క్రీస్తు, జోన్, గెలీలియో, రామదాసు, సక్కుబాయి… ఎందరో! అలా అని మహాత్ముల వెలలేని గాధల్ని చదివేందుకు మనం భయపడకూడదు. ‘అనేక అనర్ఘ జ్ఞాన రత్నాలు, అంతర్దృష్టి, పరమపద సోపాన అధిరోహణా సామర్ధ్యం, జీవననైపుణ్యాలు, మానవతా విలువలు, పారమార్ధిక దృష్టి, సన్మార్గ దర్శనం, సద్వస్తు ప్రాప్తి… వంటి అమూల్య ఫలాల్ని తక్షణమే అందుకోవచ్చు వారి సందేశాన్ని ఆచరణలో పెడితే, వేరే సాధన అవసరం లేదు, వారి జీవితచరిత్ర పారాయణకంటే. ఆలశ్యం ఎందుకు?
నేడే అమ్మ జీవిత చరిత్ర పారాయణ ప్రారంభించండి. దాని ఫలం అమృతతుల్యం అని అనుభవైకవేద్యం అని మీకే తెలుస్తుంది.