(గత సంచిక తరువాయి)
- “మా అబ్బాయిలు ఎలా ఉన్నారు?”
ఒక ఏడాది వేసవి సెలవుల్లో జిల్లెళ్ళమూడిలో ఉన్నాను. నాకు 102-106 డిగ్రీల జ్వరం తగిలింది. ఏవో మందులు వాడాను; కానీ జ్వరం తగ్గుముఖం పట్టలేదు. ఈ సంగతి అమ్మకు విన్నవించుకున్నాను. “నాన్నా! క్వినైన్ బిళ్ళలు వేసుకో” అన్నది. “అమ్మా! రక్తపరీక్ష చేసి మలేరియా అని నిర్ధారణ అయిన తర్వాతే క్వినైన్ బిళ్ళలు వేసుకోవాలి కదా!” అన్నాను. తడుము కోకుండా అమ్మ మలేరియా అయితే తగ్గుతుంది. లేకపోతే లేదు అన్నది ధీమాగా. అంటే అది మలేరియా అని అమ్మకి ఖచ్చితంగా తెలుసు; పైకి ఒక చమత్కారబాణం సంధించింది.
క్లోరోక్విన్ బిళ్ళలు రెండు వాడాను. వెంటనే జ్వరం తగ్గి మామూలు మనిషి అయ్యాను. మేడమెట్లు ఎక్కి అమ్మ దర్శనం కోసం వెళ్ళాను. అమ్మ ఆవకాయ అన్నం కలుపుతున్నది. “నువ్వు చెప్పావు అలాగే జ్వరం తగ్గిందమ్మా” అన్నాను. అమ్మ ప్రేమతో నాలుగు ఆవకాయ అన్నం ముద్దలు తినిపించింది.
‘పథ్యంగా ఆవకాయ అన్నం తినవచ్చా?’ అనే సంశయం లోలోపల వేధిస్తోంది. అమ్మ పెట్టింది అన్నం కాదు- ఔషధం కదా! అమ్మ అలౌకక తత్వాన్ని, శక్తిని ఎన్నో సందర్భాలలో రెండు కళ్ళతో దర్శిస్తున్నాను. కానీ నా బలహీనతులు, పరిమిత తత్వం జిడ్డులా వదలటం లేదు.
చిరునవ్వుతో నా సంశయానికి సమాధానంగా అమ్మ వసుంధరక్కయ్యన పిలిచి “వీడికి రెండు పూటలా కమ్మటి పెరుగు అన్నం పెట్టు” అన్నది. అక్కయ్య అలాగే చేసింది.
రెండు రోజులు గడిచాయి. వేసుకున్న క్వినైన్ బిళ్ళలు రెండే; కానీ ఒళ్ళంతా గిరగిరా తిరుగుతున్నట్లుంది. ఆ సంగతి కూడా అమ్మతో అన్నాను. అవతారమూర్తి అయి ఉండి కూడా అమ్మ ఇచ్చిన చనువు అదంతా. మనల్ని పసిపిల్లల్నిచేసి చంకన వేసుకుని ఆడించటమేకాదు; నెత్తిన పెట్టుకుని గారం చేసింది.
“నాన్నా! రెండు బిళ్ళలకేనా! నేను ఒకేసారి 20 క్వినైన్ బిళ్ళలు మింగాను” అన్నది. ఆవరణలో ఎందరికో ఒకేసారి మలేరియా సోకి ఉంటుంది. వాళ్ళకోసం అమ్మ బిళ్ళలు మింగింది; వాళ్ళు క్షేమంగా ఉన్నారు. “నేను tablet వేసుకుంటే నీకు (రుగ్మత) తగ్గుతుంది; నువ్వు వేసుకుంటే నాకు తగ్గదు- అన్న అమ్మ మాటల్లో అమ్మ, మహత్తత్త్వం సహస్రకోణాల ప్రసృతమౌతుంది.
ఆ రోజుల్లో నాకు కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ. స్వామి వారితో కొంత సన్నిహితత్వం ఉంది. సరే – పరమాచార్యుల పేరు వింటేనే అప్రయత్నంగా చేతులు జోడిస్తాం. కనుక-కొంత వాతావరణం మార్పుకోరి “అమ్మా!! కంచివెళ్ళి నాలుగురోజులుండి వస్తా” అన్నాను. వెంటనే అమ్మ “తిరువణ్ణామలై కూడా వెళ్ళిరా, నాన్నా!” అన్నది.
కంచిలో 10 రోజులున్నాను; కలవై వెళ్ళి పరమాచార్యులు వారిని దర్శించుకున్నాను. వారు శాబ్దికంగా కాక సంజ్ఞల ద్వారా 5 ని”లు నాతో సంభాషించారు. ‘జిల్లెళ్ళమూడి అమ్మ’ తాలూకు అంటే వాళ్ళని ప్రపంచంలో ఏ ఆధ్యాత్మికక్షేత్రంలోనైనా ఉచితాసనం వేసి గౌరవిస్తారు; నాకు 2/3 అనుభవాలు ఉన్నాయి. అందుకు తార్కాణంగా, ఒకసారి నేను “అమ్మా! సత్యసాయిబాబా వారు ఆత్మలింగాన్ని తీస్తారట” అన్నాను. (నేను శివపంచాయతనం చేస్తాను అందుకోసం) వెంటనే అమ్మనువ్వు అడుగు, నాన్నా! నీకు ఇస్తారేమో!” అన్నది. వారిని నేను అడిగియుండలేదు; అడిగితే తప్పక ఇచ్చేవారు-నా ముఖం చూసి కాదు, అపురూపమైన ‘అమ్మత్వం’ చూసి.
తిరువణ్ణామలై, శ్రీరమణాశ్రమంతో, రెండు రోజులున్నాను. మహర్షి సమాధి వద్ద ‘హృదయకుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం హ్యహమ హమితి సాక్షాదాత్మరూపేణ భాతి” శ్లోకాన్ని బాగా అర్ధం చేసుకున్నాను. “నేను నేనైన నేను”, ‘అన్నినేనులు నేనైన నేను” వంటి అమ్మ వాక్యాలకి ఆ శ్లోకం వివరణ అనిపించింది. అరుణ గిరి ప్రదక్షిణ చేశాను. చలంగారిని చూశాను. యాత్రముగించుకొని జిల్లెళ్ళమూడి వచ్చాను.
అన్నం తిని అమ్మవద్దకు వెళ్ళాను. అమ్మ పట్టిమంచం మీద పడుకుని ఉన్నది. గదిలో నలుగురున్నారు. గడప దాటిలోపల అడుగు పెట్టినంతనే అమ్మ నావైపు చూస్తూ “మా అబ్బాయిలు ఎలా ఉన్నారు?” అని అడిగింది. ఏం సమాధానం. ఇవ్వాలో తెలియక తల చేత్తో పట్టుకున్నా; ‘అబ్బాయిలు’ అంటే నేను వెళ్ళింది. కంచి, తిరువణ్ణామలై కదా! నా ఆలోచన స్తంభించి పోయింది. వాస్తవాన్ని అమ్మ తళుక్కున స్ఫురింపజేసింది. దయామూర్తి కదా!
“అమ్మా! (నీ బిడ్డలు) కంచికామకోటి పీఠాధిపతులు, చలంగారు…. అంతా బాగున్నారు” అన్నాను. అమ్మ ప్రేమతో చిన్న మొట్టికాయ వేసిందికదా! కథ సుఖాంతం అయింది; కనుక చిరునవ్వులు చిందిస్తోంది. నేను అమ్మను క్షుణ్ణంగా అర్ధం చేసుకున్నాను- అనే నా గర్వం ఖర్వం అయింది. సిగ్గుతో తలదించుకుని అమ్మ పాదాల చెంత గది గోడకి ఆనుకుని కూర్చున్నా.
ఆ క్షణాల్లో కలవైలో పరమాచార్య, ‘నడిచే దైవం, పావన సన్నిధిలో సంభవించిన ఒక miracle జ్ఞప్తికి వచ్చింది. ఒక పండితుడు వచ్చారు. పరమాచార్యముందు ఒక ఉద్గ్రంధాన్ని ఉంచి, ఏదో ప్రశ్న వేసి, చేతులు కట్టుకుని నిలబడ్డారు. స్వామీజీ ఆ సమయంలో ఒక మామిడి చెట్టుక్రింద కూర్చొని ఉన్నారు. ఆ సమీపాన వారి గురువుల సమాధులున్నాయి. స్వామీజీ గ్రంథాన్ని తెరచి ఒకచోట ఒక మామిడాకునుంచి, దానిని తిరిగి వారికిచ్చేశారు. వారి ప్రశ్నకి సమాధానం ఆ పేజీలో ఉంది. వారు ఆనంద బాష్పాలు రాలుస్తూ కృతజ్ఞతాంజలి ఘటించి సెలవు తీసుకున్నారు.
జిల్లెళ్ళమూడిలో అట్టి సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని. కానీ ఈ అల్పునిలో విశ్వాసం స్థిరంగా ఉండదు. అమ్మ అత్యంత సహజంగా దివ్యమథుర మాతృప్రేమతో కంచికామకోటి పీఠాధిపతులు, భగవాన్ శ్రీరమణమహర్షి, చలంగారలు తన తనయులు అన్నపుడు తక్షణం ఆ పారమార్ధిక దృష్టిని అర్ధం చేసుకోలేక పోయాను.
పరమాచార్య, శ్రీరమణులు తన బిడ్డలని త్రికరణశుద్ధిగా భావించే ఉత్కృష్టమైన స్థితి అమ్మది. అమ్మ అనల్పత్వం ముందు మన అల్పత్వాన్ని చాటుకోవడమూ సంతోషదాయకమే.
ఎప్పటికైనా విశ్వజనని విమలానురాగం దురవగ్రాహ్యమే. కాగా నా అజ్ఞానం అంతం కావాలని అమ్మ పదే పదే సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తుంది. ‘సుదర్శనం’ అంటే – నిఖిల దుష్కర్మ కర్మన, నిగమ సద్ధర్మ దర్శన.